మనం మరిచిన దారులు

ఇంగ్లిషులో రెండు పదాలున్నాయి. Road  అనీ, path  అనీ. రెండింటికీ అర్థంలో తేడా ఉందని మనకు తెలుసు. కాని వాటి వెనక రెండు జీవితదృక్పథాలున్నాయని నావరకూ నాకు Tobjorn Ekelund రాసిన In Praise of Paths (2022) చదివాక గానీ తెలియలేదు.

తొర్యాన్ ఎకెలూ నార్వేకి చెందిన ప్రకృతి ప్రేమికుడు. ఓస్లోలో తన కుటుంబంతో జీవిస్తూ, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడుగాని, అతడి దృష్టి ఎంతసేపూ నార్వే పల్లెసీమలమీదా, అడవులూ, కొండల మీదనే. ఏ చిన్నపాటి అవకాశం దొరికినా చెవురులదగ్గరకో, చెట్లకిందకో పోయి గడపాలనుకుంటాడు. మరీ పెద్ద పెద్ద సాహసయాత్రలు చేయడానికి జీవితం అనుకూలించనప్పుడు అతడు చేసిన పని, ప్రతి నెలా ఒకరోజు అడవికిపోయి, తనొక్కడే ఆ రాత్రి అడవిలో గడిపి రావడం. అలా పన్నెండు నెలలు గడిపాక ఆ అనుభవాల్ని  A Year in the Woods, Twelve Small Journeys into Nature (2021) అని ఒక పుస్తకంగా వెలువరించాడు.

ఇప్పుడు paths  గురించి రాసిన పుస్తకంలో కూడా ఇలానే మనకు చిన్నప్పణ్ణుంచీ చిరపరిచితమైన కాలిబాటలగురించీ, మట్టిదారులగురించీ, మరపు కప్పేస్తున్న ఒకప్పటి మానవసంచారాల గురించీ రాసాడు. ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ నాకు నా చిన్నప్పటి మా ఊరు, ఆ ఊరిచుట్టూ మేము నడిచిన ఎన్నో కాలిబాటలు గుర్తొస్తూ ఉన్నాయి. సన్నని కాలితోవలు, అడవిలో మరీ వెడల్పుగాని బండిబాటలు, కట్టెలు ఏరుకోడానికి కొండమీదకు పోయేవాళ్ళు నడవగా నడవగా పచ్చిక నలిగి సన్ననిగీతలాగా వంకర్లు తిరిగిన డొంకదారులు. ఆ దారులు నా చిన్నప్పటి ప్రపంచాన్ని శాసించాయనీ, అవిప్పటికీ నా మనస్సులో పదిలంగానే ఉన్నాయనీ, నేనెప్పుడు ఏ కొత్తదారిలో ప్రయాణించినా నాకు తెలియకుండానే ఆ చిన్నప్పటి మట్టిబాటలతో వాటిని పోల్చుకుంటూనే ఉన్నాననీ, ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ నాకు తెలుస్తూనే ఉంది.

రోడ్డు నాగరికతకి ప్రతినిధి. అది ఒకసారి పడ్డాక అక్కడ మరే ప్రాణీ, పచ్చికా తలెత్తే అవకాశం ఉండదు. అది నేలని రెండుగా విభజించివేస్తుంది. కాని తోవలు, దారులు, బాటలు, డొంకలు అలా కాదు. అవి ఆ ప్రాకృతికక్షేత్రాన్ని భగ్నం చెయ్యవు. వాటిలో ఒదిగిపోయి, ఆ మట్టిలో, ఆ గడ్డిలో తాము కూడా ఒక భాగంగా కుదురుకుని ఉంటాయి.  Paths once blended into the landscape; they did not destroy it. But roads did అంటాడు ఎకెలూ.

మనిషి శరీరం నిజానికి తిరగడంకోసం పుట్టింది. పరుగెత్తడం కోసం పుట్టింది. చెట్లూ, కొండలూ ఎక్కడం కోసం పుట్టింది. నాగరికత వికసించేకొద్దీ మనం కూచోడానికీ, అదికూడా నాలుగ్గోడలమధ్యా కూచోడానికీ అలవాటుపడిపోతూ ఉన్నాం. ‘ఆఫీసులో కూచుని పని చేయడం మొదలుపెట్టగానే నా జీవితంలోంచి దారులూ, చలనమూ రెండూ అదృశ్యమైపోయాయి’ అని రాసుకున్నాడు ఎకెలూ.

మన చిన్నప్పుడు మనం ఏదో ఒక దారిన, ఏదో ఒక బాటపట్టుకుని నడక మొదలుపెట్టి ఉంటాం. ఇంటినుంచి బడికి వెళ్ళివచ్చేతోవనో లేదా ఇంటినుంచి అడవికిపోయి వచ్చే తోవనో, లేదా ఇంటినుంచి గుడికి వెళ్ళివచ్చేతోవనో- ఏదో ఒక దారి. ఆ దారి మన అన్ని దారులకీ మాతృక. మనం మొదటిసారి ఆ బాటలో అడుగుపెట్టినప్పుడు మన చిట్టిపాదాలు నేలను తాకుతూ చిన్ని చిన్ని గమ్యాలవైపు ప్రయాణించడం మొదలుపెట్టినప్పుడు, సరిగ్గా, అప్పుడే that’s how memories are formed, in the intersection between reality and fantasy, and this is precisely how it has been with my memories of the path అని రాసుకున్నాడు. దాదాపుగా మనందరి కథ కూడా ఇదే.

బాటలు కూడా పురాగాథల్లాంటివి, జానపదకథల్లాంటివి, అద్భుతమాంత్రిక వృత్తాంతాల్లాంటివి. వాటికి ఎవరో ఒక కర్త అంటూ ఉండడు. పదిమందీ కలిసి సృష్టించినవి అవి. వాటిక్కూడా ఒక దేహమూ, ఒక ఆత్మా ఉంటాయి. అవి ఏకకాలంలో భౌతికం, అభౌతికం కూడా. ఒక బాట అంటే వట్టి రాకపోకలు మాత్రమే కాదు అని కూడా అంటున్నాడు ఎకెలూ. అందుకనే తర్వాత జీవితంలో మనం మళ్ళా ఏ కొత్తదారిలో నడవడం మొదలుపెట్టినా, చుట్టూ ఉన్న దృశ్యాల్ని చూడటం మీద ఎంత దృష్టిపెట్టినా, ఆ దారి అన్నిటికన్నా ముందు మనల్ని మన అంతర్లోకానికి సన్నిహితంగా తీసుకుపోతుంది. మనం మన బాల్యానికి, కాలం మరుగుపర్చలేని ఒక మానసికలోకానికి చేరువగా తీసుకుపోతుంది. ఊరికే అలా నడుచుకుంటూపోవాలనీ, ఏ గమ్యం, ఏ బాదరబందీ, ఏ జవాబుదారీతనం లేకుండా నిష్ప్రయోజనకరంగా సంచరిస్తో ఉండాలనీ మనలోపల్లోపల ఒక తీవ్రకాంక్ష జ్వలిస్తూ ఉంటుందనీ, బాటల్ని చూడగానే అది మేల్కొంటుందనీ ఎకెలూ చెప్తున్న మాటలు నాకైతే పూర్తిగా ఒప్పుకోదగ్గవిగా వినిపించాయి.

నార్వేలో అర్నే నేస్ అని ఒక తత్త్వవేత్త ఉన్నాడట. ఆయన తన ఇంటినుంచి బయటికి వచ్చినప్పుడల్లా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఒక్కదారిన పోడట. ప్రతి సారీ కొత్తదారి వెతుక్కుంటూ ఉంటాడట. తత్త్వవేత్తలు సాధారణంగా conformist లు గా ఉండటానికి ఇష్టపడరని నాకు తెలుసుగానీ, నలిగిన దారిన నడవడానికి ఇంతగా ఇష్టపడని తాత్త్వికుడి గురించి వినడం మాత్రం నేనిదే మొదటిసారి. మనం పొద్దున్నలేచి ఇంటినుంచి ఆఫీసుకో, మార్కెటుకో, సినిమాహాలుకో, పార్కుకో, లైబ్రరీకో ఎక్కడికివెళ్ళినా నలిగిన దారిలోనే, నలుగురూ నడిచే దారిలోనే వెళ్తుంటాం. చివరికి మార్నింగ్ వాక్ కోసం పార్కుకి వెళ్ళేవాళ్ళు కూడా తమకంటూ ఒక దారి గీసుకుని రోజూ ఆ దారమ్మటే నడుస్తుంటారు. ఒకసారి బాట పాతపడ్డాక, జీవితం కూడా తప్పనిసరిగా పాతబడుతుంది. నడిచిన దారుల్లోనే నడుస్తున్నంతకాలం ఎన్ని ప్రభాతాలు ఉదయించినా అవి సుందరప్రభాతాలూ, సుప్రభాతాలూ కావడం అసాధ్యం.

ఈ రోజు మనం స్కాండినేవియన్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లను అత్యున్నత మానవాభివృద్ధికి ప్రతీకలుగా చెప్పుకుంటాం. కాని ఆ దేశాల కవిత్వాల్లో మనకి కనిపించేది చెట్లూ, కొండలూ, పక్షులూ, పాటలూ మాత్రమే. ఎకెలూ కూడా ఒక నార్వేజియన్ కవి Hans Borli అనే ఆయన గురించి రాస్తాడు. ఆ కవి కవిత్వంలో path అనే మాట కనీసం డెబ్భై సార్లు కనిపిస్తుందని చెప్తాడు.

బోర్లి దృష్టిలో బాట అంటే ఎ అనే చోటునుంచి బి అనే చోటుకు తీసుకుపొయ్యేది కాదు. ప్రతి బాటా దానికదే ఒక ప్రాంతం, ఒక క్షేత్రం, ఒక సీమ. మనల్ని మన అంతర్లోకాలకు కలిపే వంతెన.

అందుకనే గొప్ప తాత్త్వికులు, కవులు, కళాకారులు వీలైనంతసేపు నడకలోనే గడిపేవారు. రూసో, డార్విన్, గొథే, హోల్డర్లిన్, కిర్క్ గార్డ్, వర్డ్స్ వర్త్, వర్జీనియా వుల్ఫ్, థోరో- పాశ్చాత్య ప్రపంచంలో ఈ పేర్లకి కొదవలేదు. వాళ్ళందర్నీ తలుచుకుంటూ ఎకెలూ చివరికి ఒక్క మాట చెప్పగలనంటాడు, a person who walks slowly must have a much richer inner life than a person who runs as fast as their legs can carry them అని.

అందుకనే నిజమైన పరివ్రాజకుడు అన్నిటికన్నా ముందు చేసేపని నాలుగ్గోడలు వదిలిపెట్టి ఆరుబయట నడక మొదలుపెట్టడం. అందుకనే నార్వేజియన్ పిల్లల కథల్లో ఒక మనిషికి విధించగల అతి పెద్ద శిక్ష అతణ్ణి కదలకుండా ఒక్కచోటనే శాశ్వతకాలం కూచోబెట్టడం అట.

కొత్త ఆలోచనలూ, కొత్త కవితలూ సోఫాలో కూచుంటే పుట్టవంటాడు ఎకెలూ. నడవడం, ఆలోచించడం అనే రెండు మౌలిక మానవ చలనాలమధ్య ఒక అదృశ్య, మార్మిక సంబంధం ఏదో ఉంది. నడుస్తున్నప్పుడే మనం సజీవంగా ఉంటాం. మన అంతఃప్రపంచంలోకి మేల్కోవడం మొదలుపెడతాం. ఎకెలూ పుస్తకంలో నాకు నచ్చిందేమంటే, అతడు మనల్ని భూమండలం మొత్తాన్ని ఎనభై రోజుల్లో చుట్టి రమ్మని చెప్పడు. చిన్న చిన్న దారుల్లో ఆ దారుల్ని నువ్వప్పుడే చూస్తున్నట్టుగా, కొత్త కళ్లతో, కొత్త తలపుల్తో చూస్తో నడవడం మొదలుపెట్టమంటాడు. అలా నడుస్తున్నప్పుడు నువ్వు మర్చిపోయిన నీలోని ఆదిమ మానవవారసత్వాన్ని అందుకొమ్మంటాడు. ఒక పర్వతారోహకుడి గురించి అతడు రాసిన ఈ నాలుగు మాటలూ ఈ పుస్తకం మొత్తానికి సారాంశం అని చెప్పవచ్చు.

3-2-2024

13 Replies to “మనం మరిచిన దారులు”

  1. “ ఆ దారి అన్నిటికన్నా ముందు మనల్ని మన అంతర్లోకానికి సన్నిహితంగా తీసుకుపోతుంది. మనం మన బాల్యానికి, కాలం మరుగుపర్చలేని ఒక మానసికలోకానికి చేరువగా తీసుకుపోతుంది. ”
    ఎంత నిజం!! మీరు చెప్పిన దారుల వెంట నడుస్తూ చిన్ననాటి జ్ఞాపకాల్లో తడుస్తూ మరువలేని మా పల్లె దారులను చుట్టి వచ్చాను. 😊
    రోడ్డు మీద బస్సు దిగి ఊళ్ళోకి మైలున్నర దూరం. నడకే. మట్టి బాట వెంట చేల మీదుగా, చింత చెట్ల కింద రాలిన చింత పూతల దారుల వెంట, ఓ వైపు చెరువు మరో వైపు పచ్చని పైరు మధ్యన కట్ట మీదుగా నడుస్తూ, చెరువులో నీళ్ళు తాగుతూ ఆవులు, నిండుగా పూసిన ఎర్ర కలువలు,చెరువు దాటగానే ఊరికంటే ముందుగా కనపడే చెన్నకేశవాలయ గోపురం !!
    ఇల్లు చేరేలోపు గుండె నిండా పైరగాలి, కళ్ళ నిండా పల్లె దారులు చూపిన చిత్రాలు!!
    As a kid I looked forward to this walk all the time!! Many memories faded but this is still as fresh as it can be.

    Thank you for this post, sir.

  2. నిజమే, గత 30 — 40 సంవత్సరాల క్రితం బాల్యాన్ని అనుభవించిన వారికి ఈ వ్యాసం చదివితే వారి బాల్యంలోని బాటలు డొంకలు వాగులు మళ్లీ కళ్ళముందు ఒక దృశ్యమాలికగా దిద్దుకుంటాయి .

    బాటలు డొంకలు తమకు ప్రాణ స్నేహితులుగా కుటుంబ సభ్యులుగా ఆనాటి జనాలకు అనిపించేవి. స్కూల్ నుండో మరో ఊరు నుండి తిరిగి వస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లే బాటనో డొంకనో చేరుకోగానే సొంత కుటుంబ సభ్యులకు చూసినంత ఆనందంగా అనిపించేది ఆ రోజుల్లో…
    ఆర్ అండ్ బి రోడ్లు, స్టేట్ హైవేలు, నేషనల్ హైవేస్ ఆ ఆనందాన్ని నేటి బాల్యపు ఆనందం నుండి చాలా మేరా తుడిచివేశాయి.

  3. నడిచిన దారుల్లోనే నడుస్తున్నంతకాలం ఎన్ని ప్రభాతాలు ఉదయించినా అవి సుందరప్రభాతాలూ, సుప్రభాతాలూ కావడం అసాధ్యం. TRUE

  4. అమృత సంతానం పిడిఎఫ్ ,, అనిల్ బత్తుల పంపారు సర్ ,, చదవటం మొదలెట్టాను

  5. మనం మరచిపోతున్న గొప్ప సంగతి.. నిజమే.. system ముందు కూర్చుంటే కథ కదలదు. కదిలి లేచి సంచి పుచ్చుకుని బజారుకు వేలుతున్నప్పుడే మంచి thoughts వస్తాయి. కొత్త లోకాలు ఏవో మీరు నడిచి చూపించారు సర్..

      1. నా చిన్నప్పుడు నేను హైదరాబాదు లో నడచిన దారులు గుర్తుకొచ్చాయి. ఇప్పుడా దారులు భవనాలతో నిండిపోయాయి. కానీ ఆ జ్ఞాపకాలు ఇంకా చెదరలేదు..

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading