
చాలా ఏళ్ళ కిందట
బహుశా నా ఇరవయ్యేళ్ళప్పుడు
ఒక తెల్లవారుజామున
మగతనిద్రలో ఎవరివో మాటలు:
మా అమ్మనెవరో ఏదో అడుగుతున్నారు
మధ్యమధ్య మసకమసగ్గా నా పేరు.
నిద్రతేలిపోయింది.
‘ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు
నా కలలోనా నిజంగానా?’
‘ఎదురింటి అమ్మాయిరా!
నువ్వెప్పుడొచ్చావని అడుగుతోంది.’
పుస్తకంలో పెట్టుకున్న పూలరేకలాగా
ఆ కుశలప్రశ్న
ఇన్నాళ్ళూ గుర్తేలేదు.
ఈ ఋతువుని నిద్రలేపుతూ
ఈ పొద్దున్నే కోకిల వచ్చివాలినదాకా.
పూర్వకాలపు గ్రామాల్లో
ఎవరింటికి చుట్టమొచ్చినా
ఊరంతా తుళ్ళిపడ్డట్టు
ఈ తొలి కూజితం
నన్ను కుదిపేసింది.
ఇంక నిద్రపట్టదు.
20-3-2025


ఆహా.. మీ తొలి కూజితం ఎన్ని చిగుళ్ళను వెలికి తీసిందో.. సిరివెన్నెల గారి ఈ సంతోషం సినిమా పాట పల్లవి ని కూడా గుర్తు చేసింది…
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవెం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
చాలా సంతోషం సార్! సిరివెన్నెల పాట గుర్తు చేసినందుకు మరీ సంతోషం.
ఎంత హాయి!
ఎంతమంది దేవతలు కరుణించారో,
ఏ జన్మలో చేసిన మహా పుణ్యమో…
ధన్యవాదాలు సార్!
Beautiful sir… కోయిల మీ కవిత్వంలోకి రాకుండా వసంతమే రాదు..❤️
ధన్యవాదాలు మానసా!
“కోకిల తప్ప మరేమీ వినిపించని” కవిత ని మీరు వ్రాసినప్పుడు ఆ స్థితి ని సమీపించడానికైనా ఆ కోకిలతో పరిచయం కావాలి కదా.
ఆ ప్రయత్నంలో ఉన్నాను 😃
అది మీ హృదయం. మీ సంస్కారం.