అరకులోయలో చెక్కుచెదరని శిఖరం

ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు అరకులోయలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాక, నేను ఒకప్పుడు తిరిగిన దారుల్ని మళ్ళా వెతుక్కుంటూ హట్టగూడ, కరాయిగూడ గ్రామాలకు వెళ్ళాను.

ఇరవయ్యేళ్ళ కిందట, ఇండియా టుడే పత్రికకోసం అరకులోయ మీద యాత్రాకథనం రాస్తూ ఆ గ్రామాలగురించి రాసాను. అరకులోయ గురించి ఎంతో విని యాత్రీకులు ఎక్కడెక్కడినుంచో అరకు వచ్చి, అక్కడేమి చూడాలో తెలియక, రోజంతా అటూ ఇటూ తిరిగి అర్థం కానిఏదో అసంతృప్తితో వెళ్ళిపోతుంటారు. అసలు అరకు అనే కాదు, చాలా పర్యాటక ప్రదేశాల్లో ఏమి చూడాలో యాత్రీకులకి చెప్పేవాళ్ళెవరూ ఉండరు.

అరకు అంటే ఒక strange landscape అనుకుంటే అంతదూరం వెళ్ళవలసిన అవసరం లేదు. కాని అది అత్యంత ఆదిమజాతులవాళ్ళ జీవనస్థావరమనీ, ప్రకృతితోనూ, తక్కిన సమాజంతోనూ ఎన్నో వేల ఏళ్ళుగా వాళ్ళు సాగిస్తూ వచ్చిన సంఘర్షణ, సమన్వయాల అద్భుత రంగస్థలం అరకులోయ అని తెలిస్తే, ఆ సౌందర్యం వర్ణనాతీతంగా ఉంటుంది.

పొరజాలు, కోందులు, గదబలు, కొటియాలు, కొండదొరలు ఆ అడవుల్లో, ఆ కొండల్లో విల్లంబుల ప్రపంచం నుంచి ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఆ ప్రయాణాన్ని కళ్ళారా చూస్తే మానవేతిహాసంలో ఒక ఆశ్వాసం ముగించి మరొక ఆశ్వాసం మొదలుపెట్టినట్టు ఉంటుంది.

ఆ వైనమంతా, ఆసక్తి కరమైన ఆ ప్రయాణమంతా నేను నా యాత్రా కథనంలో రాసాను. ఆసక్తి ఉన్నవాళ్ళు నా యాత్రా కథనాల సంపుటి ‘నేను తిరిగిన దారులు’ (2011) చూడవచ్చు.

అందులో అరకు చుట్టూ నేను వివరించిన అనుభవాలు ఇరవయ్యేళ్ళ కిందటివి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే మాట అన్నిటికన్నా ముందు ప్రతి యాత్రీకుడు గుర్తుపెట్టుకోవలసిన మాట. అరకులోయ అంటే దూరంగా ఆకుపచ్చని కెరటాల్లాంటి కొండలూ, శీతాకాలం పొడుగూతా కొండవాలుల్లో పసుపు పచ్చని తివాచీలు పరిచినట్టు వికసించే ఒలిసె చేలు, సాయంసంధ్యా గగనం మీంచి ఏటవాలుగా ఎగిరే కొంగలూ మటుకే కాదు. లేదా టూరిజం డిపార్టు మెంటు వాళ్ళు గెస్ట్ హవుజ్ ల దగ్గర ఏర్పాటు చేసిన ధింసా నృత్యాలూ కాదు.

అదొక ప్రాచీన ఆదివాసి భూమి. అక్కడ మానవుడు నిర్విరామంగా చేస్తూన్న సంగ్రామముంది, సంతోషముంది, రాత్రుళ్ళు వెచ్చని నెగడి చుట్టూ చేరి చెప్పుకున్న కథలున్నాయి, వసంత ఋతువులో పాడుకున్న పాటలున్నాయి. నిష్టురమైన జీవితదుఃఖాన్ని ఎదుర్కోవడానికి తక్కిన ప్రపంచంలో మనిషి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడో, ఆ జీవన వైవిధ్యమంతా అక్కడ కూడా ఉంది.

దోపిడీ, పీడన, ఆకలి, అవమానాలతో కూడుకున్న దైనందిన జీవితాన్ని ముఖాముఖి ఎదుర్కోడానికి గిరిజనుడు వేసుకున్న ఎన్నో మార్గాల్లో అలేఖ మహిమ ధర్మం కూడా ఒకటి. ఆ ధర్మాన్ని అరకులోయ ప్రాంతంలో ఇప్పటికీ అనుసరిస్తున్న ‘ఒలేకుల’ గురించి నేను నా యాత్రాకథనంలో రాసాను.

ఇప్పుడు కూడా ఆ ధర్మం అట్లానే కొనసాగుతున్నదో లేదో చూద్దామని కరాయిగూడ వెళ్ళాను. మేం గ్రామంలో అడుగుపెట్టేటప్పటికే కనుచీకటి పడుతోంది. ఆకాశమంతా వర్షర్తు మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఇరవయ్యేళ్ళ కిందట ఆ కరాయి గూడ గ్రామంలో గడ్డిపూరిళ్ళు మటుకే ఉండేవి. కాని ఇప్పుడు పక్కా ఇళ్ళు, పశువుల శాలలు, సిసి రోడ్లతో గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయింది. మాకు దారి చూపించిన వ్యక్తి,మమ్మల్ని ఒక ఇంటికి తీసుకువెళ్ళి, అది ఒలేకుల్లో పెద్దవాడైన బొడోభాయి ఇల్లని చెప్పాడు. బొడోభాయి కోరారంగు వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతడితో కొంతసేపు మాట్లాడిన తర్వాత, గుర్తుపట్టగలిగాను, ఇరవయ్యేళ్ళ కిందట, నాకు ఆ మహిమధర్మం గురించి చెప్పిన కొంబుపాణి బొడోభాయి అతడేనని. అతడిప్పుడు బాగా వృద్ధుడు. ముగ్గుబుట్టలాంటి కేశరాశి, గుబురు గడ్డం. అతడి ఇంటిముందు కూచోగానే మరికొంతమంది ఒలేకులు అక్కడికి చేరుకున్నారు.

అలేఖ మహిమా ధర్మం 19 వ శతాబ్దిలో ఒరిస్సా కేంద్రంగా ప్రభవించి, అనతికాలంలోనే దండకారణ్యమంతటా విస్తరించిన ఒక ఆధ్యాత్మికోద్యమం. అణగారినవర్గాల్లో, ముఖ్యంగా, ఒరిస్సా, ఛతీస్ గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ ల్లోని ఆదివాసుల్లో బలంగా వేళ్ళూనిన సామాజిక చైతన్యం. బ్రాహ్మణ సంప్రదాయాన్నీ, భూస్వామిక సంస్కృతినీ, వడ్డీవ్యాపారాన్నీ ఎదిరించి నిలబడ్డ సామాజిక అసమ్మతి ఉద్యమం.

ఆధ్యాత్మికతనీ, సామాజిక అసమ్మతినీ అంత అద్భుతంగా మేళవించుకున్న ఆరాధనా సంప్రదాయాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఉదాహరణకి, తక్కిన భారతదేశంలో కనవచ్చే అస్పృశ్యతా దురాచారం అలేఖ్యమహిమ ధర్మంలో కనిపించదు. కాని వాళ్ళ ‘అస్పృశ్యులు’ వాళ్ళకీ ఉన్నారు. వాళ్ళు ఎవరిదగ్గరైనా అన్నపానీయాలు స్వీకరించగలరుగాని, బ్రాహ్మణుల, భూస్వాముల, వడ్డీ వ్యాపారస్థుల ఇళ్ళ నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా వాళ్ళు ముట్టరు.

1838-1876 మధ్యకాలంలో మహిమ గోసాయి అనే ఒక సాధువు ఒరిస్సాలో డెంకనాల్ జమీందారు ల దోపిడీ ని ప్రతిఘటిస్తూ నిర్మించిన ఉద్యమం అది. దాన్ని ఒకవైపు ఆరాధనా సంప్రదాయంగానూ, మరొకవైపు సామాజిక అసమ్మతి ఉద్యమంగానూ ఆయన తీర్చి దిద్దాడు. బ్రాహ్మణ, బౌద్ధ, జైన మతాల్లోని అత్యున్నత విలువల్ని స్వీకరిస్తూ, అదే సమయంలో ఆయా మతాల్లోని అమానవీయ, అసాంఘిక ధోరణుల్ని పరిహరిస్తూ ఆయన అలేఖ మహిమ ధర్మానికి రూపకల్పన చేసాడు.

మీ దినచర్య ఏమిటి అని అడిగితే, బొడోభాయి ఇట్లా చెప్పాడు:

‘తెల్లవారు జాము మూడు గంటలకి నిద్రలేస్తాం. లేవగానే ఏడుసార్లు నిర్గుణ బ్రహ్మ కి సాష్టాంగపడతాం.రోజంతా పొలంలో, ఇంట్లో కాయకష్టం చేస్తాం. సాయంకాలం, సూర్యాస్తమయం కాకముందు మళ్ళా అయిదుసార్లు సాష్టాంగ పడతాం. చీకటి పడకుండానే రాత్రి భోజనం పూర్తి చేసుకుంటాం. ఆ తర్వాత గంటా, రెండు గంటల పాటు కీర్తనలు పాడుకుంటాం, ఆ పైన నిద్రపోతాం’

స్పష్టమైన ఒరియా, అస్పష్టమైన తెలుగు సమ్మిశ్రితంగా అతడింకా ఇట్లా చెప్పాడు:

‘మేం మూర్తి పూజ చెయ్యం. ఆత్మపూజ చేస్తాం. ఆత్మవందనం చేస్తాం. మాంసం నిషిద్ధం, మద్యం మాటే లేదు, పొగాకు, జూదం మరే వ్యసనాలూ లేవు. రోజంతా పని, రాత్రికి విశ్రాంతి.అంతే.’

ఇరవయ్యేళ్ళ కింద ఈ మాటలు విన్నప్పుడు నాలో ఏ మనోభావాలు కలిగాయో మళ్ళా అవే భావాలు తలెత్తాయి. ‘వంద శరత్తులు జీవిద్దాం’ అనే వేదమంత్ర స్ఫూర్తినే వాళ్ళ జీవితాల్లో కనిపిస్తోంది. కాని బ్రాహ్మణాల్లోని సంక్లిష్ట కర్మకాండ లేదక్కడ. అష్టాంగమార్గంలో కనవచ్చే మనోదేహాల క్రమశిక్షణ ఉంది, కాని బౌద్ధంలోలాగా గృహపరిత్యాగం లేదు. జీవహింసకి దూరంగా జీవించాలన్న కాయిక, వాచిక, ఆత్మిక తపస్సు ఉంది, కాని జైనుల్లోలాగా అది తీవ్ర ఆత్మక్లేశ సాధనగా పరిణమించలేదు. ఆదివాసుల్లాగా, అడవికీ, పొలానికీ అంకితమైన జీవితమే కాని, తర్పణలూ,బలులూ లేవు.

ఈ ఇరవయ్యేళ్ళలో అలేఖ్య మహిమ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ సంఖ్య అక్కడ పెరిగిందే కాని తగ్గలేదు.

‘మీ పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళూ మీకులాగా జీవించాలనుకుంటున్నారా’ అనడిగాను.

‘వాళ్ళు హాష్టళ్ళల్లో ఉంటున్నారు కదా. అక్కడ మా ధర్మాలు పాటించడం కష్టం కదా’ అన్నారు.

కాని, వాళ్ళల్లో ఎవరేనా తిరిగి గ్రామాల్లోనే స్థిరపడితే, వాళ్ళనుసరించేది తమ తండ్రి తాతల జీవనశైలినే.

ఇరవయ్యేళ్ళకీ, ఇప్పటికీ ఆ ఊళ్ళో, వాళ్ళ జీవితాల్లో చాలా మార్పు కనిపిస్తోంది. వృద్ధులకి ప్రభుత్వం నుంచి పెన్షను అందుతోంది. కొందరు రైతులు కాఫీ పండిస్తున్నారు. గిట్టుబాటు ధర దొరుకుతోంది. వాళ్ళ ధర్మంలో ఏదైనా పగులంటూ ఉంటే, ఒకటే- పూర్వంలాగా ఇప్పుడు వాళ్ళు వడ్డీ వ్యాపారస్థుల్ని అస్పృశ్యులుగా పరిగణించడం లేదు. బహుశా, ఇది అలేఖ మహిమ ధర్మం తాలూకు ‘లిబరలైజేషన్’ అనుకోవాలేమో.

నెమ్మదిగా చీకటి దట్టమైంది. ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు సోమరిగా ఉండలేక ఆగీ ఆగీ వర్షిస్తున్నాయి. అడవుల్లోంచి ఒక ప్రాచీన నిశ్శబ్దం మా చుట్టూ కూడా అల్లుకుంది.

‘ఒక కీర్తన పాడరాదా, వినాలనుకుంటున్నాం’ అన్నాను.

‘పాటలన్నీ ఒరియాలో ఉంటాయి’ అన్నాడు బొడోభాయి.

‘తెలుసు నాకు, భీం బోయి కీర్తనలే కదా’ అన్నాను.

భీం భోయి పేరెత్తగానే బొడోభాయి కళ్ళల్లో మెరుపు.

భీం భోయి ఒరిస్సాకి చెందిన ఆదివాసి కవి. కోదు తెగకి చెందినవాడు. మహనీయ భారతీయ భక్తికవులు, నిర్గుణ పంథీకవులు, కబీర్, బుల్లేషా, వీరబ్రహ్మం ల కోవకి చెందినవాడు. భక్తిపారవశ్య మాధుర్యంలో అతడి కవిత్వం, తులసీ, తుకారాం, విద్యాపతి, పోతన, త్యాగయ్యలకి ఏ విధంగానూ తీసిపోదు. అలేఖ్య మహిమ ధర్మ సంస్థాపకుడు మహిమ గోసాయి అతడికి స్ఫూర్తి. జన్మతః అంధుడైన భీం బోయి కి మహిమ గోసాయి దృష్టి ప్రసాదించాడనీ,అయితే, బయటి ప్రపంచంలోని దుఃఖాన్ని చూడలేక, భీం బోయి తనకి మళ్ళా అంధత్వమే కావాలని కోరుకున్నాడనీ కూడా అంటారు.

నెమ్మదిగా గొంతు సవరించుకుని బొడోభాయి, ఒక కీర్తన అందుకున్నాడు. గురుచరణాలకు వందనమిస్తూ సాగే ఆ కీర్తనని అతడు పూర్తిగా అలపించేక, దాని అర్థం చెప్పవా అని అడిగాను.

అతడు ఆ ఒరియా ప్రతి ఒక్క పదానికీ తెలుగులో వివరించడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి, అకస్మాత్తుగా తట్టింది నాకు: ఆ విస్మృత గిరిజన గ్రామంలో, ఆ నిరక్షరాస్య కొటియా ప్రజల మధ్య, ఒక ఆదివాసి మాకు నిర్గుణ బ్రహ్మ విద్య బోధిస్తున్నాడని!

దూరంగా భూమినీ, ఆడవినీ, ఆకాశాన్నీ కలిపి కుడుతున్న దారంలాగా మేఘమాల. నల్లని అడవిలో హోరుపెడుతున్న ఆదిమ నిశ్శబ్దం. అతణ్ణుంచి సెలవు తీసుకుని ఆ గ్రామవీథిలో అడుగుపెట్టాను. ఆ క్షణాన నేను అరకులోయలో కూలిన శిఖరాన్ని కాదు, ఎన్నటికీ చెక్కుచెదరని శిఖరాన్ని చూసాననిపించింది.

12-8-2016

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%