నూరు శరత్తులు జీవించండి

ముకుంద రామారావు గారికి అజో-విభొ-కందాళం సంస్థ వారు, 2024 కు గాను జీవితకాల సాధన పురస్కారం అందించారని తెలిసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. గత ముప్ఫై ఏళ్లుగా ఆయన కవిగా, అనువాదకుడిగా, ప్రపంచ సాహిత్య పరిచయకర్తగా తెలుగు సాహిత్యంలో చేస్తూ వచ్చిన కృషి అద్వితీయం. ముఖ్యంగా ప్రపంచ కవిత్వాన్ని పరిచయం చేసే క్రమంలో ఆయన వెలువరిస్తూ వచ్చిన ‘అదే గాలి’, ‘అదే నేల’, ‘అదే నీరు’, ‘అదే కాంతి’, ‘అదే ఆకాశం’ నిరుపమానమైన గ్రంథాలు. ఒక్క మనిషి ఒక పుష్కర కాలంలో ఇంత విస్తృతమైన పని చేయడం అసామాన్యమైన విషయం.

ముకుంద రామారావు గారు నాకు కృష్ణారావు గారి ద్వారా పరిచయం. ఆయన మొదటి కవితా సంపుటి ‘వలస పోయిన మందహాసం'(1995) గురించి చేరాతల్లో చదివినప్పటి నుంచి ఆయన చూడాలని కుతూహలంగా ఉండేది. కృష్ణారావుగారి ‘నెలనెలా వెన్నెల’ సమావేశాల్లో 95-96 మధ్యకాలంలో తరచూ కలుసుకునేవాళ్ళం. తిరిగి మళ్లా ఆయన రెండో కవితా సంపుటి ‘మరో మజిలీకి ముందు'(2000) ఆవిష్కరణ సభలో ఆ పుస్తక పరిచయం నేనే చేశాను. ఆ సమీక్ష చేసినందుకు గుర్తుగా రవీంద్ర సంగీత్ క్యాసెట్ ఒకటి బెంగాల్ నుంచి తీసుకొచ్చి మరీ నాకు కానుక చేశారు. 2013లో నోబెల్ కవుల కవిత్వం పైన రాసిన పుస్తకం మీద నన్ను మాట్లాడమని అడిగారు. అలాగే ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ వెలువరించినప్పుడు ఆ పుస్తకంలో ఆయన కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళల్లో నా పేరు కూడా చేర్చారు.

ఇప్పుడు అజో-విభొ సంస్థ ఆయనకి జీవితకాల సాధన పురస్కారం అందజేస్తూ వెలువరించిన విశేష సంచికలో నా కవిత కూడా ఉందని చెప్పి ముకుంద రామారావు గారు ఆ పుస్తకం కాపీ ఒకటి నాకు పంపించారు. ఆ కవిత చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ కవిత రాసినట్టే నాకు గుర్తులేదు. నా దగ్గర ఆ కవిత కాపీ కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు మళ్లా ఆ కవిత చదవగానే వలస పోయిన మందహాసం తిరిగి నన్ను చేరినట్టు అనిపించింది.

ముకుంద రామారావు గారూ! మీరు నూరుశరత్తులు జీవించాలి. ఇట్లానే ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ కలకాలం జీవించాలి.


దూరం చెయ్యని వీడ్కోళ్లు

అతడు వెళ్ళిపోతున్నాడు
అదేమంత విషయం కాదు
కానీ కొన్నాళ్ళు అతడు మనతో కలిసి మెసిలాడు
ఆ జ్ఞాపకం ఎంతో ప్రియం
ముఖ్యం, నా వరకు.

జీవితం బహుమేరకు, మర్చిపోవలసిందే
విస్మృతం, వినష్టం కావలసిందే.
కానీ గుర్తుండిపోయే కొన్ని కాంతిరేఖలతోపాటు
అతడూ నాతో ఉంటాడు.

ఇవాళ విడిపోతాం
రేపు అతని కోసం మరొకరు మరొక ఊళ్లో
స్నేహ హస్తాల్తో ఎదురు చూస్తుంటారు.

కొన్ని వెన్నెల రాత్రులు గడుస్తాయి
కొన్ని వానాకాలాలు, కొన్ని సంధ్యా సమయాలు
కొన్నాళ్లపాటు మన గోష్ఠి లో
ఆ జాగా అతన్ని గుర్తు చేస్తూ ఖాళీగా ఉంటుంది

మళ్లా ఒక కొత్త మిత్రుడు
కొన్ని పుస్తకాలు హృదయానికి హత్తుకుని
సవ్వడి చేయకుండా
మన మధ్యకు అడుగు పెడతాడు.
ఇక మన సాయంకాలాలు
నెమ్మదిగా
అతని సంభాషణలతో పరిమళించడం
మొదలెడతాయి.

మాటల మధ్యలో కృష్ణారావు గారంటారు
‘చూడండి, ఇతను నవ్వుతోంటే
మన ముకుంద రామారావులా లేడూ!’

కవులు విడిపోవాలి
కలుసుకున్నంత సహజంగా, సంతోషంగా.
అప్పుడు ప్రపంచం మరింత
దగ్గరగా జరుగుతుంది.

8-2-2002

12 Replies to “నూరు శరత్తులు జీవించండి”

  1. ముకుంద రామారావుగారికి అభినందనలు.
    వారి సంగ్రహ పరిచయం ,కవిత ముక్తాయింపు బాగున్నాయి సర్.

  2. కవిత ఎంత సహజంగా పరిమళం చల్లింది !
    చాలా కాలం తరువాత మీతో మాట్లాడినట్లు ఉంది!

  3. ఈ కవితా చదువుతున్నంత సేపు celluloid screen మీద Bing Bang theory చుసినట్టు వుంది గురువుగారు.. ఒకప్పుడు విశ్వంత ఉమ్మడి కుటుంబంగా ఉండటం.. విడిపోవడం.. కాలప్రవహంలో మళ్లీ దగ్గర జరగడం లా అ(క) నిపించింది 🙏

  4. భలే! ఆయన హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తుంటే మీరు కవిత రాసారు. ఆయన రిటైరైపోయాక బెంగుళూరు నుండి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతుంటే నేనో కవిత రాసాను (of course మీ అంత గొప్పగా కాదులెండి)

    https://eemaata.com/em/issues/200701/1053.html

  5. సార్, మీరు కర్నూలు జిల్లాలో, జిల్లా గిరిజన శాఖ అధికారిగా 1992-95 కాలంలో పనిచేసినప్పుడు, ఆ జిల్లా గ్రామీణ బ్యాంకు అధికారిగా మీతో ఎంతో సన్నిహితంగా వుంటూ అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా సంపూర్ణ అక్షరాస్యత అమలు…..వగైరాలు చేశాము. అప్పుడు మీలో ఉన్న ఈ సాహిత్య పిపాసకుడిని చూడలేని లేక గమనించలేని “గుడ్డి” వాడిని నేను. మీ సాహితీ ప్రతిభకు వందనాలు. ఆర్.నాగయ్య,కర్నూలు.

    1. మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%