You searched for an answer but lived without an answer. ..
Czeslaw Milosz (Provinces, Youth, 1991)
ఎండచల్లబడుతూనే మామిడిచెట్లగుబుర్లలో
వాద్యాలు శ్రుతి పెడుతున్న సంగీతకారులు.
కొమ్మలకి కొత్త తోరణాలు కట్టుకున్న
కోవిదార, కరవీర, దేవగన్నేరు.
వీథికి అటూ ఇటూ రంగుకాగితాలు
చుడుతున్న బోగన్ విల్లియా.
ఆకుపచ్చనిగోడల్ని కలుపుతూ
జలతారుపోగుల్తో ఊయెల నేస్తున్న
రెడ్ వెంటెడ్ బుల్బుళ్ళు. ఇక చీకటి
పడటం ఆలస్యం పూర్ణచంద్రుడికోసం
గాలి లాలిపాటలు మొదలుపెడుతుంది.
2
నాకేంచేయాలో తెలీటం లేదు,
నాకేం చెప్పాలో తెలీటం లేదు.
పదే పదే టెహరాన్ అని
నాలో నేను గొణుక్కుంటాను
కరెంటులేని, నీళ్ళు లేని, రొట్టెల్లేని,
బతకడానికి భవిష్యత్తులేని
టెహరాన్! టెహరాన్!
కొత్త ఏడాదికి స్వాగతంపలకడానికి
ఒక్క పూలగుత్తి కూడా దొరకని టెహరాన్!
తలలు తెగిన మొండేలు, మొండేలు విడివడ్డ తలలు
రెండూదగ్గరపెట్టి పోల్చుకుంటున్న స్త్రీపర్వం.
వ్యాసుడు కూడా చేతులెత్తేసే ఘట్టమిది.
పదే పదే యురిపిడిస్ గుర్తొస్తున్నాడు
మండుతున్న ట్రాయినగరం మధ్య స్త్రీశోకం తప్ప
యుద్ధమంటే మరేదీ గుర్తులేదతడికి.
జీవితమంతా యుద్ధాలు చూసి, యుద్ధాలు చేసి
దు-ఫు తేల్చిందొక్కటే: యుద్ధధూమం నల్లన
మనిషి ఎముకలు తెల్లన.
యుద్ధం వెనక యుద్ధం చూస్తూ వచ్చారుగనుకనే
యుద్ధమంటే ఏమీ చెప్పలేకపోతున్నారు పోలిష్ కవులు.
12,00,000 మంది నిరాశ్రయశిశువుల ఎదట
రూమీ, ఖయ్యాం, హాఫిజ్, అత్తర్ లను
పలకరించాలంటే భయమేస్తోంది.
దాస్యం నుంచి దాస్యానికి,
దుఃఖం నుంచి దుఃఖానికి-
‘ఒంటరిగా ఒంటరిగా మంటల్లో మంటల్లో
పయనిస్తున్నాడు నరుడు
తానెరుగని దిక్కుకేసి.’1
3
లేదు, నాకు సాధ్యం కాదు.
ఈ రెండు ప్రపంచాల్నీ
ఒక్కచోట ముడేసుకోలేకపోతున్నాను.
ఈ ప్రపంచంతో ఆ ప్రపంచాన్ని ఏమార్చలేను
ఆ ప్రపంచంతో ఈ ప్రపంచాన్ని కాదనలేను.
ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు గాయపడ్డా
ఆ నొప్పి మనది కాదనుకోలేం
ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు నిర్వాసితులైనా
మన తలపుల్లోనే కదా తలదాచుకోవలసింది.
లేదు, నాదగ్గర జవాబుల్లేవు
యుద్ధానికి వెళ్ళిన బిడ్డను తలుచుకుంటూ
శూన్యంలోకి చూస్తుండే తల్లిదండ్రుల్లాగా
ఈ చెట్టుకింద కూలబడతాను
ఈ పక్షుల ఎదట కూలబడతాను
ఈ జలతారు ఊయెల్లో తనలో తను నవ్వుకుంటున్న
చైత్రచంద్రబింబం ముందు కూలబడతాను.
1. బైరాగి: నూతిలో గొంతుకలు
2-4-2026


“ఈ ప్రపంచంతో ఆ ప్రపంచాన్ని ఏమార్చలేను
ఆ ప్రపంచంతో ఈ ప్రపంచాన్ని కాదనలేను”
True Sir. ☹️
ధన్యవాదాలు మాధవీ!
ఆహా! ధన్య జీవీ!
యుద్ధం, దుఃఖం లేని చైత్ర చంద్ర బింబం కోసం ఎదురు చూస్తూ….
అవును
ఈ యుద్ద మేఘాలు మాయమై
చంద్రుని వెలుగు నీలాకాశంనిండా పరచుకునే రోజుకై
నిరీక్షణ…పరాభవ పాఠం
నేర్చుకునే సమయాన్ని
లోకం చూస్తుంది.🙏
అవునమ్మా!
శోధన జవాబు దొరకనిచో , మిగుల్చు
వేదన , నిశీధి నిశ్శబ్ద రోదన యగు
సారు ! మీలోని ‘ కవి యెద ‘ చల్లబడదు
ఈ ‘ రణ ధరణి ‘ కూడ మం టార దెపుడు .
ధన్యవాదాలు
హృదయం ఆవిష్కరించుకున్న కథ .
ఏమీ చెయ్యలేని వ్యథ
యుగాల తరబడి యుధ్దపర్యవసానాల్ని
గంపలకొద్దీ కవులు తలకెక్కించినా
గొంగళ్లు ఎక్కడివక్కడే
ప్రస్తుత సామాజిక దృశ్యాన్ని సాంద్రంగా చూపారు
కవిలోని ఆర్ద్రతనూ అశకత్తకనూ మంద్రంగా వినిపించారు 🙏
ధన్యవాదాలు సార్!
ఈ దుర్విదగ్ధ యుద్ధ కాలంలో ఔచితీమంతమైన కవిత ఇది మాత్రమే చూస్తున్నాను.