ఒకానొక సహృదయుని ప్రేమలేఖలు..

గంటేడ గౌరునాయుడు నా ఆత్మబంధువు. ‘పాట పాడే ఇప్ప చెట్టు’ అని ఆయన గురించి ఒకసారి రాశాను. ఆయన నాకు ఒక దిక్సూచి. ఇక్కడ నేను ఏమి రాసినా అక్కడ వెంటనే ఆ హృదయం స్పందిస్తుంది. ఆయనా,  ఆయన లాంటి మరికొందరు మిత్రులూ నేను రాసింది ప్రతి ఒక్కటీ,  ప్రతిరోజూ చదువుతారన్న భరోసా వల్లనే రోజూ ఏదైనా రాద్దామనుకుంటూ ఉంటాను. రాసింది చదవడం సరే, ఒక ఈ బుక్ గా వెలువరిస్తే వెంటనే దాన్ని నిలువెత్తు ప్రింట్ చేయించుకుని, తెచ్చుకుని, తన మనవరాళ్లతో ఆవిష్కరింప చేసుకుంటారు. ఆ ఆవిష్కరణ ఫోటో నాకు పంపిస్తారు. ఆ ఫోటో చూస్తే హృదయంలో ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. నేనొక పుస్తకం రాసినందుకు అది చేరవలసిన చోటికి చేరిందని గొప్ప తృప్తి కలుగుతూ ఉంటుంది. ఇదిగో ఇటువంటి ఒక వ్యాసం వచ్చినప్పుడు ఇక ఆ సంతోషాన్ని మాటల్లో పెట్టడం కష్టం. విద్య గురించి నేను రాసుకున్న అనుభవాలు ఇటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడి ఆమోదం పొందినప్పుడు కదా బంగారానికి గీటురాయి దొరికినట్టు!


ఒకానొక సహృదయుని ప్రేమలేఖలు ..

గంటేడ గౌరునాయుడు

నిన్నంతా ఒక సహృదయుడు రాసిన ప్రేమ లేఖల్ని చదివుతూ గడిపేను. ఔను అవి ప్రేమలేఖలే. ఎంతో ఆర్తితో, మరెంతో బాధ్యతతో రాసిన ప్రేమలేఖలవి. కవీ, రచయిత, చిత్రకారుడూ, పిల్లలప్రేమికుడూ అయిన ఒక భావుకుడు తాను దర్శించిన ప్రయోగాత్మక పాఠశాలలగురించి రాస్తే వాటిని ప్రేమలేఖలు అనకుండా మరేమంటాను!

*

‘1945 లో ఒకవైపు మొత్తం ప్రపంచాన్ని పట్టించు కున్న మనిషి అదేసమయంలో తనని చూడ్డానికి వచ్చిన కుటుంబంలో రెండున్నరేళ్ళ పసిపాప గురించి కూడా ఆతృత పడగలిగాడంటేనే ఆ ప్రేమాస్పదహృదయ మెటువంటిదో తెలుస్తుంది’

ఎవరీ ప్రేమాస్పదహృదయుడు? ఆ ప్రేమాస్పదుడి గురించి ఎవరీ మాటలు చెప్పేరు? అని తెలుసు కోవాలి అని తప్పక అనిపిస్తుంది ఏ సహృదయుడి కైనా.

నెల్లూరు దగ్గర పల్లెపాడులో పినాకినీ ఆశ్రమాన్ని 1921లో గాంధీగారు స్వయంగా వచ్చి ప్రారంభించిన పినాకినీ ఆశ్రమాన్ని ఎంతమంది దర్శించి ఉంటారు? నాకైతే ఆ భాగ్యం కలగలేదు. నాలాటి అభాగ్యులు ఎందరో ? నాలాటి వారికోసం కళ్ళకు కట్టినట్టు అక్కడి విశేషాలెవరు పనిగట్టుకుని చెప్తారు?

నెల్లూరు దగ్గర్లోనే అల్లూరు మండలంలో గొల్లపాలెం స్వచ్చంద సంస్థ నడుపుతున్న చైల్డ్ అనే పాఠశాల, అక్కడ చదివే బాలబాలికలందరూ అనాధలు. రైళ్ళలో దోపిడీలకూ, నేరాలకూ పాల్పడే ముఠాల నుంచి రక్షించిన చిన్నపిల్లల్ని అక్కడ చేర్పించి ఆ పాఠశాల నడుపుతున్నారట రామచంద్రశరత్ బాబు, ఆయన సతీమణి. రానున్న రోజుల్లో అలాటి పిల్లలు వస్తే వారికోసం ముందుగానే మూడుజతల దుస్తులు రకరకాల కొలతల్లో కుట్టించి సిద్ధంగా ఉంచుతారట . ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న తావులున్నాయని నాకు గాని ఎవరికైనా గాని ఎలా తెలుస్తుంది?

*

అక్షరానికి గుడి ఉందంటే ఆశ్చర్యం కదా! నేలమీద ఒక గూడు, ఆగూడు లోపల 24సవర అక్షరాలు, ఆ నేల భూమి,గూటిపైకప్పు ఆకాశం, అదే’అక్షరబ్రహ్మ’ గుడి. అక్కడ విగ్రహమేదీ ఉండదు..అక్షరమే దేవుడు, పూర్వకాలపు సవరదేవతలు రక్తానికీ, సారాయికీ అలవాటు పడిపోయారని ఆ అలవాటును తప్పించడానికి ఒక సవరతెగకు చెందిన సంస్కర్త ‘ఎస్.పి.మంగైజీ గొమాంగో’ ఇలాటి ఏర్పాటొకటి చేసేడట. ఎంత గొప్ప ఆలోచన! వింటే ఒళ్ళు పులకరించదూ.ఏనాగరిక సమాజంలోనైనా ఉందా అక్షరానికి గుడి? ఈ గుడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట దగ్గర నౌగడ అనే సవరజనావాసంలో ఉందని (గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడలో కూడా ఉంది) వాటిని దర్శించాలని ఎవరు సూచిస్తారు?

భూమ్మీద స్వర్గాన్ని నిర్మించిన తావొకటి ఉందట. అది గుంటూరు దగ్గర చోడవరం గ్రామంలో డా:మంగాదేవిగారు వికసింపజేసిన చేతన పాఠశాల. అనాథ, అనాథశరణాలయం అనేవి క్రూరమైన పదాలకు ఆమె దగ్గర చోటులేదట. బాగుంది కదూ.

అటువంటి బడి ఒకటుందని పిల్లలప్రపంచం ఏ బుల్లి బుల్లి కలలపోగుల్తో నేసుకోవాలో, పిచికలు అల్లుకున్న గూడులాగా ఒక బడి ఎట్లా అల్లుకోవాలో ఆ వికాసరహస్యం డా. మంగాదేవిగారి దగ్గర ఉందని తెలిసేదెలాగ?

*

ఆంధ్రదేశంలో మొదటి గ్రంథాలయాన్ని మంతిన ఆదినారాయణ మూర్తి అనే ప్రాథమికోపాధ్యాయుడు 1886లో విశాఖపట్నం లో ప్రారంభించేడని చదివి నప్పుడు ఇంతవరకూ నాకా విషయం తెలియనందుకు సిగ్గుపడ్డాను. రాజమండ్రి లో 1893లో శ్రీవీరేశలింగ గ్రంధభాండాగారంగా నాళం కృష్ణారావు గారు స్థాపించినదే గౌతమీగ్రంథాలయం అనీ ‘ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయచరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చరిత్రే’ అని వావిలాల అన్నమాటనూ గుర్తుచేసే దెవరు?

మనం పారేసే కొబ్బరికాయలు, సీసాలు వంటివాటితో,స్పైరల్ బైండింగ్ కి వాడే అట్టల్తో బొమ్మలు తయారుచేసి పాఠ్యపుస్తకాల్లోని కథల్ని నాటకీకరణచేసి ప్రదర్శించే, ‘స్వేచ్ఛాగీతం’ ఆలపిస్తూ కోలాటమాడే పిల్లల మధ్య మనమూ పిల్లలమైపోవాలంటే చీమకుర్తిలో ‘ఎన్.ఎస్. ప్రకాశ్ అనే ఒక అభ్యుదయ వాది స్థాపించిన పబ్లిక్ స్కూల్ కి వెళ్ళాల్సిందే’ అని ఎవరోవొకరు చెప్పాలికదా.

ఇరవైమంది అంధబాలికలకోసం డా: జవహర్ గారి వసతిగృహం ఏర్పాటుచేసి వారి ఆలనా పాలనా చూస్తున్నారని, అక్కడ జూనియర్ కళాశాలలో కొందరు మిత్రుల సహకారంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని ఆ ప్రయోగం డా: జవహర్ గారిదేనని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేదెవరు?

ఈశవిద్య పేరిట ఈశ ఫౌండేషన్ తో కలిసి పాఠశాల విద్యాప్రమాణాలు పెంచడం కోసం ఆం.ప్ర ప్రభుత్వం కుప్పం నియోజకవర్గం లో ప్రత్యేక కార్యక్రమం మొదలుపెట్టిందట.. ఈశ పాఠశాలని చూసినకళ్ళతో ఆశ్రమ పాఠశాలను చూస్తే చాలా దిగులుకలిగిందని ఎందుకన్నారో ..అక్కడ గోడలు కూడా కళకళలాడితే ఇక్కడ తరగతిగదులేమో కళాహీనంగా ఉన్నాయట,

ఈశవిద్య వంటి ప్రైవేటు సంస్థలకీ, ప్రభుత్వానికీ మధ్య ఒక తేడా ఉందని. ఆతేడా ఇద్దరు తండ్రుల మధ్య తేడా వంటిదని అంటారీ రచయిత. అదెలాటిదంటే ‘ఒక తండ్రి తనపిల్లలకి శక్తివంచన లేకుండా తన సుఖం పక్కన పెట్టి, సమకూరుస్తాడు ప్రభుత్వం లాగా, కాని పిల్లల్ని పట్టించుకోడానికి తీరిక మాత్రం ఉండదతనికి. మరొక తండ్రి చాతనైనంతే సమకూర్చినా కొంతసేపు ఆ పిల్లవాడితో గడుపుతాడు గొప్ప ధార్మిక సంస్థ నడిపే పాఠశాలలాగా’ ఇప్పుడు మనకి స్పష్టమౌతుంది కదా తేడా..ఇలా తైపారేసి ఎవరుచూస్తారు?

*

అమూల్యమైన కాలాన్ని వృధాచేసి ఆరునెలల కాలంపాటు ఎందుకూ కొరగాని ఆరు ఒరియా అక్షరాలు నేర్పడం కన్నా ఆరు నీతికథలు బోధిస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పిన గిడుగువారి మాటల్ని నిజం చేసే ప్రయోగాలు జరిగిన తావుల్లో ఎంత అభివృద్ధి సాధ్యమైందో ‘గిరిజన బాలికలు ఈ అధికారితో ‘దంగల్ సినిమా’ గురించి పిల్లలు వాదన పెట్టుకున్నంతగా’ అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ. ఇదెలా సాధ్యమైందో వివరించేదెవరు?

బడిలో సమావేశం ముగియగానే లేచి వెళ్ళకుండా పిల్లలు రెండునిముషాలు పాటు మౌనంగా ఉండి అప్పుడు వెళ్ళడంలోని ఆంతర్యమేమిటో ఋషీవాలీ బడిపిల్లల్ని గమనిస్తే తప్ప తెలీదనీ, మనకి తెలియాల్సింది టీచర్ ట్రైనింగ్ అనడానికి బదులు టీచర్ మెంటరింగ్ అనాలని ఇలాటి సంభాణల్లోనేకదా తెలిసేది ఎవరికైనా ఎప్పుడైనా.

‘ఉపాధ్యాయుడు తాను ఏస్కూల్లో చదువుకున్నాడో ఎలా చదువుకున్నాడో ఆ అనుభవాన్నే తిరిగి పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నస్తాడు’ అనే చంద్రిక మాధుర్ మాటతో ఏకీభ వించాలేను నావరకు నేను.‌ ఈ మాట అనడానికైనా ఈ సంభాషణలో మనవరకు చేరవేసేవారుండాలికదా!

*

అచ్యుత సమంత ప్రయోగాల గురించి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 25000 మంది విద్యార్థుల్తో ఒక పాఠశాల నడుస్తుందని విన్నప్పుడు ఎంతో wild గానూ, crazy గానూ అనిపించిందట రచయితకి. నిజమే కదా ! అన్ని గిరిజన తెగలకూ చెందిన విద్యార్థులున్న ఆ ప్రాంగణంలో మీకు ‘గోపీనాధ మొహంతి’ తెలుసా? అంటే పదివేల కంఠాలు ఒక్కసారిగా తెలుసు అన్నాయట. ఈ వాక్యం చదివుతుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది ఎ వరికైనా. కాదూ మరి..గిడుగు తెలుసా? గురజాడ తెలుసా? అనడిగితే అన్నివేల కంఠాలు ఒక్కసారి తెలుసు అంటే వినాలనే నా ఆశ అత్యాశ అంటారా?

*

మనుషులమధ్య కొందరు కట్టిన గోడల్ని కూలుస్తూ నమ్మకాలని నిలబెడుతూ వస్తున్న నిశ్శబ్దప్రేమికులు ఇంకా కొందరుండబట్టే ఈ దేశం ఇంకా జీవించదగ్గది గా కనిపిస్తూ ఉంది అంటున్న ఈ సహృదయుని మాటలో నిజముందని ఒప్పుకోక తప్పదని గ్రామీణ విద్యారంగంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో శ్రీ అరవిందో సొసైటీ వారు చేపడుతున్న రూపాంతర్ కార్యక్రమాలు రుజువుగా నిలుస్తాయని ఈ లేఖలు చదివకపోతే నాకు తెలిసేవా?

‘మన నాయకులు మన విద్యావేత్తలు మెగలో మానియాక్స్, వీళ్ళకి వెయ్యెకరాల స్థలం లో వేలాది మంది విద్యార్థులకోసం ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాలు మాత్రమే కనిపిస్తాయి, ఒక ప్రాథమిక పాఠశాలను సందర్శించడంలో మనం లోనుకాగల ఉద్వేగం ఎటువంటిదో వీళ్ళకు తెలియనే తెలియదు’ అని ఇంత సున్నితంగా హెచ్చరించిన సంగతి ప్రపంచానికి తెలియొద్దా ?!

ప్రళయకావేరి కెరటాల ఉయ్యాలలూగి ఇరకం దీవిని మనమెలాగూ సందర్శించలేం. ఆ దీవినుండి ఓడ మీద బయటప్రాంతానికి బడికి వెళ్ళే మత్స్యకార పిల్లలకోసం వాళ్ళున్నచోటనే బడి పెడతామంటే ఒద్దంటారా..వట్టి ప్రాథమిక పాఠశాల కాదు, ఆ మత్స్యకార కుటుంబాల కోసం ఒక రెసిడెన్సియల్ పాఠశాల తెరవగలరా అనే ఎమ్మెల్యే ఒక అధికారితో అనడమైతే నాకు ఆశ్చర్యమూ ఆనందమూను.

*

రాజమండ్రి బి ఇడి కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తత్త్వశాస్త్రం బోధించారని, దక్షిణభారత దేశంలో రాజద్రోహ నేరం మీద మొదటి సారిగా శిక్షకు గురయిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు అక్కడే చదివేరని, చలం కూడా అక్కడే అధ్యాపకుడిగా పనిచేసేరని, మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాట రాసినందుకు గాను జైలు శిక్ష బహుమతి గా పొందిన మొదటికవి గరిమెళ్ళ ఇదే కళాశాలలో చదివేడనీ ఆ కళాశాలకు ఆయన పేరే ‘శ్రీ గరిమెళ్ళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్’ అని పెట్టేరని చదివి ‘ఇంతదాకా ఆ కళాశాలను చూడలేకపోయేనే’ అని మనసులో దిగులు కమ్ముకుంది.

*

చాలా సంస్థలు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయడానికి ఏవేవో పద్ధతు లు అనుసరిస్తారు,కానీ తరగతిగదిలో ఉపాధ్యాయు ల పాఠ్యబోధన వీడియోగ్రాఫు ద్వారా పరిశీలించి అనుభవజ్ఞులైన ఆదర్శ ఉపాధ్యాయులచే ఎంపిక చేసే పద్ధతొకటి ఉందని వృత్తరీత్యా వైద్యురాలైన కవి, రచయిత శ్రీసుధ మోదుగు ఆమె నాన్నగారి పేరిట ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయడం కొత్తగానూ, ఆమోదయోగ్యంగానూ ఆనందకరమైందిగానూ ఉందనిపించింది. ఎందు కంటే ఆ వీడియోగ్రాఫులో ఉపాధ్యాయుడు తరగతి గదిలో అడుగుపెట్టగానే పిల్లల ముఖాలు ఫుల్ల కుసుమితాలయ్యాయో లేదో స్పష్టమౌతుంది. ఇదొక పద్ధతి ఉందని నాకెలా తెలుస్తుందీ సంభాషణ వినక పోతే?

కాకినాడలో క్రియ సంస్థ ఏటా నిర్వహించే పిల్లల పండగ విశేషాలు చదువుతుంటే ఒక్కసారైనా ఆ పండగలో పాల్గొనలేకపోతే పిల్లల ప్రేమికులెవరికైనా అదొక పెద్ద లోటే అనిపిస్తుంది”.పిల్లల పండగ నిర్వహించాలంటే అన్నిటికన్నా ముందు పిల్లల పట్ల ప్రేమ ప్రధానం కావాలి. తక్కిన వాటిని పక్కన పెట్టగల ఔదార్యం ఉండాలి. అందుకు అపారమైన ఆత్మధైర్యం కావాలి” అంటారీరచయిత. నిజమే కదా. ఇవన్నీ పుష్కలంగా ఉన్న మిత్రుడు జగన్నాధ్ ఎన్నిసార్లు పిలిచినా అక్కడికి వెళ్ళలేని బాధ ఎప్పటికీ తీరనిది నాకు.

*

ఎన్నెన్ని సంగతులని, ఎన్నెన్ని దృశ్యాలని, ఎన్నెన్ని అద్భుత ప్రయోగాలని.అన్నీ ఇక్కడ ఏకరువుపెట్టడం సాధ్యమూ కాదు, సమంజసమూ కాదు. ఇవి వ్యాసాలు అనడం అరిగిపోయిన పదంతో చిన్నబుచ్చడమే. అందుకే ఇవి ‘ఒక సహృదయుడు రాసిన ప్రేమలేఖలు’ అని అనాలని పించింది.

పోరాటాలన్నిటిలోనూ ఏ పోరాటం గొప్పదని అడిగితే విద్యకి సంబంధించిన పోరాటాలూ, ప్రయత్నాలే సర్వోన్నతమైనవని, తెలుగునేల ఇంకా రాజకీయ పోరాటాలే ఎక్కువ ఫలప్రదాలని నమ్ముతూ ఉందని, అంతిమంగా దారుణ వైఫల్యాన్ని చవిచూస్తుందని నమ్ముతున్న ఈ సహృదయడు ‘దండకారణ్యమంతా గిరిజన తిరుగు బాట్లతో రక్తసిక్తమౌతుంటే గిడుగు సవరభాషలో వాచకాలు రాసి గిరిజనభాషా మాధ్యమంలో ప్రపంచంలోనే తొలిసారి పాఠాలు చెబుతున్నాడు. తను కదా నిజమైన విప్లవకారుడు, నిజమైన వైతాళికుడు’ అని ఎలుగెత్తి చెబుతున్న ఈ పిల్లల ప్రేమికుని మాటలోని వాస్తవికతను గుర్తించక తప్పదు.

*

ఈ లేఖల నిండా ఈ సహృదయుని ఆనంద తరంగితమైన, అచ్చెరువుగొలిపే అనుభవాలూ జ్ఞాపకాలూ ఉక్కిరిబిక్కిరి చేసేయి. ఆయన ఎన్నోయేళ్ళు తిరిగిన ప్రాంతాలన్నీ కాలయంత్రంలో ఒక్క రోజులో తిరిగి వొచ్చిన అనుభూతికలిగింది. మళ్ళీ ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ పుస్తకం గుర్తుకొచ్చి ఒకనాడు ఈ మానవుడితో కలిసి తిరిగిన క్షణాలు కళ్ళముందు కదలాడేయి. ఆ పుస్తకానికి ఇది కొనసాగింపుగా తోచింది. తన ఉద్యోగజీవితంలో ఏమి సాధించాలని కలలు కన్నారో అవి సాకారమై తిరిగి చాలాయేళ్ళతరువాత తనకు ఎదురైతే కలిగిన ఆనందమేదో హరివిల్లై స్వగతించే దృశ్యాలే ఈ పుస్తకం నిండా.

ఈ సంభాషణల లో తాను చదివిన తాడికొండ పాఠశాల గురించి, అక్కడ తనకు పాఠాలు చెప్పిన గురువుల గురించి, తన సహవిద్యార్థుల గురించి చెప్తున్నపుడు ఆయన వికసిత వదనమే నా కళ్ళముందు కదలాడింది. ఒక వ్యక్తి సహృదయుడు కావడానికీ, సాహితీవేత్తా, చిత్రకారుడూ, నటుడూ, వక్తా, భావుకుడూ కావడానికి పునాదిగా నిలిచేది ఆవ్యక్తి చదివిన బడీ, చదువు చెప్పిన గురువులూ అని ఆ తాడికొండ పాఠశాల గురించి చెప్పిన సంభాషణల్లో ద్యోతకమై ఆ హీరాలాల్ మాష్టారూ, వెంకటరత్నం మాష్టారు, రాళ్ళబండి కృష్ణమూర్తి మాష్టారు, వారణాశి రామ్మూర్తి మాష్టారు ఎంత గొప్పవారో, ఇంకెంత ధన్యులో కదా అని వారికి మనసులోనే నమస్కరించుకున్నాను. వారి ధన్యత ఆ మాన్యత ఈ సహృదయుని సంభాషణల్లో, ఈ సహృదయుని లేఖల్లో స్పష్టమౌతోంది.

ఆ సహృదయడు రచయితా, కవీ, మంచివక్తా, చిత్రకారుడు, తాత్వికుడూ ముఖ్యంగా పాఠకుల సహృదయ మిత్రుడూ అయిన గౌ. వాడ్రేవు చినవీర భద్రుడుగారు అని ఈపాటికే పాఠకులు గ్రహించి ఉంటారు. ఏ వెలుగులకోసమైతే తన ఉద్యోగజీవితం పొడవునా కలలుకన్నారో ఆ వెలగుల్ని తన ప్రయాణం లో చూడగలిగారని ఈ సంభాషణల ద్వారా, ఈ లేఖలద్వారా తనకు తాను స్పష్టం చేసు కోగలిగారు. ‘ఆ వెలుగుల కోసమే ..’ పుస్తకం చదవడం నాకైతే ఒక అపూర్వ అనుభవమే అంటాను.


Featured image: Kundana and Pallavi, rand daughters of Ganteda Gourunayudu releasing the book ‘Aa Velugula Kosame’.

26-12-2024

16 Replies to “ఒకానొక సహృదయుని ప్రేమలేఖలు..”

  1. ఆ మాస్టార్లందరినీ గుర్తుచేసుకున్న ఈ మాస్టారే సహృదయుడు! ఆ అధికారికి ఇదే నిజమైన ప్రేమలేఖ!

    ఇంగ్లీషులో చెప్పాలంటే గంటేడ గౌరునాయుడు మాస్టారు మీ
    True Follower !

    1. చాలా సంతోషం సార్ అయితే నేనే గౌరునాయుడుని అనుసరిస్తూ ఉన్నాను. ఎన్నో సాయంకాలాలు ఆయన ఆ టిక్కబాయి స్కూల్లో పిల్లలతో పాటలు పాడిస్తూ ఉండే దృశ్యాలే ఎప్పటికీ నా కళ్ళ ముందు ఉంటాయి నన్ను నడిపిస్తూ ఉంటాయి.

  2. ఎంత చక్కటి స్పందన! నిజంగానే ఇవి ప్రేమ లేఖలు. అసలు చెప్పాలంటే ఇంత అపురూపమైన ప్రేమ లేఖలు ఇంత వరకు ఎవరూ రాయలేదేమో! సమాజం పట్ల, పిల్లల పట్ల, చదువుల పట్ల, తన వృత్తి పట్ల అపారమైన ప్రేమతో రాసిన అపురూప వాక్యాలు ప్రేమ లేఖలు కాక మరేమౌతాయి??సమాజం పట్ల ఇంత బాధ్యత తో ఆ ప్రేమ లేఖలు రాసిన వ్యక్తి సహృదయుడు కాక మరేమౌతారు?? మీ ఈ బుక్ చదివి, కొత్త విషయాలు తెలుసుకున్ప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు ఈ స్పందన చదివేక కూడా అలాగే మనసు నిండిపోయింది. Still there are people who love the society అని పొద్దున్నే ఒక నమ్మకం కలిగించేరు. Sir, మీకు, గౌరు నాయుడు గారికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను!

    1. అమ్మా !మీకు హృదయపూర్వక నమస్కారాలు, ఆశీస్సులు.

  3. “విద్య” కోసం తపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నప్పుడు మా చిన వీర భద్రుడు గారు నాకు రేణిగుంట పాఠశాల గ్రంథాలయంలో దొరికారు. అలాగే “పాడుదమా స్వేచ్ఛా గీతం” అన్న మా గౌరు నాయుడు గారు FB ద్వారా దొరికారు. ఇరువురూ మిత్రులని, ఒకే ప్రాంతంలో పనిచేసారని, వాళ్ళ రచనల ద్వారా మా బడిని ఇంకెంత బాగా ఉంచుకోవాలో నేర్చుకుంటూనే ఉన్నాను. ఇరువురికీ నమస్సులు, ధన్యవాదాలు…💐🙏💐🙏

  4. శ్రీ గౌరునాయుడు గారి సహృదయ స్పందన గొప్పగా ఉంది. మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలిసి, యింకా తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతున్నది. మీకు, గౌరు నాయుడు గారికి నమస్సులు.

  5. మీరొక అరుదైన అధికారి! మీరు రిటైర్ అయినా, ఇంకా చాలాకాలం పల్లెల్లో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తారని నా నమ్మకం. కొద్దీ నెలల క్రిందటే, నెల్లూరు జిల్లా అల్లూరు వద్ద శ్రీ రామచంద్ర శరత్ నడుపుపుతున్న పాఠశాలకు, adivasi.org వారికి ఆదివాసీ పిల్లల చదువులకు, అక్కడి ఆడపిల్లలకు అవసరమైన hygene అవసరాలకు, పెద్ద మొత్తం లోనే నా వంతుగా సహకరించాను. ఇలాటి స్కూళ్ళు ఎన్నో. కాకినాడ జిల్లాలో ఒక తీరప్రాంత గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు ఇంటర్ చదువు వరకు సహాయం చేశాను. ఇప్పుడు వారు కాలేజ్ కి వెళ్ళివుంటారు. అప్పుడు నాకు కాంటాక్ట్ గా ఉండిన హెడ్ మాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినట్లున్నారు, ఆ పిల్లల సమాచారం లభించలేదు.

    1. చైల్డ్ ఆశ్రమానికి మీరు సహాయం అందించారని తెలిసి చాలా సంతోషం కలిగింది.
      .

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%