
నిన్న పొద్దున్నే మేం పాతబస్తీలో, చార్ మీనార్ దగ్గర్లో, సుల్తాన్ షాహీ ప్రాంతంలో ఒక ముస్లిం కబర్ స్తాన్ వెతుక్కుంటూ ఉన్నాం. జీడిగుంట విజయసారథీ, నేనూ, ఆదిత్యానూ. మేము వెతుక్కుంటున్నది హిందూస్తానీ సంగీతప్రపంచంలో రారాజు అని చెప్పదగ్గ ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ సమాధి గురించి.
మాకు దొరికిన సమాచారమైతే సరిగానే ఉందిగానీ, మమ్మల్ని తీసుకువెళ్ళిన టాక్సీ డ్రైవరు సుల్తాన్ షాహీ ప్రాంతంలో దింపెయ్యగానే, మేము ఆతృతగా వెతుక్కోడంలో ఒక కబర్ స్తాన్ కి బదులు మరో కబర్ స్తాన్ లో అడుగుపెట్టాం. అక్కడొక పెద్ద మనిషి బడే గులాం అలీ ఖాన్ అనగానే ఎవరో ఒక ఖాన్ సాహెబ్ సమాధి చూపించి ఇదే అన్నాడు. ఆదిత్య ఉర్దూ, పారశీకాలు చదవగలడుకాబట్టి చప్పున చదివి, మనం వెతుక్కుంటున్నది ఇది కాదు అని చెప్పేసాడు. అక్కడెవరో మరొక పెద్దమనిషి మేము వెతుక్కుంటున్న చోటు అక్కడకి దగ్గరలోనే ఉందని, తాను మోటార్ సైకిలు మీద వచ్చి మరీ మాకు దారిచూపించి వెళ్ళాడు.
అక్కడ అడుగుపెట్టగానే మేము చూడవలసిన దయిరా మీర్ మోమిన్ సిమెట్రీ అదే అని వెంటనే అర్థమైపోయింది. అదొక సాధారణ స్మశానంలాగా కాక, ఒక చారిత్రిక స్థలంలాగా కనిపిస్తూ ఉన్నది. అక్కడ బడే గులాం ఆలీ ఖాన్ సమాధిని గుర్తుపట్టడం ఏమంత కష్టం కాలేదు. ఒక చింతచెట్టు నీడన జాలీలుండే గోడల చిన్న కట్టడంలో బడే గులాం ఆలీ ఖాన్ ఇంకా నిద్రలేవలేదు. మమ్మల్ని చూస్తూనే ఒకాయన ఆ తలుపు తాళం తెరిచి, ఆ సమాధి వెనక పక్కన పెట్టిన పాలరాతి పలకలు తీసి ముందుపెట్టాడు. 1902 లో పంజాబులో కసూర్ లో జన్మించిన, పాటియాలా ఘరానాకు చెందిన, ప్రఖ్యాత గాయకుడు 1964 లో హైదరాబాదులో పరమపదించాడని ఆ పలకలమీద ఒకదానిమీద ఉర్దూలోనూ, మరొకదాని మీద ఇంగ్లిషులోనూ రాసి ఉంది.
మేము ముగ్గురం ఆ అమరగాయకుణ్ణి తలుచుకుంటూ లిల్లీలు, గులాబులు ఆ సమాధిదగ్గర నివాళిగా సమర్పించాం. అప్పుడు అక్కడ ఉన్న చిన్న అరుగుమీద కూచుని చుట్టూ పరికించాం. అది ఒక స్మశానస్థలినే కాని, చాలా సజీవమానవహృదయస్పందనాలతో సంచలిస్తూ కనబడింది. కొందరు కొన్ని సమాధులు కడుగుతున్నారు. కొందరు కొన్ని సమాధుల దగ్గర అగరవత్తులు వెలిగించారు. కొందరు తమ వాళ్ళ సమాధుల పక్కన కూచుని భగవత్ప్రార్ధన చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, మేకపిల్లలు- అక్కడంతా, నిజం చెప్పొద్దూ!- ఒక చిన్నపాటి తిరణాలలాగా ఉంది.
చాలామంది మనుషులు అక్కడ సంచరిస్తోనో, కూచునో, నడుస్తూనో, మాటాడుకుంటూనో ఉన్నారుగాని, నిజానికి, వాళ్ళు ఆ సమాధుల్లో నిదురిస్తున్న తమ ఆత్మీయుల్ని మేల్కొల్పి వాళ్ళ గురించి కుశలప్రశ్నలు అడుగుతున్నట్టే ఉంది. వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టివెళ్ళిపోయాక, ఇన్నాళ్ళుగానూ, ఇక్కడ ఏం జరుగుతోందో, ఆ సంగతులన్నీ పూసగుచ్చి చెప్పుకుంటున్నట్టే ఉంది, చిన్న చిన్న వివరాలు కూడా, ఈ బక్రీదుకి దావతుకి ఎవరిని పిలిచారు, ఈ రంజాన్ కి ఎవరు ఎంత జకాత్ సమర్పించారు- అక్కడ కనిపిస్తున్నవాళ్ళు, ఈశ్వరుడికి చెప్పుకున్నంత శ్రద్ధగా, కనిపించని తమ సహోదరులతో చెప్పుకుంటున్నట్టే ఉంది.
మేం ముగ్గురం ఆ సమాధి దగ్గర ఫొటోలు తీసుకుంటూ ఉండగా, ఒకామె, మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ ‘ఆయన మీకేం కావాలె?’ అనడిగింది. నాకు ఏదో సమాధానం స్ఫురించిందిగానీ, దాన్ని ఆమెకి చెప్పడానికి, మాటలు దొరకడం లేదు. విజయసారధి ఆమెకి చెప్పవలసింది చెప్పి ఆమె వివరాలు కనుక్కొన్నారు. ఆమె ఒక జాట్ కుటుంబపు స్త్రీ అనీ, తమ కుటుంబమే ప్రతి ఏడాదీ గులాం ఆలీ ఖాన్ సమాధికి వెల్లవేయించి, మరమ్మత్తులు చేయిస్తూ ఉంటారనీ చెప్పింది.
అక్కడ గులాం ఆలీ ఖాన్ సంగీతమేదన్నా విందామనిపించింది.’ మొగల్-ఏ-ఆజమ్ లో ‘ప్రేం జోగన్ బన్ కే ‘ గుర్తుంది కదా, అది పెట్టండి విందాం’ అన్నారు విజయసారధి. యూట్యూబు తెరిచాను. ఆ తర్వాత నాలుగైదు నిమిషాల పాటు, మా చుట్టూ ఉన్న ప్రపంచమంతా పక్కకు పోయింది.
ప్రేమ్ జోగన్ బన్ కె
సుందర్ పియా ఓర్ చలె
ప్రేమ్ గగన్ బన్ కె
ప్రేమ్ జోగన్ బన్ కె
సుందర్ పియా ఓర్ చలె
ప్రేమ్ గగన్ బన్ కె
జొగన్ హే జో జోగన్ బన్ కె
ఒక వెన్నెల రాత్రి, లతామంటపాల చెంత, ఒక ప్రియుడూ, అతని ప్రియురాలూ, ఎక్కడో దూరం నుంచి వినిపిస్తున్న తాన్ సేన్ రాగాలాపన- లోకాన్ని మర్చిపోయిన వాళ్ళ తాదాత్మ్యప్రపంచం- అదొక్కటే మా చుట్టూ అల్లుకుని, మమ్మల్ని అందులోకి లాగేసుకుంది. ప్రేమతప్ప మరేదీ పట్టని విరక్తగా, తన ప్రియుడి రక్తి ఒక్కటే తన ఆకాశంగా. ఆ రాత్రి ఆ రాజప్రాసాదంలో నడిచివెళ్తున్న అనార్కలి ఒక్కతే మా కళ్ళముందు కనిపిస్తూ ఉంది. ఆ రాత్రి ఆ ప్రాసాదంలో ఒక పొగలాగా అల్లుకున్న అగరుధూపం- మా పక్కనే జ్వలిస్తున్న సువాసన- మాత్రం మాకు తెలుస్తూ ఉంది-
బడే గులాం ఆలీ ఖాన్ సమకాలికులమై ఉంటే ఏ సంగీతసమారోహంలోనో, లేదా వారి మిత్రుల ఏ గృహ ప్రాంగణంలోనో లేదా ఏ పెళ్ళిపందిట్లోనో, ఆయన ఈ గీతాన్ని పాడుతుంటే, విని ఉండేవాళ్ళం. కాని ఇలా ఆయన సమాధి దగ్గర కూచుని వినడం- ఏమందాం దీన్ని!
తిరిగి వచ్చాక, ఒక కవిత రాసానిలా:
సహశయానులు
ఆ గానం వింటూనే ఉన్నారు రసజ్ఞులంతా
వింటూ మైమరుస్తూనే ఉన్నారు.
ఇప్పుడాయన వారి మధ్య లేడు,
కాని ఆ పాటలున్నాయి.
తన మృణ్మయమందిరంలో శయనించి
ఇక్కడకూడా పాడుతూనే ఉన్నాడాయన
చూడబోతే ఈ ఆడిటోరియం
ఇరవైనాలుగ్గంటలూ తెరిచినట్టే ఉంది.
ఆయన సహశయానులు కూడా
నిద్రపోడం మరిచినట్టే ఉన్నారు.
ఇప్పుడు వీరిమధ్య ఆయనా ఉన్నాడు
ఆయన పాటలూ ఉన్నాయి.
4-2-2026


Wow!! Beautiful!!
“ చూడబోతే ఈ ఆడిటోరియం
ఇరవైనాలుగ్గంటలూ తెరిచినట్టే ఉంది.”
ధన్యవాదాలు మాధవీ!
ధన్యోస్మి భద్రుడు గారు. ఆ అమర గాయకుని సమాధి సందర్శనాన్ని కూడా మీ కవితతో అమరం చేసేసారు. ముఖాన రూపాయ బిళ్లంత బొట్టు పెట్టుకున్న ఆ జాట్ స్త్రీ తన భర్త పేరు రామ్మోహనరావు అని చెప్పడం, ప్రతి సంవత్సరం ఆ సమాధికి రక్షణగా కట్టిన ఆ గది కి రంగులు వేయించడం తో పాటు ప్రతి రోజు శుభ్రపరిచే పని కూడా వాళ్ళే విధిగా నిర్వహిస్తారన్న విషయం ఎంతో ఆనందంతో చెప్పిన సంగతి బహుశా నా జీవితాంతం మర్చిపోలేనేమో.
గుండెని పట్టుకుంది
ధన్యవాదాలు మిత్రమా!
నిజంగా ఆకాలంలో ఉండి ఉన్నా కూడా ఆయన అమృత గానాన్నా ఇంతగా ఆస్వాదించి ఉండే వాళ్ళము కామేమో.. ఇప్పుడు మీ చెంతనే కూచొని మీకు మాత్రమే వినిపించేలా ఆరోపిస్తున్నట్లు ఉంటుంది..ఇవే కదా జీవితాన నిలచిపోయే మధుర స్మృతులు.. ధన్యులు సార్ మీరు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఏమని చెప్పను? మాటలేవి?
ధన్యవాదాలు మేడం!
Brilliant sir.. మీతో కలిస్తే ఎంత మామూలు ఉదయాలో వెలుగులు నింపుకుంటాయి. ఇక ముగ్గురు మిత్రులు, రస హృదయాలు కలిస్తే ఇట్లా దిగులు ఆశ్చర్యం నిండిన ఒక రాత; విడిచిపెట్టని రాగంలా, పాటలా అల్లుకుపోయే ఒక కవితా మాకు కానుకగా అందడంలో ఏం ఆశ్చర్యం!
Thanks for the beautiful write up! ❤️
( హైదరాబాద్ ఎంత స్వంతమనుకుంటానో .. ఇలాంటప్పుడు సిగ్గేస్తుంది. ఇంకా ఏం తెలీని తెలీదని. ఏమీ చూడలేదని. ఈ ప్రదేశపు వివరానికి కూడా ఇంకోసారి థాంక్స్ చెప్పబుద్ధై…)
హృదయపూర్వక ధన్యవాదాలు మానసా!
అబ్బా.. అబ్బా.. ఏమి మధురమైన జీవితం సార్ మీది.. ఇంతటి అద్భుతమైన అనుభవం కోసం ఆ మహాగాయకుడు నిద్రించే తోటను ఓ తొలి ఉషస్సులో అన్వేషిస్తూ పోయి పోయి.. గుర్తించి.. ప్రవేశించి.. వారి రాగాలాపనను.. ఆవాహన చేసుకుని.. ఆహ్వానించడం.. ఆనందించడం.. మీకే సాధ్యమయ్యే ముచ్చట. మీ ధన్యత్వానికి దండాలు!!
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
గొప్ప సందర్భాన్ని హృద్యంగా కథనం చేసారు
ధన్యవాదాలు సార్!
బడే గులాం అలీ గారు పాకిస్థాన్ లో కాలం అయిపోయారు అనుకొన్నాను , వారి జీవిత చరిత తెలియదు పాట వినడమే కానీ !
బడే గులాం అలీ గారు పాకిస్థాన్ లో కాలం అయిపోయారు అనుకొన్నాను సార్ , వారి జీవిత చరిత తెలియదు పాట వినడమే కానీ !
నాక్కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది.