
మాఘమాసపు మధ్యాహ్నం.
నదికి ఆవలా ఈవలా
పొదల్లో పొలాల్లో తోటల్లో
తలుపులన్నీ బార్లా తెరిచిపెట్టారు.
నా చిన్నప్పుడు మా ఊళ్ళో
ఈ వేళప్పుడు ఊరు
మాగన్నుగా కునుకు తీసేది
పనిపాటలు ముగించుకుని
మా అమ్మ ఆ మట్టి అరుగుమీద
మేను వాల్చి గడపకు తలానించి
కళ్ళు మూసుకునేది.
అప్పటికింకా పసికూననేగాని
నాకు చదవడం బాగా వచ్చేది.
ఆ మధ్యాహ్నాలు భక్తవిజయమో
మరొకటో చదివి వినిపించుకునేది.
ఇప్పుడు నేనిట్లా ఈ ఒడ్డున
వెల్లకిలా పడుకున్నాను.
ఇప్పుడు నది నాకు
మాఘపురాణం వినిపిస్తున్నది.
2-2-2026
Wow!
ధన్యవాదాలు మానసా!
ఒక్కసారిగా కన్నీళ్ళు ఉబికి, ఉరికి వచ్చాయి. ఎంత బాగా చెప్పారంటే మరపురాని తీయని జ్ఞాపకాన్ని…చిన్నతనం లోకి జారిపోయిన… నేను మా అమ్మ దగ్గరికి పారిపోయి ఆమె పసిమి వర్ణపు చీర కుచ్చెళ్ళలో దాక్కుని తీయని గుబాళింపులో మునిగిపోయిన హాయి. ఈ లోకాన్ని మరిచిపోయే దొక్కటే. అమ్మ లాలన. అప్పటి పసికూన కి ఒక్క చిరునవ్వు బహుమతి.
భక్తితో.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!