తెల్లవారి లేస్తూనే

తెల్లవారి లేస్తూనే హాల్లోకి వచ్చి నిలబడేటప్పటికి
ఎదట వీథినంతా హాలుగా మార్చేసి కానుగచెట్టు.
నునువెచ్చని నీడల పరదాల్ని పొందిగ్గా మడిచిపెట్టి
అతిథుల్ని ఆహ్వానిస్తూ తలుపులు తెరిచిపెడుతుంది.

ఆ ఆకుపచ్చని గుబుర్లనిండా తాజా పరిమళం.
చూడబోతే చెట్టు బర్త్ డే కేక్ సిద్ధం చేస్తున్నట్టుంది.
అరేబియా కథలోలాగా నా పొరుగువాడు రొట్టెలు
చేసుకుంటూ ఉంటే ఆ సువాసన నాకు దక్కుతుంది.

ఇంతలో ఊదారంగు తెల్లని మొగ్గలు చిరుగంటలు
మోగిస్తూ హాపీ బర్త్ డే పాట మొదలుపెడతాయి.
ఫలానా అని పేరు చెప్పలేవు గానీ ఆ క్షణాన నీకు
గుర్తొచ్చేవాళ్ళంతా అక్కడికొచ్చినట్టే అనిపిస్తుంది.

11-3-2025

6 Replies to “తెల్లవారి లేస్తూనే”

  1. మొగ్గలు చిరుగంటలు మోగించడం.. ఎంత అందమైన అభివ్యక్తి.. వేటూరి వారి. . పున్నాగ పూలు సన్నాయి పాడింది అన్నారు.. ఇప్పుడు నేను ఆ పూలని ఎక్కడ చూసినా.. ఆ పువ్వుల ఆకారం అలాగే అనిపిస్తుంది.. చిన్న షహానాయి కూడా వినిపిస్తుంది . అలాగే ఇక మీదట ఎప్పుడు కానుగ పూల మొగ్గలని తలచుకున్నా చిరుగంటల్లాగే మోగుతాయిమో. ప్రకృతి లోని ఆకృతి లలో కళ్ళకి కూడా శ్రవణ శక్తి తెప్పించే ఎన్ని కృతులో…

  2. ఇది నేను రాయవలసిన కవిత….ఈ పూలని చూస్తే, అసలు ఈ మాసం వస్తుందంటేనే గుర్తొచ్చే కవి మీరు. ఆ ఆఖరు వాక్యాలు నావీ 😢

    మీలోని కవికి మళ్ళీ మళ్ళీ ❤️❤️

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading