అమృత స్పందనలు

ఆ ఇద్దరు స్నేహితురాళ్ళనుంచీ అంత విలువైన స్పందనలూ లభించాక ఇక నాకు ఆ కథ మీద మరొకరి అభిప్రాయం కోసం ఎదురుచూడనవసరంలేదనిపించింది. అందుకనే వార్షిక సంకలనకర్తలుగానీ మరెవరేనా గానీ ఆ కథ గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినా నాకేమీ అనిపించలేదు. ఒక రచన ఒక పాఠకుణ్ణి చేరితే చాలు అనుకుంటాను, అలాంటిది ఈ కథ ఇద్దరు పాఠకుల్ని చేరింది అనుకున్నాను.

రాముడు కట్టిన వంతెన

ఇవేళ జీడిగుంట విజయసారథి గారు తాను ఆ కథని ఒక జూమ్ సమావేశంలో చదివివినిపించామని చెప్తూ ఆ లింక్ పంపినప్పుడు ఆసక్తిగా విన్నాను. ఆయన కథ చదివి వినిపించగానే 'కథాకళ' నిర్వాహకులు, మిత్రులు తమ స్పందనలు తెలియచేసినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినంతపనైంది.