
సంగారెడ్డి జిల్లా జహీరాబాదు ప్రాంతంలో ప్రతి ఏటా జరిగే పాతపంటల జాతర ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. పదమూడు గ్రామాల్లో జరిగే ఈ పండగలో అర్జున్ నాయక్ తండాలో జరిగిన వేడుకల్లో నేను ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. జహీరాబాదు కేంద్రంగా గత నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్న దక్కన్ డెవలప్ మెంటు సొసైటీ వారు గత 26 ఏళ్ళుగా నిర్విఘ్నంగా జరుపుతున్న పండగ ఇది.
ప్రపంచంలోనే ఇటువంటి పండగ మరొకటి లేదు
మొత్తం ప్రపంచంలోనే ఈ పండగ అత్యంత అద్వితీయమైన పండగ. ముఖ్యంగా మూడు కారణాల వల్ల. విత్తనాల పండగలు యూరోపులోనూ, అమెరికాలోనూ కూడా జరపడం సాధారణమే కాని, అవి ఏదో ఒక ఊళ్ళోనో లేదా పట్టణంలో మాత్రమే జరుగుతాయి. కాని ఈ పండగ, ఏడు మండలాల పరిధిలో జరిగే ఒక సంచారజాతర. రెండోది, తక్కినచోట్ల జరిగే వేడుకలు సాగులో ఉండే పంటలకి మాత్రమే పరిమితం. కాని ఇక్కడ జాతరలో మామూలుగా సాగు చేసే పంటలతో పాటు సాగుచెయ్యకుండానే మొలకెత్తే ఆకుకూరలు, మూలికలు, పోషకవిలువలుండే గడ్డిజాతుల్ని కూడా గుర్తిస్తారు. గ్రామీణ ప్రజలకు ఆహారభద్రత కల్పించడంలో అటువంటి uncultivated greens ప్రాముఖ్యతను గుర్తించడం ఈ జాతర ప్రత్యేకత. మూడోదీ, అన్నిటికన్నా ముఖ్యమైందీ, ఇది దళిత, గిరిజన మహిళలు ఎంతో క్రియాశీలకంగా పాల్గొనే జాతర. సామాజిక న్యాయం, పర్యావరణ సమతౌల్యం, వ్యావసాయిక సార్వభౌమత్వం అనే మూడు విలువలు అద్వితీయంగా మేళవిస్తున్న పండగ ఇది.
అర్జున నాయక్ తండాలో జాతర
ఆ రోజు మేం అర్జుననాయక్ తండాలో చూసినవి మామూలు దృశ్యాలు కావు. ముందు అక్కడ పాతవిత్తనాల్ని రెండెండ్ల బళ్ళమీద ఊరేగించారు. ఆ బండ్లకి మేలు జాతి ఎడ్లని పూన్చారు. ఆ ఊరేగింపులో స్థానిక లంబాడీ మహిళలు సాంప్రదాయిక నృత్యాలు చేసారు. ఆ తర్వాత స్థానిక సేవాలాల్ మహరాజ్ మందిరం ప్రాంగణంలో వారంతా సమావేశమయ్యారు. సమావేశం మొదలయ్యేముందు, లంబాడీ కుటుంబాలకు చెందిన అత్తలు పాతపంటల విత్తనాలతో నింపిన మట్టి పాత్రల్ని, తమ కుటుంబాల్లోని కోడళ్ళకు అందచేసారు. ఎంతో అరుదైన సాంప్రదాయిక పంటలకు చెందిన విత్తనాలు తమ సమాజం తాలూకు ఆస్తి అనీ, వాటిని తమ అత్తలు తమకి అందించారనీ, ఇప్పుడు తిరిగి తాము తమ కోడళ్ళకు అందిస్తున్నామనీ, భవిష్యతరాల ఆరోగ్యభద్రత కోసం కోడళ్ళు ఆ విత్తనాల్ని కాపాడుకోవాలనీ చెప్పే కార్యక్రమం అది. తాము ఆ విత్తనాల్ని ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటామని,ఆ కోడళ్ళు తమ అత్తలకు వాగ్దానం చేసారు. ఇంత అపురూపమైన సాంస్కృతిక ఉత్సవాన్ని నేనిప్పటిదాకా చూడలేదు. ఆ వాగ్దాన కార్యక్రమం అయ్యేక, ఒక బుర్రకథ ప్రదర్శించారు. తర్వాత గ్రామపెద్దల్నీ, ఆదర్శ రైతుల్నీ, విత్తనాల జాతుల్ని సంరక్షింకుంటూ వస్తున్న మహిళల్నీ సత్కరించారు. రాబోయే ఏడాది చేపట్టవలసిన కార్యక్రమం గురించి చర్చించారు.
వర్షాధార పంటల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి?
ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుంది. ఆహారభద్రత విషయంలో దేశం స్వావలంబన సాధించిందని చెప్పుకుంటున్న తరుణంలో, ఇంకా వర్షాధార పంటల గురించీ, పాతపంటల గురించీ ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే, మనం సాధించామని చెప్పుకుంటున్న స్వావలంబనకి మనం చాలా విలువైన మూల్యం చెల్లిస్తూ వచ్చాం కాబట్టి. ఒకప్పుడు మనదేశంలో లక్ష రకాలకు పైగా చిరుధాన్యాల, పప్పుల, నూనెగింజల పంటలు సాగయ్యేవి. విస్తారమైన ఈ దేశంలో ఎక్కడి సూక్ష్మ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ పండే పంటలు పండించేవారు. కాని 1960 ల తర్వాత దేశంలో సంభవించిన సస్య విప్లవం, 1990 తర్వాత నుంచీ సంభవిస్తున్న కార్పొరేటీకరణ ఈ సాంప్రదాయిక జాతులమీద కనిపించని దండయాత్ర చేసింది. ఈ దాడిలో ఇప్పటికే గ్రామాలకు గ్రామాలు, సమూహాలకు సమూహాలు, కుటుంబాలకు కుటుంబాలు నష్టపోయేయి.
అయినా ఇంకా వర్షాధార సేద్యం విలువ తగ్గలేదు
అయినా ఇంకా వర్షాధార సేద్యం ఈ దాడితో పెనగులాడుతూనే ఉంది. ఈ వైనాన్ని మనం ఒక్కసారి అంకెల్లో చూద్దాం. సస్యవిప్లవం, బహుళజాతి సంస్థలు ప్రవేశపెట్టిన విత్తనాలు పంటలు పండటానికి సాగునీరు అవసరం. కాని దేశంలోని మొత్తం 18 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమిలో, దాదాపు 14 కోట్ల హెక్టార్ల సాగుభూమిలో, 51 శాతం పైగా వర్షాధారం గానే ఉంది. దేశంలోని మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 44 శాతం దాకా వర్షాధార సేద్యం నుంచే లభిస్తున్నాయి. అలా వర్షాధారంగా పండే పంటల్లో 90 శాతం దాకా చిరుధాన్యాలే ప్రధానంగా ఉన్నాయి. దేశంలోని మొత్తం వ్యావసాయిక కార్మికుల్లో 60 శాతం మంది వర్షాధార సేద్యం మీదనే ఆధారపడి ఉన్నారు. అలానే మొత్తం పశుసంపదలో 78 శాతం పశుగణం వర్షాధారసేద్యం మీదనే ఆధారపడి ఉంది. అంటే విస్తీరణంలోనూ, జనసంఖ్యలోనూ, పశుగణంలోనూ కూడా సగం భారతదేశం వర్షాల్నే నమ్ముకుని జీవిస్తున్నది. వారిని కాపాడుకుంటూ వస్తున్నది మన విధానాలూ, మన ప్రణాళికలూ, మన పెట్టుబడులూ కావు. కేవలం వర్షమూ, ఆ వర్షానికి తగ్గట్టుగా పండించే పంటలూనూ. కాబట్టే మనం పాత పంటల గురించీ, పాత సేద్యపు పద్ధతుల గురించీ, పాతకాలపు పశుపోషణ గురించీ మాట్లాడుకోవలసి ఉంది.
జహీరాబాదు చూపిస్తున్న దారి
మన రాజకీయ నాయకులూ, ప్రణాళికావేత్తలూ, శాస్త్రవేత్తలూ కూడా పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులపట్లా, పెద్ద ఎత్తున వరిసాగు చేపట్టడం పట్లా, అధిక దిగుబడి వంగడాల పట్లా, అంతిమంగా పెద్ద రైతుల పట్లా ఎక్కువ ప్రేమ చూపిస్తూ వచ్చారు. మరొకవైపు వర్షాధార సేద్యాన్నీ, తృణధాన్యాల్నీ, పాతపంటల విత్తనాల్నీ, చిన్న,సన్నకారు రైతుల్నీ నిర్లక్స్యం చేస్తూ వచ్చారు. కనిపించని ఈ వివక్ష వల్ల ఈ రోజు భారతదేశం అత్యంత సంపన్న దేశంగానూ, నిరుపేద దేశంగానూ చీలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాధార సేద్యం ప్రాముఖ్యత పట్ల దేశం దృష్టి మరల్చేలా చెయ్యడం జహీరాబాదు మనకిచ్చిన అపురూపమైన కానుక. దక్కన్ డెవలప్ మెంటు సొసైటీ వారి ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటిదాకా 80 రకాల పాతపంటల్ని గుర్తించారు. వాటికీ, ఆధునిక వంగడాలుగా చెప్పుకునే వాటికీ మధ్య ఉన్న తేడాల్ని స్పష్టంగా గుర్తుపట్టారు. సాగునీటికింద పండించినప్పుడు అధిక దిగుబడినిస్తాయని చెప్పుకునే మేలుజాతి వంగడాలు, వర్షాధార పంటలకన్నా కేవలం 30 శాతం మాత్రమే అధికదిగుబడినిస్తున్నాయని జహీరాబాద్ దళిత, గిరిజన రైతులు లెక్కలుగట్టి తేల్చారు. కాని, దిగుబడిలో అదనంగా కనిపితున్న ఈ 30 శాతానికి, మనం కనిపించకుండా ఎన్నో రెట్లు మూల్యం చెల్లిస్తున్నామని కూడా వారు చెప్తున్నారు. అధిక దిగుబడి పంటల పేరిట రైతులు ఆహారభద్రతని కోల్పోవడమేకాక, అప్పులపాలవుతూ వస్తున్నారనీ, జీవవైవిధ్యంలో నష్టం, పశువులకి మేతలేకపోవడం, నేలలు నిస్సారం కావడం లాంటి ఇతర నష్టాల్తో పోల్చి చూసినప్పుడు, ఈ 30 శాతం అధిక ఆదాయం దేనికీ కొరగాదనేది వారిప్పుడు దేశం ముందు వినిపిస్తున్న వాదన.
Seed Sovereignty ని కాపాడుకోవాలి
ఈ దేశంలో పంటలు పండించడానికి విత్తనాలు తరతరాలుగా ఉచితంగా దొరికేవి. వాటిని కాపాడుకునే పద్ధతులు గ్రామాలకి వెన్నతో పెట్టే విద్యగా ఉండేది. కాని బహుళజాతి సంస్థలు ప్రవేశపెట్టిన విత్తనాలు ‘కొనుక్కోవలసి ‘ వచ్చే విత్తనాలు కావడమే కాక, వాటిని ప్రతి ఏడాదీ ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవలసి ఉంటుంది. ఇది అంతిమంగా దేశాన్ని అప్పులపాలు చేస్తుంది. ఈ ప్రమాదం నుంచి రైతుల్నీ, పంటల్నీ, పశువుల్నీ కూడా కాపాడుకోవాలంటే, విత్తనాల విషయంలో మనం మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసి ఉంటుంది. కరువునీ, క్రిమికీటకాల్నీ తట్టుకోడమేకాక, దాదాపుగా ఏడాది పొడుగునా, ఆహారభద్రతని సమకూర్చగల పాతపంటల్ని మళ్ళా ముందుకు తీసుకురావాలి. అటువంటి ప్రయత్నాలు చేపడూ వస్తున్నారు కాబట్టే దక్కన్ డెవలప్ మెంటు సొసైటీ వారు చైతన్యపరిచిన ఏడుమండలాల్లో రైతు ఆత్మహత్యల ఊసే లేకుండా ఉంది. మనం దిగుబడిలో సాధించిన స్వావలంబన నిజమైన స్వావలంబన కాదు. విత్తనాల విషయంలో ఒకప్పటి మన స్వావలంబనని మనం కాపాడుకుంటేనే, నిజమైన స్వావలంబన అనిపించుకుంటుంది. జహీరాబాద్ ఈ పోరాటాన్ని నడిపిస్తున్న లక్షమ్మ, చంద్రమ్మ లాంటి చెప్తున్నది ఇదే. ఇప్పుడు దేశం మొత్తం వారి మాటల్ని శ్రద్ధగా ఆలకించవలసిన తరుణం వచ్చింది.
Photographs courtesy: A. Gangareddy
తెలుగు ప్రభ, 30-1-2026, స్కైబాబకి ధన్యవాదాలతో
ఒక్కొక్క రోజు ఒక్కో తెలుసుకోవాల్సిన సంగతి తమరు చెప్పేది. ధన్యవాదాలు సర్
Good morning sir, today your article is very nice & informative about crops & agriculture &rain related crop. Festival in Sangareddy. From Srinidhi dept of heritage museum employee
చాలా మంచి వ్యాసం. కేవలం యాంత్రికరణమే నమ్ముకున్న ఈ కాలంలో కూడా ఇంకా పాత పద్ధతిలో వ్యవసాయము వర్షాధార పంటలు ఎంతగా ప్రాధాన్యం కలిగి ఉన్నాయో మీరు చెప్పిన విషయాలు విద్యావంతులు అనుకునే వారికి కూడా అంతగా తెలియనివి పైగా పట్టించుకోనివి ధన్యవాదాలు
అద్భుతమైన విశేషాలు. ధన్యవాదములు సోదరా!.