సిరినోము

ఒక సంవత్సరాన్ని ఒక రోజుగా భావిస్తే, ఉత్తరాయణం పగలనీ, దక్షిణాయణం రాత్రి అనీ, మకరసంక్రమణం ప్రభాతమనీ, ముక్కోటి ఏకాదశి ప్రత్యూషమనీ అనుకోవడంలో గొప్ప అనుభూతి ఉంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి, మకరరాశిలోకి సంక్రమణం చేయడానికి ముందు నెలరోజులూ కూడా తూర్పు తెల్లవారే కాలమని అనుకోవడంలోంచే తిరుప్పావై గీతాలు ప్రభవించాయి.
 
ప్రతి రోజూ తెల్లవారకముందే లేచి తిరుప్పావై గీతాలు పాడుకుంటూ నగరసంకీర్తన చెయ్యకపోయినా, ప్రతి ఏటా ఈ రోజుల్లో ఒకసారేనా తిరుప్పావై గురించి తలుచుకుంటో, మాట్లాడుతో, రాస్తోనే ఉన్నాను. ఈ ఏడాది ఆ అవకాశం చినుకు రాజగోపాల్, గోళ్ళ నారాయణరావుగారి వల్ల వచ్చింది. వారు మొన్న సోమవారం ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో తిరుప్పావై గురించి నాదొక ప్రసంగం ఏర్పాటు చేసారు.
 
ఒకసారి గురజాడ గురించి రాయడానికి ఉపక్రమిస్తూ శ్రీ శ్రీ మళ్ళా కొత్తగా గురజాడ గురించి ఏమి రాయగలననుకున్నానుగాని, రాయడానికి కూచోగానే ఎన్ని కొత్త విషయాలు స్ఫురిస్తున్నాయంటో ఆశ్చర్యపడిపోయాడు. అటువంటి సంతోషమే ఆ రోజు నాది కూడా.
 
అన్నిటికన్నా ముందు తిరుప్పావై ఒక నోముపాట. సిరినోము అన్నారు దాన్ని బొమ్మకంటి శ్రీనివాసా చార్య గారు. పావై అంటే నోము. పావై అంటే బాలిక కూడా. కాని అది వట్టి నోము కాదు. ఎంబావై. అంటే మన నోము అని. తిరుప్పావై లోని మహిమ ఇక్కడే ఉంది. ఒక మనిషి తన ఒక్కరి సుఖంకోసమో, తన శ్రేయస్సుకోసమో, తన సంతోషం కోసం పట్టిన నోము కాదు. నేను కాదు, మనం. బహుశా నాకు తెలిసి భారతీయ భక్తి సాహిత్యంలోనే, నేను కాక, మన గురించి వ్రతానికి పూనుకుందామని చెప్పిన మాట అదేనేమో. అయితే, ఆ మాట మొదటగా చెప్పింది ఆండాళు కాదు. మాణిక్యవాచకరు తిరువాసగంలోని తిరువెంబావై లో ఆ మాట అననే అన్నాడు. అది కూడా మార్గళిమాసపు నోముపాటనే. అది కూడా మేలుకొలుపునే. కాని తిరువెంబావై ఇరవై గీతాలూ ఒకరినొకరు మేల్కొల్పుకోవడం, శివుణ్ణి స్తుతించడంతో ఆగిపోయాయి. కాని తిరుప్పావై అక్కణ్ణుంచి చాలా ముందుకు నడిచింది. అది ఒక వీథికో, ఒక ఊరికో, ఒక దేశానికో పరిమితమైన పాటగానో, నోముగానో మిగిలిపోకుండా, సమస్తలోకకల్యాణ శుభాకాంక్షగా పరిణమించింది.
 
అందుకనే ఏ ఏటి కాయేడు తిరుప్పావై మరింత ప్రసిద్ధి పొందుతున్నది. ఇంతకు ముందు పత్రికల్లో వ్యాసాలు రాసేవారు, ధనుర్మాసం ముప్పై రోజులూ ఒక్కొక్క పాశురాన్ని తీసుకుని వ్యాఖ్యానాలు రాసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా ఎంతో మంది ప్రతి రోజూ తిరుప్పావై గీతాల్ని పరిచయం చేస్తూనే ఉన్నారు. తెలుగులోకి అనువదిస్తున్నారు, పాటలు కట్టిపాడుతున్నారు. బహుశా, గీతాంజలి తరువాత, చదివిన ప్రతి ఒక్కరూ, తాను కూడా తెలుగు చేయాలని తపిస్తున్న కావ్యం తిరుప్పావై ఒక్కటేనేమో.
 
అన్నిటికన్నా ముందు తిరుప్పావై ఒక శుభాకాంక్ష. అన్నిటికన్నా ముందు ఇహలోక సంతోషాన్ని అపరిమితంగా అభిలషించిన ఆకాంక్ష. కాని ఇహలోక సంతోషానికి ద్యులోకకాంతి తప్పనిసరి అని కూడా గ్రహించినందువల్లనే, ఆ పాటలో అంత వెలుగు. ఆ పాటని వట్టి వైష్ణవ గీతంగా పొరపడలేము. నాకు తెలిసి, బహుశా, ఋగ్వేద సూక్తాల తరువాత, అంత secular గా వినిపించే గీతం మరొకటి లేదు. ఈ భూమ్మీద మనిషి జీవించవలసిన జీవితం ఒక blessing గా ఉండాలంటే ఎలా జీవించాలో బుద్ధుడు తన ‘మహా మంగళసుత్త’ లో చెప్పాడు. తిరిగి అటువంటి మంగళ ప్రద జీవితం గురించిన శుభాకాంక్ష తిరుప్పావై లో కనిపిస్తుంది మనకి.
 
ఎందుకంటారా? మూడవ పాశురం చూడండి:
 
~
 
‘మనం మూడులోకాల్నీ కొలిచేవాడి గుణకీర్తనం చెయ్యడం మొదలుపెట్టగానే, నెలకి మూడు వానలు కురుస్తాయి, ఎర్రటి వరికంకులు ఏపుగా పెరుగుతాయి, ఆ పైర్లమధ్య నీటిలో చేపలు తుళ్ళిపడుతుంటాయి, కలువపూలలో మకరందం పీల్చి తుమ్మెదలు మత్తిల్లతాయి. ఆవులు తృప్తిగా కొట్టాల్లో కడవలు పొంగిపొర్లేటట్టుగా క్షీరధారలు కురిపిస్తాయి. పాడిపంటలతో దేశం సమృద్ధి చెందుతుంది. ఓ దేవా, అటువంటి వ్రతం మాది.’
 
~
 
ఈ కవిత మొదటి సారి చదివినప్పుడు నాకు వెంటనే గురజాడ గుర్తొచ్చాడు. ‘పాడిపంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటుపడవోయ్ ‘అనే ఆయన ఉపదేశం గుర్తొచ్చింది. ఇంకా గురజాడ ప్రబోధ కవి. ‘నువ్వు పాటుపడవోయ్ ‘ అంటున్నాడు. ఆండాళ్ ‘మనం పాటు పడదాం ‘ అంటున్నది!
నాకు తమిళం రాదు. తిరుప్పావై లోని ప్రతి ఒక్క పదంలోని అంతరార్థాల్ని నాకై నేను unravel చేసుకోడం కోసమేనా తమిళం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే, ఆ ముప్పై పాశురాల్లో ప్రతి ఒక్క వాక్యం, ప్రతి ఒక్క పదప్రయోగం ఎంతో విలువైనది. తరచి తరచి చూడవలసింది, పదే పదే మననం చేసుకోవలసింది. ఉదాహరణకి రెండవ పాశురంలో, తాము పట్టబోతున్న నోముకి ఎటువంటి నియమనిబంధనలు పాటించాలో చెప్తూ ఆండాళ్ ఒక మాటన్నది: ఈ వ్రతం పట్టినన్నాళ్ళూ మనం ఒకరిమీద ఒకరం చెడ్డమాటలు మాటాడుకోకూడదు అని. ఇంతకన్నా మించిన మంగళవ్రతం ఉంటుందా? ‘మా విద్విషావహై ‘అనే ఉపనిషద్వాక్యంలాంటిదే కదా ఇది. ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకోకుండా కలిసి కష్టపడితే, ఆ భూమ్మీద నెలకి నాలుగు వానలు కురుస్తాయంటే ఆశ్చర్యమేముంది?
 
నా పునర్యానం కావ్యంలో చివరి సర్గలకు వచ్చేటప్పటికి, మహిమాన్వితమైన భక్తి కవుల వాక్యాలు నాలో కలిగించిన epiphany లోంచి నేను కొన్ని కవితలు రాసాను. అందులో ఆండాళ్ మాటల్ని తలుచుకుంటూ ఇట్లా రాసాను:
 
~
 
మన ప్రార్థనలవల్ల దేశం సుభిక్షమవుతుంది
 
– ఆండాళ్
 
తెలుసుకున్నాను విలువైన మూల్యాలు చెల్లించి, వీపుని కొరడాలకప్పగించి,
తెలుసుకున్నాను హృదయాల్ని రంపాలతో కోసి, కుత్తుకలు కత్తిరించి,
తెలుసుకున్నాను కొన్ని గృహదహనాలతో, కుమ్మరించిన శాపాలతో,
మార్చలేవని నువ్వు ప్రపంచాన్ని ద్వేషంతో, దూషణతో.
 
మారేదెవరు? అందరికన్నా ముందు నువ్వు మారకుండా.
ఏ ఒక్క హృదయం రగిలినా ద్వేషంతో, దహిస్తుందది మొత్తం ప్రపంచాన్ని.
దగ్ధమవుతూ నీకు నువ్వు, ఎవరికివ్వగలవని నమ్ముతున్నావొక ఆశ్రయాన్ని?
కోరడం లేదని గ్రహించు, ప్రపంచం మరిన్ని ఆగ్రహాల్ని.
 
ఎదురుచూస్తున్నదని గ్రహించాను, అదొక మంచిమాట కోసం
తనకొక నమ్మకాన్నిచ్చేవారికోసం, తన నమ్మకాలకు నిలబడేవారికోసం.
ఎదురు చూస్తున్నదని గ్రహించాను, ఆత్మీయ కరస్పర్శనందించేవారికోసం,
ధీరత్వం వహించే వారికోసం, దయతో ప్రార్థించే వారికోసం.
 
13-1-2022

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%