
సాహిత్య ప్రక్రియగా ఆధునిక కథ పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకునే క్రమంలో వెనక్కి, ఇంకా వెనక్కి తవ్వుకుంటూపోతే అత్యంత ప్రాచీన కాలంలో వికసించిన కథారూపాల గురించి తెలిసింది. అటువంటి ప్రాచీన కథారూపాల్లో పదింటిని ఇంతకు ముందు పరిచయం చేసాను. సామాన్యశకం ఒకటవశతాబ్దిలో రోమను వ్యంగ్యకథకుడు ఫయాడ్రసు చేతుల్లో రూపుదిద్దుకున్న అపొలాగ్ తో ఆ పరిచయాలు పూర్తయ్యాయి. ఆ పరిచయవ్యాసాల్ని ‘కథలు ఎలా పుట్టాయి’ (2025) పేరిట పుస్తకంగా కూడా వెలువరించాను.
సామాన్య శకం రెండుమూడు శతాబ్దాలు మొదలుకుని, ఎడ్గార్ అలన్ పో ‘సీసాలో రాతప్రతి’ (1833) కథ రాసినప్పటిదాకా, మధ్యయుగాలుగా మనం భావిస్తే, ఆ కాలమంతటా ప్రాచీన కథారూపాలు సరికొత్త మార్పులకి గురవుతూ వచ్చాయి. frame story గా, nested narrative గా పిలిచే కథాచట్రం మధ్యయుగాల్లో విస్పష్టమైన ఆకృతిని సంతరించుకుంది. మహాభారతమూ, జాతకకథలూ కూడా ఒకవిధంగా కథాచట్రం నిర్మాణాన్నే పాటించినప్పటికీ, మధ్యయుగాల్లో మతప్రయోజనాల్నీ, పురాణపరిమితుల్నీ దాటి లౌకికతని సంతరించుకోవడమేకాక, సామాజిక విమర్శకి కూడా పదునైన అస్త్రంగా కథ తనని తాను తీర్చిదిద్దుకుంది.
మధ్యయుగాల్లో, దాదాపు 1600 ఏళ్ళ పాటు కథాచట్రం రూపుదిద్దుకోవడమే కాక, తూర్పుదేశాలనుంచి పడమటి దేశాలకు విస్తృతంగా ప్రయాణిస్తూనే ఉంది. చివరికి 18-19 శతాబ్దాల్లో కథాచట్రం అమెరికా చేరుకున్నాక, ఉత్తర అమెరికా తొలికథకులు వాషింగ్టన్ ఇర్వింగ్, నథానియలు హాథార్న్ చేతుల్లో అది పూర్తిగా వదులయ్యింది. చివరికి ఎడ్గార్ అలన్ పో కథని ఆ చట్రం నుంచి విడదీసి, చిన్నకథగా మార్చడంతో, ఆధునిక కథ పుట్టింది.
ప్రాచీన కథారూపాలు ఆధునిక కథగా రూపొందిన ఈ అత్యంత ఆసక్తికరమైన ఈ ప్రయాణంలో ఎన్నో జాతులు, ఎన్నో సార్థవాహ బృందాలు, ఎన్నో మత యుద్ధాలు, ఎందరో సన్న్యాసులు, విరాగులు, ధార్మికులు, కపటులు, జూదరులు, మోసగాళ్ళు, చివరికి దొంగలు, వ్యభిచారులు, నేరస్థులు కూడా పాల్గొన్నారు. ఎప్పుడో చరిత్ర పూర్వయుగంలో ఆదిమతెగలు ఒకరోజు వేటముగిసాక తమ గుహకి తిరిగివచ్చాక వెలిగించుకున్న నెగళ్ళ దగ్గర పుట్టిన ప్రాచీన కథారూపాలు చివరికి మధ్యతరగతి ఇళ్ళల్లో ఆధునిక కథగా రూపొందేదాకా మధ్యయుగాల కథారూపాలు నిర్వహించిన పాత్ర అద్వితీయం. ఆ ప్రయాణం గురించీ, అవి తమ భుజాన వేసుకుని తిరిగిన సాహసిక సాహిత్య యాత్ర గురించీ ఇప్పటిదాకా తెలుగులో ఎవరూ మాట్లాడినట్టు లేదు. ఆ చరిత్ర గురించీ, ఆ సాహిత్య సృజనయాత్ర గురించీ తెలిస్తే ఆధునిక కథకుడు తన కథాప్రయోజనాన్ని మరింత బాగా విశదపరుచు కోగలుగుతాడనీ, తన కథాశిల్పానికి మరింత మెరుగు పెట్టుకోగలుగుతాడనీ భావిస్తూ, ఇప్పుడు కథ గురించిన కథలో రెండవభాగం మొదలుపెడుతున్నాను.
పంచతంత్రం నుండి రొమాంటిసిజందాకా
మధ్యయుగాల కథాప్రయాణం భారతదేశంతో మొదలై ఉత్తర అమెరికాలో పూర్తయ్యింది. ఈ ప్రయాణంలో ముఖ్యమైన మైలురాళ్లని స్థూలంగా ఇలా పేర్కొనవచ్చు:
అ) భారతదేశంలో ప్రభవించిన కథాచట్రాలు
2 వ శతాబ్దం: బృహత్కథ
మొదటిసారిగా కథని ధార్మిక పరిధి నుంచి తప్పించి లౌకిక జీవితానికి ఉపకరించే సాధనంగా మార్చిన పుస్తకం బృహత్కథ. శాతవాహన రాజుల కాలంలో గోదావరి తీరంలో, నేటి తెలంగాణా ప్రాంతంలో, పైశాచి భాషలో ప్రభవించిన ఈ పుస్తకమే మధ్యయుగాల కథాచట్రానికీ, తద్వారా ఆధునిక కథకీ మూలం అని చెప్పవచ్చు. ఈ మూలగ్రంథాన్ని మనం నష్టపోయినప్పటికీ కాదంబరి, కథాసరిత్సాగరం, బృహత్కథామంజరి వంటి రచనల ద్వారా జీవించే ఉందని చెప్పవచ్చు.
3 వ శతాబ్దం: పంచతంత్రం
హితోపదేశం ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభవించిన అద్వితీయ కథాచట్రం పంచతంత్రం. తదనంతర ప్రపంచసాహిత్యాల్ని ఇంత గాఢంగా, ఇంత విస్తృతంగా ప్రభావితం చేసిన పుస్తకం ప్రపంచ సాహిత్యంలోనే మరొకటి లేదు. కథలు చెప్పడాన్ని ఒక విద్యాసాధనంగా గుర్తించడం ద్వారా పంచతంత్రం కథా ప్రక్రియకు విస్పష్టమైన దిశా నిర్దేశం చేసింది.
7 వ శతాబ్దం: దశకుమారచరిత్ర
దండి కావ్యంగా రాసిన ఈ కథాచట్రంలో జంతువుల స్థానంలో మనుషులు, అది కూడా ధూర్తులైన మనుషులు ప్రవేశించడం ముఖ్యమైన మార్పు.
8 వ శతాబ్దం: ధూర్తాఖ్యానం
మధ్యయుగాల కథానిర్మాణాన్నీ, కథలు చెప్పుకోవడం వెనక ఉన్న తత్త్వశాస్త్రాన్నీ జైనులు సమూలంగా మార్చేసారు. అంతదాకా భారతీయ సమాజం కథా ప్రయోజనం గురించి శిల్పం గురించి విశ్వసిస్తూ వచ్చిన విలువల్ని వారు కథ, అకథ, వికథ అనే వర్గీకరణతో పునర్ మూల్యాంకనం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కథాచట్రాన్ని తల్లకిందులు చేశారని చెప్పవచ్చు. దానికి అత్యంత మేలిమి ఉదాహరణ ధూర్తాఖ్యానం. అంతదాకా వచ్చిన కథానిర్మాణానికి ఇది యాంటీ థీసిస్ లాంటిది. అప్పటికే స్థిరపడ్డ పౌరాణిక సత్యాల్లోని అసత్యాల్నీ, డొల్లతనాన్నీ ఎద్దేవా చెయ్యడం ఈ జైన కథాచట్రం ముఖ్య ఉద్దేశ్యం.
11 వ శతాబ్దం: కథాసరిత్సాగరం
ఇక్కడకు వచ్చేటప్పటికి కథాచట్రం అత్యంత సంక్లిష్టతను సంతరించుకుంది. కథ తన పరిమితుల్నీ, హద్దుల్నీ దాటి ఒక సముద్రంగా విస్తరించిన దశకి చెందిన పుస్తకం ఇది. తదనంతర కాలంలో అరేబియా రాత్రుల కథలకు ప్రధాన స్ఫూర్తి ఇక్కడి నుంచే అందింది.
ఆ) చీనా లో పుట్టి ప్రయాణించిన కథాచట్రాలు
5 వ శతాబ్దం: జియాన్యూ-జింగ్
వివేకం సంపాదన కోసం బౌద్ధభిక్షువులు చెప్పుకున్న కథలు. బౌద్ధ జాతకకథల్ని టిబెట్టు నుంచి సంగ్రహించి చీనాలో చెప్పుకున్న ఈ కథలు సమర్ఖండ్ సిల్కుదారి మీదుగా మధ్యాసియాకి పయనించాయి. మరొకవైపు మంగోలియాకి కూడా చేరాయి.
ఇ) మధ్యాసియాలో రూపుదిద్దుకున్న కథాచట్రాలు
8 వ శతాబ్దం: కలిలా వా దిమ్నా
మధ్యపారశీక భాష అయిన పహ్లవీలోకి అనువాదమైన పంచతంత్రానికి ఆరబిక్ అనువాదం. ఇక్కడితో పంచతంత్రం పూర్తిగా గ్లోబలైజు అయ్యిందని చెప్పవచ్చు.
9-14 శతాబ్దాలు: వెయ్యిన్నొక్క అరేబియా రాత్రుల కథలు
పంచతంత్రం, కథాసరిత్సాగరం ల ప్రభావం ఒక వైపూ, చీనా నుంచి వచ్చిన జియాన్యూ-జింగ్ ప్రభావం మరొక వైపూ దారిచూపిస్తుండగా, కథని పూర్తిగా మానవీకరించి, లౌకికీకరించి, మృత్యువును ఎదుర్కొనే ఆయుధంగా దాన్ని మార్చిన సంపుటం.
ఈ) యూరోపులో రూపుదిద్దుకున్న కథాచట్రాలు
14 వ శతాబ్దం: డికామెరూన్
అరేబియా రాత్రులకథల్లో ప్రతీకగా ఉన్న మృత్యువు నిజమైన మృత్యువుగా ఎదురుపడ్డప్పుడు, సాంస్కృతిక పునరుజ్జీవనపు ఇటలీలో, ప్రభవించిన కథాచట్రం. ఇక్కడికి వచ్చేటప్పటికి కథాచట్రం పూర్తి యథార్థ ప్రపంచంలో అడుగుపెట్టింది.
14 వ శతాబ్దం: కాంటర్బరీ టేల్స్
ఛాసర్ ఇంగ్లీషులో రాసిన ఈ కథాచట్రం బహుళగళాలు వినిపించే కథాసమాహారంగా మారింది. ప్రతి ఒక్క కథా దాన్ని చెప్పే కథకుడి సామాజిక-మానసిక స్థాయిని ప్రతిఫలించేదిగా మారింది.
16 వ శతాబ్దం: హెప్టామెరాన్
డెకామెరాన్ స్ఫూర్తితో ఫ్రెంచిలో రాసిన పెద్దకథల సంపుటి. ఒక వరదలో దారితప్పిన యాత్రీకులు చెప్పుకున్న కథలు.
16 వ శతాబ్దం: ద పాలస్ ఆప్ ప్లెజర్
ఇటాలియన్, ఫ్రెంచి కథాచట్రంలోని కథల్ని ఇంగ్లాండు తీసుకువెళ్ళిన పుస్తకం. తర్వాత రోజుల్లో షేక్స్పియర్ తన నాటకాలకు కావలసిన ఇతివృత్తాలకు చాలావరకు ఈ పుస్తకం మీదనే ఆధారపడ్డాడు.
17 వ శతాబ్దం: ఎగ్జంప్లరీ నావెల్స్
డాన్ క్విక్జోట్ ద్వారా ప్రశస్తి సంపాదించిన సెర్వాంటిస్ స్పానిష్ లో రాసిన కథలు. ఇందులో ఆయన ప్రవేశపెట్టిన ఆవిశ్వనీయ కథకుణ్ణే తర్వాత రోజుల్లో ఉత్తర అమెరికా కథకులు అందిపుచ్చుకున్నారు.
18 వ శతాబ్దం: వెయ్యిన్నొక్క రాత్రుల కథలు
అరేబియా రాత్రుల కథకు ఆంటోయిన్ గాలాండ్, 1704 లోవెలువరించిన ఫ్రెంచి అనువాదం. ఈ అనువాదంతో యూరోపులో ఓరియెంటలిజం మొదలయ్యిందని చెప్పవచ్చు. తర్వాత రోజుల్లో రొమాంటిసిజం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి ఈ పుస్తకం కూడా కారణం.
18 వ శతాబ్దం: జర్మన్ జానపద కథలు, గ్రిమ్ సోదరుల జానపద కథలు
జోహాన్ గాట్ ఫ్రెడ్ వాన్ హెర్డర్ అనే జర్మన్ పండితుడు జర్మన్ జానపద కథలు సేకరించి వెలువరించాడు. ఆ కథలు జర్మన్ రొమాంటిక్ కవిత్వానికి స్ఫూర్తినిచ్చాయి. అలానే జాకోబ్ గ్రిమ్, విల్ హెల్మ్ గ్రిమ్ అనే సోదరులు సేకరించిన జర్మన్ జానపద కథలు కూడా ప్రాచ్యప్రపంచానికి సమానమైన జానపద కథలు యూరోపుకి కూడా ఉన్నాయని తెలియచేశాయి. ప్రాచ్య ప్రపంచపు కథాచట్రం వ్యక్తులు చెప్పుకున్న కథలుకాగా వీటిని ప్రజలు చెప్పుకున్న కథలుగా వారు ముందుకు తీసుకొచ్చారు.
ఉ) ఉత్తర అమెరికాలో ప్రభవించిన కథాచట్రాలు
18-19 శతాబ్దాలు: ఉత్తర అమెరికా Tales
హెర్డర్ సేకరించిన జానపద కథల వల్ల స్ఫూర్తి పొందిన వాషింగ్టన్ ఇర్వింగ్ జర్మన్ జానపద కథా చట్రాన్ని హడ్సన్ లోయకు అనువర్తింపచేస్తూ జాఫ్రీ క్రేయాన్ కథలు రాశాడు. సుప్రసిద్ధమైన రిప్ వాన్ వింకిల్ కథ అందులోదే. ఆ దారినే నథానియాల్ హాథార్న్ కూడా Twice-told Tales రాశాడు. ఇక్కడితో కథాచట్రం ప్రయాణం పూర్తయ్యింది. ఆ తర్వాత ఎడ్గార్ అలన్ పో కథని చట్రం నుంచి విడదీసి చిన్న కథగా మార్చడంతో ఆధునిక కథ ప్రభవించింది. ఆ తర్వాత ఆధునిక కథ ఎలా వికసించిందో మూడో భాగానికి వాయిదా వేస్తున్నాను.
ఈలోగా ఈ సంపుటాల్లో ముఖ్యమైనవాటిని ఒక్కొక్కటీ పరిచయం చేస్తూ వాటిల్లోంచి ఉదాహరణగా ఒక కథ కూడా రానున్న రోజుల్లో మీతో పంచుకోబోతున్నాను.
కథా చట్రం ప్రయాణం గురించిన ఇటువంటి సమగ్ర పరిశీలన, సోదాహరణ వివరణ నాకు తెలిసి ఇప్పటిదాకా ఇంగ్లిషులో కూడా రాలేదు.
(అసలు కథాచట్రం భారతదేశంలోనే ఎందుకు ప్రభవించింది? జైనులు కథాచట్రాన్ని ఎలా తల్లకిందులు చేసారు? మధ్యాసియా కథాచట్రాన్ని ఎలా నవీకరించింది? చివరకు పాశ్చాత్యప్రపంచం దాన్ని ఎలా స్వీకరించింది? ఈ ప్రయాణాన్ని వివరించమని హెగెల్ ని అడిగితే ఎలా విశ్లేషిస్తాడు?- ఈ ప్రశ్నలకు జవాబులు వచ్చేవారం.)
3-2-2026
Good morning sir, today your article is
Nice . From Srinidhi dept of heritage museum employee
Thank you!
Very very interesting, ఈ కథ గురించిన కథ!!
Never knew that Panchatantra kathalu were translated into Persian as Kalila wa-Dimna so long ago. Really amazing!
The journey this frame story / nested narrativeగా పిలిచే కథాచట్రం took is so interesting to read and the map helps to visualize it.
Thank you, sir! 🙏
Such an eye opening delineation…Sir
Thank you so much!