రాజకీయాల్ని దాటిన దర్శనం

మూడు రోజుల కిందట లూనా బుక్ సెంటరుకి వెళ్ళినప్పుడు కవిత్వంతో పాటు ఏవైనా నవలలు కూడా కొనుక్కుందామనుకుని రెండు నవలలు ఎంచుకున్నాను. ఒకటి, పందొమ్మిదో శతాబ్ది ఫ్రెంచి మహాకవి జెరార్డ్.డి.నెర్వాల్ (1808-1885) రాసిన రెండు నవలికల సంపుటి October Nights (పెంగ్విను ఆర్కైవు, 2025). నెర్వాల్ ని కవిగానే తెలిసిన నాకు అతడి నవలలెలా ఉంటాయో అన్న కుతూహలంతో ఆ పుస్తకం కొన్నాను. అందులో Sylvie అనే నవలిక ఉంది. మార్సెల్ ప్రూ Remembrance of Things Past  రాయడానికి ఆ నవలికనే స్ఫూర్తి అని తెలిసాక తీసుకోకుండా ఎలా ఉంటాను?

ఇక రెండో పుస్తకం  A Mountain to the North, A Lake to the South, Paths to the West, A River to the East(2022) నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నాకు తెలియలేదు, మరి నాలుగురోజుల్లో ఆ రచయిత Laszlo Krasznahorkai ని 2025 కు గాను నోబెలు పురస్కారం వరించబోతోందని!

ఈ సారి నోబెల్ పురస్కారం ఎవరెవరికి రావొచ్చునో రెండుమూడు రోజుల్నుంచీ ఇంటర్నెట్టు ఘోషిస్తూ ఉన్నప్పటికీ, గత పదేళ్ళుగా, స్వీడిషు కమిటీ, తన ఎంపికతో ప్రపంచాన్ని సంభ్రాంతపరుస్తూ ఉందికాబట్టి, ఏ ఒక్కరూ నిశ్చయంగా ఏమీ చెప్పలేకపోయారు. కాని నేను చదివిన ఊహాగానాల్లో లాస్లో క్రొస్నహొర్కాయి పేరయితే ఎక్కడా కనబడలేదు. అందుకే ఈ సాయంకాలం ఆదిత్య ఫోను చేసి హంగేరియను రచయిత క్రొస్నహొర్కాయికి నోబెలు పురస్కారం వచ్చిందని చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను. ఇంటర్నెట్టు ఊహించలేని విషయాన్ని నా చేతులెట్లా పట్టుకోగలిగేయా అని. ఆ ఆశ్చర్యం నుంచి ఇప్పటికీ తేరుకోలేకుండానే ఉన్నాను.

కాని సమస్త ప్రపంచానికీ ఈ రోజునుంచీ మరింత సుపరిచితం కాబోతున్న ఈ మనిషిని తెలుగులో అందరికన్నా ముందు గుర్తుపట్టిన ఘనత జయతి లోహితాక్షన్ దే. క్రొస్నహొర్కాయి నవల Sátántangó ఆధారంగా తీసిన సినిమా గురించి ఆమె దాదాపు ఆరేడేళ్ళ కిందటనే తన ఫేస్ బుక్ వాల్ మీద పంచుకున్నారు. ఆ సినిమా చూడమని నాకు మరీమరీ చెప్పారు కూడా. ఆ సినిమాని, అప్పుడే చూసి ఉంటే, ఈ రోజు నేనింత వెనకబడి ఉండేవాణ్ణి కానేమో.

క్రొస్నహొర్కాయి ముఖ్యరచనలు Satantango (1985), The Melancholy of Resistance (1989), War and War (1989), Destruction and Sorrow beneath the Heavens (2016), – ఇవేవీ నేనిప్పటిదాకా చదవలేదు. కానీ రాబోయే రోజుల్లో వీటిలో కొన్నైనా చదివి మీతో ఎలానూ పంచుకుంటాను. కానీ ఇప్పటికైతే, ఇప్పటికే నా టేబులు మీద ఉన్న A Mountain.. (2003) చదివి ఈ రచయిత గురించి ఏమైనా గ్రహించగలనేమో చూద్దామనుకున్నాను. ఒక నవల, ఇంకా చెప్పాలంటే ఒక నవలిక చదివి, ఆ రచయిత జీవితకాల కృషి గురించి మాట్లాడబోవడం సాహసమే. అది ‘హాహాహూహూ’ వంటి నవల చదివి విశ్వనాథ సత్యనారాయణ గురించి మాట్లాడటం లాంటిది. కాని మళ్ళా ఏమనిపించిందంటే, ఏమి? విశ్వనాథ దృక్పథమేమిటో తెలుసుకోడానికి, ఆయన అన్వేషణ దేనిగురించో అర్థం చేసుకోడానికి, హాహాహూహూ ఒక్కటి చాలదా?

ఇంతాచేసి 130 పేజీల ఈ నవలిక చదవడానికి నాకు రెండుగంటలు సరిపోయిందిగాని, ఈ చిన్ని పుస్తకంలో, రచయిత, తన సమస్త విశ్వాన్నీ ఇమిడ్చిపెట్టాడనిపించింది. అక్టోబరు 9 వ తేదీ సాయంకాలంకోసం ఎంతో ఆత్రుతగా నిరీక్షించే మహామహులైన రచయితలెందరినో పక్కనపెట్టి మరీ స్వీడిషు కమిటీ ఈ రచయితని ఎందుకు ఎంపిక చేసిందో అర్థం చేసుకోడానికి, నా వరకూ ఈ చిన్నిపుస్తకం నాకు సరిపోయింది.

ఈ రచయితా, ఈ పుస్తకమే కాదు, గత కొన్నేళ్ళుగా నోబెలు కమిటీ తన పురస్కారంకోసం ఎంపిక చేస్తున్న నవలారచయితలందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే లక్షణం వాళ్ళు కొత్త యుగానికి చెందిన రచయితలు కావడం. కిందటేడాది దక్షిణ కొరియా రచయిత్రి హన్ కాంగ్ కి పురస్కారం లభించినప్పుడు నేనిదే విషయం రాసాను. (ఆ వ్యాసాలతో కూడిన నా పుస్తకం ‘కొత్త యుగం రచయిత్రి ‘మొన్ననే విడుదల చేసాను కూడా.)

ఏమిటి ఈ కొత్త యుగం లక్షణం?

నవల అనగానే మనముందు రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి బాల్జా, డికెన్సు, జోలా, హెన్రీ జేమ్స్, టాల్ స్టాయి, థామస్ మన్ వంటి మహారచయితల నవలలు. వారు తమ చుట్టూ ఉన్న సామాజిక వాస్తవాన్ని బృహత్ప్రమాణాల్తో, అత్యంత వాస్తవికంగా, అత్యంత విశ్వసనీయంగా, అత్యంత సాధికారికంగా చిత్రించడానికి ప్రయత్నించారు. నవల అనేది epic తాలూకు ఆధునిక రూపం అని వీరిని బట్టే మనం చెప్పగలుగుతున్నాం. ఈ మహారచయితలు ఆధునిక ఇతిహాసకారులు. భారతదేశంలో కూడా ఇప్పటికీ నవలారచయితలకి వీరే నమూనాలుగా ఉన్నారు.

కాని పందొమ్మిదో శతాబ్దం నుంచీ మరొక నవలానిర్మాణం కూడా బలపడుతూ వచ్చింది. అది గొగోల్  Dead Souls తో మొదలై, కాఫ్కా దర్శనాన్నీ, బోర్హెసు కథాశిల్పాన్ని అనుసరిస్తూ గత పాతికేళ్ళుగా మరింత తీవ్రీకరణ చెందుతున్న రూపం. ఈ కొత్తనవలాకారులకి బృహత్ప్రమాణాలతో వాస్తవప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించడం కన్నా, అవాస్తవిక, అభూత, ఊహాతీత చిత్రణలద్వారా సత్యాన్ని ఆవిష్కరించడం ప్రధానం.

ఎందుకంటే మానవుడి వాస్తవజీవితాన్ని మునుపటికన్నా మరింత విస్తృతంగా, real time లో చూపించగల సమాచారప్రసారసాధనాలున్న కాలంలో ఉన్నాం మనం. ఒక యుద్ధం, ఒక క్షామం, ఒక భూకంపం-వీటిని ఈరోజు మనం తక్షణమే చూడగల సాధనాలు మన అరచేతుల్లో ఉన్నాయి. కాని మానవుడి అస్తిత్వం, అతడి అన్వేషణ, అతడు కోరుకుంటున్న మనశ్శాంతి, అతడు తపిస్తున్న సత్యం, సౌందర్యాల్ని చూపించడానికి ఈ సాధనాలకి శక్తి చాలటం లేదు. నిజానిని ఏ వాస్తవ చిత్రణా కూడా మన ‘వాస్తవం ‘గురించిన సత్యాన్ని మనకు ఎరుకపరిచేదిగా లేదు.

మనకి అటువంటి దర్శనం ఎక్కడైనా కనిపిస్తుందనుకుంటే, అది చిత్రలేఖనాల్లోనూ, ప్రయోగాత్మక సంగీతంలోనూ మాత్రమే. కాబట్టి, ఈ రోజు రచయిత, తన చుట్టూ ఉన్న వాస్తవంలోని సత్యాన్ని పట్టుకోవాలంటే, ఒక చిత్రకారుడిగా మారవలసి ఉంటుంది.  All art aspires to the condition of music  అన్న వాక్యం మనకి తెలుసు. ఇప్పుడు,  all literature aspires to the condition of painting అంటాను. అక్కడ రచయిత అవాస్తవిక, అలౌకిక, అభూత ఆకృతుల ద్వారా, ఘటనలద్వారా, తాను అన్వేషిస్తున్న సత్యాన్ని మనతో పంచుకుంటాడు. (ఇటువంటి నవలా రచన మన భాషల్లో ఇంకా కొత్త. ఎందుకంటే, ఇక్కడ అత్యధిక సంఖ్యాకులు ఇప్పుడిప్పుడే అక్షరాస్యులవుతూ, సాహిత్యంలోకి ప్రవేశిస్తున్నారు. వారికి  reality ఇంకా exhaust కాలేదు. కాకపోగా, వారు తమ జీవితవాస్తవాన్ని, ‘ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కనిపించని కథల్ని’ పంచుకోడానికి, వాస్తవిక చిత్రణే ముఖ్య అవసరంగా ఉన్నారు.)

కాని యూరోపు పరిస్థితి అలా కాదు. అక్కడ, బాహ్యవాస్తవాన్ని చిత్రించడంలో నవలారచయితలు ప్రపంచపు అంచులు చూసేసారు. కాబట్టి ఈ రోజు యూరోపు ఒక టాల్ స్టాయి ని కోరుకోవడం లేదు. అందుకు బదులో గొగోల్ తరహాలో ఒక క్రొస్నహొర్కాయిని కోరుకుంటున్నది. ఇదంతా కూడా నాకు ఈ చిన్ని నవల చదువుతున్నంతసేపూ అర్థమవుతూనే ఉంది.

ఈ నవలే తీసుకుందాం. ఇందులో ఇతివృత్తం అత్యంత వాస్తవిక ప్రమాణాల్తో చిత్రించిన ఒక అభూత కల్పన. అపారమైన పాండిత్యంతో చెప్పిన ఒక చందమామ కథ.

జపనీయ సాహిత్యంలో గెంజిగాథ సర్వోన్నతకృతి. పదకొండో శతాబ్దానికి చెందిన మురసకి షికిబు అనే ఆమె రాసిన ఆ నవల్లోని ప్రధాన పాత్ర అయిన గెంజి రాకుమారుడి మనమడు క్యోతో నుంచి బయలుదేరే ఒక రైలు ఎక్కడంతో కథ మొదలవుతుంది. అంటే ఊహించండి. పదకొండో శతాబ్ది నవల్లోని పాత్ర తాలూకు మనమడు 21 వ శతాబ్దంలో రైలు ఎక్కడం! ఈ నవలకి మొదటి అధ్యాయం లేదు. రెండో అధ్యాయం నుంచి నవల నడుస్తుంది. దాన్నిబట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ గెంజి రాకుమారుడి మనమడు ఎప్పుడో ఒక పుస్తకం చదివాడట. One Hundred Beautiful Gardens ఆ పుస్తకం పేరు. అందులో రచయిత ఆ నూరో ఉద్యానవనాన్ని చూడని వాడి జన్మ వ్యర్థం అన్నట్టుగా రాస్తాడు. అది చదివి ఈ కథానాయకుడు ఆ ఉద్యానవనాన్ని అన్వేషిస్తూ బయలుదేరతాడు. ఇంతకీ అసలు అటువంటి పుస్తకం నిజంగా ఉందా, తాను చదివాడా, చదివానని అనుకున్నడా అతడికి నిశ్చయం కాదు. కాని ఆ ఉద్యానవనం క్యోటో నగరానికి ఆవల ఒక బౌద్ధ విహారం దగ్గర ఉండవచ్చునని చదివినట్టుగా గుర్తు. అందుకని ఆ రాకుమారుడు ఆ బౌద్ధవిహారాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. నిర్జనంగా, నిర్మానుష్యంగా ఉన్న ఆ విహారాన్ని అత్యంత కవితాత్మకంగా రచయిత వర్ణిస్తాడు. అత్యంత ప్రశాంతమైన బుద్ధసన్నిధిగా ఉండవలసిన ఆ విహారంలో, నిశ్శబ్దం, పచ్చదనం, ఒక పక్షిపాటలతో పాటు, బయటి ప్రపంచపు హింస కూడా ఏదో ఒక రూపంలో అతడికి కనబడుతూనే ఉంటుంది. ఆ విహారమంతా అతడు కలయతిరుగుతాడు. చివరికి ఆ మఠాధిపతి వ్యక్తిగత మందిరంలోకూడా ప్రవేశిస్తాడు. అత్యంత అరాచకంగా కనిపించే ఆ మందిరంలో అతడికొక పుస్తకం కనిపిస్తుంది. రెండువేల పేజీలుండే ఆ పుస్తకంలో ఆ పుస్తక రచయిత, ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణితశాస్త్రజ్ఞులందరినీ విమర్శిస్తాడు. ఆ సందర్భంగా ఆ పుస్తక రచయిత ఇలా రాశాడని నవలాకారుడు రాస్తున్నాడు:

అక్కణ్ణుంచి అతడు తాను వెతుక్కుంటున్నా ఆ నూరవ ఉద్యానవనం, ఆ అపురూపమైన, ఆ అలౌకికమైన ఉద్యానవనం అక్కడ లేదనే నిశ్చయానికి వచ్చినప్పుడు- అప్పుడు కనిపిస్తుంది, అంతగా మరీ ముఖ్యంగా కనిపించని ఒక చిన్న తావులో, ఎవరూ చూడగానే గుర్తుపట్టలేని, చూసినా కూడా ఏమీ ప్రాముఖ్యత ఉందనుకోలేని, ఒక చిన్న గడ్డిబయలు. బయలు అనడం కూడా సరికాదు. చిన్న గడ్డితివాసీ. దాని చుట్టూ సమానమైన ఎత్తూ, వయసూ కలిగిన ఎనిమిది సైప్రస్ వృక్షాలు. అక్కడ, ఆ తావుని రచయిత ఇలా వర్ణిస్తున్నాడు:

ఆ సందర్భంలో, ఆ మొత్తం 43 వ అధ్యాయమంతా, ఒక అద్భుత వర్ణన. ఏమిటా అద్భుతం? ఎక్కడో దక్షినచీనాలో సైప్రస్ వనాలమీంచి రేగిన విత్తనాలు బీజవ్యాప్తి ద్వారా ఇక్కడ జపానుదాకా ప్రయాణించడం, ఆ మార్గమధ్యంలో, అవి నశించడానికి ప్రకృతి శక్తులన్నీ హోరాహోరీ అడ్డుపడుతున్నా కూడా, అవి ఎలానో, ఆ ప్రతికూల శక్తుల్ని దాటి, ఇక్కడికి, ఈ మఠానికి వచ్చి, ఇక్కడ రాలిపడి, ఈ గడ్డిదుబ్బులమధ్య మొలకెత్తి, వృక్షాలుగా మారడం. అంతకన్నా అద్భుతం మరేముంటుంది? అంతేనా? ఆ గడ్డిదుబ్బుకింద ఉన్న నేల, దానికందే ఒక అద్భుతం. అది ఎన్ని మహాయుగాలుగా, ఎంత భూగర్భకల్లోలాన్ని దాటుకుని ఒక సారవంతమైన క్షేత్రంగా మారిందో అదంతా వివరిస్తాడు. కాబట్టి, అంతిమంగా, ఆ చిన్ని పచ్చికపరుపూ, ఆ ఎనిమిది సైప్రస్ వృక్షాలూ, తాను పుస్తకంలో చదివిన ఆ అలౌకిక, మహత్తర నూరో ఉద్యానవనం అదే అని ఆ రాకుమారుడు గ్రహిస్తాడు. గ్రహిస్తాడా? గ్రహించలేదా? స్పష్టంగా తెలియదు. కానీ ఈ పోస్టు మాడర్న్ హంగేరియను రచయిత మాత్రం గ్రహించాడు. తాను చూసిన ఆ దర్శనాన్ని గుక్కతిప్పుకోకుండా మనతో పంచుకుంటాడు. కాబట్టే, ఈ నవలని సమీక్షిస్తూ డెయిలీ టెలిగ్రాఫు పత్రిక this is fiction as hypnosis అని కితాబిచ్చింది.

సరే, ఈ రచనలో దర్శనమూ, చింతనా అలా ఉంచి, ఆ శైలి గురించి చాలా చెప్పాలి. అది కవిత్వం. ఇంకా చెప్పాలంటే ధ్వనికవిత్వం. ధ్వనిప్రధాన కవితలో లక్షణార్థం చెక్కుచెదరకుండానే, దానికి అతీతమైన మరొక అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. ఈ కొత్తతరం రచయితల రచనలు ఒకరకంగా చెప్పాలంటే, ధ్వనిప్రధాన నవలలు. (ఇటువంటి నవలల్ని ఊహించడం కూడా తెలుగు రచయితలకి ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు.)

ఇందులోని కవితాత్మక శైలికి ఉదాహరణగా కనీసం కొన్ని పేరాలేనా అనువదించి చూపించాలనుకున్నానుగాని, సమయం లేదు. కనీసం ఈ ఒక్క పేరా అయినా చూడండి:

బహుశా ఇటువంటివి దృష్టిలో పెట్టుకునే ఒక పత్రిక ఇలా రాసింది:

క్రొస్నహోర్కాయి దర్శనాన్ని ఇంతకన్నా బాగా వివరించడం కష్టం. మరొక పత్రిక రాసినట్టుగా,  he is offering perspective more than politics. He has a worldview to show us, so it falls upon us to ‘simply look and be silent’.

9-10-2025

18 Replies to “రాజకీయాల్ని దాటిన దర్శనం”

  1. How Ironic it is that you picked his book in A Book Store and Four days Later He Won Nobel Prize. నిజం గానే ఇంటర్నెట్టు ఊహించలేని విషయాన్ని మీ చేతులెట్లా పట్టుకోగలిగేయో అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జయతి గారు చెప్పిన గంటల సినిమా గురించి గుర్తుంది కాని ఈ రచయిత గురించి అప్పట్లో అసలు రిజిస్టర్ కాలేదు. మీరు Laszlo Krasznahorkai ను , ఆయన రచనలను పరిచయం చేసిన విధానం చాలా Enlightening గా వుంది. ముందుగా మీరు చదివిన mountain నవల తోనే నేను కూడా ఈ రచయిత రచనలు చదవడం మొదలుపెడతాను.

  2. నిన్న సాయంత్రం లిటరేచర్ కి నోబెల్ ప్రైజ్ ప్రకటించిన వార్త చదవగానే, మీ గురించే అనుకున్నా. తప్పకుండా మీరీ రచయితను పరిచయం చేస్తారని. కాని ఇంత వెంటనే చేస్తారని ఊహించలేదు. బాగుందండీ.

    అలాగే జయతి చూడమన్న సినిమా కూడా గుర్తుకొచ్చింది. కాని నిడివి చాలా ఎక్కువ.. చూడలేక పోయాను.
    మీ పరిచయం- అనువాదం చదివాక పుస్తకం చదవాలి అనిపించింది. ధన్యవాదాలు🙏

  3. మన దగ్గర లాబీయింగ్ లతో పొందే పురస్కారం కాదది.
    నిజంగా అర్హత ఉన్నవారినే వరించే గొప్ప పురస్కారం నోబుల్ అని మరోసారి నిరూపితమైంది.

    వారి పుస్తకాలు మరిన్నిటిని మాకు పరిచయం చేస్తారని ఆశిస్తూ……

    ధన్యవాద నమస్కారములు సార్ 🙏❤️🌹

  4. ఈవేళ మీ నుంచి ఎదురు చూశాను. మీరు రాశారు. నాలుగు రోజులు ముందు మీ చేతులు పట్టుకున్నట్టు అనుకున్నట్టుగానే మా కళ్ళు పట్టుకున్నాయి. చాలా సంతోషం. ధన్యవాదాలు

  5. జీవితం ఒక అందమైన ప్రయాణం, ప్రతి రోజు మనకు కొత్త పాఠాలు నేర్పుతుంది. మన కష్టపడి చేసిన పనికి ఫలితం ఎప్పుడో ఒక రోజు తప్పక దొరుకుతుంది. ప్రతి మనిషి మనసులో ఒక కల ఉంటుంది, దాన్ని నెరవేర్చడమే జీవనార్థం. స్వార్థం లేకుండా సహాయం చేయడం నిజమైన ఆనందం. నమ్మకం మనిషిని ముందుకు నడిపించే శక్తి. సమయం విలువ తెలుసుకున్నవాడు జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. తప్పులు చేయడం తప్పు కాదు, వాటి నుంచి నేర్చుకోవడమే ముఖ్యం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆశను కోల్పోకూడదు. ప్రకృతిని ప్రేమించడం మన మనసుకు శాంతిని ఇస్తుంది. మనసు మంచిగా ఉంటే ప్రపంచం కూడా మనకు మంచిగానే కనిపిస్తుంది. **మొత్తానికి, జీవితం ఎంత కష్టమైనదైనా, దాన్ని సంతోషంగా జీవించడం నేర్చుకుంటే అది నిజమైన విజయం.

  6. ఈ వ్యాసం చదవడం ఒక సాహిత్య యాత్రలా అనిపిస్తుంది — వ్యక్తిగత అనుభవం నుంచి తాత్విక దృష్టి వరకు సజావుగా పయనిస్తుంది. లాస్లో క్రొస్నహొర్కాయి నవలను రచయిత వర్ణించిన తీరు, ఆ రచయిత యొక్క ‘మౌన దర్శనం’ని అచ్చం ప్రతిబింబిస్తుంది. “కొత్త యుగం రచయిత” అనే భావనను ఆయన విశదంగా, కానీ పాఠకుడికి చేరువగా వివరించారు. వాస్తవికతను మించి సత్యాన్ని వెతికే సాహిత్యపు అవసరాన్ని ఆయన దృశ్యాత్మకంగా చూపారు. “All literature aspires to the condition of painting” అనే వాక్యం వ్యాసానికి సారాంశంలా నిలుస్తుంది. సైప్రస్ వృక్షాల దృశ్య వర్ణనలో ఆయన చూపిన కవితాత్మక చింతన అసాధారణం. క్రొస్నహొర్కాయి రచనలోని మౌనం, అనంతత్వం, దర్శనశక్తిని రచయిత అత్యంత సున్నితంగా పట్టుకున్నారు. ఈ వ్యాసం చదివాక సాహిత్యం అంటే కేవలం కథకాదు — ఒక ఆలోచన, ఒక దృష్టి, ఒక అనుభూతి అని అనిపిస్తుంది. భాష, లోతు, పఠనానుభవం అన్నీ సమతుల్యంగా కలిసిన ఈ వ్యాసం ఒక పుస్తక సమీక్షకన్నా ఎక్కువ — అది ఒక సాహిత్య సాధనానుభవం, ఒక చింతనాత్మక ధ్యానం.

  7. విశిష్టత గలిగిన నోబెల్ బహుమతి గ్రహీత క్రొస్నె హొర్కాయిని మీరు ముందే పసికట్టడం నా మట్టుకు ఆశ్చర్యం కంటే అవును మీరందుకు తగినవారు అని అనిపించింది. విశ్వసాహిత్యాన్ని ఒక తపస్సుగా భావించే మీకు
    ఆ గీటురాయితనం ఉంది. అతని రచనలోని అంతరార్థం అప్పటికప్పుడు చదివి చెప్పగలిగే స్తోమత కలిగిన మీరు మా అదృష్టవరద్రష్టలు. నూరవ ఉద్యానవనం నేపథ్యంలో సాగిన కథనం విశ్లేషణ సంకుచితం నుండి అనంతత్వాన్వేషణలో ప్రశాంతత చేకూర్చిన గడ్డితివాచీని అనుభూతి చెందిన రాకుమారిని ఆత్మలోకి పాఠకులను ఈ చిన్న పోస్టుతో చేర్చగల మీ ప్రతిభకు అభినందనలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading