చెట్లు మేలుకునే దృశ్యం

ప్రభాతం తూర్పుదిక్కున అని అనుకోవడం ఒక నమ్మకం,
సోమరి అలవాటు. చెట్లు మేలుకునే దృశ్యం చూసాక
తెలుసుకున్నాను: అరణి రాపాడించి ఋషులు అగ్నిని
పుట్టించినట్టు పక్షులు ప్రభాతాన్ని మేల్కొల్పుతాయని.

కార్తికప్రత్యూషాల్లో దీపాలు వెలిగించి నదిని మేల్కొల్పినట్టు
ప్రతి పండగా ముందు గుడిమల్కాపూరు పూలమండిలోనే
మొదలైనట్టు, తెలతెలవారేవేళ పెళ్ళివారి విడిదిముందు
సన్నాయిమేళం వినబడగానే ఉత్సవసౌరభం వ్యాపించినట్టు

చెట్లు మేలుకునే ఏకాంతవేళ సూర్యుడు భూమికి దగ్గరవుతాడు
అప్పుడు ప్రతి కొమ్మలోనూ, ఈనెలోనూ, వేర్లనుంచి పూలదాకా
వెలుగు తయారవుతుంది. పూర్వకాలపు సమష్టికుటుంబాల్లాగా
ఒకరు లేవగానే అందరూ లేస్తారు, పల్లె మొత్తం మేలుకుంటుంది.

5-4-2023

16 Replies to “చెట్లు మేలుకునే దృశ్యం”

  1. శుభోదయం, ప్రభాత సమయాన్ని బాగా వర్ణించారు, ఉత్సవ సౌరభాన్ని బాగా ఆఘ్రానించాం.

  2. పూర్వకాలపు సమష్టి కుటుంబం లాగా
    ఒకరు లేవగానే అందరూ లేస్తారు, పల్లె మొత్తం మేలుకుంటుంది. నాకైతే సృష్టిలో అత్యద్భుతమైనిది చెట్టు.

  3. చక్కని పల్లెటూళ్లు,
    పచ్చని చెట్లు..
    పక్షుల కిలకిలారావాలతో..
    మేల్కొనే ప్రభాతం..
    నిజమే.. ఋషులు ఆరణి రాపాడించి అగ్నిపుట్టిన్చినట్లే..
    చెట్లు, పక్షులు.. రోజుకొక సూర్యుడిని పుట్టిస్తున్నాయి..
    జగతికు వెలుగు కోసం..

    బాగుంది సర్..

  4. Beautiful thought sir!
    ప్రకృతి ప్రభాతాన్ని మేల్కొలపడం!
    దీపాలు నదిని మేల్కొలపడం!
    పండగ గుడిమల్కాపూర్ పూల మండీలో మొదలవడం!!
    As much as this is because of that, that is as much because of this !!
    Harmony between human life and nature!!

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%