హొకుసాయి తెలుసు కద!

హొకుసాయి తెలుసు కద! జపాను చిత్రకారుడు
బహుశా ఆ కెరటాల బొమ్మ చూస్తే గుర్తుపడతారు.

ఆ కెరటాల్ని అతడు ఏదో ఒక్కసారి కాదు
జీవితకాలం పాటు చిత్రిస్తూనే ఉన్నాడు.

ముప్ఫైమూడేళ్ళప్పుడు గీసిన బొమ్మలో
కెరటంకన్నా తీరం పెద్దదిగా కనిపిస్తుంది.

నలభైనాలుగేళ్ళప్పుడు గీసిన బొమ్మలో
కెరటాలమధ్య ఓడమీదనే ధ్యాసపెట్టాడు

మూడేళ్ళ తర్వాత మళ్ళీ గీసాడు
అప్పుడు కూడా కెరటాలున్నాయి, ఓడకూడా ఉంది.

డెబ్భై రెండేళ్ళకు మళ్ళా గీసాడు
ఇప్పుడు మరేమీ కనిపించవు, కెరటాలు, కెరటాలు తప్ప.

ఇరవయ్యేళ్ళ వయసులో కోకిలమీద రాసినప్పుడు
కాలం దేశం నన్నంటిపెట్టుకునే ఉన్నాయి.

నడివయసులో అడుగుపెట్టాక రాస్తే
కోకిలతో పాటు అడవీ కొండా వచ్చేశాయి.

ఇప్పుడు అరవై రెండేళ్ళ వయసులో
అడవిలేదుగాని అణచుకోలేని ఆవేదన ఉంది.

పదేళ్ళు వేచి చూస్తాను అప్పుడు రాయగలనేమో
కోకిల తప్ప మరేదీ వినిపించని కవితని.

19-4-2025

10 Replies to “హొకుసాయి తెలుసు కద!”

  1. Sir, Hokusai’s art gradually showing that shift from surface level reality to deeper perspectives demonstrates to us that it is a life long practice to achieve that profound understanding of nature and being one with it.
    Thank you for showing Hokusai in this philosophical view. Have seen the painting but didn’t know about the artist.

    “ కోకిల తప్ప మరేదీ వినిపించని కవితని”
    మీరు వ్రాసినపుడు ఆ కోకిల గానాన్ని మాత్రమే వినగలిగే ఎరుక, పరిపక్వత నాలోనూ రావాలని కోరుకుంటున్నాను. 🙏🏽🙏🏽🙏🏽

  2. హొకుసాయి కెరటాలు పూపొదలై మొగ్గలేస్తాయి, పైకెగసి వికసించి పూలు వెదజల్లుతాయి. అలిసి వాలిపోయినా వెంటనే తేరుకుని మళ్లీ పరుగు తీసే ఆ ప్రయాణం ఎంత స్ఫూర్తివంతం!

    మీ కోకిలమ్మ కూడా అంతే. కొన్నాళ్లు ఏకాంతంలో పాడుకుంది. కొన్నాళ్లు అడవినీ కొండనీ అవలోకిస్తూ పాడింది.

    రసహృదయాల జీవనయానంలో అన్నిరసాలూ అనివార్యమే. శోకం కూడా శ్లోకమయే కవిలోకం మీది. నిరంతరం వినిపించాల్సిన పాట మీది. 🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading