చినుకులు రాలుతున్న రాత్రి

తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ టిటిడి ప్రచురణల విక్రయకేంద్రంలో ‘శ్రీ నమ్మాళ్వారుల తిరువాయ్ మొళి ‘ దొరికింది. మాడభూషి రామానుజాచార్యులు అనే ఆయన రూపొందించిన ప్రతి పదార్థ వ్యాఖ్యని టి టి డి మొదటిసారి 1950 లో ప్రచురించింది. తిరిగి మళ్ళా ఆ గ్రంథాన్నే 2016 లో పునర్ముద్రించింది. ఆ పుస్తకం చూడగానే నా ఆనందానికి హద్దులేదు.

నమ్మాళ్వార్ కవిత్వం నుంచి కొన్ని పద్యాలను ఏరి ఎ.కె.రామానుజన్ ఇంగ్లీషులో వెలువరించిన Hymns for the Drowning (1981) ఇరవయ్యేళ్ళ కిందట చదివినప్పణ్ణుంచీ నమ్మాళ్వారు పట్ల నాకు గొప్ప తృష్ణ ఏర్పడింది. అప్పణ్ణుంచీ తిరువాయ్ మొళి కి పూర్తి తెలుగు అనువాదం కోసం వెతుకుతూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇటీవల పెంగ్విన్ క్లాసిక్స్ లో Endless Song (2020) పేరిట అర్చనా వెంకటేశన్ ఇంగ్లీషు అనువాదం వెలువడ్డాక తిరువాయ్ మొళిని తెలుగులో ఆమూలాగ్రం చదవాలన్న కోరిక మరింత అధికమయింది. కిందటేడాది నేను తమిళనాడులో కొన్ని దివ్యక్షేత్రాలు చూస్తున్నప్పుడు నమ్మాళ్వారు గురించి కూడా రాయడానికి పూనుకున్నప్పుడు ఆదిత్య నాకు రెండు అనువాదాలు పంపాడు. ఒకటి శ్రీరామ భారతి, సౌభాగ్యలక్ష్మి అనేవారు చేసిన ఇంగ్లీషు అనువాదం. మరొకటి, పాలవంచ తిరుమల గుదిమెళ్ళ వేంకట లక్ష్మీ నృసిమ్హాచార్యులు అనే ఆయన 2011 లో చేసిన తెలుగు అనువాదం. కాని టి టి డి ప్రచురించిన ఈ ప్రతిపదార్థ వ్యాఖ్య వీటన్నిటికన్నా ఎంతో సమగ్రంగా ఉంది.

ఆ పుస్తకం చేతికందగానే త్వరత్వరగా ఒక పఠనం పూర్తి చేసేసాను. తిరువాయ్ మొళి అంటే పవిత్రమైన నోటినుండి వెలువడిన వాక్కు అని అర్థం. అంటే భగవద్వాక్యం అని చెప్పవచ్చు. అది పది అధ్యాయాల కావ్యం. ఒక్కొక్క అధ్యాయంలోనూ ఒక్కొక్కటీ పదకొండు పద్యాలుండే పదేసి కవితలుంటాయి. మొత్తం పది అధ్యాయాల్లోనూ కలిపి 1102 పద్యాలున్నాయి. ఈ పద్యాలన్నీ కవి ఒక పద్ధతిలో పూలమాలలాగా కూర్చాడు. వాటన్నిటిలోనూ తనకీ, భగవంతుడికీ మధ్యనుండే అనుబంధాన్ని, తదేకభావాన్నీ, తాదాత్మ్యాన్నీ ఎలుగెత్తి చాటాడు.

ఇప్పుడు ఈ పూర్తి తెలుగు అనువాదంలో నమ్మాళ్వారు కావ్యమహిమ ఏమిటో నాకు కొంతేనా బోధపడింది. ముఖ్యంగా ఆయన అనుభూతి గాఢతలోనూ, అభివ్యక్తిలోనూ ఎంతో అత్యాధునికంగా కనిపించాడు. రానున్న కాలంలో మళ్ళా మళ్ళా ఈ కావ్యనదీప్రవాహంలో ఎలానూ మరెన్నో మునకలు వేయబోతాను. కాని మొదటి మునకలోనే ఆ కావ్యమెంత శుభ్రవాక్కునో నాకు అనుభవానికి వచ్చిందని చెప్పక తప్పదు.

మళ్ళా మళ్ళా ఈ కావ్యం గురించి ఎలానూ మాట్లాడుతూనే ఉంటాను, కాని ఇప్పటికి మాత్రం 5 వ అధాయంలోని నాలుగవ పదికం గురించి మాత్రం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ పదికంలోని పదకొండు పద్యాలూ చదవగానే నాకు ఆధునిక ఫ్రెంచి, స్పానిష్ మహాకవులు గుర్తొచ్చారు. వానలో తడుస్తున్న పారిస్ మీద పాల్ వెర్లేన్ రాసిన కవిత గుర్తొచ్చింది. ఈ కవిత:

~

అది నా హృదయంలో రోదిస్తున్నది

నగరం మీద మెత్తగా వానకురుస్తున్నది

ఆర్థర్ రేంబో

~

అది నా హృదయంలో రోదిస్తున్నది

నగరం పైన వాన కురుస్తున్నది.

నా హృదయాన్ని లోబరుచుకున్నది

ఇదేమిటిది ఈ శోకాకుల సన్నిధి?

నేలపైన ఇళ్ళపైన కురుస్తున్నది

వాన చినుకుల ఎడతెగని సవ్వడి.

వ్యథాకులిత హృదయాన్నూగిస్తున్నది

మృదుమధురంగా వాన పాడుతున్నది.

కారణమేమీలేకుండానే విలపిస్తున్నది

వ్యాకుల హృదయమిటు మూలుగుతున్నది

ఏ ప్రేమికుడి వంచనవల్లన? ఏమిటిది

నా హృదయమెందుకిట్లా విలపిస్తున్నది?

శోక సంతోషాలకు అతీతమైన దుర్విధి

నా గుండెనిట్లా ఊడబెరుకుతున్నది

ఏ కారణాన నన్నిట్లా కలతపరుస్తున్నది

అదేమిటో నాకు అంతు తెలియకున్నది.

~

ఏళ్ళ తరువాత పెరూలో లీమాలో వాన పడుతున్న ఒక మధ్యాహ్నం సెజార్ వల్లేజో ఇట్లాంటి వ్యాకులతకే లోనయ్యాడు. నిర్హేతుకమైన ఆ వ్యాకులతలో అతడీ కవిత రాసాడు. ఆ కవిత వెనక వెర్లేన్ కవిత ఎంత బలంగా ఉందంటే, చివరికి, అతడీ లోకాన్ని ఒక వానపడుతున్న మధాహ్నం పారిస్ లోనే విడిచిపెట్టేసాడు:

~

అవశేషం అంచులదాకా

ఎన్నడూ లేనంతగా ఈ మధ్యాహ్నం వాన కురుస్తున్నది, ఇక

హృదయమా, నాకింక ఈ ప్రాణాలు అవసరం లేదనిపిస్తున్నది.

ఈ మధ్యాహ్నం ప్రసన్నంగా ఉన్నది, ఎందుకని ఉండకూడదు?

హర్షామర్షాలను ఆమె ఒక స్త్రీలాగా నిండుగా ధరించి ఉన్నది.

ఈ మధాహ్నం లీమాలో వాన కురుస్తున్నది, గుర్తుకు వస్తున్నది

సరిగ్గా ఈ క్షణాన్న నా కృతఘ్నతా గిరికంధరాల దుర్భర స్మృతి

సుకోమల కుసుమపేశల, ఆమె హృదయంపైన నా శీతస్పర్శ

ఇలా ఉండకంటూ ఆమె రోదిస్తున్నదాని కన్నా తీవ్రంగా ఉన్నది.

కపిల వర్ణాలు నా క్రూర పుష్పాలు, శిలాఘాతం, అనాగరికం

పదే పదే ఆమెని హింసిస్తున్న మధ్యలో హిమపాతవిరామం

నా వాక్యం ముగిసీముగియకుండానే గంభీరం ఆమె నిశ్శబ్దం

మండుతున్న చమురు మరీ మరీ ఎత్తిపోస్తున్నది.

కాబట్టి ఈ మధ్యాహ్నం ముందెన్నడూ లేనట్టుగా గడుస్తున్నది

గుడ్లగూబ లాంటి నా హృదయం నా వెంటే నడిచివస్తున్నది.

వడివడిగా సాగిపోతున్నారెందరో స్త్రీలు, నా గుండెనిట్లా విరిచి

గాఢవిషాద జలాల్ని కెరలించిపోతున్నారొకసారి కలచి కలచి.

ఎన్నడూ లేనంతగా ఈ మధ్యాహ్నం ఒకటే వాన కురుస్తున్నది,

హృదయమా, నాకింక ఈ ప్రాణాలు అవసరం లేదనిపిస్తున్నది.

~

ఇప్పుడు నమ్మాళ్వారు కవిత చూద్దాం. ఈ కవిత ఆయన తొమ్మిదవ శతాబ్దితిరువిణ్ణగర్ లో రాసాడా లేక పందొమ్మిదో శతాబ్ది పారిస్ లో రాసాడా లేక ఇరవయ్యవశతాబ్ది లీమాలో రాసాడా తెలియకున్నది:

~

1

ఊరంతా సద్దుమణిగింది. లోకమంతా చిమ్మచిక్కటి అలముకుంది. మొత్తం భూమినే మింగినవాడు, పాము పడకగా కలిగినవాడు, ఈ దీర్ఘరాత్రి నన్ను కాపాడటానికి రాడు, ఎంత పాపిష్టిదాన్ని, నా ప్రాణాలు నిలిపేదెవ్వరు?

2

మనసా! ఎటువంటి రాత్రి ఇది! ఇది ఆకాశమని, ఇది లోకమని ఇది సముద్రమని తెలియనంత చీకటి కమ్మి అంధకారం అడుగడుగునా పెరుగుతున్నది. నల్లకలువల్లాంటి కళ్ళు కలవాడూ రాడు, పాపిష్టిదానివి, మనసా, నువ్వూ తోడులేకపోతివి, ఇక నా ప్రాణాలు నిలిపేదెవ్వరు?

3

మనసా, నువ్వు కూడా అనుకూలంగా లేకపోతివి. ఈ రాత్రి ఎడతెగకుండా పెరుగుతూనే ఉంది. క్రూరమైన బాణాలతో శత్రువుల్ని దహించగల నాథుడు రాడు, ఎంత క్రూరమైన పాపం చేసానో, ఇట్లా స్త్రీగా పుట్టాను, ఎలా మరణించాలో కూడా తెలియకున్నది.

4

నాలాంటి స్త్రీలు పడుతున్న ఈ దుఃఖం చూడలేకన్నట్టుగా సూర్యుడు కూడా తలెత్తడం మానేసాడు. భూమిని కొలిచినవాడు, పెద్ద కళ్ళవాడు, ఎర్రటి పెదవులవాడు, మబ్బులాగా దట్టమైన రంగువాడు,నిజంగా ఉత్తముడు, కాని రాడు. ఇక లెక్కపెట్టలేనంత నా మనోవ్యాధిని తీర్చగలవారెవ్వరు?

5

నా దుఃఖం పట్టించుకోకుండా నా బంధుమిత్రులు ఈ దీర్ఘరాత్రి సుఖంగా నిద్రపోతున్నారు. కారుమబ్బులాంటి మేనుగలవాడూ నన్ను పట్టించుకోడు. ఇక ఇక్కడ మిగిలేది నా పేరు ఒక్కటే. నన్ను పట్టించుకునేవారెవ్వరు?

6

ఆశ ఒక వ్యాధిలాగా నా వెనకనుండి నన్ను బాధపెడుతున్నది. రాత్రి ఒక యుగంలాగా ముందుండి కళ్ళు మసకబరుస్తున్నది. సుదర్శనుడు వాడెక్కడ? ఆశ్చర్యచేష్టితుడు వాడెక్కడ? ఇలా తపిస్తున్న నన్ను కాపాడేదెవ్వరు?

7

ఒక పక్క పొడుగ్గా పెరుగుతున్న చీకటి మరొక పక్క చినుకులు. ఒక యుగంలాగా గడుస్తున్న ఈ రాత్రిపూట పాలనురుగులాంటి తెల్లటి శంఖ చక్రాలతో వాడు కనిపించడు. ఓ దేవతలారా, నేను చేసుకున్న పాపమేమిటోగాని అది నన్ను నిప్పులాగా దహిస్తున్నది. నేనేమి చేసేది!

8

దేవతలారా! నేనేమి చెయ్యను? ఈ రాత్రి ఒక యుగంలాగా పెరిగి నన్నెట్లానైనా వధించాలనుకుంటున్నది. చేతిలో సుదర్శనం ధరించినవాడా రాడు. మరీ ముఖ్యంగా పుష్యమాసపు చలిగాలి నన్ను నిప్పుకన్నా తీవ్రంగా దహిస్తున్నది.

9

చల్లని చినుకులు పడుతున్న ఈ రాత్రి రగులుతున్న అగ్నికన్నా వేడిగా తాకుతున్నది. సూర్యుడి రథమా కనబడకున్నది, ఎర్రతామరపూలవంటి కన్నులు కలవాడా కనిపించడు,. ఇట్లా దుఃఖంలో కరిగిపోతున్న నన్ను కాపాడేదెవ్వరు?

10

ఇలా చినుకులు రాలుతున్న ఈ రాత్రి, ఒకప్పుడు లోకాన్ని కొలిచినవాడు వస్తాడనో రాడనో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ లోకం చూడు ఎట్లా పడినిద్రపోతున్నదో, నాకు ఆశ్చర్యంగా ఉన్నది.

7-3-2021

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%