
అత్యంత ప్రాచీన కాలంలో ఎన్నో రూపాల్లో తలెత్తిన కథ కాంస్యయుగం నాటికి పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో వికసించింది. మధ్యుయుగాల నాటికి అది framed narrative గా మారి తూర్పుదేశాలనుంచి మధ్యాసియా మీదుగా ఆధునిక యుగంలో అమెరికాలో, యూరోపులో అడుగుపెట్టింది. పద్ధెనిమిదో శతాబ్ది చివరిభాగంలో, పందొమ్మిదోశతాబ్ది మొదటి భాగంలో, అమెరికాలో, వాషింగ్టన్ ఇర్వింగ్ (1783-1859), నథానియల్ హాథార్న్ (1804-64) తూర్పుదేశాల మౌఖిక కథనరీతిని, జొహాన్ గాట్‌ఫ్రెడ్ హెర్డరు (1744-1803) సేకరించిన జర్మన్ జానపదకథల్తో మేళవించి tale అనే ఒక సరికొత్త ప్రక్రియకు అంకురార్పణ చేసారు.
ఆ tale ని, అంటే కథని, ఎడ్గార్ అలన్ పో (1809-1849) shortstory గా అంటే, చిన్నకథగా, మార్చాడు. ‘ఏం జరిగిందో’ చెప్పడం మీద కథ దృష్టిపెడితే, అది ‘ఎలా జరిగిందో’ చిన్న కథ చెప్తుంది. కాని అందుకోసం అది ఆ సంఘటనల్ని మరింత వివరించదు. దానికి బదులు, ఆ సంఘటన లేదా సంఘటనలు పాత్రల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించాయో దాన్ని వివరిస్తుంది. అలా చెప్పడంలోచిన్నకథ unity of effect మీద దృష్టి పెడుతుంది. ఒక సంఘటన లేదా సంఘటన క్రమం అందులోని పాత్రల మీద చూపించే ఆ single most effect ని పాఠకుడు కూడా అనుభవించేట్టు చెయ్యడం చిన్నకథలోని శిల్పరహస్యం. అలా ఆ ప్రభావం తనకి కూడా అనుభవం అవుతున్నప్పుడు పాఠకుడు పొందే అద్వితీయ అనుభూతి, దాదాపు ఆధ్యాత్మిక సంతోషం లాంటిదని భావిస్తూ, తర్వాతి రోజుల్లో జాయిస్ దాన్ని epiphany అని అన్నాడు.
స్థూలంగా, కథ చిన్నకథగా పరిణామం చెందిన, కథ ఇది. కథని చిన్నకథగా మార్చిన ఎడ్గార్ అలన్ పో దారినే నడుస్తూ, చిన్న కథని ఆధునిక కథగా మార్చి, దానికి జవసత్త్వాలిచ్చిన మహా కథకులు పందొమ్మిదో శతాబ్దంలో చాలామందే ఉన్నారు గాని, వారందరిలోనూ, ముగ్గురు ధ్రువ తారలుగా నిలబడిపోయారు.
ఒకరు ఫ్రాన్సుకి చెందిన మపాసా (1850-93), రెండవవారు రష్యాకి చెందిన చెకోవ్ (1860-1904), మూడవవారు అమెరికాకి చెందిన ఓ హెన్రీ (1862-1910). నన్ను వెన్నాడే కథల్లో మపాసా, చెకోవ్ కథల్ని ఇంతకుముందు పరిచయం చేసాను. ఇప్పుడు ఓ హెన్రీని పరిచయం చేయబోతున్నాను.
ఓ హెన్రీ అనే కలం పేరుతో రచనలు చేసిన విలియం సిడ్నీ పోర్టరు మనందరికీ దాదాపుగా హైస్కూలు రోజుల్లోనే పరిచయమై ఉంటాడు. ఇంగ్లిషు నాన్ డిటెయిల్డు రీడింగులో భాగంగా, The Gift of the Magi (1905), The Last Leaf (1907) లాంటి కథల్ని మనం చిన్నప్పుడే చదివి ఉంటాం. అదీకాక, ఇరవయ్యవ శతాబ్దం పొడుగునా, ప్రతి భాషలోనూ, ఎవరో ఒకరు ఓ హెన్రీ కథల్లోని ఇతివృత్తాల్ని తీసుకుని తాము సొంతంగా కథలు రాస్తూనే ఉన్నారు, చివరకి సినిమాలు కూడా తీస్తూనే ఉన్నారు. ఉదాహరణకి After Twenty Years (1906) ని కథకులు మళ్ళీ ఎన్ని రకాలుగా తిరిగి తిరిగి రాసి ఉంటారో చెప్పలేం. ఆ కథ మూలకథ అని చెప్పకుండా ఎన్ని సినిమాలు తీసి ఉంటారో కూడా చెప్పలేం. ఉదాహరణకి, తెలుగులో వచ్చిన ‘మంచిమిత్రులు’ (1969) సినిమా. దానికి ఒక తమిళసినిమా మాతృక ఆట! ఈ తెలుగు సినిమానే తిరిగి మళ్ళా మలయాళం, హిందీ భాషల్లో కూడా తీసారు.
తెలుగు పాఠకులకి కూడా ఓ హెన్రీ చిరపరిచితుడు. ఆయన కథలు ఎంతమంది ఎన్ని సార్లు అనువాదం చేసి ఉంటారంటే, అనువాద కథలు ప్రచురించడం కోసమే కొన్నాళ్ళపాటు నడిచిన ఒక పత్రిక, తమకి ఓ హెన్రీ కథల అనువాదాలు మాత్రం పంపొద్దని రచయితలకి విజ్ఞప్తి చేసిందట!
కానీ, కథకుడిగా ఓ హెన్రీ సామాజిక దృక్పథాన్ని గాని, లేదా ఆయన కథనశిల్పాన్ని గాని వివరిస్తూ ఇప్పటిదాకా తెలుగులో ఒక్క సమగ్ర వ్యాసం కూడా నాకంట పడలేదు. మంచి రచయితల్ని తెలుగువారు పట్టుకుంటారు, పైకెత్తుతారుగాని, వారినెందుకు మంచి రచయితలుగా భావిస్తారో ఎప్పటికీ సరిగ్గా చెప్పుకోలేరు. ఓ హెన్రీ విషయమే తీసుకోండి. ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ, ‘కొసమెరుపు’ గురించి మాట్లాడతారు. అంటే కథ ముగించేటప్పుడు, రచయిత, అంతదాకా తాను చెప్తూ వచ్చిన కథలో మనం ఊహించని ఒక చిన్న మెలిక లేదా మలుపు చూపించి పాఠకుణ్ణి నివ్వెరపరుస్తాడు. ఇది ఓ హెన్రీకే ప్రత్యేకమైన ఒక శిల్పవిశేషం. కానీ ఓ హెన్రీ అద్వితీయత దీనిమీద మాత్రమే ఆధారపడిలేదు.
ఒక శతాబ్దం గడిచిపోయేక, ఇప్పుడు ఓ హెన్రీ కథలు చదువుతుంటే, అతడిలోని సామాజిక విమర్శకుడు చాలా ప్రస్ఫుటంగా దర్శనమిస్తున్నాడు. ముఖ్యంగా, న్యూయార్కు నగరజీవితం మీద అతడు రాసిన కథలు. ఇరవయ్యవ శతాబ్దపు తొలిరోజుల్లో విస్తరిస్తున్న ఒక మహానగరపు రథచక్రాల కింద నలిగిపోతున్న అధోజగత్సహోదరుల యథార్థ గాథల్ని అతడు ఎంతో ప్రతిభావంతంగా చిత్రించాడు. ఒక మహానగరజీవితాన్ని దాని విస్మృత పార్శ్వాలనుంచి ఇంత కథనకౌశల్యంతో పట్టుకున్న కథకుడు మనకి మరొకరు కనిపించరు.
తన కాలం నాటి న్యూయార్కులో నలభై లక్షలమంది జీవిస్తుంటే, అందులో సౌకర్యవంతంగా జీవిస్తున్న నాలుగు వందలమంది గురించి మాత్రమే రాయడం సాహిత్యం కర్తవ్యం కాదనీ, చూడగలిగితే, రాయగలిగితే, నలభై లక్షలమందికీ, ప్రతి ఒక్కరికీ చెప్పుకోడానికి ఒక కథ ఉందన్నాడు. అతడు న్యూయార్కులో గడిపింది తన జీవితంలోని చివరి ఎనిమిది సంవత్సరాలే (1902-10) అయినప్పటికీ, మరే రచయితా చూడలేని విధంగా న్యూయార్కును దర్శించాడు. చిత్రించాడు. ఈ విషయంలో ఒక్క వాల్ట్ విట్మన్‌ని మాత్రమే మనం అతనితో పోల్చగలం. కానీ విట్మన్ కవి.
నేను రాజమండ్రి వదిలిపెట్టాక, పార్వతీపురంలో కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు, ఓ హెన్రీ కథలు సాకల్యంగా చదవడం మొదలుపెట్టినప్పుడు, An Unfinished Story నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. 1905 లో, ఓ హెన్రీ ఈ కథ రాస్తున్నప్పుడు, రష్యాలో టాల్‌స్టాయి నీతికథలు రాస్తూన్నాడు. కానీ నీతికథ రాసినా కూడా దాన్ని ఆధునిక కథగా ఎలా రాయాలో ఓ హెన్రీ ఈ కథ రాసి చూపించాడు. వందేళ్ళకు పైగా గడిచింది. ఇప్పుడు ప్రపంచమే ఒక న్యూయార్కుగా మారింది. స్విగ్గీలు, జొమాటోలు, బ్లింకిట్లు, ఆమెజానులు, ఫ్లిప్ కార్టులు గ్లోబు మొత్తం ఒక డిపార్టుమెంటు స్టోరుగా మారిపోయింది. కాని ఇప్పుడు లేనిదల్లా వాటిల్లో పనిచేసే నిర్భాగుల జీవితాల్ని సాధికారికంగా చిత్రించగల ఓ హెన్రీ లాంటి కథకుడు మాత్రమే.
పూర్తికాని కథ
మూలం: ఓ హెన్రీ
ఎవరేనా పవిత్రభస్మాల గురించి ప్రస్తావించగానే మనమేమీ పెద్దపెట్టున ఏడుస్తూ ఆ బూడిద నెత్తిన పోసుకోం. ప్రవచనకారులు కూడా ఈ మధ్య దేవుడు రేడియం లాంటివాడనీ, లేదా ఏదో ఒక సేంద్రియ పదార్థమో, లేదా ఏదో ఒక వైజ్ఞానిక మిశ్రమంలాంటివాడనో, లేదా మనలాంటి పాపిష్ఠి వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పాలంటే, దేవుడు ఒక రసాయన చర్యలాంటివాడనో చెప్తున్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది . అలాగని పూర్వకాలపు సనాతనులు నమ్మే పాపభీతి, దైవభీతి లాంటివి పూర్తిగా అదృశ్యమైపోయాయని అనడానికి లేదు.
అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకుండా మనకి నచ్చినట్టు మాటాడుకోడానికి రెండు విషయాలైతే ఇంకా మిగిలి ఉన్నాయి. ఒకటి, మనకొచ్చే కలల గురించి చెప్పుకోడం. రెండోది, చిలకలు మాట్లాడగా విన్నామని చెప్పుకోడం. పురాణాల్లో వర్ణించిన మన స్వప్నాధిదేవతా, పక్షులూ కూడా సాక్ష్యానికి రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. నువ్వేం చెప్తున్నా, నీ శ్రోత నువ్వు చెప్పేదాన్ని కాదనలేడు. కాబట్టి ఏదో చిలకపలుకులు వల్లించడానికి బదులు ఇటువంటి స్వప్నవృత్తాంతం ఒకటి మీతో పంచుకోబోతున్నాను. అందుకు ముందస్తు క్షమాపణలు కూడా చెప్పుకుంటూనే అనుకోండి.
నాకో కలవచ్చింది. అది ఏదో తీర్పుకి సంబంధించిన కల. అలాగని పూర్వకాలం వాళ్ళు అంతిమతీర్పు లాంటి కలగాదు.
కలలో గాబ్రియేలు మా మీద అభియోగాలు వినిపించాడు. వాటినుంచి తప్పించుకోలేనివాళ్ళం మాలాంటివాళ్ళం విచారణకు హాజరయ్యాం. మాకు పూచీకత్తులు ఇవ్వడానికి వచ్చినవాళ్ళు ఒకపక్క గుంపుగా నిలబడ్డారు. వాళ్ళు నల్లటి దుస్తులు ధరించీ ఉన్నారు. వాళ్ళ కాలర్లకి బొత్తాలు వెనకవేపు కుట్టి ఉన్నాయి. వాళ్ళు సమర్పించవలసిన జామీను పత్రాల్లో ఏదో సమస్య తలెత్తినట్టుంది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని బయటపడేసేలా కనిపించడం లేదు.
ఇంతలో చురుకైన పోలీసొకడు – దేవదూతల్లో పోలీసన్నమాట- నా మీంచి ఎగురుకుంటూ వచ్చి నన్ను తన ఎడమ రెక్కతో పట్టుకున్నాడు. ముందుముందు బాగా వృద్ధిలోకి వచ్చేట్టు కనిపిస్తున్న ఒక భూతాల గుంపు కూడా విచారణకోసం ఆ పక్కనే దగ్గరలో నిలబడి ఉన్నారు.
‘నువ్వు కూడా ఈ ముఠాకి చెందినవాడివేనా?’ అనడిగాడు ఆ పోలీసు.
‘వాళ్ళెవరు?’ అనడిగాను.
‘వాళ్ళా!’ అతను చెప్పబోతున్నాడు ‘వాళ్ళు-‘
కాని ఇదేమిటి, అసలు కథ పక్కనపెట్టేసి ఈ సొదంతా రాస్తున్నాను.
డల్సి ఒక డిపార్టుమెంటు స్టోరులో పనిచేస్తుంది. ఆ దుకాణాల్లో ఆమె హాంబర్గు లేసువస్త్రాలో, లేదా కారం తినుబండారాలో లేదా ఆటోమొబైళ్ళో లేదా రోల్డుగోల్డు నగలో ఏవో ఒకటి అమ్ముతుంటుంది. ఆ పనికి గాను ఆమెకి వారానికి ఆరుడాలర్లు వేతనం ముడుతుంది. మిగిలిన సొమ్ము, జి-గారు చూసుకునే చిట్టాల్లో, వేరెవరి ఖాతాలోనో జమవుతూ ఉంటుంది. ఆ ఖాతాల్ని, ఒక మూలశక్తి, మీ మాటల్లో చెప్పాలంటే మతాధికారులు చెప్పే మూలశక్తి నిర్వహిస్తూ ఉంటుంది.
ఆ స్టోరులో చేరిన మొదటి ఏడాది డల్సికి వారానికి అయిదు డాలర్లు వేతనం దక్కేది. ఆమె ఆ జీతంతో ఎలా నెట్టుకొస్తోందో నిజంగానే తెలుసుకోవలసిన అంశం. కానీ మీకు తెలుసుకోవాలని లేదా? మంచిది. బహుశా పెద్ద పెద్ద జీతాల గురించి మాత్రమే మీకు ఆసక్తి ఉంటుందనుకుంటాను. కాని ఆరుడాలర్లు కూడా పెద్దమొత్తమే ఆ ఆరు డాలర్ల మీదా ఆమె ఆ వారమంతా ఎలా బతికేదో చెప్తాను, వినండి.
ఒక రోజు సాయంకాలం ఆరింటికి, డల్సి తన మెడుల్లా అబ్లాంగేటాలో అంగుళంలో ఆరోవంతు దిగబడేలాగా తన టోపీ పిన్ను గుచ్చుకుంటూ, తనలాగే పనిచేసే అమ్మాయి, తనకి ఎడమపక్కనుండే, తన స్నేహితురాలు సాడీతో అంది కదా
‘సాడీ నీకో సంగతి చెప్పాలి. ఈ రోజు సాయంకాలం నేను పిగీతో డిన్నరుకి వెళ్తున్నాను.’
‘నిజ్జంగా!’ అరిచినంత పనిచేసింది సాడీ. ‘నువ్వెప్పుడూ ఇలా వెళ్ళలేదు కదా! నువ్వెంత అదృష్టవంతురాలివో తెలుసా! పిగీ భలే మనిషి. అతను అమ్మాయిల్నెప్పుడూ భలే చోట్లకి తీసుకెళ్తుంటాడు. మొన్నో రోజు బ్లాంచ్ ని హాఫ్ మన్ హౌజుకి తీసుకెళ్ళాడు. అక్కడంతా భలే సంగీతం, మొత్తం భలేగా ఉంటుందిలే. నువ్వు భలే మజా చెయ్యబోతున్నావు, తెలుసునా డల్సీ ‘ అని అంది.
డల్సి త్వరత్వరగా ఇంటిబాట పట్టింది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. తన జీవితంలో-ఇన్నాళ్ళకు యథార్థంగా – ఒక అరుణోదయం ఉదయించబోతున్నట్టుగా ఆమె చెక్కులు ఎర్రబారాయి. ఆ రోజు శుక్రవారం. కిందటి వారం జీతంలో ఆమె దగ్గర యాభై సెంట్లు మిగిలి ఉన్నాయి.
సాధారణంగా ఆ వేళప్పుడు ఉరకలెత్తే జనప్రవాహపు వరదతో వీథులు నిండి ఉన్నాయి. ఎక్కడెక్కడినుంచో, మైళ్ళ దూరం నుంచి, యోజనాల దూరం నుంచి, వందలాది యోజనాల దూరం నుంచి వచ్చి దగ్ధం కావడామెలానో నేర్చుకొమ్మని రెక్కలపురుగుల్ని రెక్కలపురుగులకి చెప్తున్నట్టుగా బ్రాడ్వేలో విద్యుద్దీపాలు ధగధగలాడుతున్నాయి. చక్కగా కత్తిరించి కుట్టిపెట్టిన దుస్తులు తొడుక్కున్న మగవాళ్ళు, పూర్వకాలపు నావికుల ఇళ్ళల్లో కనిపించే నగిషీ పనిలాగా చక్కగా తీర్చిదిద్దిన ముఖాల్తో డల్సీనే తేరిపారచూస్తూ ఉన్నారు. వారిని పట్టించుకోకుండా, ఆమె వడివడిగా, వారిని దాటుకుంటూ ముందుకు పోతున్నది. రాత్రిపూట వికసించే నాగజెముడు పువ్వులాంటి మన్ హాట్టన్ నగరం అప్పటిదాకా చచ్చుబడ్డట్టు ముడుచుకున్న తన తెల్లని పూలరేకల్ని విప్పారుస్తూ కటువైన పరిమళం వెదజల్లుతున్నది.
చౌకగా సరుకులమ్మే ఒక దుకాణం దగ్గర ఆగి ఆమె తన దగ్గరుండే యాభై సెంట్లతోటీ ఒక ఇమిటేషను కాలరు కొనుక్కుంది. నిజానికి వేరేవాటిమీద ఖర్చుపెట్టవలసిన సొమ్ము అది. అందులో పదిహేను సెంట్లు రాత్రిభోజనానికీ, పది సెంట్లు మధ్యాహ్న భోజనానికీ పోగా, ఒకటీ అరా పొదుపుచేసుకోవలసి ఉంది కూడా. మామూలుగా అయితే ఇంకో అయిదు సెంట్లతో తీపి మిఠాయిలాంటిది కొనుక్కునేది. ఆ మిఠాయినో లేదా ఆ జీడిపాకమో నముల్తుంటే, ఏదో పంటినొప్పితో బాధపడుతున్నవాడి బుగ్గల్లాగా, ఆమె బుగ్గలు బాగా ఊరినట్టు, పుష్టిగా కనిపించేవి. అది ఒకరకంగా దుబారాఖర్చునే, ఇంకా చెప్పాలంటే తాగితందనాలాడటం లాంటిదే-కాని అలాంటి చిన్న చిన్న సంతోషాలు కూడా లేకపోతే జీవితానికి అర్ధమేముంది?
ఫర్నిచరుతో సహా అద్దెకు దొరికేలాంటి ఒక గదిలో డల్సి నివసిస్తోంది. ఇటువంటి గదుల్లో నివాసానికీ లేదా ఏదన్నా హాస్టల్లో ఉండటానికి మధ్య ఒక తేడా ఉంది. ఇలాంటి గదుల్లో నువ్వు తిండిలేక పస్తుపడుకుంటే ఆ సంగతి మూడో కంటికి తెలీదు.
డల్సి మెట్లెక్కి గదిలో అడుగుపెట్టింది. పడమటి ముఖంగా ఉండే ఇటుకరంగు భవంతిలో మూడో అంతస్థులో ఉండే ఆ గదిలో అడుగుపెట్టి ఆమె గాసు వెలిగించింది. శాస్త్రవేత్తలు వజ్రం అత్యంత దుర్భేద్యమైన పదార్థం అని చెప్తారు. కానీ వాళ్ళకి తెలీదు.ఇలాంటి గదులు అద్దెకిచ్చే యజమానురాళ్ళకి అంతకన్నా దుర్భేద్యమైన పదార్థం గురించి తెలుసు. వాళ్ళు గాసుబర్నర్లలో కుక్కిపెట్టేది దాన్నే. నువ్వు కుర్చీ ఎక్కిమరీ నీ చేతులు ఎర్రబారిపోయి బొబ్బలెక్కేదాకా దాన్ని తవ్వి చూసినా, పొడిచి చూసినా ఆ పదార్థం బయటికి రాదు. జడపిన్ను తో గుచ్చి లాగాలనుకున్నా లాగలేవు. అది బ్రహ్మపదార్థం.
మొత్తానికి, డల్సి గాసు వెలిగించింది. కొవ్వొత్తి వెలుగులో నాలుగోవంతు కనిపిస్తున్న ఆ వెలుతురులో మనం ఆమె గదిని పరిశీలనగా చూద్దాం.
ఆ గదిలో,మంచం, పరుపు, డ్రెస్సింగు సామాను పెట్టుకునే చెక్క బీరువా, వాష్ స్టాండు, కుర్చీ- ఈ సామగ్రి వరకూ ఇంటియజమానురాలు మూటకట్టుకున్న పుణ్యం లేదా పాపం. తక్కినవన్నీ డల్సీ సొంతం. ఆ డ్రెస్సింగు బీరువా మీద ఆమె సంపద మొత్తం ఉంది- సాడీ బహుమతిగా ఇచ్చిన ఒక గిల్టు పింగాణి గిన్నె, పచ్చళ్ళ కంపెనీ వాళ్ళ కాలండరు, స్వప్నశాస్త్రాన్ని వివరించే ఒక పుస్తకం, బియ్యప్పిండితో ఉన్న ఒక గాజుగిన్నె, గులాబిరంగు రిబ్బనుకు గుచ్చిపెట్టిన నకిలీ చెర్రీలు.
ఆ డ్రెస్సింగు బీరువా మీద గీతలు పడిపోయిన అద్దం పక్కనే జనరల్ కిచ్నరు, మల్లయోధుడు విలియం మల్డూను, దొరసాని మార్ల్ బరో, ఇటాలియను శిల్పి బెనెవెంటునో చెల్లినీ చిత్రపటాలు కూడా ఉన్నాయి. ప్లాస్టరు ఆఫ్ పారిసులో పోతపోసిన ఒక బొమ్మ ఒకవేపు గోడకి తగిలించి ఉంది. దానికి రోమను శిరస్త్రాణం కూడా ఉంది. దాని పక్కన ఒక వర్ణచిత్రం. నిమ్మకాయరంగులో ఉన్న పిల్లవాడొకడు ఒక సీతాకోకచిలుకని వేటాడుతున్నట్టున్న హింసాత్మక దృశ్యం అది. చిత్రకళకి సంబంధించినంతవరకూ డల్సి అత్యున్నత అభిరుచికి ఆ బొమ్మ నిదర్శనం. ఇప్పటిదాకా ఆ అభిరుచిని ఖండించినవాళ్ళెవరూ లేరు. చోరీకి గురయ్యే శిల్పాల గురించిన వార్తలు ఆమెదాకా రానే రావు. ఇక ఆ పిల్లవాణ్ణి చూసి వాడో పిల్ల కీటకశాస్త్రజ్ఞుడిలా కనిపిస్తున్నాడే అని విమర్శించేవాళ్ళూ ఆమెకి తారసపడలేదు.
పిగీ ఏడింటికి ఆమె దగ్గరకి రావలసి ఉంది. ఈలోగా ఆమె తయారయ్యేలోపు మనం ఆమె గురించి మరికొంత లోకాభిరామాయణం సాగిద్దాం.
ఈ అద్దె గదికి డల్సి వారానికి రెండేసి డాలర్ల చొప్పున చెల్లిస్తుంది. మామూలు రోజుల్లో పొద్దుటిపూట అల్పాహారానికి రోజుకి పదిసెంట్లు ఖర్చుపెడుతుంది. తాను ఒకవైపు పనిలోకి వెళ్ళడానికి తయారవుతూనే మరోవైపు గాసులైటుమీద ఒక కోడిగుడ్డు ఉడికించుకుని, కప్పు కాఫీ కాచుకుని తాగుతుంది. ఆదివారం ఉదయాలు బిల్లీస్ రెస్టరెంటులో ఇంత మాంసం కూరా, నాలుగు పండ్లముక్కల్తో మహరాజులాగా విందారగించి, తనకి హోటల్లో వడ్డించేమనిషికి పదిసెంట్లు టిప్పు కూడా ఇస్తుంది. ఆడంబరంగా జీవించాలనుకుంటే న్యూయార్కు దగ్గర చాలానే ప్రలోభాలున్నాయి. ఆమె మధ్యాహ్నభోజనాలు తన దుకాణం వారి రెస్టరెంటులోనే కానిస్తుంది. వాటికి వారానికి అరవైసెంట్లు ఖర్చవుతాయి. రాత్రి భోజనాలకి 1.05 డాలర్లు ఖర్చుపెడుతుంది. సాయంకాలం వార్తాపత్రికలకి-అసలు వార్తాపత్రిక చదవకుండా ఉండే న్యుయార్కువాసి అంటూ ఉంటే చూపించండి!- వాటికి ఆరుసెంట్లు; ఆదివారమొస్తే రెండు పత్రికలు, ఒకటి ఉద్యోగప్రకటనలు చూసుకోడానికీ, రెండోది తీరిగ్గా చదూకోడానికీ, వాటికి పది సెంట్లు. మొత్తం ఖర్చు 4.76 డాలర్లు. ఇంక అప్పుడప్పుడు కొత్త గుడ్డలు కూడా కొనుక్కోవాలి, గానీ-
ఇంక చెప్పడం నావల్లకాదు. ఆమె కొత్త దుస్తులు కొనుక్కోడానికి బేరసారాలు చేస్తుంటుందనీ, చక్కగా కుట్లూ, అల్లికలూ చేసుకుంటుందనీ విన్నానుగానీ, నాకైతే నమ్మకం లేదు. సాధారణంగా, స్త్రీలోకం నోచుకునే అలిఖిత, పవిత్ర, సహజ సంతోషాలు డల్సికి కూడా లభ్యమవుతున్నాయని రాయాలని ఉంటుందిగాని, నా కలం మొరాయిస్తోంది. బహుశా భగవంతుడు ఆ సంతోషాల్ని ఆమె నుదుటిన రాసిపెట్టలేదనుకోవాలి. ఆమె జీవితంలో రంగులరాట్నమంటూ ఎక్కింది రెండు సార్లే. ఎవరేనా మామూలుగా ఇన్నేసిగంటలపాటు సంతోషంగా గడిపేరని చెప్పాల్సిన విషయాలు ఎప్పుడో ఒకటీ అరా వేసవికాలాల్లో మాత్రమే గడిపేరని చెప్పాలంటే నీరసమొస్తుంది.
పిగీని వర్ణించడానికి అతని పేరొక్కటీ చాలు. ఆడపిల్లలు అతణ్ణి పిగీ అని పిలుస్తున్నప్పుడు పందులు తమ పవిత్రవంశానికి అప్రతిష్ట కలిగినట్టు భావిస్తాయి. నీలం రంగు పాఠ్యపుస్తకాల్లో అక్షరాలూ, పదాలూ నేర్చుకోడం మొదలుపెట్టినప్పుడు, ఆ మూడక్షరాల పదంతోనే పిగీ జీవితకథ మొదలవుతుంది. అతను బాగా కొవ్వుపట్టి ఉంటాడు. అతడి ఆత్మమాత్రం ఎలకది. అలవాట్లు గబ్బిలానివి. ఔదార్యం విషయానికొస్తే పిల్లులు గుర్తొస్తాయి. బాగా ఖరీదైన గుడ్డలు తొడుక్కుంటూ ఉంటాడు. తిండిలేక ఆకలితో పస్తులుండే మనుషుల్ని కనిపెట్టడంలో అతడు గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. దుకాణాల్లో పనిచేసే ఏ అమ్మాయినైనా చూసీ చూడగానే ఆమె ఇంత రొట్టే, ఇన్ని టీనీళ్ళూ తాగి ఎన్నాళ్ళయ్యిందో, లేదా ఇంకా చెప్పాలంటే, ఎన్ని గంటలయ్యిందో ఇట్టే చెప్పగలడు. ఎప్పుడూ బజారు వీథులు పట్టుకు వేలాడుతుంటాడు. అక్కడ పనిచేసే ఆడపిల్లల్ని డిన్నరుకి రమ్మని ఊరిస్తూ ఉంటాడు. తమ కుక్కల్తో పాటు వీథుల్లో వ్యాహ్యాళికిపోయే పెద్దమనుషులు అతణ్ణి చూస్తే చాలు ఈసడించుకుంటూ ఉంటారు. మొత్తానికి అతడో రకం. ఇంక అతడి గురించి ఎక్కువ రాయలేను. నా కలం ఉన్నది అటువంటి వాళ్ళ గురించి రాయడానికి కాదు. నేనేమీ వడ్రంగిని కాను.
ఏడుగంటలవడానికి ఇంకో పదినిమిషాలుండగానే డల్సి తయారైపోయింది. గీతలు పడ్డ ఆ మసకటద్దంలోనే ఆమె తనని తాను చూసుకుంది. తన ప్రతిబింబం తనకే సంతృప్తికరంగా కనిపించింది. చిన్నపాటి ముడత కూడా లేకుండా, ఆ ముదురునీలం రంగు డ్రెస్సు, సరిగ్గా పట్టినట్టుంది. నెత్తిమీద టోపీ, దానికొక సొగసైన ఈక, చేతికి తొడుక్కున్న గ్లోవులు కొద్దిగా మాసినట్టున్నాయిగాని-మొత్తం మీద ఆ వేషం చూస్తే, ఆమె ఒక ఆత్మపరిత్యాగిలాగా, ఆమాటకొస్తే, ఆకలిదప్పులు కూడా త్యాగం చెయ్యగలిగేదానిలానే కనిపిస్తూంది.
తాను అందంగా ఉన్నానన్న ఊహ ముందు డల్సి తక్కినవన్నీ ఒక క్షణం పాటు మర్చిపోయింది. జీవితం తన రహస్యమైన ముసుగుని తనకోసం ఒకింత తొలగించి ఏవో అద్భుతాలు చూపించబోతున్నట్టే ఉంది. తళతళ్ళాడే ఒక వైభవోజ్జ్వల ప్రపంచంలోకి ఆమె ఇప్పుడు కొన్నిక్షణాలేనా అడుగుపెట్టబోతున్నది.
పిగీ డబ్బులు ఖర్చుపెట్టడానికి వెనకాడడనే అమ్మాయిలు చెప్తుంటారు. అతడితో వెళ్తే, ఆ డిన్నరు గొప్పగా ఉంటుందనీ, చక్కటి సంగీతమూ, చూడ చక్కగా ఉండే మహిళలూ, అక్కడ దొరికే తిండీ లాంటి వాటి గురించి చెప్తున్నప్పుడు ఆ అమ్మాయిలకి నోరూరిపోతూ, చెప్పడం కష్టమయిపోయేది. సందేహం లేదు, అతడు తనని కూడా మళ్ళీ మళ్ళీ అలాంటి డిన్నర్లకి రమ్మంటూనే ఉంటాడు.
నీలం రంగు సూటు ఒకటి ఆమెకి ఒక దుకాణంలో షోకేసులో కనిపించింది. వారానికి పదిసెంట్లు చొప్పున కాకుండా ఇరవై సెంట్లు చొప్పున ఆదాచేసుకుంటూ పోతే- ఎన్నాళ్ళు పడుతుంది- ఓహ్- కొన్నేళ్ళు పడుతుంది అది కొనాలంటే! కాని ఏడో వీథిలో ఒక సెకండు హాండు దుస్తుల దుకాణం ఉందే, అక్కడైతే-
ఇంతలో ఎవరో తలుపు తట్టారు. డల్సి తలుపు తెరిచింది. కృత్రిమంగా నవ్వుతూ ఇంటియజమానురాలు గుమ్మం దగ్గర ప్రత్యక్షమైంది. డల్సి వంటగాసు మరీ ఎక్కువ వాడేస్తోందా చూద్దాం అన్నట్టు ముక్కు ఎగబీలుస్తూ.
‘కింద నీకోసం ఎవరో పెద్దమనిషి ఎదురుచూస్తున్నాడు ‘ అన్నది ఆమె ‘అతడి పేరు విగ్గిన్స్ అంట.’
తన పట్ల గౌరవం చూపించే దురదృష్టవంతులకి అతడు ఆ నామవాచకంతోటే పరిచయమవుతాడు.
తన జేబురుమాలు కోసం డల్సి డ్రెస్సింగు టేబులు వేపు తిరిగి, ఒక క్షణం స్తబ్ధుగా నిలబడిపోయి, తన కిందిపెదవి బలంగా కొరుక్కుంది. అద్దంలో చూసినప్పుడు, తాను, సుదీర్ఘ నిద్రనుంచి అప్పుడే మేల్కొన్న, ఒక మాంత్రికలోకపు రాకుమారిని చూసింది. ఆ సమయంలో, తన అందమైన, గంభీరమైన, కించిద్విషాదభరిత నయనాల్తో ఒకే ఒక్కరు తనని చూస్తున్నారని మర్చిపోయింది. ఆమె ఏమి చేసినా దాన్ని అంగీకరించడానికో లేదా అభిశంసించడానికో సమర్ధులైన ఒకే ఒక్కరు. ఆ డ్రెస్సరు మీద ఉన్న గిల్టుఫొటో ఫ్రేములోంచి, జనరల్ కిచ్నర్, సన్నగా, పొడుగ్గా, తన సుందర, విచారభరిత వదనం మీద కదలాడుతున్న అద్భుత నేత్రాల్తో నిందాపూర్వకంగా ఆమెనే చూస్తున్నాడు.
తనంతటతనే తిరిగే మరబొమ్మలాగా డల్సి ఇంటియజమానురాలివేపు తిరిగింది
‘నేను రాలేనని చెప్పండి’ అంది నీరసంగా. ‘నాకు ఒంట్లో బాలేదనో, ఏదో ఒకటి చెప్పండి. నేను బయటకు వెళ్ళాలనుకోటం లేదని చెప్పండి.’
తలుపు మూసేసి లోపల గడియ పెట్టేసాక, డల్సి మంచం మీద వాలిపోయి, చేతుల్లో టోపీ నలిపేసుకుంటూ , పదినిమిషాల పాటు భోరున ఏడ్చింది. అక్కడ, అప్పుడు, జనరల్ కిచ్నర్ ఒక్కడే ఆమె స్నేహితుడు. డల్సి కలగనే ఆదర్శసాహసవీరుడు అతడు మాత్రమే. అతడి చూపులు చూస్తుంటే, అతడికి ఎవరితోనూ పంచుకోలేని ఏదో రహస్య దుఃఖం ఉన్నదా అన్నట్టూ, అద్భుతమైన అతడి మీసం ఒక స్వప్నమన్నట్టూ కనిపిస్తున్నాడు. అతడి కళ్ళల్లో కనిపించే ఆ సుకోమలమైన, కానీ గంభీరమైన ఆ దృక్కులంటే ఆమెకి ఒకింత భయం కూడా. అతడు ఎప్పుడో ఒకప్పుడు తన ఇంటి తలుపు తడతాడనీ, అతడి కృపాణం ఎత్తైన అతడి బూట్లకి తగులుకుంటూ చప్పుడు చేస్తుండగా, తనంతట తనే వచ్చి ఆమెని వరిస్తాడనీ, ఆమెకేవో చిన్నపాటి ఊహాగానాలుండేవి. ఒకసారి ఎవరో ఒక పిల్లవాడు దీపస్తంభానికి ఏదో గొలుసు రాపాడిస్తున్న చప్పుడు విని ఆమె కిటికీ తలుపు తెరిచి చూసింది. కాని ఏం లాభం! ఎందుకంటే అప్పుడు జనరల్ కిచ్నర్ ఎక్కడో దూరంలో, జపానులో ఉన్నాడనీ, తన భీకరసైన్యంతో తురుష్కులమీద దండయాత్ర చేస్తున్నాడనీ, అతడు తన గిల్టు ఫ్రేములోంచి ఎప్పటికీ ఆమెకోసం బయటకి రాడనీ ఆమెకు తెలుసు. అయినప్పటికీ అతడి ఒక్క చూపు ఆ రాత్రికి పిగీని పక్కకు నెట్టిపారేసింది. అవును. ఆ రాత్రికి.
ఏడుపైపోయాక డల్సీ లేచి తాను అంతదాకా తొడుక్కున్న దుస్తులు విప్పి పక్కన పెట్టేసి, తన నీలం రంగు పాత గౌను తొడుక్కుంది. ఆ రాత్రికి ఇంకా ఆమెకి భోజనం చెయ్యాలనిపించలేదు. తనకిష్టమైన ఒక సినిమాపాట రెండు చరణాలు కూనిరాగం తీసింది. తన ముక్కుమీద ఎర్రని దద్దురు కనిపిస్తే దాన్ని పరీక్షగా చూసుకుంది. ఆ పరిశీలన పూర్తయ్యాక, కోళ్ళు సరిగ్గా లేక ఊగుతున్న టేబులుకి దగ్గరా కుర్చీ లాక్కుని పాత పేకముక్కలు తీసుకుని తన అదృష్టం ఎలా ఉందో చూసుకోడానికి ప్రయత్నించింది.
‘ఎంత దారుణం? ఎంత అవమానకరం!’ అని గట్టిగా అనుకుంది ‘అదీకాక నేను తనతో వస్తానని మాటివ్వలేదే, అసలు వాడికి అలాంటి ఊహలు కలిగేలాగా వాణ్ణెప్పుడూ చూడను కూడా చూడలేదే!’
తొమ్మిదింటికి ఆమె తన ట్రంకుపెట్టెలోంచి బిస్కట్ల పొట్లాం, జామూ బయటకి తీసి, వాటితో విందు భోజనం ఆరగించింది. ఒక బిస్కట్టుముక్కకి కొంత జాము రాసి జనరల్ కిచ్నర్ కి నైవేద్యం పెట్టింది. కాని జనరల్ చూపులు చూస్తుంటే స్ఫింక్సు మహావిగ్రహం ఒక సీతాకోక చిలుకని చూసినట్టు చూస్తున్నాడు- కాకపోతే ఎడారుల్లో కూడా సీతాకోక చిలుకలుండాలనుకోండి.
‘నీకు తినాలని లేకపోతే తినకు’అంది డల్సి. ‘అంతే తప్ప మరీ అలా గొప్పలు పోతూ, నీ చూపుల్తోనే నా మీద విరుచుకుపడకు. నువ్వు కూడా వారానికి ఆరుడాలర్ల మీద బతకాల్సి వస్తే, నువ్వు నిజంగా ఇంత గొప్పలు పోయేవాడివా, ఇంత విసుగ్గా మొహం పెట్టేవాడివా అనిపిస్తుంది నాకు.’
కాని జనరల కిచ్నర్ పట్ల మరీ అంత కోపం చూపించడం డల్సీకి సంతోషం కాదు. అందుకని ఆమె ఒకింత కినుకతో బెనువెనుటో చెల్లినీ ముఖాన్ని కిందకు వంచేసింది. ఆ పనిచేసినందుకు ఆమెకేమీ బాధలేదు. ఆమె దృష్టిలో చెలీని ఎనిమిదో హెన్రీ లాంటివాడే. కాబట్టి అతడంటే ఇష్టం లేదు.
తొమ్మిదిన్నరకి డల్సి డ్రెస్సరు మీద ఉన్న చిత్రాలన్నిటినీ చివరగా ఒక సారి చూసి, దీపం ఆర్పేసి, దుప్పటి ముసుగుదన్నింది. జనరల్ క్రిచ్నర్ కీ, విలియం మల్డూన్ కీ, దొరసాని మాల్బరోకీ, బెనెవెనుటో చెల్లినీకి గుడ్ నైట్ చెప్తూ నిద్రలోకి జారుకోడం మామూలు విషయం కాదు.
ఈ కథ ఇంతకుమించి ముందుకు నడిచేది కాదు. ఒకవేళ మళ్ళా ముందుకు నడిచినా, అదంతా మళ్ళా మామూలుగా జరిగేదే. పిగీ మళ్ళా డల్సీని తనతో పాటు డిన్నరుకి రమ్మని పిలవడం, ఎప్పట్లానే ఆమెకి తాను ఒంటరినని అనిపించడం, జనరల్ క్రిచ్నర్ మళ్ళా ఆమెని అదోలా చూడడం, అప్పుడు-
ముందుముందు బాగా వృద్ధిలోకి రాబోతున్న భూతాల గుంపు పక్కన నిలబడ్డట్టు కలగన్నానని చెప్తున్నాను కదా, అప్పుడొక పోలీసు నన్ను రెక్కతో పట్టుకుని ‘నేను కూడా వాళ్ళల్లో ఒకణ్ణా’ అనడిగాడు.
‘వాళ్ళెవరు’ అనడిగాను.
‘బతకడానికి వారానికి అయిదో ఆరో డాలర్లు జీతమిచ్చి ఆడపిల్లల్ని పనిలోకి తీసుకునే పెద్దమనుషులు వాళ్ళు. నువ్వు కూడా ఆ బాపతేనా?’ అనడిగాడు ఆ పోలీసు.
‘కాదు, మహాప్రభో, ఎంత మాత్రం కాదు’ అని అన్నాను. ‘నేను కేవలం అనాథశరణాలయాలకు నిప్పటించే రకం మనిషిని లేదా గుడ్డివాడిదగ్గరుండే చిల్లరనాణేల కోసం వాణ్ణి చంపేసే రకాన్ని మాత్రమే’ అని జవాబిచ్చాను.
27-1-2026


కథ చదువుతుంటే , కథా గమనంతో పాటు భావ గమనం సమాంతరంగా పయనించింది. ప్రారంభంలో కథ చిన్న కథ వివరణ కథలు చదవడం వేరు , అధ్యయనం చేయడం వేరు అని బోధపడింది. చిన్నతనంలో చందమామ కథలనుండీ , ఆపై పలు పత్రికలలో చదివిన వేల కథల్లో వేళల మీద లెక్కబెట్టే కథలు మాత్రమే గుర్తుకు వచ్చాయి.ఆంధ్రప్రభ వారపత్రికలో అప్పట్లో ఓ హెన్రీ కథలు చదివి అప్పటికప్పుడు ఆనమదించడమే తప్ప ఇంత సార్థకత గురించి అప్పట్లో చెప్పే వారెవరూ లేకపోయారనే భావం కలిగింది. దానితో పాటే తాము చదివిన పుస్తకాల గురించి చర్చించుకునే చదువరుల సమూహాలు ఊరూరా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది . కథలో న్యూయార్క్ గురించీ, మన్ హాట్టన్ గురించీ చదువుతున్నప్పుడు నేను సంచరించిన మన్ హాట్టన్ వీథలూ సందర్శనా స్థలాలతో పాటు , మనుషులు నడిపించే రిక్షా ఎక్కిన సందర్భం , పొట్టకూటికై మనుషులను చూస్తూ బొమ్మలు గీసేవాళ్లూ, గుర్రపు బగ్గీలు నడిపే వాళ్లూ,లిబర్టీ సిటాచియూలమ్ముకునే వాళ్లూ గుర్తుకు వచ్చారు. డల్సీ పాత్ర మనస్సులోని సంఘర్షణ, వేషధారణ , రచయిత సూక్ష్మ పరిశీలనను , ఒక సగటు జీవి జీవన మూలాలను , మూల్యాలను స్పర్శించే విధానం ఆలోచింపజేసింది. ముగింపులో ఎక్కుపెట్టిన సామాజిక వ్యంగ్యాస్త్రం రచయిత పరిణతనూ ఎందుకు ప్రసిద్ధులయ్యారో అనే విషయాన్ని చెప్పక చెబుతున్నది.
కాసేపు మళ్లీ మన్హాటన్ చుట్టూ తిరిగి జ్ఞాపకాలు ఇంకా పదిలంగా పచ్చిగానే ఉన్నాయని అనిపించడం ఇలా అనేక భావాల సమన్వయం లో మనిషి గురించి తాపత్రయపడే రచయిత , కవి , సాహితీ పరుని గురించి ఆలోచన మెదిలింది .
ఇదివరకు పూలలో తేనె జుర్రి
ఒళ్లంతా రంగులు పులుముకునే సీతాకోకచిలుకలే చూడటం తెలుసు
మకరందం త్రాగి ఓంకారం ఝంకరించే
తుమ్మెదలూ ,తేనె పంచి పెట్టే తేనెటీగలనూ గమనించాలనీ, ఇంకా ఎన్నెన్నో భావాలు అంకురించాయి. మీకు నమస్సులు