తమంతతామే పండే పొలాలూ, పాలు పొంగిపొర్లే పొదుగులూ, తేనెవాకలూ ఉండే ఒక స్వర్గం ఈ భూమ్మీద సాధ్యమనే అజ్టెక్కులు, సెల్టిక్కులు, ప్రాచీన గ్రీకులు, రోమన్లూ, ఎట్రుస్కన్లూ, వైదికఋషులూ మరెందరో కవిత్వాలు చెప్తూనే ఉన్నారు. ప్రాచీన చీనా కవి శ్రేష్టుడు తావోచిన్ తన peach blossom spring లో చిత్రించింది కూడా అటువంటి భూలోక స్వర్గాన్నే.
దివ్యానుభవం
చివరి పదికంలో మళ్ళా ఆండాళ్ చిన్నపిల్లగా మారిపోతుంది. తిరుప్పావై రోజులకన్నా చిన్నపిల్లగా. ఉల్లాసభరితురాలిగా మారిపోతుంది. పదమూడవ పదికంలో వేడినిట్టూర్పులు చిమ్మిన ఆ మోహోద్రిక్త వనిత ఎక్కడ? ఈ పసిపాప ఎక్కడ? మధ్యలో ఎమి జరిగింది?
పాడిపంటలు పొంగిపొర్లే దారిలో
పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (క్రీ.శ.9 వశతాబ్ది) రచించిన తిరుప్పావై భారతీయసాహిత్యంలోని అత్యంతవిలువైన కృతుల్లో ఒకటి. తదనంతరసాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసిన రచన. అక్కమహాదేవి, మీరా, లల్ల, మొల్ల వంటి ప్రాచీనకవయిత్రులతో పాటు సరోజినీనాయుడు, తోరూదత్, మహాదేవీవర్మవంటి ఆధునిక కవయిత్రులదాకా ఎందరో భావుకులకూ, రసపిపాసులకూ, జీవితప్రేమికులకూ ఆండాళ్ దే ఒరవడి.
