
వసంతఋతువు చివరిరంగు దిగులు
సౌగంధిక పర్వంలో ఇది చివరి పద్యం.
వసంతం నడివేసవిగా మారిపోయేక
మదిలోపల కూడా ఎండ కాస్తుంటుంది.
ఆ పరాగమూ ఆ తేనే తరలిపోయాక
ఎటు చూడు దుమ్మునిండా పూలమరకలు.
మధుమాసమంటే అప్పుడు అడవులూ కొండలూ
ఇప్పుడు రెండున్నరవీథుల ఈవెనింగ్ వాక్.
వసంతం వెళ్ళిపోయిందని తెలుస్తున్నదిగాని
నీ సాయంకాలరాగమింకా సద్దుమణగలేదు.
ఆ పసుపుపూల చెట్టుని చూసుకుని కదా
ఈ ప్రపంచాన్ని పక్కకు నెట్టేగలిగావు.
రాలిపడుతున్న పూలరేకలు పలచబడుతున్నచోట
ఒక సంభాషణ ముగిసిపోతున్న చివరి క్షణాలు.
కానీ రాలిపడుతున్న పూలరేకల్ని చూసినప్పుడల్లా
నీలో ఒక పువ్వు మొగ్గ తొడుగుతూనే ఉంటుంది.
27-5-2025


“రాలిపడుతున్న పూలరేకలు పలచబడుతున్నచోట
ఒక సంభాషణ ముగిసిపోతున్న చివరి క్షణాలు”
Too beautiful and melancholic!!
ఈ వారాంతపు శెలవుల్లో ఒక అడవి లాంటి ప్రదేశం లో తిరుగులాడే అదృష్టం నాకు కలిగింది. 🙏🏽
గడ్డిపూల తివాచీలు పరిచిన దారుల్లో నడిచాను
హాయిగా నింపాదిగా గడ్డి మోసే జింకలను దగ్గరగా చూశాను
ఎటు చూసినా పచ్చదనం, రంగు రంగుల పూలు, మహా వృక్షాలు!!
పొద్దున్నే రకరకాల పక్షుల కలకలరవాలు, వుండుండీ కూసే ఆ పక్షి కూత, ఆ అడవి మిమ్మల్ని గుర్తు చేశాయి.
ఆ దగ్గరలోనే వివేకానందుడు నడయాడిన చోటు!
My cup runneth over!!
🙏🏽🙏🏽🙏🏽
మీరు అదృష్టవంతులు మాధవీ!
వాడ్రేవు చినవీరభద్రుడు “సౌగంధిక పర్వం”లో చివరి పద్యంగా ఉండడం తగిన ముగింపు లా అనిపిస్తుంది. ఇది కాలచక్రం మారడాన్ని, ముఖ్యంగా వసంత ఋతువు ముగియడాన్ని జీవిత మార్పులతో పోలుస్తూ మనసులో కలిగే దిగులును చిత్రిస్తుంది. వసంతం నుంచి వేసవికే మార్పు, ఆ మార్పుతో పాటుగా మనస్సులో తేలికపాటి నిరాశ మొదలవుతుంది. గతంలో ప్రకృతి అందంగా ఉండేదని, ఇప్పుడు మాత్రం నగర జీవితం మామూలు వీధుల్లో నడకలకే పరిమితమైపోయిందని ఒక కొణమైన వేదన వెలిబుచ్చుతుంది. అయినా, వసంతం వెళ్లిపోయినా, మనసులో ఆ సంగీతం ఇంకా మెరిసేలా ఉంటుంది. చివర్లో, పూల రాలటం – ఒక సంభాషణ ముగిసిపోతున్న సూచనగా వాడినప్పటికీ, ఆ పూలను చూస్తే మనసులో మళ్ళీ కొత్త పువ్వు మొలకెత్తే అవకాశం మిగిలే ఉంటుంది. కాబట్టి ఇది ఒక కాలాంతర మార్పును మాత్రమే కాదు, తిరిగి పుట్టే ఆశను కూడా సూచించే శ్లిష్టమైన భావవ్యాఖ్య.కాలం మారడాన్ని మనోభావాలతో అనుసంధానించి, ప్రస్తుత ప్రపంచంలో ప్రకృతిని కోల్పోయిన వేదనను చెప్పడంతో పాటు, చిన్న ఆశాకిరణాన్ని కూడా మిగిల్చుతుంది.
ఎంతోకోమలమైన మీ సహృదయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు శైలజా మిత్ర గారూ!