నాడు నేడు

గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిగారు మొన్న తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ‘నాడు నేడు’ పథకం మొదటి దశ పనుల్ని పిల్లలకి అంకితం ఇస్తూ, రెండవదశ పనులకి శ్రీకారం చుట్టడం పాఠశాల విద్యా శాఖ చరిత్రలో ఒక మైలురాయి.
 
రాష్ట్రంలో ఉన్న దాదాపు నలభై ఐదువేల ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాలని రెండేళ్ళ కిందట ఆయన సంకల్పించినప్పుడు, ఆ విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పినప్పుడు మేము ఊహించలేదు, ఈ కార్యక్రమం ఈ విధంగా రూపుదిద్దుకుంటుందని, ఇంత విశేషంగా జయప్రదమవుతుందని. రెండేళ్ళ కిందట ఆగస్టులో మేము పాఠశాలల స్థితిగతుల్ని ప్రతిబింబించే విధంగా అన్ని పాఠశాలలవీ ఫొటోలు తీసాం. మూడు మిలియన్ల ఫొటోలు ఆన్ లైన్ లో పొందిపరిచాం. ప్రతి పాఠశాల ఉనికినీ గూగుల్ మాప్ లో చూపిస్తూ, అప్పటి పరిస్థితికి అద్దంపట్టేలాగా అన్ని వివరాలు పొందుపరిచాం. అప్పటికి మూడేళ్ళుగా ఎన్నికలకు నోచుకోని పాఠశాల తల్లిదండ్రుల కమిటీల్ని పునర్వ్యవస్థీకరించాం.
 
నాడు నేడు పనుల్ని కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా తల్లిదండ్రుల కమిటీలద్వారానే చేయాలని మేం ప్రతిపాదించినప్పుడు ముఖ్యమంత్రిగారు మా మీద నమ్మకంతో సరేనన్నారు. కాని దాదాపు ఆరేడు నెలలలు పట్టింది ఆ కొత్త విధానం తన కాళ్ళమీద తాను నిలబడటానికి. ఈలోపు కరోనా మహమ్మారి ముంచుకొచ్చింది. మన జీవితకాలంలో మనం ఇంతదాకా ఎన్నడూ చూడని విధంగా లాక్ డౌన్. జనజీవితం స్తంభించింది. కాని నాడు నేడు పనులు మాత్రం ఆగలేదు. పైగా స్థానికంగా కూలీలకి, వివిధరకాల పనివాళ్ళకి ఉపాధి దొరికింది. ఒక్కొక్క పాఠశాలలో దాదాపు తొమ్మిది పనులు, అంటే దాదాపు లక్షా యాభైవేల పనులు. సివిల్ పనులు తల్లితండ్రుల కమిటీలు పూర్తిచేయగా, అత్యంత నాణ్యమైన వస్తువులు సెంట్రల్ ప్రొక్యూరుమెంటు ద్వారా కొనుగోలు చేసాం. అత్యాధునికమైన ఫర్నిచరు, తాగునీరు, ఫాన్లు, ట్యూబులైట్లు, డిజిటల్ టివిలు, అన్నిటికన్నా ముఖ్యంగా అత్యంత శ్రేష్టమైన టాయిలెట్ సామగ్రి, చివరగా పెయింటింగ్లు, గోడలమీద ఆకర్షణీయమైన బొమ్మలు- చూస్తూండగానే కళ్ళముందే సరికొత్త రూపురేఖల్తో పాఠశాలలు సాక్షాత్కరించడం మొదలుపెట్టాయి.
 
ఈ లోపు మళ్ళా మరొకసారి కరోనా పంజా విసిరింది. కాని అన్ని ఒడిదుడుకుల్నీ తట్టుకుని నాడు నేడు మొదటిదశ పనులు పూర్తయ్యాయి. సర్వాంగ సుందరంగానూ, అన్ని సౌకర్యాలతోనూ ఈ రోజు పాఠశాలలు తెరిచేటప్పటికి అవి పిల్లల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. దాదాపు 3669 కోట్ల వ్యయంతో జరిగిన ఈ కార్యక్రమం, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారతదేశ చరిత్రలోనే ఇదే ప్రథమం. ఇంత పెద్ద ఎత్తున, ఒక రాష్ట్రవ్యాప్తంగా, పాఠశాల విద్యలో ఇన్ని పనులు చేపట్టి పూర్తి చేయడం ఇప్పటిదాకా మరే రాష్ట్రంలోనూ కనీ వినీ ఎరుగని బృహత్తరమైన కార్యక్రమం. పేదపిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల మీద ఇంత పెట్టుబడి పెట్టి అదికూడా తల్లిదండ్రుల కమీటీల ద్వారా చేయడమనేది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కూడా ఊహించలేని విషయం.
 
ఇదొక యజ్ఞం. ఇందులో లక్ష మందికి పైగా తల్లిదండ్రులు, వేలాదిగా ప్రధానోపాధ్యాయులు, ఇంజనీర్లు, క్లష్టరు రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఎప్పటికప్పుడు ఈ పనులు పర్యవేక్షిస్తూ వచ్చారు. రాష్ట్రస్థాయిలో గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ గారితో పాటు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, సలహాదారు మురళి గారు, చీఫ్ ఇంజనీర్ లు ఎంతోమంది ఇందులో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ గారు తన భుజాల మీద వేసుకోకపోతే ఈ కార్యక్రమం ఇంత సమర్థవంతంగా జరిగి ఉండేది కాదు.
 
ఈ రెండేళ్ళల్లో ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా అన్ని జిల్లాల్లోనూ వందలాది పాఠశాలలు సందర్శించాను. ఈ పనులు చేపట్టడంతో తల్లిదండ్రుల్లోనూ, ప్రధానోపాధ్యాయుల్లోనూ కొత్త ఉత్సాహం కళ్ళారా చూసాను. ఎందరో ప్రధానోపాధ్యాయులు ఈ పనులు చేస్తూనే రిటైఅర్ అయిపోయారు. కాని తమ సర్వీసు మొత్తం మీద ఇంత సంతృప్తి కలిగించిన కార్యక్రమం మరొకటి చూడలేదనిచెప్పారు.
 
రెండేళ్ళ కాలం. రెండు సార్లు విజృంభించిన కరోనా. కాని, ఎన్ని కార్యక్రమాలు చేయగలిగాం ఈ రెండేళ్ళలో! ఊహించడానికే వీలుకానన్ని మహత్తరమైన కార్యక్రమాలు. ఆ మధ్య ఒకరోజు ముఖ్యమంత్రిగారి సమీక్ష కోసం ప్రెజెంటేషన్ తయారు చేస్తూ, ఒకదాని వెనక ఒకటి లెక్కవేసుకుంటే ఇరవైకి పైగా లెక్కతేలాయి. దేశంలో మరే రాష్ట్రమూ, చివరికి కేరళ, ఢిల్లీ కూడా తలపెట్టని కార్యక్రమాలు. వాటన్నిటి గురించి రాయాలంటే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. అయినా స్థూలంగా వాటిలో కొన్నింటినైనా ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను.
 
అన్నిటికన్నా మొదటిది, రెండు సార్లు నిర్వహించిన అమ్మ ఒడి కార్యక్రమం. రెండేళ్ళుగా నిర్వహించిన ఈ పథకం వల్ల దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశించారు. అయిదేళ్ళ వయసుగల పిల్లల్లో అత్యధిక శాతం పాఠశాలల్లో చేరిన రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని ఇటీవల ఏసర్ రిపోర్టు ప్రకటించింది కూడా.
 
మధ్యాహ్నభోజనం అమలు మీద ముఖ్యమంత్రిగారు పెట్టిన వ్యక్తిగత శ్రద్ధ బహుశా భారతదేశంలో ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రీ చూపనంత శ్రద్ధ. నేను ఈ మాటలు రాస్తున్నప్పుడు మీకు ఎం.జి.రామచంద్రన్ గుర్తుకొస్తూ ఉండవచ్చు. కాని రెండేళ్ళ కిందట నేను తమిళనాడు ఎన్నికల పరిశీలకుడిగా వెళ్ళినప్పుడు దాదాపు అరవై డెభ్భై పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం ఎలా అమలు జరుగుత్న్నదీ కళ్ళారా చూసాను. ఇప్పుడు జగనన్న గోరుముద్ద పేరు మీద మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న మధ్యాహ్నభోజనానికీ, తమిళనాడు లో జరుగుతున్న అమలుకీ పోలికనే లేదు. ఇక్కడ ప్రతిరోజూ పిల్లలు కొత్తదనాన్నీ, కొత్త రుచిని కోరుకుంటారని, ఒక ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించిన మెనూ అమలవుతున్నది. ఆ పథకం అమలు మీద నాలుగంచెల పర్యవేక్షణ. ప్రతిరోజూ ఆ ఫొటోలు ఆన్ లైన్ లో అప్ లోడ్ అవుతాయి. ఎక్కడ నాణ్యత లేదో మెషీన్ లెర్నింగ్ ద్వారా డాష్ బోర్డులో కనిపిస్తుంది. కిందటి నెలలో ఈ కార్యక్రమం గురించి భారతప్రభుత్వానికి ఒక ప్రెజెంటేషన్ చూపించినప్పుడు భారతప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఎంతగా ముగ్ధురాలైపోయారంటే, ఆ ప్రెజెంటేషన్ కాపీని ఆమె అన్ని రాష్ట్రాలకీ పంపించకుండా ఉండలేకపోయారు.
 
ఇక జగనన్న విద్యాకానుక పేరు మీద గత సంవత్సరం, ఈ ఏడాదీ రెండు సార్లు అమలు చేసిన కార్యక్రమం లాంటిది ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఊహించనది. దేశంలో మరే రాష్ట్రానికీ ఇంతదాకా స్ఫురించనది. పిల్లలు పాఠశాలలో చేరే సమయానికే వాళ్ళకి యూనిఫాం, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బాగు, షూసు, బెల్టు లాంటివి ఒక కిట్ గా అందచేసే కార్య్క్రమం ఇది. ఈసారి వీటన్నిటితో పాటు ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ కూడా ఇచ్చారు. ఇందులో ప్రాథమిక స్థాయి పిల్లలకోసం ఒక బొమ్మల డిక్షనరీని ఎస్.సి.ఇ.ఆర్. టి రూపొందిస్తే, హైస్కూలు పిల్లలకోసం ఆక్స్ ఫర్డ్ పాకెట్ డిక్షనరీ ఇచ్చారు.
 
కరికులం సంస్కరణల్లో భాగంగా ఈ రెండేళ్ళలో ఒకటవ తరగతినుంచి ఏడవ తరగతిదాకా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన పాఠ్యపుస్తకాల గురించి ఏకంగా ఒక పుస్తకమే రాయొచ్చు. అందులోనూ తెలుగు పుస్తకాల గురించి ఒక వ్యాసం రాసినా సరిపోదు. ఇప్పటిదాకా తెలుగు పాఠ్యపుస్తకాలు ఒకరిద్దరు ఉపాధ్యాయులు రాసేసేవారు. కాని ఈసారి ఒకటవ తరగతినుండి ఏడవతరగతి దాకా దాదాపు 125 మంది మహాకవులూ, రచయితలూ పిల్లలకు పరిచయమవుతున్నారు. నన్నయ, తిక్కన, పోతన,వేమన వంటి ప్రాచీన కవులే కాక, గురజాడ, రాయప్రోలు, చలం, శ్రీ శ్రీ, బైరాగి, గిడుగు వంటి ఆధునిక కవిరచయితలు కూడా తరగతికి తగ్గ స్థాయిలో పరిచయమవుతున్నారు. అంతే కాదు, ఈసారి పాఠ్యపుస్తకాలు inclusive. అందులో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల రచయితలూ, ఇతివృత్తాలూ, రచనలతో పాటు గిరిజనులు, దళితులు, మైనారిటీ వర్గాల జీవితానికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా గణనీయంగా చోటు చేసుకున్నాయి. విశాఖ మన్యంలో గిరిజనులు జరుపుకునే ఇటిజ్ పండగ ఈ రోజు ఒక పాఠ్యాంశం అంటే ఊహించండి. ఇలాంటి విశేషాంశాలు ఈ కొత్త పాఠ్యపుస్తకాల్లో కనీసం పదిపన్నెండు దాకా ఉన్నాయి. అందుకనే ఆ మధ్య మా ప్రిన్సిపల్ సెక్రటరీగారు భారతప్రభుత్వ విద్యాశాఖ చేపట్టిన ఒక సమీక్షలో ఈ అంశాల్ని వివరించినప్పుడు భారతప్రభుత్వ కార్యదర్శి ఈ కొత్త పాఠ్యపుస్తకాలు తననెంతో ముగ్ధురాల్ని చేసాయని చెప్పగా, ఆ సమావేశంలో పాల్గొన్న మరొక ఉన్నతాధికారి మూడు గంటల ఆ సమావేశాన్ని a three hours delight అని అభివర్ణించకుండా ఉండలేకపోయాడు.
 
ఈ పాఠ్య పుస్తకాల రూపకల్పన ఇంత విశిష్టంగా రూపుదిద్దుకోవడానికి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంగ్లీష్ మీడియం స్పెషల్ ఆఫీసర్ ఐన వెట్రి సెల్వి గారు, ఎస్ సి ఇ ఆర్ టి బృందంతో పాటు, వందలాది మంది ఉపాధ్యాయులు కారణమని చెప్పాలి.
 
గౌరవనీయులైన ముఖ్యమంత్రి పిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాలకీ, పాఠశాలల్లో వడ్డించే మధ్యాహ్న భోజనానికీ ఎంత ప్రాముఖ్యత నిస్తున్నారో అంతకన్నా మించిన ప్రాధాన్యతని పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకి ఇస్తున్నారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకోసం నాలుగువందల కోట్ల మేరకు టాయిలెట్ నిర్వహణ నిధిని ఒకటి ఆయన ఏర్పాటు చేసారు. ప్రతి పాఠశాలలోనూ వాటి నిర్వహణ కోసం ఆయాల్ని నియమించారు. అత్యాధునికమైన పారిశుద్ధ్య సామగ్రిని పంపిణీ చేసారు. ప్రతిరోజూ టాయిలెట్ల నిర్వహణ ఎలా ఉందో పదిపన్నెండు ఫొటోలు తీసి ఆన్ లైన్ లో పొందుపరుస్తుండగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మీద ఆధారపడ్డ సాఫ్ట్ వేర్ ఆ టాయిలెట్ల నిర్వహణని ఏ రోజుకి ఆ రోజు గ్రేడింగ్ చేస్తుంది. ఈ అంశంలో ఇటువంటి చొరవ, ఇటువంటి నిర్వహణా సామర్థ్యాన్ని చూపిస్తున్న ప్రభుత్వం, బహుశా, మొత్తం ప్రపంచం లోనే మరొకటి లేదని చెప్పవచ్చు.
 
ఈ కార్యక్రమాల నిర్వహణకి సంబంధించిన మొత్తం టెండర్ల ప్రక్రియ ఆన్ లైన్లో రివర్స్ టెండరింగ్ ద్వారా జరిగే ప్రక్రియ. ఏ ఒక్క వ్యక్తీ, ఏ ఒక్క అధికారీ కూడా ఆ ప్రక్రియను ప్రభావితం చేసే పరిస్థితి ఉండదు. పెద్ద టెండర్లకి జుడీషియల్ స్క్రుటినీ తప్పనిసరి. ప్రతి కొనుగోలుకి సంబంధించిన చెల్లింపులూ ఆన్ లైన్ ద్వారా నేరుగా సప్లయిర్ బాంక్ అకౌంట్ కి జమ అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకమైన ప్రక్రియ.
 
2009 లో విద్యాహక్కు చట్టం వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రపరిణామం సంభవించింది. ప్రభుత్వం బాధ్యత కేవలం బడిని అందుబాటులోకి తీసుకురావడం మాత్రమేననీ, చక్కటిచదువు అందించే శక్తి, వనరులు ప్రభుత్వానికి ఉండవనీ, మంచి చదువు కావాలంటే ప్రైవేటు పాఠశాలల్లో చేరమనీ అప్పటి ప్రభుత్వాలు చెప్పకనే చెప్తూ వచ్చాయి. అందువల్ల 2014-15 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షలకు పైగా ఉండే విద్యార్థులు, 2018-19 నాటికి 37 లక్షలకి పడిపోయారు. కాని 2019-20 లో అదనంగా లక్ష మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి ఈ పరిస్థితిని మలుపు తిప్పారు. పోయిన ఏడాది కరోనాను కూడా లెక్కచేయకుండా మరొక అయిదున్నర లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వీరిలో అధికశాతం అంటే దాదాపు అరవై శాతం మంది నాడు నేడు చేపట్టిన పాఠశాలల్లో చేరటం గమనార్హం.
 
మన దేశంలాంటి దేశంలో ప్రభుత్వ వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లితే దానికి పేద, బలహీనవర్గాలే మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కాని ఈ పరిస్థితి మారుతున్నదనటానికీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులన్నిటినీ తల్లిదండ్రులు గమనిస్తున్నారనటానికీ, ఆమోదిస్తున్నారనటానికీ తార్కాణ, ఈ రెండేళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఆరులక్షలమందికి పైగా విద్యార్థులు చేరటమే.
 
ఈ రెండేళ్ళుగా పాఠశాల విద్యాశాఖలో ఒక అధికారిగా, ఈ పరివర్తనలో నేను కూడా ఒక భాగస్వామిని కావడం, అది కూడా నా ఉద్యోగ జీవితపు చివరిదినాల్లో, ఇంత చారిత్రాత్మక కార్యక్రమంలో పాలుపంచుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. బహుశా ఈ అనుభవాలన్నింటినీ మరింత సమగ్రంగా రాస్తే, అది ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ రెండవ భాగం అవుతుందనుకుంటాను.
 
18-8-2021

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading