నేను తిరిగిన దారులు-10

పాపికొండల నడుమ

3

దివ్య చలనచిత్రం

మరి కొంత దూరం ప్రయాణించిన తరువాత మేం పోతవరం అన్న గ్రామానికి వచ్చాం. అక్కడ గోదావరి విశాలంగా పరుచుకుని ఉంది. విస్తారంగా మేట వేసిన ఇసుకతిన్నెల పక్కన నది, కవి ఉపమించినట్లుగా, ప్రోషితభర్తృక లానే ఉంది.

అక్కడ మమ్మల్ని ఉత్తమ్, వసంత్ అయిన్ఇంజన్‌తో నడిచే ఓ పెద్ద పడవ ఎక్కించారు. ఆ కప్పు పైన కూడా కూర్చునే వీలు ఉంది. అది ఓ కొండరెడ్డి గ్రామానికి ప్రభుత్వం ఇచ్చిన పడవ అట. పడవ ఎక్కుతుండగా మాస్టారు చెప్పారు. ‘ఇక్కడ్నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాక పేరంటపల్లి గ్రామం వస్తుంది. అక్కడి నుంచే పాపికొండలు వరస ప్రారంభం. మరో రెండు గంటల తర్వాత మనం కొండమొదలు గ్రామానికి చేరుతాం. అక్కడితో పాపికొండల కనుమ ఆఖరవుతుంది.’

‘ఆ పైన’ అని అడిగాను నేను. ‘అక్కణ్ణుంచి ఇంకా అయిదారు గంటల ప్రయాణంలో రాజమండ్రి. పాపికొండల్ని చూడాలని రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు పేరంటపల్లి దాకానూ, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు కొండమొదలు దాకానూ ప్రయాణం చెయ్యవచ్చు’ అన్నారు.

పడవ ప్రయాణం మొదలవుతుండగానే బ్రేక్ ఫాస్ట్. కూనవరంలో కట్టించిన పెసరట్లు చల్లారినా ఎంతో రుచిగా ఉన్నాయి. పడవ కొంత దూరం వెళ్ళాక ఎడమవైపు దూరంగా కనిపిస్తున్న పల్లెని చూపిస్తూ. ‘ఇది కొల్లూరు కొండరెడ్డి పల్లె. ఎన్నో వరదల్లో మునిగి తేలిన గ్రామం’ అన్నాడు వసంత్.

మరికొంత దూరం సాగిన తర్వాత అప్పటికి నది నెమ్మదిగా నన్ను వశపరచుకోవడం మొదలు పెట్టింది. ‘సరితలన్నిటిలోకి శ్రేష్ఠమైందని అన్నాడు దీన్ని వాల్మీకి’ అన్నారు మాష్టారు. ఒక చోట నీలంగా, ఒక చోట ఎమరాల్డ్, ఎండ పడుతున్న చోట రజతకాంతితోనూ మిలమిలలాడుతున్న ఆ జలాలు స్థిమితంగా, ఉద్వేగరహితంగా, కవి మాటల్లోనే చెప్పాలంటే, మంచిమనిషి అంతరంగంలా ఉన్నాయి.

పడవ మలుపు తిరుగుతున్న చోట ఉత్తమ్ దూరంగా కొండలపైన కనిపిస్తున్న గ్రామాన్ని చూపిస్తూ, ‘అదే పేరంటపల్లి. ఇక్కణ్ణుంచే పాపికొండలు మొదలవుతున్నాయ’న్నాడు.

పాపికొండల్ని చూడడం ఒక అనుభవం. అవి వాల్మీకి వర్ణించినట్లుగా ఏనుగుల్లా ఉన్నాయనో, భూమిని చీల్చుకు వచ్చిన పర్వతాల్లా ఉన్నాయనో అనుకోవడంలో తృప్తి లేదు. వాటి ఉనికిలో భూమి ఆవిర్భావంలోని ఉద్వేగభరితక్షణమేదో ఉంది. వాటి ఆకృతుల్లో అదృశ్య దైవహృదయంలోని కాల్పనికకౌశలమేదో ఉంది.

ఆ పాపికొండల కనుమలో మలుపు తిరిగిన గోదావరిలో కొండమొదలు వెళ్ళేదాకా ఒక గంటన్నరా, తిరిగి వచ్చేటప్పుడు ఒక గంటన్నరా నువ్వు ఏం చేశావు, ఏం చూశావు అని అడిగితే ఆ ప్రశ్నలకు అర్థం లేదు. చేయడం, చూడడమనేది ఏదో ఒక సాంఘికసందర్భానికి జీవితాన్ని అనువుగా చేసుకోవడం కోసం అన్వయించిన మాటలు. కానీ, జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. అవి నీకై నువ్వు జీవించేవి. నీవు జీవించినట్టుగా నీ అస్తిత్వం నీకు ఎరుకపడేవి. అటువంటి భద్రక్షణాలని నీకు గుర్తు చేసే మహత్తరఅస్తిత్వాన్ని ఈశ్వరసృష్టి అక్కడక్కడా ప్రతిష్ఠించి ఉంటుంది. ఆ మహత్తర ప్రగాఢపర్వతరాశి మలుపు మలుపుకీ తెలుపు, నీలం, ఆకుపచ్చ, పసుపురంగుల్తో దివ్య చలనచిత్రాన్ని నా ముందు ప్రదర్శించింది.

ఆ కొండల్ని అర్థం చేసుకోవడానికి రకరకాల పోలికల కోసం ప్రయత్నించాను. ఆ జలరాశి ఒక సరస్సనీ, ఆ కొండలు పెద్దసరస్సులో నీళ్ళు తాగడానికి వచ్చిన ఏనుగు మందలనీ అనుకోవడం కూడా బాగుంది. అవి నదీవాద్యం పైన నిరంతరంగా వినిపిస్తున్న సంగీత తరంగాలని అనుకోవడం కూడా సంతోషాన్నిచ్చింది.

‘ఇవేవీ కావు, అవి కొండలే. వాటి మధ్య నదిలో నేను ప్రయాణిస్తున్నాను’ అని అనుకున్నా ఆ స్ఫూర్తి కలిగిస్తున్న విద్యుత్ నాలో అంతబలంగానూ ప్రకంపిస్తూనే ఉంది. అంతులేని నీలజలరాశి, అవధి లేని కొండలవరస మత్తెక్కించిన నా కళ్ళకు మానవసంరంభాన్ని చూపించాలని కాబోలు మాస్టారు కొండమొదలు సంతకు తీసుకెళ్ళారు.

ఎండకు వేడెక్కిన ఇసుకలో అడుగు తీసి అడుగు వేసుకుంటూ రేవు దగ్గర మెట్లెక్కుతుండగా అక్కడి అపరిశుభ్రతను చూసిన నా కళ్ళల్లో ఏ విసుగు కనిపించిదో కానీ, మాష్టారన్నారు కదా, ‘నదుల పరిశుభ్రతే కాదు, రేవుల అపరిశుభ్రత కూడా కలిస్తేనే దాన్ని ప్రపంచమంటాం’

కొండమొదలు చిన్న గిరిజన గ్రామం. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వస్తుంది. అక్కడ ఆదివారం సంతలో పోలవరం, రాజమండ్రి, కాకినాడ నుంచి పొగాకు, చేపలు, తినుబండారాలు, వంటపాత్రలు అమ్మే చిన్న చిన్న వర్తకులు దుకాణాలు తెరిచి పెట్టారు. చుట్టపక్కల గ్రామాల నుంచి వచ్చిన కోయలు, కొండరెడ్లు వారానికి సరిపడా సామాన్లు అక్కడ కొనుగోలు చేస్తున్నారు. ఒక చోట క్షవరాలు నడుస్తున్నాయి. మరో అంగళ్ళో సినిమా తారల బొమ్మలు, దేవుడి బొమ్మలతో కలిసి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. స్కార్ఫ్ మెడలో ధరించి, కొత్త టీ-షర్ట్ ఒక గిరిజన యువకుడు సారాఅంగడి ముందు తూలుతున్నాడు. మాస్టారు అతన్ని పలకరించారు అనునయంగా. ఆ పలకరింపు అతని పసి హృదయాన్ని సూటిగా తాకి ఉంటుంది. ఆ యువకుడు తన జేబు నుండి బీడీ కట్ట తెరిచి మాస్టారికొక బీడీ ఆఫర్ చేశాడు.

పడవ తిరుగుప్రయాణంలో కొల్లూరు గ్రామం దగ్గర ఆగాం. రెండు కొండల మధ్య ఆకుపచ్చని లోయలో శరత్కాలపు ఉసిరిచెట్టులాగా ఉంది ఆ ఊరు. అక్కడొక చిన్న గిరిజన ఆశ్రమపాఠశాల. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు గారు ఆ చిన్ని పల్లె చుట్టూ మమ్మల్ని తిప్పి చూపారు.

ఆయన చెప్పారు – ఒకప్పుడు కొండరెడ్లు వేట మీదే బతికేవారు. ఈ లోపల అడవి అంతా అడవిదున్నల మందల అరుపులతో హోరెత్తేవి. ఇప్పటికీ చిరుతపులులు ఊళ్ళోకి వస్తుంటాయి. కానీ, ఇప్పుడు కొండరెడ్ల జీవనపరిస్థితుల్లో ఎంతో మార్పు. వాళ్ళిప్పుడు వ్యవసాయంలోకి ప్రవేశించారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న యువతీయువకులు ముఫ్ఫై మందిదాకా ఉంటారు.

ఆయన మమ్మల్ని కదల అనసూయ అనే రైతుకి పరిచయం చేశారు. ఆమె ఒకప్పుడు పోడు చేసేనేలలో ఇప్పుడు రెండెకరాల జీడిమామిడి తోట పెంచుతున్నారు. కొండ కింది తన ఒక ఎకరం నేలలో వేరుశెనగ వేశారు. స్త్రీలు చరిత్ర సృష్టించాలని కోరుకునే నా మిత్రులకు ఈమె గురించి చెప్పాలనిపించింది. అభినందనపూర్వకంగా ఆమెకు షేకహ్యాండ్ ఇచ్చాను.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 1986లో వచ్చిన వరద గురించి చెప్పారు. అప్పుడు ఆ గ్రామం, తన పాఠశాల పూర్తిగా మునిగిపోయాయట. వాటి మించి లాంచీలు తిరిగాయట. వారం రోజుల పాటు గ్రామస్థులు, పిల్లలు-అందరూ కొండ మీద, చెట్ల కింద గడిపారట.

‘ఇప్పుడు ఇక్కడ మీ ప్రధానసమస్య ఏమిటి’ అని అడిగాను ఆ ప్రధానోపాధ్యాయుణ్ణి. ఆయన సమాధానం విని ఆశ్చర్యపోయాను.

తమ అతి పెద్దసమస్య మంచినీళ్ళు అని చెప్పారాయన. ఇసుకమేట వల్ల నది దూరంగా జరిగిపోయిందనీ, గ్రామంలో ఒక్క మంచినీటి బోరు కూడా పడలేదనీ, రోజూ నదికి వచ్చి నీళ్ళు తీసుకుపోవడం కష్టంగా ఉందనీ చెప్పారాయన.

4

స్వామి బాలానంద

తిరుగు ప్రయాణంలో మేము పేరంటపల్లికి వచ్చేటప్పటికి ఎండ బాగా చల్లబడింది. నెమ్మదిగా చలిగాలులు మొదలయ్యాయి. పేరంటపల్లి రేవు ఎక్కుతుండగా మాస్టారు చెప్పడం మొదలు పెట్టారు.

‘ఈ గ్రామం కొండరెడ్ల జీవితంలో కొత్తఅధ్యాయం తెరిచిన గ్రామం. నాగరికతకు దూరంగా బతుకుతున్న జాతిలో, కలపవర్తకుల చేతిలో మోసపోతున్న గిరిజన జీవితాల్లో ఈ గ్రామం వెలుగు తీసుకువచ్చింది. ఇక్కడ ఒకప్పుడు స్వామి బాలానంద అనే సాధువు ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆయన ఇక్కడ పని చేస్తున్న ఫారెస్ట్ ఉద్యోగుల పైన ఆధ్యాత్మిక  ప్రభావం చూపి కొండరెడ్ల సంక్షేమం కోసం ఆలోచించేటట్టు చేశారు. వారితో ఏర్పరచిన ‘పావర్టి రిలీఫ్ సొసైటి’ కొండరెడ్ల కోసం చేపట్టిన మొదటి పెద్ద సహకారోద్యమం.

‘ఆయన అటు నిజాంతోనూ, ఇటు మద్రాస్ ప్రెసిడెన్సీతోనూ చేసిన సంప్రతింపుల వల్ల కొండరెడ్ల జీవితాల్లో దీర్ఘకాలిక మార్పు తీసుకు రాగలిగారు. నిజాం కోరిక మేరకు హైదరాబాద్ రాష్ట్రంలోని గిరిజనుల స్థితిగతులను హైమండార్ఫ్ అధ్యయనం చేసిన సంగతి నీకు తెలుసు. అందులో కొండరెడ్ల పైన ఆయన చేసిన స్టడీ వెనుక పేరంటపల్లి సాధువు ప్రభావం చాలా ఉంది’

మేం గ్రామంలో అడుగు పెట్టగానే మా ఎదుట ప్రశాంతమైన ఆలయం ఎదురైంది. ‘శ్రీ రామకృష్ణ మునివాటము’ అన్న పేరున్న ఆ ఆశ్రమంలో ఆలయగోపుర శిఖరంలో ఒకవైపు సిలువ, ఒకవైపు స్వస్తిక, మరొక వైపు ఓంకారం, క్రిసెంట్, ఇంకొకవైపు పారశీకుల జ్వాలా కలశం కనిపించాయి.

ఆ ఆలయం చుట్టూ అరటి తోటలు, బంతిపూలూ, ఆలయం పక్కన సన్నని మర్మర ధ్వనితో కొండవాగు జలపాతం. మేము చల్లని ఆ నీళ్ళ దగ్గర కాళ్ళు, చేతులు కడుక్కోగానే అంతదాకా ఆవరించిన అలసటంతా మంచులాగా తొలగిపోయింది. అక్కడ రామకృష్ణ పరమహంస, వివేకానందుల మందిరాలు కూడా ఉన్నాయి. మాకు ఆశ్రమనిర్వాహకులు స్వామి బాలానంద జీవిత విశేషాలున్న కొన్ని రచనలు అందించారు.

ఆ రచనలను ఆత్రంగా తిరిగేస్తున్న నాకు ఒక చోట హైమండార్ఫ్ రాసిన రచనలలోని ఉల్లేఖనాలు కనిపించాయి. ‘ది రెడ్డిస్ అఫ్ బైసన్ హిల్స్’ (1945)లో స్వామి గురించి హైమండార్ఫ్ రాసిన కొన్ని భాగాలు అక్కడున్నాయి. విముక్తుడైన ఆ మనిషి గురించి, అదిమ గిరిజనజాతి ఆరోగ్యం, స్వావలంబన, జనసంఘటనల గురించి, ఆ సాధువు చేపట్టిన ఉద్యమం గురించి హైమండార్ఫ్ చేసిన ప్రస్తుతి చదువుతుంటే నా మనసంతా ఆర్ద్రమైపోయింది.

పేరంటపల్లి నుండి బయలుదేరేటప్పటికే సాయంసంధ్య అరుణిమ నదీజలమంతటా ఆవరించింది. మేం పోచవరం చేరేటప్పటికి ఆకాశమంతా చుక్కల వెలుతురు. దూరంగా కొయిదా గ్రామం దీపాలు మెరుస్తున్నాయి. మాస్టారన్నారు కదా, ‘మన యాత్ర ఇంకా ముగిసిపోలేదు. మనం కూనవరం వెళ్ళేటప్పటికి వెన్నెల వస్తుంది. నీ కోసం వెన్నెల్లో కొంచెంసేపు పడవప్రయాణం వేచి ఉంది.’

ఆ రాత్రి వెన్నెల్లో శబరినది ఒడ్డున మా కోసం నావ సిద్ధంగా ఉంది. పడవవాళ్ళు నా హృదయం గ్రహించినట్టే ప్రయాణాన్ని శబరీ గోదావరీ నదుల సంగమం వైపు నడిపించారు. అనంతకాలం నుంచి ప్రవహించి కలుస్తున్నట్టే ఆ నదులు మళ్ళీ మా కోసం ఆ వెన్నెల్లో సంగమిస్తున్నాయి. నేలా, ఆకాశం, నదీ సంగమం వెన్నెల్లో ఒకటైపోయాయి.

హృదయస్పందన తప్ప మరే శబ్దానికీ అక్కడ చోటు లేదు. జీవించడమే, జీవించి ఉన్నందుకు నిండుగా సంతోషించడమే. అందులో ఆత్మను పునీతం చేసుకోవడమే. మరే కర్తవ్యమూ లేని మరవలేని క్షణాలవి.

‘ఏ సంగమమైనా పవిత్రస్థలం’ అని మాస్టారు నదీ జలాల్ని నెత్తిన చల్లుకున్నారు. ఆయన్ని చూసి ఉత్తమ్, వసంత్ కూడా నెత్తిన నీళ్ళు చల్లుకున్నారు.

నాకా రోజు ఉదయం నుంచీ నేను చూసిన ప్రతి స్థలం ఒక సంగమమనే అనిపించింది. దార్లపల్లి గిరిజనజనావాసం, కొండమొదలు సంత, పేరంటపల్లి ఆశ్రమం, కొల్లూరు పాఠశాల ప్రతి స్థలం- శబరి స్రవంతి, ప్రధాన స్రవంతితో సంగమిస్తున్న చోటుగానే ఉంది. ఆ వెన్నెల్లో నేను చూసినది, కవి చెప్పినట్టు కేవలం ‘స్థల రామణీయకం’ లేదా ‘జల రామణీయకం’ మాత్రమే కాదు, అన్నిటినీ మించిన తాదాత్మ్యంలోని రామణీయకమిది.

ఏ రాత్రికో భద్రాచలం చేరాం. కానీ, గోదావరిపైన సూర్యోదయాన్ని చూడాలన్న నా కోరిక నన్ను నిద్రపోనియ్యలేదు. మాస్టార్ని నిద్రపోనివ్వలేదు.


In the Lap of Papikondalu

3

A Divine Panorama

After traveling a little further, we arrived at a village called Pothavaram. There, the Godavari stretched out wide and expansive. Beside the vast sandbars that had silted up, the river lay tranquil—looking, as the ancient poets would describe, like a woman pining in separation from her beloved (proshitabhartrika).

There, Uttam and Vasanth helped us board a large boat powered by an oil engine. It had a flat roof where one could sit and take in the view. We were told it was a boat provided by the government to a Konda Reddy village. As we boarded, Master explained: “A little further from here lies the village of Perantalapalli. That is where the range of Papikondalu begins. After another two hours, we will reach the village of Kondamodalu. That marks the end of the Papikonda gorge.”

“And beyond that?” I asked.

“From there, Rajahmundry is another five to six hours by water,” he replied. “Those traveling from Rajahmundry to see the Papikondalu can travel up to Perantalapalli, while those heading down from this side can journey up to Kondamodalu.”

As our voyage began, we sat down for breakfast. The pesarattus packed for us at Kunavaram were delicious, even though they had gone cold. Once the boat had moved some distance, Vasanth pointed to a village visible far away on the left bank: “That is the Konda Reddy hamlet of Kolluru—a village that has weathered and risen out of countless floods.”

As we drifted onward, the river gently began to hold me under its spell. “Valmiki hailed this as the foremost among all sacred streams,” Master said. Shimmering deep blue in one spot, emerald green in another, and glinting like pure silver where the sunlight caught the crests, those waters flowed placid, steady, and devoid of agitation—resembling, in the poet’s own imagery, the serene inner mind of a noble soul.

Where the river curved, Uttam pointed to a village nestled high upon the hills in the distance: “That is Perantalapalli. The Papikondalu begin right from here.”

Beholding the Papikondalu is an experience in itself. There is little satisfaction in simply describing them, as Valmiki did, as resembling herds of wild elephants or mountains bursting through the crust of the earth. In their very presence, one feels a primal, passionate moment from the dawn of creation. In their contours rests the boundless imaginative artistry of an unseen divine heart.

If someone were to ask what you did or what you saw during that hour and a half winding through the Papikonda gorge to Kondamodalu, and the hour and a half on the return journey, the question itself loses all meaning. “Doing” and “seeing” are merely transactional words invented to fit life into conventional social molds. But there are rare moments in life that you live entirely for yourself—moments where your very consciousness awakens to its own existence. To remind us of such sacred, sheltered moments, Divine Creation has consecrated such monumental forms across the earth. With every bend in the river, that massive, profound mountain range unfurled a divine panorama before my eyes, painted in hues of white, azure, lush green, and gold.

I tried grasping those hills through various metaphors. Imagining that vast body of water as an expansive lake and the hills as a herd of elephants gathering to drink felt apt. Thinking of them as endless waves of music resonating across the instrument of the river also brought joy.

“None of these—they are simply hills, and I am traveling on a river between them,” I told myself, yet the electrifying current stirring within me continued to thrum with undiminished power. Perhaps hoping to temper my entranced gaze—intoxicated by the endless expanse of blue waters and limitless ranges—with the warmth of human commotion, Master took me to the weekly village market (santa) at Kondamodalu.

Treading through the sun-warmed sand as we climbed the steps at the boat landing, Master noticed a passing shadow of discomfort in my eyes at the untidiness around the ghat. He smiled and observed gently: “It is not just the pristine purity of rivers, but also the untidy bustle of river landings that together make up the world.”

Kondamodalu is a small tribal village falling under the jurisdiction of East Godavari district. In that Sunday market, small traders from Polavaram, Rajahmundry, and Kakinada had set up stalls selling tobacco, fish, dry snacks, and cooking utensils. Koyas and Konda Reddys from surrounding hamlets had gathered to purchase their weekly provisions. In one corner, barbers were busy at work. In another stall, glossy posters of film stars hung for sale right alongside pictures of deities. Wearing a scarf around his neck and a crisp new T-shirt, a young tribal man swayed tipsily before a country-liquor stall. Master greeted him with tender affection. That gentle warmth must have touched the young man’s innocent heart directly; reaching into his pocket, he opened a pack of beedis and offered one to Master.

On our return journey, our boat made a stop at Kolluru. Nestled in a verdant valley between two hills, the village looked like an autumn amla tree in full bloom. It housed a small tribal ashram school. The headmaster of the school, Sri Venkateswara Rao, took us around that tiny settlement.

He told us that Konda Reddys had once lived entirely by hunting. In those days, the inner forests continuously echoed with the deep bellowing of wild bison herds. Even now, leopards occasionally stray into the village. Today, however, the lives of the Konda Reddys have transformed significantly. They have taken to agriculture, and nearly thirty young men and women from the village have studied up to the Intermediate level.

He introduced us to a woman farmer named Kadala Anasuya. On land where she once practiced shifting cultivation (podu), she now tends a flourishing two-acre cashew orchard. On an acre of land at the base of the hill, she has sown groundnuts. Feeling an urge to tell my friends—who champion women making history—about her quiet triumph, I shook her hand in admiration.

The headmaster then recalled the catastrophic floods of 1986. Back then, the entire village and his school were submerged under water, with motorized river launches sailing right above them. For a whole week, the villagers and children took shelter atop the hill, living beneath the canopy of trees.

“What is your primary problem here today?” I asked the headmaster.

His answer caught me by complete surprise.

Their single greatest problem, he explained, was drinking water. Because of heavy sand siltation, the river course had shifted far away. Not a single borewell in the village had struck sweet water, making it a daily ordeal for the residents to walk all the way to the river just to fetch water.

4

Swami Balananda

By the time we reached Perantalapalli on our return journey, the heat of the sun had mellowed pleasantly. A cool breeze had begun to stir. As we climbed the steps of the Perantalapalli landing, Master began to explain:

“This village opened a new chapter in the life of the Konda Reddys. For a community living far removed from modern civilization and suffering exploitation at the hands of timber contractors, this settlement brought a dawn of light. A monk named Swami Balananda once established an ashram here. Exercising a deep spiritual influence over the forest officials working in this region, he inspired them to care for the welfare of the Konda Reddys. The ‘Poverty Relief Society’ he founded with their cooperation was the very first major cooperative movement undertaken for these indigenous people.”

“Through his tireless representations with both the Nizam’s government and the Madras Presidency, he brought lasting transformation to their lives,” Master continued. “As you know, at the Nizam’s behest, Professor Haimendorf studied the living conditions of the tribal communities in Hyderabad State. The influence of this sage of Perantalapalli is prominently woven throughout his study of the Konda Reddys.”

The moment we stepped into the village, a serene temple greeted us. In that sanctuary, known as Sri Ramakrishna Munivatamu, the spire atop the temple tower bore the symbols of universal faith—a Christian cross on one side, a Swastika on another, the sacred Omkara and Islamic crescent alongside, and the flaming urn of the Zoroastrians on yet another.

Around the temple lay lush plantain groves and beds of marigolds; right beside it, a mountain brook cascaded into a waterfall with a gentle, murmuring music. The moment we washed our hands and feet in those cool waters, all our lingering fatigue melted away like morning mist. Shrines dedicated to Sri Ramakrishna Paramahamsa and Swami Vivekananda also grace the precinct. The ashram caretakers presented us with a few writings chronicling the life and work of Swami Balananda.

As I eagerly leafed through those texts, I came across excerpts from Haimendorf’s writings. Pages from The Reddis of the Bison Hills (1945) paid tribute to the Swami. Reading Haimendorf’s deep admiration for this liberated soul—and for the movement the sage spearheaded for the health, self-reliance, and social solidarity of this indigenous tribe—my heart was deeply moved.

By the time we departed from Perantalapalli, the crimson glow of twilight had spread across the entire river. Night had set in and the sky was blanketed in starlight as we reached Pochavaram. Far away, the lights of Koida village sparkled.

Master smiled and said, “Our journey is not over yet. By the time we reach Kunavaram, the moon will have risen. A quiet boat ride in the moonlight awaits you.”

That night, bathed in silver moonlight, a boat stood waiting for us on the banks of the Sabari. As if intuiting the longing in my heart, the boatmen steered our craft toward the confluence of the Sabari and the Godavari. As though they had been flowing and merging since the beginning of time, the two rivers embraced once again in the moonlight, solely for our sake. Earth, sky, and the sacred confluence melted into one silver radiance.

There was no room for any sound other than the quiet beating of the heart. Just to be alive, to feel boundless joy in the mere fact of existence, and to cleanse the soul in that stillness—these were unforgettable moments, free from any other worldly purpose.

“Every confluence is sacred ground,” Master said, sprinkling drops of the river water upon his head. Following his example, Uttam and Vasanth also sprinkled the waters reverently over their heads.

To me, every place I had visited since that morning felt like a sacred confluence. The tribal settlement of Darlapalli, the weekly village market at Kondamodalu, the ashram at Perantalapalli, the school at Kolluru—each seemed a quiet tributary like the Sabari, flowing into and embracing the great mainstream of life. What I witnessed in that moonlit stillness was not merely the scenic charm of landscape or water, but a sublime beauty born of profound oneness and communion (tādātmya).

We reached Bhadrachalam late into the night. Yet the longing to witness the sunrise over the Godavari kept me awake—and kept Master awake as well.

1-9-2026

2 Replies to “నేను తిరిగిన దారులు-10”

  1. In the Lap of Papikondalu

    (Typographical error in the heading to be corrected, sir)

    Reading Haimendorf’s deep admiration for this liberated soul—and for the movement the sage spearheaded for the health, self-reliance, and social solidarity of this indigenous tribe…

    Great souls strived for our upliftment, sir.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading