ఆమె మరొక వెయ్యి పున్నములు చూడాలి

డా.నన్నపనేని మంగాదేవి గారి 82 వ పుట్టినరోజు మొన్న సోమవారం చేతన ఆశ్రమప్రాంగణంలో ఎంతో సంతోషం నడుమ ఒక పండగలాగా జరిగింది. ఆ ఉత్సవానికి నాకు ఆహ్వానం రావడం నా భాగ్యం.

ఆమె ఒక బీడు భూమిలో, బండనేలమీద నందనవనాన్ని మేల్కొల్పారు. ఆ పూలతోట మధ్య పువ్వుల్లాంటి చిన్నారులు మరొక తోట. ఆ రెండు తోటలమధ్యా కొన్ని క్షణాలు తిరుగాడినా, గుండెల నిండా గాలి పీల్చినట్టుంటుంది. నీ మనోదేహాలు రెండూ పూర్తిగా ఛార్జి అవుతాయి. నువ్వు మరికొన్నాళ్ళపాటు నిరుత్సాహం దరిచేరకుండా మనగలుగుతావు, మసలగలుగుతావు.

ఒక్క ఉదాహరణ చెప్తాను. మరో పాఠశాలలో మరో మనిషి పుట్టినరోజు నాడు ఏమి చేసి ఉండేవారో నేను చెప్పలేనుగాని, మంగాదేవి గారి పుట్టినరోజు నాడు పిల్లలేం చేసారో తెలుసునా? రకరకాల విత్తనాలు మట్టిలో చుట్టి ఉండలు చేసారు. ఆ ఉండలు పట్టుకుని పాఠశాల పొలిమేరల్లో ఉన్న కొండలమీదకీ, గుట్టలమీదకీ వెళ్ళి ఆ బంతుల్ని కిందకు దొర్లించారు. ఆ మట్టి ఉండలు నేలమీదా, నెర్రెల్లోనూ కుదురుకుంటాయి. వానపడగానే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఆ ఊషరక్షేత్రం ఒక వనంగా మారిపోతుంది. కథల్లో చదువుతాం ఇట్లాంటివి. ఆ రోజు కళ్ళారా చూసాను.

ఆమె ఒక వ్యక్తి కాదు, శక్తి అనేది మామూలుగా ఒక పడికట్టుపదం. కాని మంగాదేవమ్మ ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఒక ఉద్యమం. ఒక స్ఫూర్తి. ఆ శక్తి అందరికీ లభించేది కాదు. ఆ అసామాన్యమైన చైతన్యాన్ని ఆరాధించడం దానికదే ఒక చైతన్యం.

ఆమె వెయ్యి పున్నములకు పైగా చూసారు. మరొక వెయ్యి పున్నములు చూడాలని కోరుకోవడమే నేను చెయ్యగలిగేదల్లా.

4-7-2019

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%