గొప్ప పఠనానుభవం

ఈరోజు రాధాకృష్ణమూర్తిగారి పుట్టినరోజని గుర్తు రాగానే ఆయనకి ఏమి కానుక ఇవ్వగలనా అని ఆలోచించాను. సాధారణంగా మనుషులు తమ కాలానికీ,కుటుంబాలకీ, తమ కార్యాలయాలకీ పరిమితమై జీవిస్తారు. కాని కొంతమంది దేశాలకీ, కాలాలకీ అతీతమైన అనుభవాన్ని కూడగట్టుకుంటారు. ఈ భూమ్మీద జీవించి ఇక్కడి మన అనుభవాన్ని పరిపుష్టం చేయడానికి తమ ఆలోచనల్నీ, స్ఫూర్తినీ వదిలిపెట్టి వెళ్ళిన మహనీయులతో ఒక నిరంతర సంభాషణ కొనసాగిస్తుంటారు. వాళ్ళ దృష్టి ఇక్కడ ఉండదు గానీ, నిజానికి వాళ్ళ దృష్టి మనమీదనే. మనం మన జీవితాల్ని మరింత సార్థకంగా అనుభవంలోకి తెచ్చుకోవడమెలానో మనకు తెలియచెప్పాలన్నదే వాళ్ళ తపన. అహర్నిశలు వాళ్ళ చింతన అదే. రాధాకృష్ణమూర్తిగారు అట్లాంటి మనిషి. పూర్వకాలాలకి పూర్తివారసుడు. కాబట్టే భవిష్యతరాలకి మార్గదర్శకుడు.

అటువంటి మనిషితో ఏమి సంభాషించడమా అనుకుంటూ ఉండగా, ఇదిగో, నా ఎదట The Light that Remained (2019) అనే పుస్తకం కనిపిస్తున్నది. నెల్లూరు కి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు హెచ్.ఎస్.వి.కె.రంగారావుగారూ, తెనాలికి చెందిన సాహిత్య ఉద్యమ కారుడు సురేష్ వెలువరించిన పుస్తకం. శ్రీమతి ఆనంద కుమారస్వామి, సంజీవదేవ్, నేలనూతల శ్రీకృష్ణమూర్తి, యేటుకూరి బలరామ్మూర్తి, వేదం వెంకట్రామన్, వేగుంట మోహన ప్రసాద్ వంటి భావుకులు రాసుకున్న ఉత్తరాలు, జ్ఞాపకాలు, వ్యాసాలు, కవితల సంకలనం. ఎటువంటి లాభాపేక్ష లేని ఇద్దరు సాహిత్యాభిమానులు ఎంతో ప్రేమతో, శ్రద్ధగా, ఎంతో అందంగా వెలువరించిన పుస్తకం.

అందులో నేలనూతల శ్రీకృష్ణమూర్తికి సంజీవదేవ్ రాసిన ఉత్తరాలు చదువుతూ ఉన్నాను. సంజీవ్ దేవ్ ఉత్తరాలు, ఎవరికి రాసినవేనా, చదవడం గొప్ప పఠనానుభవం. ఆయన వాక్యాల్లో, ఆ ఉత్తరాలు రాసినప్పటి మనఃస్థితిలో యోగులకీ, యోగభూమికలోంచి కళాసృజనచేసే కళాకారులకీ మాత్రమే సాధ్యమయ్యే గాంభీర్యం, ధ్యానశీలత, సారళ్యం కనిపిస్తాయి. మనిషి లోపలి ప్రపంచమూ, బయటి ప్రపంచమూ ఒక్కటయ్యే తావుల్ని దర్శించినప్పుడో, లేదా ఒక్కటిగా సంభావించుకోగలిగిన క్షణాల్లోంచో రాసిన వాక్యాలు కావడంతో, అవి చదువుతున్నప్పుడు మనం కూడా ఒక మహద్స్పర్శని అనుభవం చెందుతాం. నికొలస్ రోరిక్ చిత్రించిన హిమాలయాల వర్ణచిత్రాలను చూసినప్పటిలాగా కాలాతీతమైన మహద్విభూతిని దేన్నో చూసినట్టుగా అనుభూతి చెందుతాం. ఈ ఉత్తరాల్లో కూడా అటువంటి క్షణాలు తక్కువేమీ లేవు.

షేక్స్పియర్ నో, ఛాందోగ్య ఉపనిషత్తునో, తిక్కననో, ఎలియట్ నో, డాస్టవిస్కీనో, ఇప్పుడు కాఫ్కానో వివరిస్తున్నప్పుడు రాధాకృష్ణమూర్తిగారి వాక్యాల్లో కనిపించేది కూడా అదే. దాన్ని మనం కేవల వేదాంత చర్చగానో, సాహిత్యసమీక్షగానో భావించి ఊరుకోలేము. చీనా, జపాన్ లాండ్ స్కేప్ చిత్రకారుల గురించి సంజీవ దేవ్ రాస్తున్నప్పుడు ఆయన వివరిస్తున్నది పైకి చిత్రకళగా కనిపిస్తున్నప్పటికీ, అది చిత్రలేఖనానికి పరిమితమైన అనుశీలనకాదు. చిత్రలేఖన ద్వారం గుండా ఆ సాధకులు ఎటువంటి ఆత్మమైదానాల్లో అడుగుపెట్టి విహరించారో ఆ పరిశీలనగా దాన్ని మనం గుర్తించాలి. రాధాకృష్ణమూర్తిగారు నీషే గురించి రాసినా, కిర్క్ గార్డ్ గురించి రాసినా అది కేవలం అస్తిత్వవాద వివరణ కాదు. మనిషి తన జీవితాన్ని మరింత authentic గా జీవించడమెట్లానో, ఆ సాధికారికత, ఆత్మస్వాధీనతల గురించిన మేలుకొలుపుగా మనం దాన్ని భావించాలి.

ఎన్ ఎస్ కె గా ప్రసిద్ధుడైన నేలనూతల శ్రీకృష్ణమూర్తి (1910-96) వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేసినప్పటికీ, ప్రాచీన భారతీయ చరిత్ర, లలిత కళలు, శిల్పం, నాట్యం, వేదవిజ్ఞానాలకు సంబంధించి నిరుపమానమైన కృషి చేసిన విద్వాంసుడు. ఆనంద కుమార స్వామితో ఆయన స్నేహం, శ్రీమతి కుమారస్వామితో కూడా కొనసాగింది. ఆమె శ్రీకృష్ణమూర్తి దంపతులకు రాసిన ఉత్తరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. మరొకవైపు ఆయనకు సంజీవదేవ్ రాసిన ఉత్తరాలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి. ఆ ఉత్తరాలు చదువుతున్నంతసేపూ నేను ఈ లోకానికి ఆవలి తీరాన్ని చూపించే ఏదో ఒక పొగమంచు అంచుదగ్గర నిలబడ్డట్టుగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఇంగ్లీషులో రాసిన ఆ ఉత్తరాల్లోంచి కొన్ని వాక్యాల్ని, నా తెలుగులో, రాధాకృష్ణమూర్తిగారికోసం సమర్పిస్తున్నాను.

~

వేసవి వాతావరణం మొదలయ్యింది. ఇట్లాంటి వేసవి వేసటలో నాకు చదవాలన్న, రాయాలన్న కోరిక బాగా మందగిస్తుంది. వాటికి బదులు, సొమరిగా పగటికలలు కనడంలోనూ, చెట్ల నీడల్లో కూచుని ఊరికే ఏదో ఒకదానిమీద మనసుపెట్టి ధ్యానించడంలోనూ, సంతోషకరమైన హేమంతాన్ని గుర్తుకు తెచ్చుకోడంలోనూ, ఇంకా ఉషోదయం కాకుండానే రహస్య సంభాషణ మొదలుపెట్టే కోకిల కూజితాలు వినడంలోనూ, సాయంకాలాలు తరగలెత్తే వేసవి వానలు చూడటంలోనూ సంతోషం పొందుతుంటాను. ప్రతి ఋతువులోనూ మంచీ చెడ్డా సమానంగానే ఉన్నప్పటికీ నాకెందుకో హేమంత శిశిరాలంటేనే ఎక్కువ ఇష్టం. ఆ శీతవేళల్లో నాకు ఇంత ధ్యానానికీ, ఇంత సాహిత్యసృజనకీ స్ఫూర్తి దొరుకుతుంది. మరీ ముఖ్యంగా శరత్తు మరీ చలి లేకుండా, మరీ ఎండకాయకుండా, వానల్లేకుండా ఉంటుంది. కానీ ఈ ఋతుచక్రప్రభావాన్ని మానసికంగా దాటినవాళ్ళే నా దృష్టిలో నిజంగా భాగ్యవంతులు! (12-5-1957)

2

యోగులు పొందే ఆనందమూ, కళాకారులు సృజనలో లోనయ్యే సంతోషమూ ఒకదానికొకటి చాలా దగ్గర. అంత దగ్గరగా ఉండేవి మరేవీ మనకి అంతగా కనిపించవు. అందుకనే భారతీయ భక్తికవులు గొప్ప వాగ్గేయకారులుగానూ, చీనా లో కవి-చిత్రకారులుగానూ వికసించారు. సృజనాత్మక కళా, ధ్యానశీల ఆధ్యాత్మికతా ఏ అతీతకాలం నుంచో జమిలిగా అల్లుకుపోయి ఉన్నాయని చెప్పొచ్చు. (19-3-57)

3

నికొలస్ రోరిక్ పెద్దకోడుకు డా. జార్జి రోరిక్ టిబెట్ నుంచి మహాయాన తంత్రశాఖకు చెందిన ఒక లామాను వెంటబెట్టుకొచ్చాడు. ఆ లామానుంచి అతడు టిబెటన్ తంత్రం గురించీ, సాహిత్యం గురించీ తెలుసుకుంటూ ఉండేవాడు. నేనూ ఆ లామా అక్కడ పైన్ చెట్ల అడవుల్లో చాలా దూరంపాటు వ్యాహ్యాళి సాగించేవాళ్ళం. కాని అతడికి హిందీగానీ ఇంగ్లీషు గానీ రాదు, నాకేమో టిబెటన్ రాదు. అదృష్టవశాత్తూ అతడు కొన్నాళ్ళు డార్జిలింగ్ లో ఉన్నందువల్ల బెంగాలీ ముక్కముక్కలుగా మాటాడేవాడు. దాంతో మేమిద్దరం ఆ అరకొర బెంగాలీలోనే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఒక సాయంకాలం నేనూ ఆ లామా ఒక బండరాయి మీద కూచుని ఉత్తరహిమాలయాల మంచుశిఖరాల్ని చూస్తూ ఉన్నాం. ఉన్నట్టుండి లామా నాతో తన శరీరాన్ని తాకమన్నాడు. నేనతడు చెప్పినట్టే ఆ శరీరాన్ని తాకి చూసాను. అది నిప్పులాగా వేడిసెగలు కక్కుతూ ఉంది. నా వేళ్ళు కాలిపోతాయేమోనని చప్పున నా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను. అతడు చిరునవ్వాడు. మరికొంతసేపటికి మళ్ళా నన్ను తన శరీరం తాకి చూడమన్నాడు. ఈసారి తాకిచూస్తే అది మంచుగడ్డలా అతిశీతలంగా ఉంది! యోగమహిమ ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను! (25-8-58)

4

ఏదో ఒక గమ్యాన్ని చేరుకునే ప్రయాణం నన్నెప్పుడూ ఆకర్షించదు. నా దృష్టిలో అది చాలా పరిమితం . పరిమితమైంది ప్రతీదీ హద్దుల్లో ఇమిడిపోయి ఉంటుంది, ప్రతి హద్దూ ఒక బంధమే, ప్రతి ఒక్క బంధం ఒక దుఃఖమే. హద్దుల్లేనిదీ, అపరిమితమైందీ ఏదో అది మాత్రమే అసలైన ఆనందం. (1.19159)

5

మీ బౌద్ధిక శ్రేష్టతా, అట్లానే మీలో కనవచ్చే పసితనపు అమాయికతా మా హృదయాల్ని కట్టిపడేసాయి. మిమ్మల్ని మా హితులుగా, సన్నిహితులుగా మార్చేసాయి. ఇప్పటి మానవాళికి అట్లాంటి మంచితనం చాలా అవసరం. అటువంటి ప్రేమకాంతి తరంగాలు అదృశ్యంగా ఈ విశ్వమంతటా ప్రతి ఒక్కచోటా ప్రసరిస్తూనే ఉంటాయిగాని, వాటిని అందుకోగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు చాలా చాలా తక్కువ మంది! అటువంటి అదృశ్య ప్రేమప్రకాశప్రవాహాలను అందుకోనివ్వకుండా మానవ చేతనా సౌకుమార్యాన్ని బండబార్చే బాహ్య పరిమితులు లెక్కలేనన్ని. (3.2.1959)

6

నా దగ్గర బ్లేక్ కవితా సంపుటమొకటి వుంది. ఫేబర్ అండ్ ఫేబర్ ప్రచురణ. దానికి జాఫ్రీ కీన్న్స్ ముందుమాట రాసాడు. అందులో బ్లేక్ వర్ణచిత్రాల తాలూకు అద్భుతమైన కలర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. రూపంలోనూ, సారంలోనూ కూడా బ్లేక్ కళ యోగభూమికకి చెందిందని చెప్పవచ్చు. అతడి కవిత్వమూ, చిత్రలేఖనాలూ రెండూ ఒకదాన్నొకటి పరస్పరం వ్యాఖ్యానించుకుంటాయి. అతడి వర్ణచిత్రాలు అతడి కవితల రేఖా వ్యాఖ్యానాలు, కవితలు అతడి వర్ణచిత్రాల శాబ్దిక వ్యాఖ్యానాలు. అనంతత్త్వంతో అతడు సదా సాగిస్తో వచ్చిన సంభాషణాల ఫలితాలే రెండూనూ. అవును. బ్లేక కీ రోరిక్ కీ మధ్య కొన్ని పోలికలు లేకపోలేదుగానీ వారి వ్యక్తీకరణ పద్ధతులు, అలవాట్లు పూర్తిగా విభిన్నం. బ్లేక్ తన మనోభావాల్ని మానవాకృతులద్వారా వ్యక్తీకరిస్తే రోరిక్ లాండ్ స్కేప్ ల ద్వారా వ్యక్తీకరిస్తాడు. కానీ, ఇద్దరి చిత్రలేఖనాల్లోనూ ప్రస్ఫుటమయ్యేది మాత్రం ఒక్కలాంటి యోగానందమే. జపనీయ జెన్ సాధువులు చెప్పేదాని ప్రకారం జీవజ్వాల ఏ క్షణానికి ఆ క్షణం కదిలిపోయే అనుక్షణ హృదయంలో మటుకే ఉన్నది. కాని ఇంతదాకా ఏ ఒక్క చిత్రకారుడు కూడా ఆ జీవజ్వాలను పట్టుకోగలిగాడని గానీ, తన కళలో ఆవిష్కరించగలిగాడని గానీ చెప్పలేం. ( 6-3-59)

7

తమ తీరికవేళలకన్నా తమ వృత్తి జీవితానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు నిజంగా ధన్యులు. కానీ, తమ వృత్తి జీవితం కన్నా తమ తీరికసమయపు వ్యాపకాలకు మరింత ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు మరింత ధన్యులు. అయితే ఆ తీరికసమయపు వ్యాపకాలు కూడా వృత్తివ్యాపకాల్లానే ఉదాత్తమూ, పవిత్రమూ అయి ఉండాలి. (14-9-59)

8

అపరిచితుల్ని చూడాలనీ, అపరిచిత ప్రదేశాలకు పోయి రావాలనీ నాకెందుకో ఒక అనిరర్ధక కౌతుకం. మీరు నాకు అపరిచితులేగాని మరో విధంగా సుపరిచితులు కూడా అందుకని మిమ్మల్ని కలవాలని ఒకటే ఆతృతగా ఉంది నాకు. (9-1-59)

9

సంతోషం లేదంటే దానర్థం దుఃఖం ఉందని కాదు, దుఃఖం లేదంటే దానర్థం సంతోషం ఉందని కాదు. ఒకదాని ఉనికి మరొకదాని లేకునికి ని సూచించదు. ఆనందానికీ, విచారానికీ మధ్య ఒక సరిహద్దు సీమ ఉన్నది. బహుశా ప్రస్తుతం మీరు ఆ సరిహద్దుల్లో సంచరిస్తూండవచ్చు. సంతోష ధావళ్యంగానీ, విషాదకాలిమగానీ కనిపించని ఆ సరిహద్దుసీమది ధూసరవర్ణం. లేదా బహుశా అక్కడ ఆ రెండు రంగులూ కలగలిసిపోయి కూడా ఉండవచ్చు. సంతోషం ఒక ఉద్రేకం. దుఃఖం కూడా అట్లానే ఒక ఉద్రేకం. కాని ఆ సరిహద్దుసీమ అనుద్విగ్నం. అందుకనే ఆ సీమలో గొప్ప శాంతి, ప్రశాంతి. (19-3-60)

10

(పుట్టపర్తి నారాయణాచార్యులుగారి నోటివెంట శివతాండవ గీతాన్ని విన్న అనుభవాన్ని తలుచుకుంటూ) ..అటువంటి మహాసౌందర్యరసయోగానికి సంబంధించిన కృతుల ఎదట మనం కేవలం ‘ఉండటం’ దాటి ‘జీవించడం’ మొదలుపెడతాం. ఉండటమంటే జీవించడం కాదు. కేవలం మనుగడ జీవితం కాదు. ఉండటమంటే కేవలం ఉండటం మటుకే. ‘ఉండటం’ జీవించడం’ గా మారాలన్నదే అతీతకాలం నుంచీ మానవాళి పవిత్రాశయాల్లో ఒకటిగా కొనసాగుతున్నది. కేవలం ‘ఉండటం’ దాస్యం. ‘జీవించడం’ స్వాతంత్య్రం. ‘ఉండటం’ స్తబ్ధత. ‘జీవించడం’ చలనం. ‘ఉండటం’ జడత్వం. ‘జీవించడం’ స్పందన. ఏది కేవలం ‘ఉంటుందో’ అది ముడుచుకున్న జీవితం. ఏది ‘జీవిస్తుందో’ అది తెరుచుకున్న జీవితం. (10-4-61)

15-8-2019

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%