అసాధారణ పథికుడు

కొంతమంది కుర్రవాళ్ళు పావననవజీవన నిర్మాతలు అని మహాకవి అంటున్నప్పడు ఆయన మనసులో ఎవరున్నారా అని అనుకుంటూ ఉంటాను. బహుశా తన కాలం నాటి తక్కిన యువకుల్లాగా జీవితంతో రాజీపడకుండా వ్యవస్థ మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనే ఆశ కల్పిస్తున్న యువకుల్ని చూసి ఆయన ఆ మాట అని ఉండవచ్చు. కాని ఇప్పుడు లంకమల వివేక్‌ ని చూడగానే ఆ మాటలు గుర్తొస్తున్నాయి నాకు.

నిజానికి వివేక్‌ చాలా సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చిన చాలా సాధారణమైన యువకుడు. సాధారణమైన ఉద్యోగి. కాని మన కళ్ళముందే అతడు మన కాలపు అత్యధిక సంఖ్యాకులైన యువకులకన్నా ప్రత్యేకంగా, అసాధారణంగా తనని తాను ఆవిష్కరించుకుంటో వస్తున్నాడు. ఆ ఆవిష్కరణ ఒక్కసారిగా హటాత్తుగా మనల్ని నివ్వెరపరిచేదిగా కాకుండా, నెమ్మదిగా, ఫాల్గుణమాసంలో చెట్టు చిగిరించడం మొదలుపెట్టినంత సహజంగా జరుగుతుండటం నేను గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాను.

ఇప్పుడు ఈ ‘లంకమల దారుల్లో’ యాత్రానుభవాలు చదవగానే అతడిలో నేనింతదాకా అస్పష్టంగా చూస్తూ వచ్చిన ధీరత్వం, సాహసం, సహృదయం స్పష్టంగా దర్శనమిచ్చాయి. .. for the hero is commonly the simplest and obscurest of men, నిజమైన ధీరుడు చాలా మామూలు మనుషుల్లో, చాలా చాలా మామూలుగా చాలా అనామకంగా ఉంటాడు అని థోరో రాసుకున్న మాటలు వివేక్‌ లాంటి వాళ్ళకి బాగా సరిపోతాయి.

ఒక యువకుడి మీద ఇటువంటి ప్రశంసల వర్షం కురిపించడం సముచితమేనా అనిపించవచ్చు మీకు. కాని మనం నిజంగా ప్రశంసించవలసిందీ, ప్రోత్సహించవలసిందీ, నాలుగడుగులు కలిసి నడవవలసిందీ ఇటువంటి యువకుల్తోనే. ఎందుకంటే ఇటువంటి యువతీయువకుల నిర్మల అంతరంగంలోంచే పావననవజీవనం ప్రభవిస్తుంది. ఏదో ఒక మతానికో, రాజకీయపార్టీకో, లేదా ఏదో ఒక భావజాలానికో, సిద్ధాంతానికో, ముఠాకో అనుచరుడిగా, ట్రోలర్‌గా, ఒక వోటుగా మారకుండా తన అంతరంగం ఎటు నడిపిస్తే అటు ఎప్పటికప్పుడు కొత్తదారుల్లో, అనిశ్చితినీ, అగమ్యాన్నీ స్వాగతిస్తో కొత్తదారులు వేసుకుంటూ పోగల ఇటువంటి సాహసికులే కొత్త యుగాలకు తలుపులు తెరవగలుగుతారు.

పందొమ్మిదో శతాబ్ది అమెరికాలో థోరో చేసింది ఇదే. ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ నడిచాడు. అతడు చేసిన అది పెద్ద పని నడవడం. నడక. కొలంబస్‌ అమెరికా ఖండాన్ని కనుగొని ఉండవచ్చుగాక. కాని అమెరికా ఆత్మని దర్శించింది మాత్రం థోరోనే. అది అతడికి పూర్తి స్వేచ్ఛలో, తన అంతరంగం చెప్పినట్టుగా, నడుచుకుంటూపోవడం ద్వారానే సాధ్యపడిందని చెప్పవచ్చు. ఇక్కడ నడక ఒక రూపకాలంకారం మాత్రమే కాదు, నిజంగా నడవడం కూడా. తన సుప్రసిద్ధమైన వ్యాసం Walking (1862) లో అతడు స్పష్టంగా రాసుకున్నాడు: It requires a direct dispensation from Heaven to become a walker అని. తన పూర్వకాలపు కవులు, ప్రవక్తలు, పరిశోధకులు నడిచినట్టుగా తాను కూడా ప్రకృతిమధ్యకి నడుచుకుంటూ పోతున్నానని చెప్పుకున్నాడు.

2

ఇప్పుడు ఈ వ్యాసాల్లో, ఈ కథనాల్లో వివేక్‌ చేసింది ఇదే. థోరో అమెరికాని కనుగొన్నట్టు వివేక్‌ నల్లమల, ఎర్రమల, లంకలమ కొండల్నీ, అడవుల్నీ కనుగొంటున్నాడు. అలాగని కేవలం ప్రకృతిని కాదు. ప్రకృతికీ మనిషికీ మధ్య ఉన్న దృశ్యాదృశ్య అనుబంధాన్ని కనుగొంటున్నాడు. ప్రకృతిలో మనిషి ఒకప్పుడు జీవించి వెళ్ళిన ఆనవాళ్ళు కనుగొంటున్నాడు. ఆ ఆనవాళ్ళను చెరుపుకుంటూ పోతున్న మనిషి విధ్వంసాన్ని కనుగొంటున్నాడు. కొందరు మనుషులు తమ ప్రయోజనాల కోసం మరికొందరు మనుషుల్ని నిరాశ్రయుల్ని చేయడాన్ని కనుగొంటున్నాడు. మనుషులంతా కలిసి ప్రకృతి పట్ల చేస్తున్న అపచారానికి ప్రకృతికి ఒక్కసారి కోపం వస్తే అది ఎంత విలయం సృష్టించగలదో అది కూడా కనుగొంటున్నాడు.

అన్నిటికన్నా మించి ఒక చెట్టు, ఒక కొండ, ఒక లోయ, ఒక పిట్ట, ఒక తీగ, ఒక పువ్వు వీటికి దగ్గరగా జరగాలని, ఏ మాత్రం తీరిక చిక్కినా వాటిదగ్గరకు పోయి గడపాలని తహతహలాడుతున్నాడు. ఇది, ఇలా కొండకోనల్తో ప్రేమలో పడటమే ఈ యువకుణ్ణి నా కళ్ళల్లో గొప్పగా చూపిస్తున్నది. మన కాలం నాటి యువకులు ఎన్నో విషయాలపట్ల, ఎన్నో అందాలపట్ల, అధికారం పట్ల, ఆస్తిపాస్తులు సమకూర్చుకోడం పట్ల కూరుకుపోతూ ఉండగా, ఈ పిల్లవాడు మాత్రం మరికొన్ని మట్టిదారుల వెంటనడవాలనీ, మరికొన్ని పాతకోనల్ని తనకై తాను కళ్లారా చూడాలనీ ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇటువంటి యువకుడు ఒక్కడున్నా కూడా భగవంతుడు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, ఆ సమాజాన్ని ఎన్ని తప్పులకైనా క్షమించగలడనిపిస్తుంది.

ఈ పుస్తకంలో 21 వ్యాసాలున్నాయి. వ్యాసం అనేది సరైన మాట కాదు నిజానికి. వీటిని యాత్రాకథనాలు అనాలి. అనుభవ కథనాలు అనాలి. మ్యూజింగ్సు అని కూడా అనొచ్చు. తనతో తాను చేసుకున్న సంభాషణలు అని కూడా అనుకోవచ్చు. లేదా ప్రకృతికి రాసుకున్న ప్రేమలేఖలు అని అనడం కూడా బావుంటుంది.

మనం ఈ రచనలోకి ప్రవేశించగానే ముందు మన చుట్టూ ఉన్న నగరసంరంభం పక్కకు తప్పుకుపోతుంది. మనం మనకు తెలియని తెలుగుసీమలో అడుగుపెడతాం. జనాభాలెక్కలు రాసుకునేవాళ్ళో, ఓటర్ల జాబితాలు తయారు చేసేవాళ్ళో లేదా రేషను కార్డులో, ప్రభుత్వపథకాలో పట్టుకు తిరిగేవాళ్ళో తప్ప మరెవరూ అడుగుపెట్టని ఊళ్ళమీంచి ప్రయాణించడం మొదలుపెడతాం. అసలు అటువంటి ఊళ్ళున్నాయనీ, వాటిని చూడటమే ఒక భాగ్యమనీ మనకు ఇప్పటిదాకా తెలియదు. పర్యాటకమంటే మాల్దీవులూ, లక్షదీవులచుట్టూ తిరిగే రాజకీయం కాదనీ, అది అన్నిటికన్నా ముందు నీ స్వదేశంలో, నీ స్వజనం మధ్య, నీ మూలాల్ని, నీ బంధాల్ని, నీ బొడ్డుతాటిని వెతుక్కుంటూ చేసే ప్రయాణమని అర్థమవుతుంది మనకి ఈ పుస్తకం పూర్తి చేసాక. రచయిత అనుకున్నట్టే మనమూ అనుకుంటాం:

ఎన్ని పల్లెలు, ఎన్ని కొండలు, ఎన్ని వాగులు, ఎన్ని గుట్టలు! ఎక్కడో బద్వేల్‌ దగ్గర నందిపల్లె కు చెందిన వివేక్‌ లంకమలని గురట్ల బాయి దగ్గర మొదలయ్యే లంకమల కొండల వరసలు పిలవడం మొదలుపెట్టాక, ఎన్ని పల్లెల వెంబడి ఎన్ని ప్రయాణాలు మొదలుపెట్టాడు!

ఒంటిమిట్ట మండలంలోని బెస్తపల్లె, మల్లేష్‌ కొండ, ఇసుకదిన్నె, కోటపాడు పరిసరాల్లోని మునకజలాల్లో పడవ ప్రయాణాలు, నందలూరు వైపునుంచి చేసిన పొత్తపియాత్రలో పరిచయమైన గుండ్లమాడ, లంకమలేశ్వర గుడినుంచి సదురుబండకీ, సిద్ధవటంకోటనుంచి బంగళాబోడు, సవళ్ళబాయికీ వెళ్ళే దారిలో రాజుల చెరువు దగ్గర గుర్రపుబాటలు, కాలిబాటలు, చెయ్యేరు వరదలొ నిలబడ్డ ఏకిరిపల్లె, ఒక మనిషిని ఆత్మార్పణకు ప్రేరేపించేటంత మార్మికత నింపుకున్న మొండిభైరవుని కోన, పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ నది, పాలకొండలు, పొద్దుటూరు, రామేశ్వరం, జమ్మలమడుగు, కమలాపురం, తాడిపత్రి, అనంతపురం నుంచి బళ్ళారి వెళ్తూ ఒకసారి, పేరూరు, సోమశిల, ఆత్మకూరు, కోవూరు దగ్గర పెన్నాను దాటిన స్థలాలు, పుష్పగిరి దగ్గర కాళ్ళు కూరుకుపోతున్న ఇసుకలో వేసిన అడుగులు కనిపిస్తాయి ఇందులో.

గొడ్డుమర్రి దగ్గర చిత్రావతి గలగలలు, గండివద్ద పాపాఘ్ని ఇసుకతిన్నెలు, అలాడుపల్లె పక్కన కుందూ ఉధృతి, వట్టిపోయిన సగిలేటి ఒడ్డున ఆడుకున్న ఆటలు, నందలూరు పల్లెల్లో చెయ్యేటి వరదబీభత్సం, బొగ్గేరు చెలిమెలో నీటి ఊటలు వీటన్నిటి వెంబడి అతడితో కలిసి, అతడి మిత్రుల్తో కలిసి మనం కూడా ప్రయాణాలు కొనసాగిస్తాం. గోపవరం మండలంలోని గట్టుపల్లె, రాజుపాళెం, ఓబులం పాయకట్టులో మత్స్యకారులు వండిపెట్టిన చేపలకూరని అతడు ఆరగిస్తుంటే చూసి మన కడుపు నిండిపోతుంది.

ఇంతకన్నా సుసంపన్నమైన జీవితం, ఇంతకన్నా సాదరంగా ఆహ్వానించే స్వజనం వేరే ఎక్కడుంటారు? నిజమైన యాత్ర అంటే ఇది. అందుకనే ఒకచోట ఇలా అనుకుంటున్నాడు:

ఎవరైనా అడగవచ్చు.

అందుకని ఈ ప్రశ్న తనకు తనే వేసుకుని తనే ఇలా జవాబు చెప్పుకుంటాడు:

అగాధమైన సాగరాల మీద తెప్పలు వేసుకుని భూమిని చుట్టిరావడానికి బయల్దేరిన మహాసాహసికనావికుల్ని ఏది ప్రేరేపిస్తున్నదో ఇతణ్ణీ అదే ప్రేరేపిస్తున్నది. అందుకనే ఇలా చెప్పుకుంటున్నాడు:

3

నడక గురించి రాస్తూ థోరో వర్డ్స్‌ వర్త్‌ కి సంబంధించిన ఒక సంఘటన చెప్పాడు. ఒకసారి ఎవరో వర్డ్స్‌ వర్త్‌ ని చూడటానికి వాళ్ళింటికి వెళ్ళారట. అప్పుడు ఆ మహాకవి ఇంట్లో లేడు. ఎప్పట్లానే సరస్తీరాలంబడి పచార్లు చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ సందర్శకుడు వర్డ్స్‌ వర్త్‌ సహాయకుల్ని ‘మీ కవిగారి అధ్యయన మందిరం చూపించండి’ అని అడిగాడట. దానికి ఆ ఇంట్లోవాళ్ళు అన్నారట కదా ‘ఆయన గ్రంథాలయమైతే ఇదిగో, ఈ గదిలో ఉంది, ఇక ఆయన అధ్యయనమందిరం అంటారా? అది ఆరుబయటనే ఆయన తిరిగే ప్రతి చోటా ఉంది’ అని.

ఈ పుస్తకంలోని నడకల్ని చూసినప్పుడు నాకు ఆ విషయమే స్ఫురించింది. ఇందులో ప్రతి ప్రయాణం ఒక అధ్యయనం. ప్రకృతి గురించి, మనిషి గురించి, మానవసమూహాల గురించి, మానవ సమాజం గురించి, పర్యావరణం గురించి. ఏదో ఒక చోటు చూడ్డానికి వెళ్ళిన ప్రతిసారీ వివేక్‌ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాడు. మనకీ నేర్పుతూనే ఉన్నాడు. ప్రతి నడకా అతడి పరిథిని ఎప్పటికప్పుడు విస్తరింపచేస్తోనే ఉంది.

నవజీవనం ఇలానే సిద్ధిస్తుంది. అది ఉన్నట్టుండి మంత్రించినట్టుగా ఒక్కరోజులో సాధ్యపడదు. ప్రతి సారీ ప్రతి ప్రయత్నం తర్వాత, ప్రతి వైఫల్యమ్మీంచీ, పడిలేచిన ప్రతిసారీ కొత్త చిగుళ్ళు వేస్తోనే ఉంటుంది. ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఎవరో ఒకరిని కలుసుకోవాలి- ఏమి తెలుసుకుంటామని కాదు, ఏదో ఒకటి తెలుసుకు తీరతామనే భరోసా. గొడ్డేటి కొండపైన బుస్సానాయుడి కోట చూడాలని ఉందని రాస్తూ ఇలా అనుకుంటాడు.

కోటలేదు కదా, ఇప్పుడంత దూరం వెళ్ళాలా అన్న ఆలోచన లేదు. వెళ్ళాలి. చిన్న రాయి ఉన్నా కూడా వెళ్ళాలి. ప్రత్యక్షంగా చూడాలి. ఊహల్లోని దృశ్యానికి వాస్తవాన్ని రూపమివ్వాలి.

దేని గురించి విన్నా దాన్ని చూడాలనీ, ఏది కనిపించినా దాన్ని మరింత దగ్గరగా చూడాలనీ అతడు మొదలుపెట్టిన ప్రయాణాలూ అడవి గర్భానికి, చెరిగిపోని రాయలసీమ గతానికి దగ్గరగా తీసుకుపోవడం మాత్రమే కాదు, సోమశిల ముంపు గ్రామాలకీ, చెయ్యేటి వరద బీభత్సానికీ కూడా దగ్గరగా తీసుకువెళ్ళాయి. ఆ తపన వల్లనే అతడు లంకమల బీడుభూముల్లో విత్తనాల మట్టి ఉండలు విరజిమ్ముతున్నాడు. ఆ ఆరాటం వల్లనే No Plastic Lankamala కాంపైన్‌ మొదలుపెట్టాడు. తన పర్యటనల్లో కనిపిస్తున్న యానాదులు తన హృదయాన్ని తట్టిలేపుతున్నందువల్లనే ఎస్‌.ఆర్‌.శంకరన్‌ పేరుమీద యానాదుల కోసం అభివృద్ధి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాడు.

యూనివెర్సిటీల్లో సిద్ధాంతగ్రంథాలు చదివి తోటిమనిషికి చేరువకావడానికి ప్రయత్నించడం ఒకదారి. ఎటువంటి ముందస్తు ఉద్దేశ్యాలూ, పరిజ్ఞానమూ, పరికల్పనలూ లేకుండా ప్రకృతిమధ్యకు పోయి వచ్చినప్పుడల్లా తనలో కొత్తమనిషి మేల్కొంటూ, మనలోని కొత్తమనిషిని మేల్కొల్పడం మరొక దారి. వివేక్‌ది రెండో దారి. సహజమైన దారి.

4

తన యాత్రాకథనాల్లో వివేక్‌ ఒక అన్వేషిగా మాత్రమే కాదు, ఒక కవిగా, భావుకుడిగా కూడా కనిపిస్తున్నాడు. అతడు తాను నడుస్తున్న దారుల్లో పూర్వ కవుల్ని తలుచుకోవడమే కాదు, తానే కవిగా మారుతున్నాడు. ఎందుకంటే, అడివి మాటవినబడగానే అతడి అంతరంగం రెక్కలు విప్పుకుంటుంది. ఎవరో ఏదో ఒక సామెత చెప్పగానే వెంటనే ‘చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో లోయ, లోయలో నీళ్ళు, ఆ నీళ్ళను ఆశ్రయించి బతికే అడవిజంతువులతో బాగా దట్టమైన ప్రదేశం ఊహల్లో మెదుల్తాయి’ అని రాసుకున్నాడు ఒకచోట.

అడవీ, కొండలూ అతడి చూపులకి రంగులు అద్దుతాయి, రాగాలు దిద్దుతాయి. తళతళమెరిసే నెమలీకల్లాంటి ఎన్నో పోలికలు ఈ పుస్తకంలో మనకి ప్రతిపుటలోనూ కనిపిస్తాయి. మచ్చుకి కొన్ని చూడండి:

తన భావుకత వల్ల అతడు కొండలు మాట్లాడుకునే మాటలు కూడా వినగలడు. ఈ వాక్యాలు చూడండి. అవి:

అడవి అతణ్ణి రాగద్వేషాలకూ అతీతంగా జరిపి మనుషుల్ని ప్రేమించగల విద్యనేర్పుతున్నదని మనం గ్రహిస్తాం. ఒకప్పుడు రాజద్రోహిగా ముద్రపడ్డ సంబెట వీరనరసింహరాజు తవ్వించిన చెరువు దగ్గర కూచుని వందల ఏళ్ళుగా వేల జంతువులు, ఎన్ని లక్షల సార్లు తమ దప్పికను తీర్చుకుని ఉంటాయి అనుకుని అతనిపట్ల గొప్ప గౌరవభావం కనబరుస్తాడు.

‘అడవి నిగూఢమైంది’ అంటాడు ఒకచోట. ‘అడవిలో ఒంటరినడక మంచి అనుభవం’ అని రాసుకుంటాడు. ‘అడవి మార్మికతకు అలవాటుపడ్డ మనిషి జనజీవనంలో ఎక్కువసేపు నిలవలేడేమో అనిపించింది’ అని కూడా అనుకుంటాడు. అడవిముందు నిలబడగానే ‘లోపలి అలజడులు, భయాలు, పైపైన అపోహలు, నువ్వు నీ చుట్టూ అల్లుకునే బింకపు పొరలు అన్నీ కలసి నిన్ను నీ కళ్ళముందు నిలబెడతాయిు అని అంటూ ‘అవసరం అప్పుడప్పుడూ’ అని కూడా అంటాడు.

ఇవన్నీ ఏవో పుస్తకాలు చదివితే వచ్చిన భావనలు కావు. ఒక మనిషి తనంతతానుగా అడవినీ, కొండల్నీ, ఊళ్ళనీ ప్రేమిస్తే కలిగే భావనలు. ఇవి అతడిలోని మనిషికి అతణ్ణి సన్నిహితుణ్ణి చేస్తున్నాయి. కాబట్టే, సోమశిల ముంపు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇదుగో, ఇటువంటి వాక్యాలు రాయగలిగాడు:

5

ఈ మధ్యకాలంలో యాత్రాకథనాలకు ప్రాచుర్యం లభిస్తోంది. కాని, ఆ యాత్రాకథనాలు రాసేవాళ్ళు, అయితే ప్రపంచపర్యాటకులు లేదా సుప్రసిద్ధ దర్శనీయ స్థలాలకు పోయి వచ్చేవాళ్ళు. దాదాపుగా ఆ కథనాలన్నీ అప్పటికే సుస్థిరమైన దారుల్లో మళ్ళా మరొకరు కొత్తగా చేసే ప్రయాణాల కథనాలు. కానీ ఈ సంపుటిలోని యాత్రలు రహదారులమీద చేసినవి కావు. ఇవి కాలిబాటలవెంబడి, మట్టిబాటల వెంబడి, చెరిగిపోతున్న ఆనవాళ్ల వెంబడి చేసిన ప్రయాణాలు. ఒకప్పుడు మనుషులు నడిచిన దారుల్ని కాలం పూర్తిగా మరుగుపర్చకముందే మళ్ళా మరొకసారి ఆ దారుల్నీ, ఆ గాథల్నీ వెలికితీసే ప్రయాణాలు.

ఇంగ్లిషులో road అనీ, path అనీ రెండు మాటలున్నాయి. సాధారణంగా మనం చదివే యాత్రాకథనాలు రోడ్లకి సంబంధించినవి. కానీ ఈ కథనాలు paths కి సంబంధించినవి. సుప్రసిద్ధ నార్వేజియన్‌ పర్యాటకుడుTorbjorn Ekelund రాసిన In Praise of Paths (2020) చదివాక గానీ, నాకు road కీ path కీ మధ్య ఉన్న తేడా తెలియలేదు. రోడ్డు మన వయోజన జీవితానికి సంబంధించిన అనుభవం. దాని మీద మనం నడవం. కారులోనో, బస్సులోనో లేదా రైల్లోనో ప్రయాణిస్తాం. కాని path మన బాల్యానికి సంబంధించిన అనుభవం. దాని ద్వారానే మనకి మన నేల, మన ఊరు, మన ప్రపంచం అనుభవంలోకి వస్తాయి. అది మన జీవితానుభవంలో, మన జ్ఞాపకాల్లో ఇంకిపోతుంది. మనం చిన్నప్పుడు ఒక దారిన నడిచి ఉంటాం. అది మన కొండగుర్తు. మనం తిరిగి ఏ దారిలో నడిచినా ఆ దారినే మళ్లా వెతుక్కుంటూ ఉంటాం. వివేక్‌ సరిగ్గా ఈ మాటలే రాస్తున్నాడు. చూడండి:

తర్వాత కాలంలో కొండలు, కోనలు, కనుమలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఎన్నెన్నో ప్రయాణాలు చేసానుగానీ నన్ను అడవికి దగ్గర చేసిన ఈ లంకమల దారుల్లోఇప్పటికీ ప్రత్యేకం. నాటి అనుభవాలు, జ్ఞాపకాలు మదిమూలల్లో ఇప్పటికీ పదిలంగా నిక్షిప్తమై ఉన్నాయి.

Paths once blended into the landscape; they did not destroy it. But roads did అంటాడు Ekelund. కాలిబాటలు, మట్టిదారులు, కొండదారులు, లోయదారులు లాంటి ప్రాకృతికపథాలు ప్రయాణించినప్పుడు ఆ దారుల్లో కథలూ, గాథలూ, పురాణాలూ, పూర్వమానవులూ మనకి మళ్ళా కనిపిస్తారు. కాబట్టే వివేక్‌ తో పాటు మనం కూడా ఈ దారుల్లో నడుస్తున్నప్పుడు సంబెట వీరనరసింహరాజునో, బుస్సానాయుడినో, రైతుగా పుట్టి రైతుగా పెరిగిరైతు తత్త్వాన్ని పదిమందికి పంచుతూ అవధూతగా మారిన కాశినాయననో మనమూ చూడగలుగుతాం. దొంగలసాని కొండ దగ్గర నిలబడ్డప్పుడు నెల్లూరు సిద్ధిరాజుతో పొత్తపి రాజులు మల్లదేవ,సోమదేవులకు జరిగిన యుద్ధం మనకి కూడా కనిపిస్తుంది. గుండ్లమాడ శివాలయం దగ్గర గంగరసదేవ మహారాజుల్ని మనం కూడా పలకరిస్తాం. ఘటికసిద్దేశ్వరం దగ్గర అగస్త్యాది సిద్ధ, సాధుపరంపర వెనక మనమూ అడుగులేస్తాం. పెద్దపెద్ద వానలు పడితే తురకల ఝరిలో కత్తులు బయటపడటం మనమూ కళ్ళారా చూస్తాం.

ఏ విధంగా చూసినా ఈ కథనాలు చదవడం గొప్ప అనుభవం. వనవాసి నవలలో కనిపించే మహాలిఖారూప పర్వతశ్రేణి లాంటిదే మన మధ్య మన ప్రాంతంలో మనకూ ఉందనీ, అటువంటి లంకమల శ్రేణులు తమ వనవాసిని వివేక్‌లో వెతుక్కున్నాయనీ మనకి స్ఫురిస్తుంది. పుస్తకం ముగించేటప్పటికి, వివేక్‌ లానే మనం కూడా ఇలా అనుకుంటాం:


(ఈరోజు సాయంకాలం ఏడు గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ పుస్తకావిష్కరణ)

15-2-2024

10 Replies to “అసాధారణ పథికుడు”

  1. ప్రకృతిని మించిన గురువు లేడని తెలుసుకున్న
    అడవిబాటసారి అంతరంగ తరంగ పరిచయం
    అనన్య సామాన్యం . మిమ్మల్ని చదువుతూ ఉండడం మాకు రోజుకో కొత్త సూర్యుణ్ణి చూసినట్టు 🙏

  2. ఇతని పోస్టులు కల్యాణి గారు షేర్ చేస్తే చదివాను. అతని పేజీ కి కూడా వెళ్లి కొన్ని చదివాను. మీరన్నట్టు యువకులు అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఇంత మంచి పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ. ఇప్పుడు ఇది ఎక్కువ మందికి చేరుతుంది.

  3. వివేక్ పుస్తకాన్ని పరిచయం చేస్తూ సుమారు పుస్తకమంతా చదివించిన అనుభూతి కలిగించారు. ధన్యవాదాలు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%