ఈ కాలమే అలాంటిది

లెక్కపెట్టాను. మొత్తం పందొమ్మిది.
నాసరరెడ్డి పందొమ్మిది కవితల్లాగా
పందొమ్మిది గులాబి మొక్కలు.

దేశాన్నుద్ధరించే సోషల్ మీడియాలోంచి
చేతులు ఎగజాపి బయటికొచ్చాను
పాడుపడ్డ బావిలోంచి బయటపడ్డట్టు.

మొక్కలచుట్టూ గడ్డకట్టిపోయిన మట్టి-
గాలిచొరబడాలంటే గుల్లబరచాలి.
నా చేతివేళ్ళు వానపాములై ఉండాల్సింది.

డిసెంబరు గులాబీల మాసం కాదు
అయినా ఈ మట్టిలో ఈ మొక్కల వేళ్ళు
నిద్రపోటం లేదని గుర్తుపట్టాను.

ఇవి కూడా మార్గశిరాన్ని పీలుస్తున్నాయి
మంచుని ధిక్కరించి చేతులు ఎగజాపి
పూలై తలెత్తాలని వీటికెంత ఆరాటం!

ఈ కాలమే అలాంటిది. ఇప్పుడు నువ్వు కూడా
నీ రోజువారీ ఇంద్రియాల్ని పక్కనపెట్టి
వ్యోమగామిదుస్తులు ధరించక తప్పదు.

15-12-2025

10 Replies to “ఈ కాలమే అలాంటిది”

  1. ఈ కవితలో కవి ప్రకృతి, కాలం, మనిషి అంతర్గత పోరాటాన్ని ఒకే ప్రవాహంగా చూపించారు . పందొమ్మిది గులాబీ మొక్కలు నాసరరెడ్డి పందొమ్మిది కవితలతో పోల్చడం ద్వారా సృజన కూడా జీవం లాంటిదే అని సూచించారు. సోషల్ మీడియా నుంచి బయటకు రావడాన్ని పాడుపడ్డ బావి నుంచి బయటపడినట్లు చూపడం ఈ కాలం మనల్ని ఎంతగా అలసటకు గురి చేస్తుందో బలంగా చెప్పింది. మట్టిని గుల్లబరచడం, చేతివేళ్లు వానపాముల ఉండాల్సిందన్న భావన మార్పు కోసం మనిషి శ్రమించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. డిసెంబరు కాలమైనప్పటికీ గులాబీ మొక్కలు నిద్రలేని వేళ్లను గమనించడం ఆశకు ప్రతీకగా నిలుస్తోంది. మంచును ధిక్కరించి పూలై తలెత్తాలన్న మొక్కల ఆరాటం మనిషి లోపలి జీవన తపనతో సమానంగా అనిపిస్తుంది. చివరికి ఈ కాలంలో బ్రతకాలంటే సాధారణంగా కాకుండా, వ్యోమగామిలా అప్రమత్తంగా జీవించాల్సిన పరిస్థితి ఉందని కవి భావోద్వేగంగా వ్యక్తపరిచారు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading