నేను కంటున్న కల

18

స్వామి వివేకానంద ఒక మిత్రురాలికి రాసిన ఉత్తరంలో ( 27, డిసెంబర్,1899) ఇలా రాస్తున్నారు:

నేనిప్పుడు రోజుకి 25 డాలర్ల చొప్పున సంపాదిస్తున్నాను…కొన్నాళ్ళకి హిమాలయాల్లో ఇంతచోటు కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే, 6000 అడుగుల ఎత్తునుండే ఒక మొత్తం కొండ కొనుక్కుంటాను. అక్కణ్ణుంచి చూస్తే సతతహిమపాత సుందరదృశ్యం గోచరిస్తూంటుంది. అక్కడ ఊటబుగ్గలూ, చిన్ని సరస్సూ ఉంటాయి. హిమాలయ దేవదారువనాల మధ్య పువ్వులు, ఎటుచూసినా పువ్వులుండాలి. అక్కడొక చిన్న కుటీరం కట్టుకుంటాను. ఆ మధ్యలో నాదొక చిన్నకూరగాయలతోట ఉంటుంది. దాన్ని నేనే నా కాయకష్టంతో సాగుచేసుకుంటాను.ఇంకా-ఇంకా-ఇంకా-నా పుస్తకాలు. ఎప్పుడో దీర్ఘకాలమట్లా గడిచాకగాని మనిషన్నవాడి ముఖం కనిపించగూడదు. ప్రపంచం ధ్వంసమైపోతున్న శబ్దాలు నా చెవుల్లో మోతపెట్టవచ్చుగాక-నేను పట్టించుకోను. నా పనంతా-ఇహలోకానిదిగానీ, పరలోకానిదిగానీ పూర్తి చేసేసి ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకుంటాను.నా జీవితమంతా ఎట్లా గడిపాను. పుట్టు సంచారిని. ఇదీ ప్రస్తుతం నేను కంటున్న కల. భవిష్యత్తుసంగతి నాకు తెలియదు..’

ప్రాచీన చీనాకవీంద్రుడు తావోచిన్ కవిత్వంలా, జెన్ సన్యాసులూ, స్వయంగా మహనీయులైన కవులూ అయిన హాన్ షాన్, సైగ్యో, బషోల మాటల్ని గుర్తు చేస్తున్న ఈ వాక్యాలు నాకెంతో దిగులు పుట్టిస్తున్నాయి. ఏమంటే ఇది నా కల కూడా. ప్రభుత్వోద్యోగమనే ఈ దాస్యవృత్తి నా జీవితాన్ని కబళించివేసింది. ఇది నా ఆత్మను తినెయ్యకుండా ఉండటానికీ, నన్ను నేను కాపాడుకోడానికీ నాలోనేను, నాతోనేను ఎంత యుద్ధం చేస్తూ వచ్చానో ఆ దేవుడికే తెలుసు.

నాకు హిమాలయాల మీద మక్కువలేదు. తూర్పుగోదావరి అడవుల్లో, మా ఊరిదగ్గర, వణకరాయి అనే కొండరెడ్డి పల్లె ఉంది. ఆ పురాతన గిరిజనగ్రామంలో వాళ్ళతో కలిసిజీవించాలనీ, వాళ్ళకి వ్యవసాయం గురించీ, ఆరోగ్యం గురించీ చెప్తూ అనుక్షణం మారే ఋతు పరిభ్రమణంలో సర్వేశ్వరవైభవాన్ని పాటలు కట్టి కీర్తించాలన్న కల.

ఎప్పటికి నెరవేరుతుంది!

11-8-2013

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading