మంత్రమయపవనం

ఇంకా తెల్లవారకుండానే తలుపు తెరిచి చూస్తే-
బాల్కనీలో గులాబిమొక్కల్ని లాలిస్తున్న గాలి.

తల్లికడుపులో దూరిమరీ పడుకున్న కుక్కపిల్లల్లాగా
గాలి చేతుల్లో ఒదిగి కనులరమోడ్చిన మొగ్గలు.

ఊయెల్లో కనులరమోడ్చి తన తలపుల్లో తేలియాడే
బిడ్డను నలుగురికీ పిలిచి మరీ చూపించే తల్లిలా-

ఆ మొక్కల దగ్గరికి అయితే సమస్త ప్రపంచంతో
లేదా నేనొక్కణ్ణే పోయి నిలబడాలని తెలుస్తున్నది.

ఎక్కడో దూరంగా నడుస్తున్న సంకీర్తన నెమ్మదిగా
నీ ఇంటిదిక్కు మళ్ళినట్టు మరికాసేపట్లో ప్రభాతం.

అడవి వార కొండవాగులో పాదాలు మోపగానే
ఓషధులు నీ పాదాల్ని చుట్టుకున్నట్టు ఒక ధన్యత.

నా పసితనాన పిల్లలం మాకు బాగోలేదన్నప్పుడల్లా
మా అమ్మ ఒకామెతో మాకు మంత్రం వేయించేది.

కావిరంగుచీర కొంగు, నుదుటన తిరుచూర్ణం,
ఆ వైద్యురాలి దగ్గర ఏదో పురాతన గృహాల వాసన.

పొయ్యి రగిలించడానికి పొగగొట్టం ఊదినట్టు
ఆమె నోరు సున్నాలాగా చుట్టి గాలి ఊదేది.

నా మొహంలో మొహం పెట్టి పైకీ కిందకీ ఆమె
ఊదినంతసేపు గాలి ఊదాక ప్రాణం తేలికపడేది.

ముణగదీసుకు పడుకున్న ఈ కుక్కపిల్లల చుట్టూ
ప్రత్యూషపవనం లాలనగా జపిస్తున్న మంత్రం.

పూలమొగ్గలకు స్వస్థత. పూల మొక్కలకు స్వస్థత.
ఆ క్షణాల్లో అక్కడున్నందుకు నాక్కూడా స్వస్థత.

15-6-2025

12 Replies to “మంత్రమయపవనం”

  1. సమస్త ప్రపంచానికి అవసరమైన “స్వస్థత“
    🙏🏽

  2. ప్రాక్తనానుభవ పల్లెపరిమళం , నవ్యమై దివ్యమై
    మన వెంబడే వస్తున్న వర్ణచిత్రమై , మాంత్రిక స్వరమై , గుండె అడుగు పొరల్లో అదిమిపెట్టిన
    పూవు పుట తెరచినట్లు .ఎంత కమనీయమో , ఎంత మనసు వీడని బాల్యచాపల్యమో . మీకు నమస్సులు .

  3. ప్రత్యూషమెప్పుడూ పదిలంగా దాచకున్న జ్ఞాపకమే… 💛🧡

  4. మధురం.. మీకే సాధ్యమైన కొన్ని దృశ్యా దృశ్య రూపకల్పన..

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading