
ప్రాచీన కాలంలో కథలు రకరకాల రూపాల్లో చెప్పేవారు. ఆధునిక యుగం మొదలయ్యాక, ఆ రూపాలు నెమ్మదిగా tale అనే రూపంలోకి కుదించుకుంటూ, ఎడ్గార్ అలన్ పో చేతుల్లో, ఇప్పుడు మనం చదువుతున్న, short story గా రూపుదిద్దుకుంది. కానీ ఇరవయ్యవశతాబ్దం సగభాగం గడిచాక పూర్వకాలపు మౌఖిక కథారూపాలు ఏదో ఒక దారిన మళ్ళా కథాశిల్పాన్ని ప్రభావితం చెయ్యడం మొదలుపెట్టాయి.
వాటిల్లో parable ఒకటి. ఒకప్పుడు దృష్టాంతంగా, పిట్టకథగా, కొంతవరకూ నీతికథగా ప్రచలితంగా ఉండే పారబుల్ నిజానికి కథన సంప్రదాయం నుంచి పక్కకు తప్పుకున్నది ఎప్పుడూ లేదు. మధ్యయుగాల్లో కూడా ఏదో ఒక చోట ఎవరో ఒకరు పారబుల్స్ చెప్తూనే ఉన్నారు. కాని వాటిని కేవలం నీతికథల స్థాయినుంచి పైకి లేపి ఒక inexplicable human predicament ని వివరించడానికి వాడుకోవచ్చని తెలియచెప్పినవాడు కిర్క్ గార్డ్.
ప్రాచీన కాలంలో కథకుడికి ఒక సత్యం తేటతెల్లంగా తెలిసినప్పుడు దాన్ని శ్రోతకి కూడా అంతే తేటతెల్లంగా చెప్పాలనుకున్నప్పుడు దాన్ని పారబుల్ గా చెప్పేవాడు. బుద్ధుడూ, క్రీస్తూ చెప్పిన పారబుల్స్ అటువంటివే. ఒకవేళ సత్యం స్పష్టంగా గోచరించకుండా చిక్కుముడి విడిపోకుండా ఉండి ఉంటే, దాన్ని పొడుపుకథగా, ప్రహేళికగా, conundrum గా చెప్పి ఊరుకునేవాడు. ఎన్నో ఆదిమజాతుల కథలు ఇటువంటి చిక్కుముళ్ళే.
అయితే కిర్క్ గార్డ్ మొదటిసారి, ఒక పారబుల్ ని చిక్కుముడితో మేళవించి కొత్త కథారూపంలో చెప్పడానికి ప్రయత్నించాడు. అంటే మానవుడు ఎదుర్కుంటున్న అనుభవాల్లో మానవత్వం ఎంత పాలు ఉందో, పశుత్వం ఎంత పాలు ఉందో తేల్చుకోలేనప్పుడూ, మనిషి తన అంతరంగంలో అనుభవిస్తున్న పగులుని పూడ్చుకోవడమెట్లానో తెలియనప్పుడూ, దైవత్వం ఎప్పటికీ సుదూరం నుంచీ ఆకర్షించే ఒక సత్యమా లేక మిథ్యనా అన్న ప్రశ్నని పరిష్కరించుకోలేకపోయినప్పుడు, ఆ అవస్థను పారబుల్ గా చెప్పడానికి ప్రయత్నించాడు.
పారబుల్ కీ, అలిగరీకీ తేడా ఉంది. రెండూ ఒక మెటఫర్ చుట్టూతానే అల్లుకుంటాయిగాని, అలిగరిలో మెటఫర్ ని మనం సులభంగా డీకోడ్ చెయ్యవచ్చు. అలిగరి సాధారణంగా ఒకే ఒక్క అర్థానికి కట్టుబడి ఉంటుంది. (కాని ఒక మిత్ ని మనం అలిగారికల్ గా చదివినప్పుడు మాత్రం దాన్ని అనేక రకాలుగా చదివే అవకాశం ఉంటుంది.) అలాకాక ఒక కథ దానికదే ఒక అలిగరి అయినప్పుడు అక్కడ ఒకటే అర్థముంటుంది. కాని పారబుల్ అలా కాదు. అక్కడ రూపకాలంకారం ఒకటే అయినప్పటికీ, ఆ అలంకారానికి ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చెప్పుకోవచ్చు. ఉదాహరణకి కాఫ్కా సుప్రసిద్ధ నవల The Castle లో లాగా. అక్కడ ఆ కాసిల్ కి ఎవరికి తోచిన అర్థం వారు చెప్పుకోవచ్చు. కాని ఒకసారి దానికి ఒక అర్థాన్ని నిశ్చయం చేసుకున్నాక, ఆ కథ మొత్తం ఆ అర్థానికి అనుగుణంగా ఒదిగిపోతుంది.
ఆధునిక జీవితంలోని అసంబద్ధతని వివరించడానికి కిర్క్ గార్డు పారబుల్ ని ఉపయోగించడం మొదలుపెట్టాక కూడా కొన్ని సార్లు ఆ పారబుల్స్ అలిగరిలుగానే మిగిలిపోయాయి. ఉదాహరణకి ఈ కథ చూడండి:
నేలమాళిగలో కాపురముండేవాడు
ఎవరేనా ఒక భవనం ఊహిస్తే అందులో ఒక మాళిగ, కింద వాటా, పైన మేడమీద మరొక వాటా ఉన్నాయనుకుంటే, ఆ మూడు వాటాల్లోనూ ఉంటున్నవాళ్ళు వాళ్ళ సామాజిక స్థాయికి తగ్గట్టుగా ఉన్నారనుకుంటే, అప్పుడు మనం అలాంటి ఇంటిని ఒక మనిషితో పోలిస్తే- అప్పుడు అత్యధికసంఖ్యాకులు వాళ్ళ సొంత ఇళ్ళల్లోనే వాళ్ళు నేలమాళిగలోనే నివాసముంటూ కనిపించడం ఎంత దురదృష్టం. మనిషిలోని దేహాత్మవిభాగం కూడా ఒక భవనంలాంటిదే అనుకున్నప్పుడు ఆ మనిషి ఎంతసేపూ నేలమాళిగలోనే అంటే ఇంద్రియాల చెప్పుచేతల్లోనే ఉండిపోతుండటం మనం గమనించవచ్చు. అతడలా నేలమాళిగలోనే ఉండిపోడానికే ఇష్టపడుతుండటమే కాదు, అలా ఉండిపోడాన్ని అతడెంత ప్రేమిస్తాడంటే, ఒకవేళ ఎవరేనా ఆ పై అంతస్తు కూడా నీ ఆధీనంలోనే ఉంది కదా, అక్కడెందుకుండవు అని అడిగితే వాళ్ళ మీద విరుచుకుపడతాడు కూడా- కావటానికి అతడు నివసిస్తున్నది తన ఇంట్లోనే అయినప్పటికీ.
ఒక పారబుల్ గా ఇది క్రీస్తు చెప్పిన కథలకి చాలా దగ్గరగా ఉన్న కథ. ఇందులో ఉన్న రూపకాలంకారంలో ధ్వనిస్తున్న అర్థం కాక మరో అర్థం దానికి చెప్పలేం. కాని ఈ పారబుల్ చూడండి:
ఊహించుకున్న విప్లవం
విప్లవాలు చెలరేగే యుగాలు ప్రధానంగా క్రియాశీలకంగా ఉంటాయి. కాని మనం జీవిస్తున్నది ప్రకటనల యుగం, ప్రచారాల యుగం. ఇటువంటి యుగంలో తక్కినవెలాగైనా ఉండనీ, ఒక విప్లవం సంభవిస్తుందని మాత్రం ఊహించలేం. ప్రతి దాన్నీ జాగ్రత్తగా లెక్కలు వేసుకునే మన కాలంలో ఒక విప్లవశక్తిని ఆవాహన చెయ్యడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ కుశలుడైన రాజకీయనాయకుడెవరైనా గొప్ప తమాషా చేసి చూపించగలడు. అతడొక కార్యాచరణ ప్రణాళిక రాసుకొచ్చి, ఒక మహాజనసభ ఏర్పాటు చేసి విప్లవమే తక్షణ అవసరం అని ప్రజలు నిర్ణయించేలా చేయగలడు. ఆ తీర్మానాన్ని అతడెంత జాగ్రత్తగా రాస్తాడంటే చివరికి సెన్సారు కూడా దాన్ని అడ్డుకోకుండా వదిలేయగలదు. అక్కడితో ఆగకుండా, ఆ మీటింగులోనే అతడు ప్రజలకి ఎటువంటి భావన కలిగిస్తాడంటే, వాళ్ళంతా అప్పటికప్పుడే నిజంగానే తిరగబడి విప్లవం సాధించేసినట్టుగా నమ్ముతారు, ఆ తర్వాత వాళ్ళంతా ఎంత సుఖంగా ఇంటిదారి పడతారంటే, ఆ సాయంకాలం నిజంగానే చాలా బాగా గడిచిందనుకునే అనుకుంటారు ఇంటికి పోతూ.
ఇది నిస్సందేహంగా మాడర్న్ పారబుల్. ఎందుకంటే ఇందులో ఏ రూపకాలంకారం లేదు. ఈ కథ మనం ఎన్ని సార్లు చదివినా దీన్ని అర్థాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నామని చెప్పలేం. ఇంకా చెప్పాలంటే, కథకుడు ఈ కథ పందొమ్మిదో శతాబ్దిలో రాసినప్పటికీ, ఇది ఇరవయ్యవ శతాబ్దిలో ఎంత సుసంగతంగా అనిపించిందో, ఇప్పుడూ కూడా అంతే ప్రాసంగికంగా మనకి తోస్తూ ఉంది. కాని ఈ పారబుల్ కూడా మానవ జీవితం తాలూకు అసంబద్ధతని పూర్తిగా కొల్లగొట్టుకోలేదు. కానీ ఈ ఉదాహరణ చూడండి:
దేవుళ్ళ విసుగు
దేవుళ్ళకి బాగా విసుగ్గా ఉండటంతో కాలక్షేపానికి మనిషిని సృష్టించారు. మొదట్లో ఆదాము ఒక్కడే అయిపోయి అతనికీ విసుగ్గా ఉండటంతో అవ్వని సృష్టించారు. (అప్పణ్ణుంచీ) ఈ ప్రపంచంలోకి విసుగు ప్రవేశించింది. ఇక ఆ తర్వాత జనం ఏ మోతాదులో పెరిగితే విసుగు కూడా అదే మోతాదులో పెరుగుతూ వచ్చంది. అప్పుడు ఆదామూ, అవ్వా ఇద్దరికీ కలిపి విసుగుపుట్టింది. ఆ తర్వాత ఆదాము, అవ్వ, ఏబెల్, కెయిన్ మొత్తం కుటుంబానికంతటికీ విసుగుపుట్టడం మొదలయ్యింది. ఈలోగా ప్రపంచ జనాభా పెరగడం మొదలుపెట్టింది. మొత్తం జనాభా జనాబా అంతటికీ విసుగుపుట్టడం మొదలయ్యింది. వాళ్ళు ఆ విసుగునుంచి తప్పించుకోడానికి ఎత్తుగా ఒక గోపురం కడితే బాగుంటుందనుకున్నారు. ఆ గోపురం లాగా ఆ ఆలోచన కూడా చాలా విసుగ్గా తోచింది. అంటే ఏం చెయ్యి, చివరికి విసుగుదే పైచేయి ఎలా అవుతుందో రుజువైనట్టు అనిపించింది… నాకు శిష్యులుండాలని కోరుకోను. కాని ఎవరేనా నా మరణసమయంలో నా మృత్యుశయ్యదగ్గర ఉన్నట్టయితే, ఇక నా చివరిక్షణాలు దగ్గరపడ్డాయని నాకు నిశ్చయమైనాక, భరించలేనంత పరోపకార భావావేశానికి లోనై నేనతని చెవిదగ్గర నా సిద్ధాంతం గొణగడం మొదలుపెడతాను, నేనలా చెయ్యడం అతనికి మంచి అవునోకాదో నాకు నిశ్చయంగా తెలియకపోయినప్పటికీ..
ఇదుగో, ఇటువంటి కథల్లోంచే మాడర్న్ పారబుల్ పుట్టింది. పందొమ్మిది, ఇరవై శతాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఇటువంటి పారబుల్స్ నుంచి ఒక వందదాకా ఎంపిక చేసి Howard Schwartz అనే ఆయన Imperial Messages: One Hundred Modern Parables (1976) అనే సంకలనం తీసుకొచ్చాడు. అందులో డాస్టొవిస్కీ, గొగోల్, బోర్హెస్, కాఫ్కా, అగ్నాన్, దానీల్ కార్మ్స్ వంటివారి కథల్ని పొందుపరిచాడు. కాని ఈ ప్రక్రియ, absurdism, magical realism లాంటి ప్రక్రియల నీడన మరుగుపడిపోయినప్పటికీ, ఆ కళా ఉద్యమాలకీ, మాడర్న్ పారబుల్ కీ మధ్య విస్పష్టమైన భేదం ఉందని మనం చెప్పగలం.
ఉదాహరణకి బోర్హెస్ రాసిన ఈ కథని మాజికల్ రియలిస్టు కథగానే లోకం చదువుతున్నప్పటికీ, ఇది స్పష్టంగా ఒక మాడర్న పారబుల్.
నేనూ, బోర్హెసూ
మామూలుగా ఏదన్నా జరుగుతుంటే అది ఆ మరోమనిషికి అంటే బోర్హెసుకి జరుగుతుంటాయి. నేనైతే బ్యునోస్ ఎయిర్స్ లో ఊరికే అటూ ఇటూ యాంత్రికంగా తచ్చాడుతుంటాను, ఏదేనా ఒక పెద్ద కమానునో లేదా ఇనుపగేటునో పరికిస్తుంటాను. బోర్హెస్ గురించిన వార్తలు నాకు మెయిల్లో అందుంటాయి, అప్పుడప్పుడు అకడెమిక్ బాలట్ మీదనో లేదా ఏదేనా ప్రముఖుల జీవితవిశేషాల పట్టికలోనో అతని పేరు కనబడుతుంటుంది. నాకేమో ఇసుకగడియారాలన్నా, భూగోళపటాలన్నా, పద్ధెనిమిదో శతాబ్ది పోతపోసిన అచ్చు అక్షరాలన్నా, కాఫీ రుచి అన్నా, స్టీవెన్ సన్ వచనమన్నా ఇష్టం. ఆ మరోమనిషి ఈ ఇష్టాల్ని నాతో పంచుకుంటూ ఉంటాడుగానీ అదేమిటో ఒక నటనలాగా తోస్తూంటుంది. మా మధ్య సంబంధాల్లో విరోధముంది అనడం అతిశయోక్తి అవుతుందిగాని, నేనేమో జీవించడానికీ, అలా జీవించే వీలు దొరకపుచ్చుకోడానికీ చూస్తుంటాను, దానివల్ల బోర్హెస్ కి సాహిత్యం రాసుకోడానికీ, అలా తన రాతల ద్వారా నా అస్తిత్వాన్ని సమర్థించడానికీ వీలు చిక్కుతుంది. అతడేదో కొంత చెప్పుకోదగ్గదే రాసాడని ఒప్పుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదుగానీ, అతడు రాసిన పుటలేవీ నన్ను రక్షించగలవని మాత్రం నేననుకోవటం లేదు. ఎందుకంటే వాటిల్లో అధికభాగం ఎవరో ఒకరికి చెందినవి కావు, ఆ మాటకొస్తే అతనికి కూడా చెందినవి కావు. నిజానికి అవెప్పుడో స్పానిష్ భాషకీ, ఆ సంప్రదాయానికీ చెందినవైపోయాయి. ఎలా చూసినా నేను మిగలకుండాపోతానుగాని, నాలో కొన్ని క్షణాలు మాత్రం ఆ మరోమనిషి ద్వారా మిగులుతాయనుకుంటాను. ప్రతి ఒక్కదాన్నీ ఊరికే అతిశయోక్తుల్తోనూ, అబద్ధాలతోనూ నింపే అలవాటు అతనికి ఉందని నాకు తెలిసినా కూడా నేను నెమ్మదినెమ్మదిగా అతనికి లోబడిపోతూనే ఉన్నాను. వస్తువులూ, విషయాలూ తమ స్వభావాన్ని నిలబెట్టుకోడానికే తపిస్తాయని స్పినోజా అన్నాడు: అంటే రాళ్ళెప్పటికీ రాళ్ళుగానూ, పులులెప్పటికీ పులులుగానే ఉండిపోవాలనుకుంటాయని. కాని నేను-అంటే నేనంటూ ఒకడుంటే-అతడు నాద్వారా కాకుండా బోర్హెస్ రూపంలో మనుగడ సాగించక తప్పదు. కాని వేరేవాళ్ళ చూసినప్పుడో,, లేదా ఊరికే గిటారు ప్రాక్టీసులోనో నన్ను నేను పోల్చుకున్నంతగా అతడి పుస్తకాల్లో మరీ అంతలా పోల్చుకోలేకపోతుంటాను. ఏళ్ళ కిందటే నేనతడినుంచి బయటపడటానికి ప్రయత్నించాను. దిగువమధ్యతరగతి కథలనుంచి బయటపడి కాలంతోనూ, అనంతత్వం తోనూ క్రీడించడం మొదలుపెట్టాను. కాని ఇప్పుడు ఆ ఆటలన్నీ బోర్హెసువి అయిపోయాయి. కాబట్టి నేను మరోటేదో వెతుక్కోక తప్పదు. ఆ విధంగా చూస్తే నా జీవితమంతా దేన్నుంచో పారిపోవడమే. నాదంటూ ఏదన్నా ఉంటే అది అయితే విస్మృతిలోనైనా పడిపోతుంటుంది లేదా ఆ మరోమనిషికి సొంతమైనా అయిపోతుంటుంది.
ఇంతకీ మా ఇద్దరిలో ఈ మాటలు రాస్తున్నదెవరో నాకు తెలియనే తెలియదు.
ఒకప్పుడు నేను ఈ ప్రక్రియ గురించి రాస్తూ ఈ కథల్ని ‘కథల్ని ధిక్కరించే కథలు’ అని అన్నాను. (చూ. సాహిత్య సంస్కారం, పే.216) కాని నిజానికి వీటిని అకథలు అని పిలవడం సమంజసమని ఇప్పుడనిపిస్తోంది.
అకథ అనే పేరు నేను పెట్టింది కాదు. ప్రాచీన కాలంలో జైన ప్రాకృత సాహిత్యవేత్తలు కథావిభేదాల్ని పేర్కొంటున్నప్పుడు కథలు మూడు రకాలుగా ఉంటాయన్నారు. అవి అకథ, వికథ, సత్కథ. అకథ అంటే ఈ లోకాన్ని మిథ్యాదృష్టితో చూడటం వల్ల పుట్టేది. వికథ అంటే వ్యామోహదృష్టితో చూడటం వల్ల పుట్టేది. సత్కథ అంటే సత్యదృష్టితో చూడటం వల్ల పుట్టేది. అకథలకీ, వికథలకీ దూరంగా ఉంటూ జైన సాధువులు సత్కథలు మాత్రమే వినాలని జైన లాక్షణికులు చెప్పారు.
కాని ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో నాకయితే ఈ మూడు పదాలకీ అర్థం మార్చి చెప్పవలసిన అవసరం కనిపిస్తున్నది. సత్కథ ఎప్పటికీ సత్కథనేగాని, అటువంటి కథ నిజంగా ఈ లోకంలో జరుగుతుందా అని అనుమానం కలిగిస్తుంది. అత్యంత ఆదర్శవంతమైన ఆ కథల్లో లానే ప్రతి ఒక్కరూ తమ జీవితం కొనసాగితే బాగుండని అనుకుంటారుగాని, సాధారణంగా, మన కథలు, అయితే అకథలు లేదా వికథలు మాత్రమే.
అకథ అంటే కథగానిది. కాని దానిలో ఒక కథాస్ఫురణ ఉంటుంది. అలాగని దాన్ని మనం కథగా మారిస్తే దానిలోని కథ అదృశ్యమైపోయి అది నిజంగానే అకథగా మిగిలిపోతుంది. అందుకని మన జీవితంలోనూ, మన చుట్టూతా సంభవించే ఆ అకథనాత్మక క్షణాల్ని మనం ఉన్నవి ఉన్నట్టుగా పట్టుకోగలిగితే, అప్పుడు ఆ అకథలు మనకి కథలుగా వినిపిస్తాయి. చాలామంది తాత్త్విక కథలు రాయాలనే చాపల్యంతో చేసే పొరపాటు ఏమిటంటే, ఆ అకథల్లోని ఆ realistic element ని super-natural గానో, లేదా magical గానో మార్చే ప్రయత్నం చేసి వాటిని కథలు కాకుండా వ్యాసాలుగా మార్చేస్తుంటారు. లేదా కొన్నిసార్లు కథలపేరు మీద కవిత్వం రాస్తుంటారు. కాని అకథలు వ్యాసాలు కావు, కవితలు కావు, చిక్కుముళ్ళు కావు, నీతికథలు అసలే కావు. అవి మన అస్తిత్వం మనకి సూటిగా తటాలున ఎదురయ్యే క్షణాలకు సంబంధించిన కథలు. వాటిని కథలుగా మార్చనంతకాలం మాత్రమే అవి కథలుగా నిలబడతాయి.
కాబట్టి అకథలు అంటే కథలుగా రాయకూడని కథలన్నమాట. నిజానికి blurring of genres అనేది ఒక పోస్ట్ మాడర్న్ లక్షణం. ఇప్పుడు కథలు కథల రూపంలోనే ఉండవలసిన పనిలేదు. కొన్నిసార్లు అవి వార్తలుగా, కొన్నిసార్లు సంపాదకీయాలుగా, కొన్నిసార్లు ప్రసంగాలుగా కూడా కనబడవచ్చు. అలానే మనం కథలుగా చదువుతున్నవన్నీ కథలని చెప్పలేం. చాలా సార్లు అవి వ్యాసాలు, లేదా కవితలు లేదా అధికప్రసంగాలు.
ఏళ్లమీదట నేను గ్రహించిందేమంటే, అకథలు చాలా కాలంగా నా తలుపు తడుతున్నా ఇన్నాళ్ళూ ఉపేక్ష వహించానని. వాటిని కథలుగా రాద్దామనే వ్యర్థ సంకల్పమే దానికి కారణం. ఇప్పణ్ణుంచీ వాటిని ఉన్నవున్నట్టుగా ఎప్పటికప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
Featured image: Absolute Reality, a painting by Joan Miro (1893-1983)
1-1-2025


మరో కొత్త పాఠం మీ నుండి వింటున్నందుకు సొమతోషం. అలిగరీ, పారబుల్.అకథ, వికథ, సత్కథ వివరణ కథోదహరాణలతో చెప్పడం బాగుంది. మీరు యూనివర్సిటీ లో ప్రొఫెసరయ్యుంటే ఎలా ఉండేదో . కానీ ప్రవృత్తికి తగిన వృత్తిని పూర్వ భాగం, వృత్తికి తగిన ప్రవృత్తిని ఉత్తర భాగం లో చేపట్టి ఇరు వైపుల వెలుగు ప్రసరింప జేయగలిగిన మీ భాగ్యం గొప్పది.
ధన్యవాదాలు సార్!
నిన్న,రేపు అర్ధమవుతాయేమో అనుకున్నా.ఈరోజు అర్ధమయేలా.వివరించారు.ధన్యవాదాలు!
ధన్యవాదాలు
మన జీవితంలోనూ, మన చుట్టూతా సంభవించే ఆ అకథనాత్మక క్షణాల్ని మనం ఉన్నవి ఉన్నట్టుగా పట్టుకోగలిగితే, అప్పుడు ఆ అకథలు మనకి కథలుగా వినిపిస్తాయి.
మళ్ళీ మళ్ళీ చదువుకునే వ్యాసం సర్. శుభోదయం.
ధన్యవాదాలు మేడం
నేను కథలు, కథల గురించి చదవాలని నిన్న అనుకున్నాను , మీరు ఈరోజు క్లాసులో ఈ పాఠం చెప్పారు…
అదృష్టం అంటే నాదే గురువుగారు
🙇🏻♂️💐🌟
ధన్యవాదాలు సోమ భూపాల్!