
186
ముప్ఫై రెండు ఆయుధాలతో
అభ్యాసం చేస్తే ఏమిటి?
పగని కూల్చడానికి
ఒక్క అలుగు చాలదా?
దైవాన్ని గెల్చుకోడానికి
శరణసతి లింగపతి
అన్న ఒక్క అలుగు చాలదా?
కూడలసంగమదేవా!
నాకూ నీకూ
జంగమప్రసాదమనే
ఒక్క అలుగు చాలదా? (735)
మాహేశ్వరుని ప్రాణలింగి స్థలము
187
చంపనయ్యా ప్రాణుల్ని
తినబోను నోటిరుచికి
కోరుకోను పరసతీ సంగమాన్ని.
ముందుముందు
ముప్పుందని తెలుసు.
అందుకని కొలపాత్ర ముక్కులాగా
నామనసుని ఒక్కవైపు తిప్పి
ఆగు ఆగు అని ఆపవయ్యా నన్ను
కూడలసంగమయ్యా! (736)
188
వస్తాడని
రాకుండా ఉన్న
బాటల్నే చూస్తున్నాను.
ఇంకెవర్ని పంపిస్తాను?
ఇంకెవర్ని పంపిస్తాను?
ఇంకెవరి పాదాలు
పట్టుకుంటాను?
కూడలసంగముని మనుషులు
రాకపోతే
నా ప్రాణాలే పంపిస్తాను. (738)
మాహేశ్వరుని శరణస్థలం
189
నేల విశాలం, నింగి విశాలం,
అన్నిటికన్నా మీరెక్కువ విశాలం,
పాతాళాన్ని దాటి మీ శ్రీచరణం
బ్రహ్మాండాన్ని దాటి మీ శ్రీమకుటం.
మిమ్మల్ని కొలవలేము, పట్టలేము
చూడలేము, ఇదీ అను గుర్తుపట్టలేము.
అటువంటిది మీరు
నా అరచేతిలో అవతరించి
కూడలసంగమదేవా
పుడిసెడైపోయారయ్యా (745)
190
గోత్రమేమిటని అడిగితే
మాటాడకుండా
మౌనంగా ఉంటారేమిటి?
తలవంచుకుని
నేలమీద రాతలు
రాస్తారేమిటి?
గోత్రం మాదిగ చెన్నయ్యది,
కూడలసంగమదేవా!
డొక్కల కక్కయ్యది. (746)
191
ఎవడలిగితే ఏమిటి?
ఊరు ఊరంతా అలిగితే ఏమిటి?
మా వాడికి పిల్లనివ్వకండి
మా కుక్కకి కంచంపెట్టకండి.
ఏనుగుమీద ఎక్కినవాణ్ణి
కుక్క కరవగలదా?
మాకు మా
కూడలసంగముడున్నాక. (754)
192
ఊరిముందుపాలవాగు
పారుతుంటే
వట్టిపోయిన ఆవువెనక
ఉరకడమెందుకు?
లజ్జ చెడడమెందుకు
సిగ్గు పోవడమెందుకు?
కూడలసంగమదేవుడున్నాక
బిజ్జలుడి భండారం నాకెందుకు? (756)
193
ఆప్యాయంగా పెడతాను
లాంఛనం చూస్తే చాలు శరణంటాను
లాంఛనానికి తగ్గట్టుగా
ఆచరణలేకపోతే
కూడలసంగమదేవా
నువ్వు సాక్షిగా
ఛీకొడతాను. (759)
194
ఎక్కడైనా ఒక భక్తుడు
పెట్టిపోషిస్తుంటే
పెద్ద నిధినిధానం
కంటపడిందనిపిస్తుంది.
కాళ్ళుకడిగి నీళ్ళు
తీర్థమిస్తే
పోయిన ప్రాణం
తిరిగొచ్చినట్టుంటుంది.
పొట్టనింపుకోడానికి
మరొకరి ఇంటిగడపతొక్కని
అచ్చమైన శరణుణ్ణి చూస్తే
నిశ్చయంగా నా
కూడలసంగముడే
కనిపించినట్టుంటుంది. (760)
మహేశ్వరుని ఐక్యస్థలం
195
వీరుడిచేతిలో
కత్తిలాగా ఉండాలి.
ఎముకలు పైకొచ్చేలాగా
సరసమాడినా
సహించాలి.
రణంలో తలతెగి
మొండెం నేలమీద కూలినా
ఎవరు బొబ్బలు పెడతారో
వాళ్ళంటేనే వలపు
కూడలసంగడికి. (765)
ప్రసాది జ్ఞాన స్థలము
196
నెయ్యి పూసినట్టు
చక్కగా మాట్లాడతారు.
కాని జాణలాగా
శరణుడు
తనని బయటపెట్టుకుంటాడా?
అతడు బతికేదే
కూడలసంగముడి
అనుగ్రహం వల్ల.
ఆ సంగతి
మర్చిపోతాడా?
ప్రసాది ప్రసాదస్థలం
197
దాసోహమనే సోహం పట్టిపోయి
గురుణ్ణి కనుగొన్నాను
దైవాన్ని కనుగొన్నాను.
జంగముని కనుగొన్నాను.
అనుగ్రహాన్ని అందుకున్నాను.
కూడలసంగమదేవా!
ఇలా
నాలుగువిధాలుగా
సంపన్నుణ్ణయ్యాయను
చూడయ్యా! (780)
ప్రసాది భక్తి స్థలం
198
సద్గురు వచనం వినగానే
చెవికి పట్టిన మైల పోయింది
సద్భక్తుల్ని చూసాను కాబట్టి
కళ్ళకు పట్టిన మైల పోయింది.
మీ చరణాలు తాకాను కాబట్టి
వంటికి పట్టిన మైల అణగింది.
మీరు వదిలింది తిన్నాను కాబట్టి
నోటికి పట్టిన మైల వదిలింది
మీ మనుషుల్నే తలుచుకుంటూ ఉన్నానుకాబట్టి
నానారకాల సూతకాలూ నశించిపోయాయి.
కూడలసంగమదేవా.
వినవయ్యా
నువ్వు కాక మరొకటిలేదని తెలిసింది కాబట్టి
నా మనసుకు పట్టిన మైల తొలగింది. (782)
ప్రసాది మాహేశ్వర స్థలము
199
శరీరం కోరుతోందనో
నోరూరుతోందనో
ఏదన్నా తిన్నానా
నేను మీ ఇంట్లో
పనిమనిషి కొడుకుని
కానన్నట్టే.
మీ సద్భక్తుల్ని
వేడుకుంటాను
అడుక్కుంటాను.
వారు తినగా మిగిలిందిస్తే
అదే తింటాను.
వారేమంటే అదే అంటాను.
నా ప్రభువు కూడలసంగముణ్ణి
ఒల్లనివాళ్ళతో కలిసితిరిగానా
మీ పాదం మీద
ఆన. (786)
ప్రసాది ప్రాణలింగి స్థలము
200
మంట తగిలిన తర్వాత
మృగం ఒక్క అడుగన్నా
వెయ్యగలుగుతుందా?
తనువును తాకిన తర్వాత
సుఖం విడిచిపెడుతుందా?
కూడలసంగమ శరణుల
అనుభావం రుచిచూసాక
వాళ్ళని మళ్ళా
మామూలు మనుషులనగలమా? (794)
8-12-2023
మా మైల పోగొట్టిన మీ మేలు మారవలేము గురువుగారు🙏
ధన్యవాదాలు, నమస్సులు.