
ఆ ఉత్తరంలో రెండుపేజీలు చదివానో లేదో
మధ్యలో ఖాళీకాగితంలాగా గ్రీష్మ ఋతువు.
రంగుపోగొట్టుకున్న అక్షరాలు, దానిమీద
ఒక వానజల్లు పడితే తప్ప తేటపడవు.
మూలభాషకి దూరంగా జరిగిన అనువాదంలాగా
ఈ నగరం, ఈ వీథులు, ఇక్కడి దైనందిన జీవితం
ఒక పురాణపాత్రలాగా జీవించాను మొన్నటిదాకా
ఆరునెలలు పాతాళంలో, ఆరునెలలు భూమ్మీదా.
నెమ్మదిగా తెలుస్తున్నది, నేను నడుస్తున్నదారి
ఏకకాలంలో కంటక వికీర్ణం, కుసుమ విశీర్ణం.
స్నేహితులుంటే ఉత్తరాలు రాసిఉండేవాణ్ణి, ఇప్పుడు
లోకంతో మాట్లాడాలంటే కవిత ఒక్కటే దారి.
మండుటెండల్లో తురాయిచెట్టు నేర్పిన పాఠమిది
నీ గుండె బద్దలయితే దారంతా పూలు చిమ్మాలి.
4-6-2025


ఏదో వాక్యం కోట్ చేద్దామనుకుంటే ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి . గ్రీష్మస్మరణ పూలతో ముళ్లతో . శుభోదయం .
” నీ గుండె బద్దలైతే దారంతా పూలు చిమ్మాలి” నమస్కారాలు సార్.
“మూలభాషకి దూరంగా జరిగిన అనువాదంలాగా”
“రంగుపోగొట్టుకున్న అక్షరాలు”
“లోకంతో మాట్లాడాలంటే కవిత ఒక్కటే దారి.”
“తురాయిచెట్టు నేర్పిన పాఠమిది
నీ గుండె బద్దలయితే దారంతా పూలు చిమ్మాలి”
Sir, your expression to convey the depth of experience and emotion is truly matchless.
Just the right words, in just the right way.
చేరవలసిన హృదయానికి చేరితే మాటలు ఇట్లానే పరిమళిస్తాయి.
కంటక వికీర్ణం.. కుసుమ విసీర్ణం..
అద్భుతం.. ఈ వాక్యంలో వంద గ్రంథాలున్నాయి సర్.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
వత్సర పొత్తంలో రెండు పేజీల కావల దివాకరుని ప్రకాశ మాయ ప్రకృతి తో బాటు మనస్సుని ఖాళీ కాగితమే చేస్తుంది . మూల భాషకి దూరంగా జరిగిన అనువాదం జీవంలేని కృత్రిమ నగరానికి సారూప్యం..ఆహా….
కంటక వికీర్ణం, కుసుమ విశీర్ణం. ఏకకాలంలో…
గుండె పగిలినా తురాయి చెట్ల మల్లె పూలు వెదజల్లడం…బహుశా ఇది పరిణతి చెందిన వ్యక్తిత్వ ప్రతీక నా గురువుగారు…
నిజమే లోకంతో మాట్లాడాలంటే కవిత ఆలంబనే..ఐనా మీవంటి శేముషీ సంపన్నులతో ఉత్తరాల భాగ్యం కూడా అమూల్య పాఠం వంటిదే..నమస్సులు సర్..
ప్రస్తావన
‘వందనం ‘ చెప్పడం తప్ప, మరో మాట లేదు రాదు
ధన్యవాదాలు సార్!