నిజంగా ఉదారచరితులు!

ఉదారచరితులు పుస్తకం మీద మిత్రులు కల్లూరి భాస్కరంగారు రాసిన సహృదయ స్పందన. వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. నా పుస్తకాల్లో ఇంత సమగ్రమైన సమీక్ష ఇదే మొదటిసారి నేను చదవడం!


మాటలకు లోతూ, చూపులకు వైశాల్యమూ సంతరించే రచన

కల్లూరి భాస్కరం

వాడ్రేవు చినవీరభద్రుడు గారి ‘ఉదారచరితులు-వారిది వసుధైక కుటుంబం’ పుస్తకం సగం చదివాక ప్రయాణాలు వచ్చిపడ్డాయి, చోటుమారింది. ఆ వెంటనే రాబోయే నా పుస్తకానికి సంబంధించిన పనిలో పడాల్సివచ్చింది. మారిన చోట కుదుటపడుతూ పుస్తకం పని పూర్తి చేశాక తిరిగి వీరభద్రుడుగారి పుస్తకం చదవడం ప్రారంభించి పూర్తిచేశాను.

ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో నన్ను నేను దర్శించుకుంటున్నట్టే కాక, ఎన్నో కొత్త ఆలోచనలను దర్శించుకుంటున్న అనుభూతి కలిగింది. అవడానికి ఇది కేవలం 184 పేజీల పుస్తకమే, కానీ అందులోని విషయానికున్న బరువుతోనే తప్ప పేజీల సంఖ్యతో కొలవాల్సిన పుస్తకం కాదు.

మనం చూసే చూపులు, మనకు కలిగే ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, రాసే రాతలు రకరకాల అంతరవుల తేడాతో ఉంటాయి. కొన్ని కొన్ని మాటలనూ, కొన్ని కొన్ని రాతలనే తీసుకుంటే, అవి నాలుక చివరినుంచి, కలం చివరినుంచి లేదా ల్యాప్ టాప్ కీబోర్డు మీద ఆడే వేలి కొసలనుంచి జాలువారుతూ ఉంటాయి. అలాంటివి ఎన్ని వందల పేజీలకు విస్తరించినా విషయపరంగా వాటి బరువు పెరగదు. కానీ కొన్ని మాటలూ, కొన్ని రాతల పంక్తుల మధ్యలో మన కంటికి కనిపించని లోతూ, వైశాల్యమూ వ్యాపించి ఉండి పుస్తకం బరువు పెంచుతూ ఉంటాయి. ‘ఉదారచరితులు’ పుస్తకం అటువంటిది.
మన మామూలు చూపులకూ, ఆలోచనలకూ కూడా ఇదే వర్తిస్తుంది. ప్రజలూ, సమాజం, రాజకీయాలు, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర- దేని గురించైనా కానీ, వర్తమానానికీ, మన ప్రాంతానికీ, దేశానికీ పరిమితమయ్యే మేరకే మన చూపుల్ని, ఆలోచనల్ని కుంచించుకుంటూ ఉంటాం, ఆ చూపుకు అందిన మేరకే వాటిపై వ్యాఖ్యానిస్తాం. అలాకాకుండా, వర్తమానపు గాఢత నుంచి గతపు లోతుల్లోకి వెళ్ళి ఆ తర్వాత భవిష్యత్తులోకి తేరి చూడడం ద్వారా మూడుకాలాలనూ ముడివేయగల వైశాల్యాన్ని మన చూపులూ, ఆలోచనలూ, అవగాహనా సంతరించుకున్నప్పుడు మాటే మంత్రమూ, వాక్యమే గొప్ప సందేశాత్మకమూ అవుతాయి. నాలుక చివరి మాటలకూ, వేలికొసలనుంచి జాలువారే రాతలకూ ఉన్న తేడా అర్థమవుతుంది. ఈ పుస్తకంలో అలాంటి త్రికాలదర్శనాన్ని ఆవిష్కరించే దార్శనికత కనిపిస్తుంది.

ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే, మన చూపుల్ని, ఆలోచనల్ని కుంచించుకోవడం దేశభక్తిగా, జాతీయతాస్ఫూర్తిగా భావించి ఆరాధించడం ఇప్పుడు పరిపాటి అయింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ఎంత భక్తి, గౌరవం, ప్రేమ ఉంటాయో పుట్టిపెరిగిన గడ్డమీద కూడా అంతే ఉంటాయి; అది ప్రాకృతికధర్మం. కానీ ఇప్పుడు ‘దేశభక్తి’ అనే మాట, దేశాన్ని ఒక భౌతికవాస్తవంగా కొన్ని సరిహద్దులమధ్య ఊహించుకోవడంతో జతపడి ప్రాచుర్యంలోకి వచ్చింది. అలా చూపులకూ, ఆలోచనలకూ, అవగాహనకూ సరిహద్దులు గీసుకోవడం ఒక ఆదర్శంగా పరిణమించింది. చారిత్రకంగా జాతీయరాజ్యభావననుంచి పెంపొందిన ఆదర్శం అది.

కానీ ఈ పుస్తకం ఏం చేస్తుందంటే, మన చూపుల్నీ, ఆలోచనల్నీ, అవగాహననూ దేశాల సరిహద్దులను దాటించి, దేశాల స్థానంలో, వాటికి ఉనికిచ్చిన మనిషిని ఆవిష్కరిస్తుంది. మనిషి ప్రాతిపదికగా కొత్త సరిహద్దులు గీసి చూపడానికి ప్రయత్నిస్తుంది. అవడానికి రచయిత ఇందులోని విషయాన్ని ‘అంతర్జాతీయరంగం’, ‘జాతీయరంగం’, ‘తెలుగు సమాజం’, ‘చరిత్ర, పురాణాలు, సామాజికగమనం’, చివరిగా- ‘మరో రెండు మాటలు’ అనే శీర్షికలతో ఆరు విభాగాలు చేసినా వాటన్నిటిలో ఏకసూత్రంగా మనిషీ, అతణ్ణి మనిషిని చేసే లక్షణాలు, అతని ఔన్నత్యాలు, అతను పూరించుకోవలసిన కొరతలే ఇతరేతర హద్దులకు అతీతంగా ప్రధానభూమిక వహిస్తూ ఉంటాయి. ఆవిధంగా ప్రతి వాక్యమూ, ప్రతి వ్యాఖ్యా త్రికాలవ్యాప్తమైన లోతునూ, వైశాల్యాన్నీ సంతరించుకుని ఉంటాయి.

‘అంతర్జాతీయరంగం’ అనే విభాగంలోని తొలి రెండు వ్యాసాలలో 2015లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న రష్యన్ రచయిత్రి స్వెత్లానా అలెగ్జీవిచ్ గురించి రాస్తారు. అఫ్ఘానిస్తాన్ లో సోవియెట్ యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాలకూ, 1986లో చెర్నోబిల్ లో సంభవించిన అణుప్రమాదబాధితుల గాథలకూ ఆమె అక్షరరూపమిచ్చింది. మానవవిషాదాన్నే తన ప్రధాన ఇతివృత్తం చేసుకుంది. బాధితుల మధ్యకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చేసిన ఇలాంటి రచనల స్వభావం గురించి కూడా రచయిత చర్చిస్తారు. ఈ ప్రక్రియను కేవలం జర్నలిజంగా భావించలేమంటారు. దీనిని ‘సమష్టి నవల’గా, ‘వక్తృత్వ నవల’గా, ‘సాక్ష్యరచన’గా, ‘ఐతిహాసిక బృందగానం’ గా రచయిత్రి పేర్కొనడాన్ని ఉదహరిస్తూ, ప్రక్రియ పరంగా ఇంకొక లోతైన, ఆసక్తికరమైన వ్యాఖ్యను ఉటంకిస్తారు. సోవియెట్ రచయితల దృష్టి ఎంతసేపూ బ్రహ్మాండమైన పురాణాలు నిర్మించడం మీదే ఉంటే, బెలోరష్యన్ రచయితలు, సినిమాదర్శకులు చిన్నచిన్న మనుషుల్నీ, వాళ్ళ అనుభవాల్నీ చిత్రించడం కోసమే ఎక్కువ తహతహలాడతారట.

స్వెత్లానాకు నోబెల్ రావడం నుంచి రచయితలు, ముఖ్యంగా తెలుగు సాహిత్యం తెలుసుకోవలసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించి; నేటి కాలంలో రచయిత ఇంకెంతమాత్రం ఒంటరిగా కూర్చుని రచనలు చేస్తూ ఉండడంలో అర్థంలేదనీ, నేటి సాహిత్యప్రక్రియలు సామూహికప్రక్రియలూ, సమష్టి ప్రక్రియలూ అంటూ రచయిత తనే సమాధానమిస్తారు. రైతుల ఆత్మహత్యలు సహా మన చుట్టూ సంభవిస్తున్న విషాదాలు చెర్నోబిల్ దుర్ఘటన లాంటివేననీ, వాటి బాధితుల సామూహికరోదనలకు అక్షరరూపమివ్వడానికి మననుంచి ఒక స్వెత్లానా రావడానికి ఇంతకన్నా చారిత్రకసందర్భం ఏముంటుందని ప్రశ్నిస్తూ మనిషినీ, అతని దుఃఖాన్నీ చూపులనిండా నింపుకుని వాటిని దేశాల సరిహద్దులను దాటించవలసిన అవసరాన్ని ఉద్బోధిస్తారు.

2

వాడ్రేవు చినవీరభద్రుడిగారి ఈ పుస్తకం చదువుతుంటే, నన్ను నేను పునర్దర్శించుకున్న విషయాలూ, నాలో కొత్త ఆలోచనామథనానికి తావిచ్చిన విషయాలూ ఉన్నాయన్నాను. వాటినీ, వాటితోపాటు మిగతా విషయాలనూ వీలైనంత క్లుప్తంగా చెబుదామనుకున్నాను కానీ, తీరా మొదలెడితే అదంత తేలికని అనిపించలేదు..

స్వెత్లానా అలెగ్జీవిచ్ గురించి రాస్తూ, ‘నేటి సాహిత్యప్రక్రియలు సామూహికప్రక్రియలు, సమష్టి ప్రక్రియ’ లన్న రచయిత మాటల్ని చూడగానే, సాహిత్యంలో భాగమైన ఆటపాటలు సామూహికశ్రమనుంచీ, స్పందననుంచే పుట్టాయన్న సంగతి నాకు గుర్తొచ్చింది. సామాజిక అంతరాలు పెరుగుతూ వ్యక్తి సమూహంనుంచి వేరుపడే క్రమంలోనే ఆటపాటలతో సహా సాహిత్యం వైయక్తికమవుతూవచ్చింది. ఇప్పుడు మళ్ళీ దానిని తలకిందులు చేస్తూ సాహిత్యం ప్రజాపరమూ, సామూహికనిర్మాణమూ అయిన, అవుతున్న క్రమానికి స్వెత్లానా అలెగ్జీవిచ్ రచనలు అద్దంపడుతున్నాయన్న అన్వయానికి ఇది అవకాశమిచ్చింది.

అలాగే బెన్ ఒక్రి అనే ఆఫ్రికా రచయిత గురించిన ప్రారంభవాక్యాలు కూడా. అవి నా ఊహను ఒక్కసారిగా తటిల్లున మెరిపించాయి. పాశ్చాత్య రచయితల్ని, ముఖ్యంగా ఐరోపా రచయితల్ని చదువుతుంటే ఒక సెమినార్ హాల్లో ఒక మేధావితోనో, తాత్త్వికుడితోనో గంభీరమైన విషయాల గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుందనీ, కానీ ఆఫ్రికా రచయితల్ని చదువుతుంటే మన గ్రామాలకు వెళ్ళి, అక్కడి మట్టి అరుగుల మీద కూర్చుని, ఆ గ్రామవృద్ధులో, రైతులో, అక్కడి ముంగిళ్ళలో గృహిణులో చెప్పే సుద్దులు విన్నట్టుంటుందనీ రచయిత అంటారు.

ఆఫ్రికా మూలాలున్న ‘రూట్స్’ నవలా రచయిత ఎలెక్స్ హేలీ అనుభవం కూడా అలాంటిదే. అతను ఆఫ్రికాలో తనకు ఆరు తరాల వెనకటి పూర్వీకులు జీవించిన గ్రామానికి వెళ్ళి కెబ్బా కంజీ పొఫానా అనే వృద్ధగాథికుడు తన వంశచరిత్రను గానం చేస్తుండగా వింటాడు. ఆ ఉదంతాన్ని నేపథ్యంగా తీసుకుని గాథికసంప్రదాయంలో ఆఫ్రికాకూ, మనకేకాక, ఇతర సాంప్రదాయిక సమాజాలకూ ఉన్న పోలికల గురించీ; మన వ్యాసవాల్మీకులతోనూ, సూతుడితోనూ కెబ్బా కంజీ పొఫానాకు ఉన్న సామ్యాల గురించీ నా ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అనే పుస్తకంలో పొందుపరచిన వ్యాసభాగాలు – పై వాక్యాలు చదివినప్పుడు చటుక్కున నా కళ్ళముందు మెదిలాయి.

రచయిత పొందుపరిచిన బెన్ ఒక్రి ఆలోచనల్లోకి తొంగిచూసినప్పుడు కూడా వలసపాలనకన్నా కూడా చాలా వెనకటినుంచీ భారత్, ఆఫ్రికా సహా సాంప్రదాయికసమాజాల మధ్య ఉన్న సామ్యాలే నా కళ్ళముందు తళుక్కున మెరిశాయి. నిజానికి మనకు రాజకీయాలకన్నా కవిత్వమే ఎక్కువ సన్నిహితమనీ, అసలు మనం పుట్టడంలోనే శ్వాసించడంతోపాటు కవిత్వం ఉందనీ అంటాడాయన. ఆధునికతకు ముందు ప్రపంచవ్యాప్తంగా వేల సంవత్సరాల మానవానుభవంలోని ఒక పార్శ్వాన్ని ఎత్తిచూపే మాటలే ఇవి.

ఆపైన, రచయితలు పతనమైనప్పుడే జాతులు పతనమవుతాయనీ, ఒక జాతి అవ్యక్తసత్త్వానికి, ఒక దేశ జీవస్ఫూర్తికీ ఆ జాతిరచయితలే ప్రతినిధులంటాడు బెన్ ఒక్రీ. ఇలా చారిత్రకపు లోతుల్లోంచి, చూపుల వైశాల్యంలోంచీ చూసి ఎవరికి వారు వర్తమానానికి అన్వయించుకోవాల్సిన దిక్సూచికలు, ఉటంకింపులు ఈ పుస్తకమంతటా కనిపిస్తాయి.

కెన్యా రచయిత గూగి వా థియాంగో గురించి రాస్తూ, గ్లోబలైజేషన్ యుగంలో పోస్ట్ మాడర్న్ బహుళతా వాదం బలపడ్డాక, వివిధ ప్రాంతాలు, కులాలు, భాషలు తమ అస్తిత్వాన్ని ప్రకటించుకోవడం మొదలు పెట్టాక, వాటిని ఏవిధంగా తమ ఆశయాలతో సమన్వయపరచుకోవాలో మన రచయితలకు అర్థం కాలేదనీ, ప్రధానంగా మనవాళ్ళు పందొమ్మిదో శతాబ్ది భాషలోనే ఆలోచించడానికి అలవాటుపడ్డారనీ, ఆ సమన్వయం గూగిలో కనిపిస్తుందనీ రచయిత అంటారు. చరిత్ర లోతుల్లోంచి మన లోపాలను గమనించుకోవడంవైపు ఒక్కసారిగా మన ఆలోచనలను మళ్లించే వ్యాఖ్యలలో ఇదొకటి.

అంతకన్నా కీలకంగా ఆ వ్యాసంలోనే ఒక వ్యాఖ్య నేరుగా మనల్ని వర్తమానంలోకి తీసుకొస్తుంది: ‘వలసవాదం రోజుల్లో భారతీయమధ్యతరగతి వలసవాదసాధనాలైన యూనివర్సెటీలు, రైళ్లు, పత్రికలు, తంతితపాలాలను వాడుకునే ప్రజలను కార్యోన్ముఖులను చేసింది. ఇప్పుడు కొత్త వలసపాలన రోజుల్లో, మునపటికన్నా శక్తిమంతమైన ప్రచారసాధనాలు తన చేతుల్లోకి వచ్చిన ఈ తరుణంలో భారతీయ మధ్యతరగతి ఆ సాధనాల్ని వినోదానికీ, కాలక్షేపానికీ, ఇంకా చెప్పాలంటే ద్వేషవ్యాప్తికీ వాడుకుంటూ ఉం’ దంటారాయన. నేటి మన దైనందిన అనుభవంలో ప్రత్యక్షంగా చూస్తున్న ఈ పరిణామం గురించి విస్తరించి చెప్పుకోనవసరం లేదు. ఈ విషయంలో మనకూ, ఆఫ్రికాకూ కొంతమేరకు సామ్యం కుదురుతోందనుకుంటాను. ఎందుకంటే, గూగి కూడా ఇటువంటి మధ్యతరగతిని ఉద్దేశించే మాట్లాడతాడు.

ఇలాగే, ఇరవైరెండేళ్ల స్వీడిష్ అమ్మాయి, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థున్ బెర్గ్ గురించి రాసినా; నెల్సన్ మండేలా గురించి చెప్పినా, తొలితరం పురాతత్వశాస్త్రవేత్త హైన్రిశ్ ష్లీమన్ గురించి మాట్లాడినా స్థలకాలాల హద్దులకు అతీతంగా మనిషిని ప్రపంచమనే ఉమ్మడి వేదికపై ప్రతిష్ఠిస్తూనే వర్తమానాన్ని వ్యాఖ్యానించడం ఈ పుస్తకంలో అంతస్సూత్రంగా వ్యాపించి కనిపిస్తుంది. పర్యావరణపరిరక్షణ అనే ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడుతున్న గ్రేటా థున్ బెర్గ్ అచ్చం మన అమ్మాయిలానూ, జీవితాంతం హోమర్ ను ఆరాధిస్తూనే గడిపిన ష్లీమన్ మన పాతకాలపు పండితుల్లానూ మన మనసుకు దగ్గరవుతారు.
నెల్సన్ మండేలా, ఆ తర్వాత మన పూర్వరాష్ట్రపతి అబ్దుల్ కలాంల గురించిన ఇందులోని వ్యాసాలు నేను అంతగా దృష్టి పెట్టని వారి అపురూపపార్శ్వాలను చూపించి నా చూపుల్ని జిగేలు మనిపించాయి; నా ఊహలో వారి వ్యక్తిత్వాల ఎత్తును ఎన్నో అడుగుల మేరకు పెంచివేశాయి. మండేలాపై రాపోలు సీతారామరాజు రచించిన ‘మెలకువలో కన్న కల’ అనే పుస్తకాన్ని ఆధారం చేసుకుని రాసిన వ్యాసంలో మండేలా కేవలం దీర్ఘకాలం జైలుశిక్ష అనుభవించిన ఒక ఉద్యమకారుడిగా, ఆ తర్వాత దేశాధినేత అయిన ఒక పాలకుడిగా మాత్రమే కనిపించడు; తనంతవరకూ నమ్మిన మానవీయమైన విలువల నుంచి తను ఏమాత్రమైనా పక్కకు జరుగుతున్నానా అని నిరంతరం ఆత్మశోధన చేసుకుంటూ, అంతరంగాన్ని శుభ్రపరచుకునే ఒక మహోదాత్త మానవుడిగా కనిపిస్తాడు. అలాగే అబ్దుల్ కలాం కూడా. ఆయన గురించిన రెండు వ్యాసాల్లో ఒకటి, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను బంధుమిత్రుల కోసం ఎట్టి పరిస్థితులలోనూ వాడుకోకూడదన్న సూత్రాన్ని ఆయన జీవితాంతమూ త్రికరణశుద్ధిగా పాటించడం గురించి చెబుతుంది; రెండోది, తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తిని ప్రోత్సహించి చదివించి ఉన్నతవిద్యావంతుని చేయడం గురించి చెబుతుంది.

ఈ ఇద్దరి గురించిన వ్యాసాలూ, వీరి గురించిన నా దృష్టిలోని ఒక కొరతనూ, నా ఆలోచనల్లోని ఒక వెలితినీ పూరిస్తున్నట్టు నాకు అనిపించింది. తరతమభేదాలతో ప్రజాక్షేత్రంలో ఉన్న వీరిద్దరినీ ఒక పత్రికారచయితగా, వృత్తిపరమైన పరిమితుల్లో మాత్రమే నేను చూస్తూవచ్చాను; వారి వ్యక్తిత్వాల్లోకి తొంగిచూసే అవసరమూ, అవకాశమూ కలగలేదు. కలాం విషయమే తీసుకుంటే, రాష్ట్రపతిగా ఆయనను రాజకీయ, పాలనావ్యవస్థలో భాగంగా చూడడమే తప్ప వ్యక్తిగతపార్శ్వంలోకి తలదూర్చలేదు. వృత్తిపరమైన ఒక పరిమితి అందుకు కారణం అనుకోవచ్చు; లేదా వృత్తిరీత్యా సంక్రమించిన ఒక దృష్టిభేదమని కూడా అనుకోవచ్చు. కానీ వీరభద్రుడిగారి చూపు వేరు, బాహ్యమైన వాటినన్నిటినీ పక్కకు తప్పిస్తూ వ్యక్తి లోపలికి చూసే చూపు అది. ఉదాత్తవ్యక్తిత్వాలను చూసి పరవశించడమే కాదు, ఒక్కోసారి కన్నీళ్ళు పెట్టే చూపు కూడా. ఈ పుస్తకంలో అడుగడుగునా అది మనకు కనిపిస్తుంది. ఆ విధంగా అది ఇతరుల చూపు లోపాన్ని, లేదా కొరతను పూరించేది కూడా.

ఈ ఇద్దరి సందర్భంలోనే ఆయన మరో కీలకమైన వ్యాఖ్య చేస్తారు. ..

2

నెల్సన్ మండేలా, అబ్దుల్ కలాంల గురించి రాస్తున్న సందర్భంలో రచయిత ఒక కీలకమైన వ్యాఖ్య చేశారని అంటూ కిందటి పోస్ట్ ను ముగించాను. నిజానికది ఒకటిగా కాక; వేర్వేరు చోట్ల వేర్వేరు మాటల్లో చెప్పిన రెండు వ్యాఖ్యలుగా కనిపిస్తుంది కానీ, సారంలోనూ, స్వభావంలోనూ, భావనలోనూ ఒకటే:

ఆయనేమంటారంటే-

ఒక పీడక, పీడిత వైరివర్గంలో పీడకులను పీడితులు భౌతికంగా నిర్మూలించాక, ఆ చిట్టచివరి జార్ కూడా మరణించాక, అప్పుడు ఆ మొట్టమొదటి బోల్షివిక్కు తనే ఒక జార్ గా మారతాడని! నువ్వు నీలో ఉన్న జార్ ను నిర్మూలించనంతవరకూ బయటి జార్లను ఎంతమందిని నువ్వు వధించినా లాభం లేదని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చెబుతోందంటారు. దీనినొక పారడాక్స్ గా, విషమ ప్రహేళికగా ఎత్తిచూపుతూ, ఏ అసమానతానిర్మూలన కోసం underprivileged రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తారో, ఆ రాజ్యాధికారం సిద్ధించగానే వాళ్ళల్లో ఒక చిన్నభాగం privileged గా మారిపోతారనీ, అంతదాకా విమోచనశీలాన్ని కనబరచిన ఆ సమూహం ఇక అప్పణ్ణించీ ఆధిపత్యధోరణిని సంతరించుకుంటుందనీ, తనే రాజ్యంగా మారిపోతుందనీ అంటారు. రాజ్యాధికారం స్వభావతః privileged కాబట్టి, పాలనాధికారం పొందిన ప్రతివాడూ పాలకుడుగానే ప్రవర్తిస్తాడు కనుక underprivileged కి ఎప్పటికీ రాజ్యాధికారం సిద్ధించదంటారు. చివరిగా, పాలకస్వభావాన్ని సంతరించుకోని పాలకుడి కోసమే తను మూడు దశాబ్దాలుగా అన్వేషిస్తున్నాననీ అంటారు.

ఇది ఆలోచనాత్మకమైన కీలకవ్యాఖ్య మాత్రమే కాదు; వామపక్షాలు, రాజ్యాధికారాన్ని కోరుకునే దళిత, బహుజనవర్గాలతో సహా రాజకీయసామాజికక్షేత్రాలలో పనిచేసే ప్రతివారికీ ఒక సవాలు విసురుతున్నది కూడా.

అదలా ఉంచితే, నన్ను నేను పునర్దర్శించుకోడానికీ, మరింతగా కనెక్ట్ చేసుకోడానికీ అవకాశమిచ్చి ఆశ్చర్యచకితం చేసినవి వీరభద్రుడుగారి పుస్తకంలో మరికొన్ని ఉన్నాయి. వాటిలో నేతాజీ సుభాస్ చంద్ర బోస్ గురించి రాసినవి ఒకటి. ‘Indian Pilgrim’ అనే సుభాస్ స్వీయచరిత్ర గురించి ‘భారతీయతీర్థయాత్రికుడు’ అనే శీర్షికతో రాస్తూ; ఆయనా, అల్లూరి సీతారామరాజూ 1897లోనీ జన్మించారనీ, ఇద్దరి జీవితాల మధ్యా చాలా పోలికలున్నాయనీ, ఆయన మృతి చెందారని నమ్మనివారు ఇప్పటికీ ఉన్నారనీ, తనూ అంతేనని రచయిత అంటారు. విచిత్రమేమిటంటే, అల్లూరి సీతారామరాజు విషయంలోనూ అదే జరిగింది. ఆయన మరణించినట్టు నమ్మనివారు గతంలో ఉండేవారు. అప్పట్లో పాపికొండల్లోని పేరంటపల్లిలో ఆశ్రమం కట్టుకుని జీవించిన బాలానందస్వామి అనే ఆయనను సీతారామరాజుగా భావించేవారని చెప్పుకోగా విన్నాను. సుభాస్ బోస్, సీతారామరాజుల మధ్య ఉన్న ఇలాంటి పోలికలను పొడిగిస్తూ, అలాంటివి మరికొన్ని జోడిస్తూ, వాటి వెనుక ఉన్న దృష్టికోణాన్ని వివరిస్తూ ‘వీరుడు మరణించడు’ శీర్షికతో నా ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే’లో రాశాను.

సుభాస్ బోస్ తనను ‘Indian Pilgrim’ అని ఎందుకు పిలుచుకున్నాడో ఆ పుస్తకం చదువుతుంటే అర్థమవుతుందని, ప్రాయకంగా ఆయన ఒక ఆత్మాన్వేషకుడని, యోగి కావాలని తపించాడని, ప్రాపంచిక బంధాల్లో కూరుకుపోకుండా జీవితసత్యాన్ని దర్శించడానికి తపించాడని కూడా అర్థమవుతుందనీ రచయిత అంటారు. రాజ్ మోహన్ గాంధీ రచించిన అత్యంత పరిశోధనాత్మకమూ, పఠనీయమూ అయిన గాంధీ జీవితచరిత్ర ‘మోహన్ దాస్’ ను అనువదించినవాడిగా స్వాతంత్ర్యోద్యమఘట్టంలో సుభాస్ నిర్వహించిన పాత్రపై నాకు కొంత అవగాహన ఉంది కానీ, పై వివరం నా దృష్టికి రాలేదు. దాంతో యోగీ, ఆత్మాన్వేషీ కావాలని సుభాస్ అనుకోవడం వెనుక ఈ దేశానికి చెందిన ఒక చారిత్రకవిశేషం ఉన్నట్టు నాకు స్ఫురించింది.

మనదేశం దీర్ఘకాలంపాటు స్వపరిపాలనలో కానీ, ఒక కేంద్రీయమైన పాలనలో కానీ లేకపోవడంవల్లా; అంతకుముందు కూడా దేశం అనేక రాజ్యాల రూపంలో రాచరికవ్యవస్థలో ఉండడంవల్లా యువతతో సహా చాలామందికి రాజకీయంగా, పరిపాలనాపరంగా నిర్వహించవలసిన పాత్ర ఏదీ లేకపోవడం సహజమే. అందువల్ల ఆధ్యాత్మికరంగమే వాళ్ళకు ఏకైకకార్యక్షేత్రంగా పరిణమించి ఉండవచ్చు. బ్రిటిష్ ఏలుబడిలో మొదలైన స్వాతంత్ర్యోద్యమఘట్టంలోనే వాళ్ళు పెద్ద ఎత్తున రాజకీయకార్యక్షేత్రంలోకి అడుగుపెట్టే అవకాశం చిక్కింది. అయినా దానికి సమాంతరమైన ఒక పాయగా అధ్యాత్మికదృష్టి కొనసాగుతూ ఉందనుకోవాలి. వివేకానంద, అరవింద, చివరికి గాంధీలో కూడా రాజకీయ, ఆధ్యాత్మికదృష్టికోణాలు రెండూ పెనవేసుకుని కనిపిస్తాయి. ఆధ్యాత్మికతతోపాటు చాలామందిని మతభావన కూడా అంటిపెట్టుకుని ఉంటూవచ్చింది. ఆధ్యాత్మికతను అలా ఉంచితే, ఆర్థికంగా, శాస్త్రసాంకేతికపరంగా దేశం అభివృద్ధి చెందిన వర్తమానఘట్టంలో మతభావన విరాడ్రూపాన్ని తెచ్చుకుని వైవిధ్యవంతమైన ఈ దేశస్వభావానికి ప్రమాదం తెచ్చిపెట్టే స్థాయిలో మతప్రాతిపదికపై దేశాన్ని సంఘటితంగా చేసే దిశగా అడుగువేస్తోందనుకోవాలి.

స్వాతంత్ర్యోద్యమనాయకులందరిలో ఎక్కువ వివాదాస్పదుడైందీ సుభాస్ చంద్ర బోసే. గాంధీ అహింసావాదానికి భిన్నంగా ఆయన హింసావాదాన్ని అనుసరించడమే కాక, ఫాసిస్ట్ శక్తుల సాయం పొందే ప్రయత్నం చేశాడన్నది ఆయనపై వచ్చిన ఆరోపణలలో ఒకటి. ఈ పుస్తకరచయిత ఈ కోణాన్ని కూడా చర్చించారు. ఈ నేపథ్యంలోనే సుభాస్-గాంధీ సంబంధాలు కూడా స్వాతంత్ర్యోద్యమచరిత్రలో చర్చలోకి రావడమూ జరుగుతోంది. ఇందులోని ‘విప్లవాత్మక జాతీయవాది’ అనే వ్యాసానికి రచయిత ఆధారం చేసుకున్న గిరిజ.కె.ముఖర్జీ పుస్తకం ‘బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా’, గాంధీ-సుభాస్ లు ఎందుకు కలసి పనిచేయలేకపోయారన్న ప్రశ్నను ముందుకు తెచ్చి సుభాస్ వైపునుంచి సమాధానం చెబితే, రాజ్ మోహన్ గాంధీ పుస్తకం ‘మోహన్ దాస్’ గాంధీవైపునుంచి చెబుతుంది. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ తరానికి, సుభాస్ తరానికి మధ్య ఉన్న అంతరం, దాంతో ఉభయుల ఆకాంక్షలలో, వ్యవహరణలో తలెత్తిన తేడా, మొదట్లో కాంగ్రెస్ చట్టసభల్లో ప్రవేశించడానికి వ్యతిరేకించిన గాంధీ ఆ తర్వాత మెత్తబడి అందుకు అనుమతించడం, కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుభాస్ దానిని వ్యతిరేకించి, కాంగ్రెస్ నుంచే బయటపడి వేరుదారి పట్టడం జరిగినట్టు ముఖర్జీ పుస్తకం విశ్లేషిస్తుంది. అంతిమంగా, ఇలాంటివాటిపై ఒక స్పష్టతనిచ్చే విధంగా సమగ్రపరిశోధన జరగవలసిన అవసరాన్ని ఈ వ్యాసాలు సూచిస్తాయి.

3

అసలు ‘చరిత్ర’ను ఎలా చూడాలి?!

ఇది చాలా మౌలికమైన ప్రశ్న. అందులోనూ ఇప్పటి మన దేశీయసందర్భంలో ఒక సమాధానానికి తప్పనిసరిగా రావలసిన చాలా ముఖ్యమైన ప్రశ్న కూడా. వాడ్రేవు చినవీరభద్రుడు గారు తన ‘ఉదారచరితులు’ పుస్తకంలో దీనిపై కూడా ఒక కీలకమైన వ్యాఖ్యను ముందుకుతెస్తారు, అది కూడా సుభాస్ చంద్ర బోస్-గాంధీల సంబంధం గురించి రాస్తున్న సందర్భంలోనే.

‘నేతాజీ-మహాత్ముడూ ఎందుకు కలసి పనిచేయలేకపోయారు? 1939లో నేతాజీ కోరుకున్నట్టుగా ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచెయ్యనిచ్చి ఉంటే, భారతదేశభవితవ్యం మరోలా ఉండేది కదా అని నాకే కాదు, చాలామందికి అనిపిస్తుం’దని వీరభద్రుడుగారు అంటూనే, అసలలాంటి ఊహాగానానికే చరిత్ర తావివ్వదన్న తన చిన్నప్పటి సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుని అభిప్రాయాన్ని ఉటంకిస్తారు. ‘చరిత్రలో ‘if’ అనేది ఉండదనీ, వ్యక్తిగత అభిప్రాయాల కన్నా, రాగద్వేషాల కన్నా చారిత్రకగతిశక్తులు చాలా పెద్దవనీ’ ఆయన అనేవారట. నేటి కొమ్ములు తిరిగిన చరిత్రకారులు, అధ్యాపకులు, ఔత్సాహిక చరిత్రపరిశోధకులనుంచి, మామూలు ఆలోచనాపరులవరకూ అందరూ గమనించి తీరవలసిన వ్యాఖ్య ఇది.

ఎందుకంటే, ఈరోజున మన దేశంలో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. గాంధీ 1914లో దక్షిణాఫ్రికానుంచి స్వదేశానికి తిరిగివచ్చి స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెడితే; ఆ తర్వాత సరిగ్గా వందేళ్ళకు, అంటే, 2014నాటికి కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ మెజారిటీ మతతత్వంవైపు మొగ్గు చూపే రాజకీయపక్షమూ-కూటమీ సొంతంగా సంపూర్ణ సంఖ్యాబలంతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసినదే. అప్పటినుంచీ ఆ వందేళ్ల చరిత్రనూ, ఆ చరిత్రలో ప్రముఖపాత్ర వహించిన వ్యక్తుల చరిత్రను తిరగదోడడం, వారి వ్యక్తిత్వాలు, వ్యవహరణ తీరును ఆక్షేపించడం, వారి నిర్ణయాలను ప్రశ్నించడం, పునర్వ్యాఖ్యానించడం, ప్రత్యేకించి వాళ్ళ ‘తప్పు’లను ఎంచి చూపడం అటు అకడమిక్ స్థాయినుంచి, ఇటు మీడియా, సోషల్ మీడియా, సినిమా స్థాయివరకూ ఆయా అంచెలలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడం గత పదకొండేళ్లుగా చూస్తున్నాం. అది ఏకంగా ఒక రాజకీయమహోద్యమంగా మారడమూ గమనిస్తున్నాం.

అందులో భాగంగా అటు బ్రిటిష్ , ముస్లిం కాలాల్లోకి కూడా తమదైన చూపును మరింత బలంగా చొప్పించే ప్రయత్నమూ జరుగుతోంది. పాఠ్యపుస్తకాలను తిరగరాయడంతో మొదలు పెట్టి, ఎక్కడికక్కడ మరింత ఎత్తున కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా పాత విగ్రహాలను మరుగుజ్జులను చేయడం, లేదా వాటికి స్థానభ్రంశం కలిగించడం వరకూ అది బహురూపాలలో సాగుతోంది. ఏదైనా ఒకటి రాజకీయమైనరూపం తీసుకున్నప్పుడు నిజాలను మరుగుపరచడం, మసిపూయడం, వక్రీకరించడం, వాటిపై అసత్యాలను స్థాపించడం, లేదా ఉన్న నిజాన్ని అనేక రెట్లు పెంచి చూపడం, లేదా అనేకరెట్లు తగ్గించి చూపడం, దూషణభూషణలు రెండూ హెచ్చుశ్రుతిని అందుకోవడం సహజంగానే జరుగుతూ ఉంటుంది.

చరిత్రను వస్తుగతంగా నిష్పాక్షికంగా చూసే అకడమిక్ రంగం దీనికి విడిగా, దూరంగా పనిచేస్తూ ఉంటే ఏమోకానీ, రాజకీయమైన ఒత్తిడులకు తలవంచి అందులోని హెచ్చుభాగం ఆ ఉద్యమంలో భాగస్వామి అయితేనే చిక్కు. ప్రస్తుత వాతావరణం అందుకు భిన్నమైన భరోసాను ఇస్తోందా అంటే, ఇస్తోందని గట్టిగా చెప్పలేని పరిస్థితి.

ఇటీవలి కాలంలో గుజరాత్ లో నెలకొల్పిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం – ఈ జరుగుతున్నదానికంతటికీ ‘ఆరువందల అడుగుల ఎత్తైన’ ఉదాహరణ. ప్రపంచంలో అనేక చోట్ల గాంధీ విగ్రహాలు ఉన్నాయి కానీ, ఆయనపుట్టిన గడ్డమీద మాత్రం, ‘ప్రపంచంలోనే ఎత్తైన’దిగా చెబుతున్న విగ్రహం ఆయన అనుయాయికే కానీ ఆయనకు లేదు! గాంధీ-పటేల్ ల సంబంధం ఎలాంటిదో రాజ్ మోహన్ గాంధీ రచించిన ‘మోహన్ దాస్’ చదివితే అర్థమవుతుంది. అది రామలక్ష్మణులు, రామ, ఆంజనేయుల సంబంధం లాంటిది. అప్పటి అగ్రనాయకులలో గాంధీకి పటేల్ అంతటి విధేయ అనుచరుడు మరొకరు లేరు, నెహ్రూ కూడా గాంధీకి అంత విధేయుడు కాదు. అటువంటిది, తన గురువు కన్నా ఎత్తున తన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చూసి పటేల్ ఆత్మ సిగ్గుతో చితికిపోతూ, కోపంతో రగిలిపోతూ ఉండి ఉంటుంది.

కానీ రాజకీయం నిజానిజాలనే కాదు; తారతమ్యాలనూ, ఉచ్చనీచాలనూ, ఔచిత్యానౌచిత్యాలనూ కూడా పట్టించుకోదు. తాత మూకుడు తరతరాలు అన్నట్టుగా ఇప్పటి పాలకుల విషయంలో కూడా రేపు అదే జరుగుతుందన్న ఇంగితజ్ఞానాన్ని కూడా కప్పివేయగల క్షుద్రదృష్టి అది. అలాగే, నెహ్రూ-పటేల్, నెహ్రూ-సుభాస్ చంద్ర బోస్ ల సంబంధం విషయంలో కూడా! నెహ్రూ-పటేల్ ల మధ్య అభిప్రాయభేదాలు ఉండేవికానీ పటేల్ ప్రధానమంత్రి పదవి కోసం నెహ్రూతో ఎప్పుడూ పోటీపడలేదనీ, ఆయన నాయకత్వాన్ని ఆమోదించి, రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడనీ, గాంధీ వారిద్దరి మధ్యా వయసులో ఉన్న పద్నాలుగేళ్ల అంతరాన్ని దృష్టిలో పెట్టుకొని యువకుడైన నెహ్రూవైపు మొగ్గు చూపాడనీ, అదీగాక స్వాతంత్ర్యం వచ్చేనాటికే పటేల్ ఆరోగ్యం క్షీణించిందనీ, ఆ తర్వాత మూడేళ్లే ఆయన జీవించాడనీ ‘మోహన్ దాస్’ చెబుతుంది. అయినాసరే, పటేల్ కు దక్కవలసిన ప్రధానమంత్రి పదవి అన్యాయంగా నెహ్రూకు దక్కిందనీ, పటేల్ ప్రధానమంత్రి అయుంటే దేశగమనం మరో విధంగా ఉండేదన్న నేరెటివ్ ను ప్రచారంలో ఉంచడం చూస్తున్నాం.

అలాంటి నేరెటివ్ నే సుభాస్ చంద్ర బోస్-నెహ్రూల విషయంలో చలామణిలోకి తేవడమూ జరిగింది. సుభాస్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నెహ్రూ, ఆయనా కలసికట్టుగా వ్యవహరించేవారనీ, కొన్ని కొన్ని సందర్భాలలో గాంధీని ప్రశ్నించడం, ధిక్కరిండం చేసేవారనీ ‘మోహన్ దాస్’ చెబుతుంది. కానీ, నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాక సుభాస్ చంద్రబోస్ పోరాటచరిత్రనూ, ఆయన జ్ఞాపకాలనూ భూస్థాపితం చేయడానికి ప్రయత్నించాడనే నేరెటివ్ ను ప్రచారంలోకి తెచ్చారు.

‘చరిత్రలో ‘if’ అనేది ఉండదనీ, వ్యక్తిగత అభిప్రాయాలకన్నా, రాగద్వేషాలకన్నా చారిత్రకగతిశక్తులు చాలా పెద్దవనీ’ వీరభద్రుడుగారు ఉటంకించిన వ్యాఖ్య అతికినట్టు సరిపోయే ఒక ఆసక్తికరకోణం కూడా ఇక్కడ ఉంది. రెండవ ప్రపంచయుద్ధనేపథ్యంలో జపాన్ ఒక దురాక్రమణశక్తిగానూ, దూకుడుగానూ వ్యవహరిస్తూవచ్చిందని చరిత్ర చెబుతోంది. అది ఒకదశలో మన దేశ ఈశాన్య సరిహద్దుల దాకా చొచ్చుకువచ్చిందనీ, అంతవరకూ ప్రపంచయుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా తన పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి దరిమిలా యుద్ధంలోకి దిగి, జపాన్ లోని హిరోషిమా, నాగసాకీల మీద అణుబాంబు ప్రయోగించిన తర్వాతే జపాన్ వెనక్కి తగ్గిందనీ కూడా చరిత్ర చెబుతోంది. అలా జరగకుండా ఉండి ఉంటే, జపాన్ దూకుడు అప్రతిహతంగా కొనసాగి ఉంటే చరిత్రగతి ఎలా పరిణమించేదో చెప్పలేం. సుభాస్ చంద్ర బోస్ అప్పుడు జపాన్ తో సత్సంబంధాలలో ఉన్నాడు కనుక నెహ్రూ స్థానంలో ఆయనే దేశాధినేత అయుండేవాడేమో అనుకోవడం కేవలం ఊహాగానం మాత్రమే అవుతుంది. పై వ్యాఖ్య చెప్పినట్టు చారిత్రకగతిశక్తులు మన ఇష్టాయిష్టాలూ, ఊహాగానాలకన్నా చాలా బలమైనవి.

4

‘అద్వితీయ జయగాథలు’ అనే వ్యాసంలో వీరభద్రుడు గారు ఆలోచననే కాక, చర్చను రేకెత్తించే ఒక వ్యాఖ్యచేశారు. ‘ఐ.ఆర్ 8’ అనే వరివంగడం ద్వారా సస్యవిప్లవానికి దోహదం చేసిన నెక్కంటి సుబ్బారావు గారి గురించి డా. గోటేటి లలితాశేఖర్ రచించిన ‘పుడమితల్లి నేస్తం’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆయన ఇలా అంటారు:

“రైతు కడగండ్లనీ, దోపిడీనీ, పీడననీ చిత్రించడంపట్ల తెలుగు రచయితకి ఉన్న ఆసక్తి, రైతు విజయగాథలు నమోదు చెయ్యడం మీద లేదు. జయగాథల గురించి చెప్పడమంటే ప్రభుత్వానికి మద్దతు పలికినట్టుగానూ, pro-establishment వైఖరి అవలంబించినట్టుగానూ భావిస్తాడు తెలుగు రచయిత. అది అతడి పరిమితుల్ని తెలియచెప్తుంది తప్ప, అతడి అవగాహనను కాదు… social entrepreneur గా మారితే తప్ప ఏ రైతూ బీదరికం నుంచి బయటపడడు. ఆ ప్రయాణం ప్రధానంగా అతనిదీ, అతని సహచరులదీను. ప్రభుత్వం వారికి సహాయపడి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే కథ. నేను తెలుగు రచయితలనుంచి, పత్రికలనుంచి, ప్రసారమాధ్యమాల నుంచి ఇటువంటి కథలు ఆశిస్తాను”.

ప్రో, లేదా యాంటీ ఎస్టాబ్లిష్ మెంట్ కోణం నుంచి కాకుండా విడిగా చూసినప్పుడు ఎవరైనా ఆమోదించితీరవలసిన మాటలే ఇవి. వ్యక్తుల విజయగాథలు అసలే నమోదు కావడంలేదని అనలేం కానీ; రైతులతో సహా ఆయా వర్గాల కడగండ్లూ, దోపిడీ, పీడనా నమోదైన స్థాయిలో కాకపోవచ్చు, లేదా ఆ స్థాయిలో జనం దృష్టిని ఆకర్షించకపోతూనూ ఉండవచ్చు. అయితే, ఈ వ్యత్యాసాన్ని ప్రొ, లేదా యాంటీ ఎస్టాబ్లిష్ మెంట్ కోణం నుంచి చూసి, రచయితలు, పత్రికలు, ప్రసారమాధ్యమాల వైఖరిని ఒక లోపంగా భావించినప్పుడు మరో రకమైన ప్రమాదం తలెత్తుతుందని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే, వ్యక్తుల స్థాయిలో విజయాలను సాధించడాన్ని ఒక ఆదర్శంగా స్థాపించిన కొద్దీ ప్రభుత్వాలు ప్రజలపట్ల తాము నిర్వర్తించవలసిన బాధ్యతల బరువును వదిలించుకునే ప్రయత్నం చేయవచ్చు; లేదా ప్రభుత్వాల బాధ్యత గురించిన చర్చ పలచన కావచ్చు. ప్రభుత్వరంగం క్షీణించి, ప్రైవేట్ రంగం బలపడుతూరావడంలో మనం ఈ పరిణామాన్ని ఇప్పటికే చాలాకాలంగా చూస్తున్నాం. ఇది క్రమంగా జనజీవితంతో ప్రత్యక్షంగా ముడిపడిన అన్ని పాలనావిభాగాలకూ విస్తరించే ప్రమాదానికి దారితీయవచ్చు.

అందులోనూ, ఏడు దశాబ్దాలకు పైబడిన మన ప్రజాస్వామికపాలనానుభవంనుంచి చూస్తే ప్రభుత్వాలతో సహా ఆయా వ్యవస్థలు తమకు నిర్దేశించిన విధులు, బాధ్యతలలో పూర్తిగా కుదురుకోలేదనీ; పనితీరులో తగినంత పరిణతిని తెచ్చుకోలేదనీ, ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించడం లేదనీ, ఇంకా నేర్చుకుంటూ, అనుభవాన్ని గడించుకుంటున్న దశలోనే ఉన్నాయనీ అర్థమవుతుంది. రాజకీయపక్షాలూ, ప్రభుత్వయంత్రాంగాలూ, మీడియా సహా ఏవీ ఇందుకు మినహాయింపు కావు. అందుకే, ప్రధానంగా రాజకీయనాయకత్వాలు, ప్రభుత్వాలు చేసే తప్పులనూ, వేసే తప్పుటడుగులనూ ఎత్తిచూపుతూ ప్రతిపక్షపాత్ర పోషించే విధంగానే మీడియా, ప్రత్యేకించి వార్తాపత్రికల రూపకల్పన జరిగింది. దానినుంచే ‘యాంటీ-ఎస్టాబ్లిష్ మెంట్’ భావన బలపడింది. కనుక, వీరభద్రుడు గారు అన్నట్టు వ్యక్తుల జయగాథలు నమోదు కావలసిన అవసరాన్ని గుర్తిస్తూనే, అది యాంటీ-ఎస్టాబ్లిష్ మెంట్ వైఖరిని పూర్తిగా మసకబార్చి ప్రో-ఎస్టాబ్లిష్ మెంట్ వైఖరివైపు నడిపించకుండానూ జాగ్రత్తపడడం అవసరం.

మన ప్రజాస్వామికపాలనావ్యవస్థ ఇప్పటికీ ఇంకా పరిణామదశలోనే ఉందనడానికి సాక్ష్యాలు ఎన్నో కనిపిస్తాయి. వ్యక్తులు-వ్యవస్థల మధ్య తేడాను ఇప్పటికీ పోల్చుకోలేకపోతుండడం వాటిలో ఒకటి. ప్రజాస్వామ్యంలో పౌరులు ఆధారపడవలసింది వ్యవస్థలమీదే తప్ప; వాటిలో చిన్నా, పెద్దా హోదాల్లో ఉన్న వ్యక్తులూ, వాళ్ళ దయాదాక్షిణ్యాలూ, వాళ్ళ సొంత నిర్ణయాల మీద కాదు. పరిపాలన అనేది వ్యవస్థాముఖంగా జరగాలి తప్ప వ్యక్తుల ముఖంగా కాదు. కానీ అది తలకిందులు కావడం, ఇతర వ్యవస్థలలో కన్నా ఎక్కువగా రాజకీయ, ప్రభుత్వనాయకత్వాలలో కనిపిస్తూ ఉంటుంది. కేంద్రస్థాయిలో, రాష్ట్రస్థాయిలో జరిగే సమష్టినిర్ణయాలను, వాటి సానుకూల ఫలితాలను ప్రధానమంత్రికీ, లేదా ముఖ్యమంత్రికీ ఆపాదించి, వాళ్ళ వ్యక్తిగతఘనతగా చిత్రించడం, వాళ్ళను ఆకాశానికెత్తడం, ఆవిధంగా వాళ్ళకు రాచరిక, లేదా ఫ్యూడల్ వ్యవస్థలో రాజుకు ఇచ్చే ప్రతిపత్తినీ, ఇమేజ్ నూ కల్పించడం ఇప్పటికీ చూస్తున్నాం.

ఆవిధంగా, ‘పాలకస్వభావాన్ని సంతరించుకోని పాలకుడి కోసమే తను మూడు దశాబ్దాలుగా అన్వేషిస్తున్నా’నని వేరే సందర్భంలో వీరభద్రుడు గారు చేసిన వ్యాఖ్య ఈ సందర్భానికి కూడా తూచినట్టు సరిపోతుంది. పాలకులూ, వారిపట్ల నాయకారాధనను చాటుకునే ప్రజలూ కూడా ఇప్పటికీ ప్రజాస్వామికపరిణతిని తెచ్చుకోని దశలో ప్రో, యాంటీ- ఎస్టాబ్లిష్ మెంట్ వైఖరుల మధ్య తూకం తారుమారు కాకుండా చూసుకోవడం అనివార్యమవుతుంది.

***

‘ఒక చరిత్రకారుడి ప్రయాణం’ అనే శీర్షికతో ప్రముఖ చరిత్రకారులు వకుళాభరణం రామకృష్ణ గారి గురించి రాస్తూ – ఆయనా, ఆయన కొలీగ్ ప్రొ. లక్ష్మీనారాయణా తమ కాలనీలో రోజూ తెల్లవారుజామునే ఏదో గంభీరమైన విషయం మీద మాట్లాడుకుంటూ మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటే మా కాలనీ వీథులు ‘ఏథెన్స్ వీథు’ల్లా అనిపించేవంటారు వీరభద్రుడు; ఆ ఉపమానం మన ఊహలను ఒక్కసారిగా జిగేలు మనిపించి, లోతైన తాత్విక, వైజ్ఞానిక మథనానికి వేదిక అయిన ప్రాచీనగ్రీసుచరిత్ర మొత్తాన్ని మన కళ్లముందు ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకం పుటల వీథుల్లో మన మనోనేత్రాలు వాకింగ్ చేస్తున్నప్పటి అనుభవం కూడా దానికి ఏమాత్రం భిన్నమైనది కాదు.

ఇక, ఈ సంపుటిలోని ‘జాతిని మేల్కొల్పినవాళ్ళు’ అనే 13పేజీల వ్యాసాన్ని కేవలం వ్యాసంగా పేర్కొనడం దాని ప్రాధాన్యాన్ని తగ్గించడమే అవుతుంది. అది విషయరీత్యా ఒక పరిశోధకగ్రంథప్రమాణంలో ఉండి భావి పరిశోధకులకు ఒక సోర్సు కాదగినది. జాతీయోద్యమంలో పాల్గొన్న వేలాదిమంది తెలుగువారు చరిత్రకెక్కకపోవడం గురించీ, మన సాహిత్యచరిత్ర జాతీయోద్యమకారుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం గురించీ ఇది చర్చిస్తుంది. ఉభయతెలుగురాష్ట్రాలలోనూ ప్రాచుర్యంలో లేని ఎన్నో విశేషాలు, వివరాలు ఇందులో కనిపిస్తాయి.

ఒక ఐ.ఎ.ఎస్ అధికారిగా తెలిసిన నరేంద్ర లూథర్ గురించి అంతగా తెలియని కోణాన్ని ఇందులోని ‘ఒక తల్లిదండ్రుల కథ’ అనే వ్యాసం ముందుకు తెస్తుంది. ఆయన రాసిన ‘A Bonsai Tree’ అనే పుస్తకం చదువుతూ చివరిపుటలకు వచ్చేసరికి కన్నీటితో నా కళ్ళు మసకబారిపోయాయంటారు వీరభద్రుడు. మద్యానికి బానిసై జీవనవిధ్వంసపు అంచులకు చేరుకొన్న కొడుకుని చూసి లూథర్ దంపతులు పడిన దుఃఖాన్ని చిత్రించే ఘట్టమది. అటువంటి కొడుకు ఆ పతనంనుంచి బయటపడి తిరిగి జీవితాన్ని గెలుచుకున్నప్పుడు తల్లిదండ్రులు పడిన సంతోషాన్ని కూడా ఆ పుస్తకం చిత్రిస్తుంది. గాంధీ పెద్దకొడుకు హరిలాల్ జీవితం కూడా అలాంటిదే కానీ, అతను ఎప్పటికీ కోలుకోలేక గాంధీదంపతులకు చివరివరకూ కడుపుకోతనే మిగిల్చాడు. హరిలాల్ జీవితకథను తెలుగు చేస్తున్నప్పుడు కూడా నా నేత్రాలు తడిసిపోతూనే ఉండేవంటారు వీరభద్రుడు. నేను అనువదించిన రాజ్ మోహన్ గాంధీ ‘మోహన్ దాస్’ కూడా హరిలాల్ జీవితాన్నీ, గాంధీ దంపతుల దుఃఖాన్నీ అంతే కరుణరసార్ద్రంగా చిత్రిస్తుంది.

సంఘసేవకుడు, గాంధేయవాది మురళీధర్ దేవీదాస్ ఆమ్టే సహచరి సాధనా తాయి ఆమ్టే రాసిన ‘సమిధ’ కు భారతి కోడె చేసిన తెలుగు అనువాదం చదువుతున్నప్పుడు కూడా (ఒక తల్లి ఆత్మకథ) నా కళ్ళు ధారాపాతంగా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాయనీ, పుస్తకం ముగించేటప్పటికి గంగాస్నానం చేసినట్టూ, గంగాపానం చేసినట్టూ, నన్ను ఎవరో బయటా, లోపలా కూడా శుభ్రం చేసేసినట్టూ ఉందంటారు వీరభద్రుడు. ఒక కరుణరసవంతమైన జీవితగాథ మన నేత్రాలకూ, మనోనేత్రానికీ కూడా చేసే అక్షరాల అశ్రుచికిత్స అది.

చివరిగా, నన్ను వ్యక్తిగతంగా ఆశ్చర్యపరచే ఒక భావసామ్యం: ‘ఎమ్మెస్ నారాయణ జీవితకథ’ అనే పుస్తకం గురించి రాస్తూ, ‘తెలుగు సినిమాల్లో కమెడియన్లే నిజమైన హీరోలనీ, హీరోలు కమెడియన్లనే అభిప్రాయంనుంచి నేను ఇప్పటికీ బయటపడలేకపోయా’నని వీరభద్రుడు అంటారు. సరిగ్గా నేనూ అలాగే అనుకుంటాను!

5

వాడ్రేవు చినవీరభద్రుడు గారి ‘ఉదారచరితులు-వారిది వసుధైక కుటుంబం’ అనే పుస్తకం గురించి ఆరవదీ, చివరిదీ అయిన ఈ పోస్టులో నేను ప్రధానంగా రెండు విషయాలను ప్రస్తావించదలచుకున్నాను. ఇవి ప్రస్తుతానికి కేవలం ప్రస్తావనలే తప్ప మరింత లోతుగానూ, విస్తృతంగానూ చర్చించబోతున్నవి కావు;

నిజానికి ఆ చర్చ అనేక రోజులపాటు, అనేకమంది ఆలోచనాపరుల భాగస్వామ్యంతో అనేక పుటలూ, అనేక గొంతుల మీదుగా జరగవలసినది!

అందుకు ఈ పోస్టు సరిపోదు…

మొదటిది ఏమిటంటే, ప్రాచీన వాఙ్మయంతో మొదలుపెట్టి సమకాలీన వాఙ్మయంవరకూ ప్రతి ఒక్కదానినీ ప్రతి ఒక్క తరమూ కొత్తగా చదువుకుంటారు, కొత్తగా అర్థం చేసుకుంటారు, ఆ క్రమంలో అవి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సంతరించుకుంటూ తమ ఉనికిని పొడిగించుకుంటూ ఉంటాయి. ప్రాచీనవాఙ్మయాన్నే తీసుకుంటే, దానికి మతవిశ్వాసమూ, భక్తీ, దాని గురించిన సాంప్రదాయికభాష్యమూ వంటి అనేక కవచాలు తొడిగి కట్టకట్టి పూజగదిలో ఉంచి పూజించడానికే పరిమితమైనప్పుడు, ఆవిధంగా సరికొత్తగా వాటిని చూడడాన్ని నిషేధించినప్పుడు ఆ వాఙ్మయపు పునర్వికాసమూ, పునర్నవీకరణా ఆగిపోవడమే కాదు, వాటి గురించిన సాంప్రదాయికభాష్యం కూడా యాంత్రికమైన వల్లింపుగా మారి శ్రోతలను, లేదా పాఠకులను ఉత్తేజపరచగల శక్తినీ, తన అస్తిత్వాన్ని పొడిగించుకోగల జీవశక్తినీ కూడా కోల్పోతుంది.

ఎప్పటికప్పుడు ప్రతి తరమూ స్వేచ్ఛగా, నిర్నిషేధంగా దానిని కొత్తగా చదువుకోగలిగినప్పుడు సాంప్రదాయికభాష్యానికి అక్కడక్కడ పూర్వపక్షం, ప్రతిపక్షం తలెత్తవచ్చు నిజమే; అదే సమయంలో మరెన్నో వినూత్నమైన, విశిష్టమైన కోణాలూ, అన్వయాలూ, భాష్యాలూ వెలుగు చూసి, ప్రాచీన వాఙ్మయానికి నూతన వికాసాన్ని కల్పించి అంతిమంగా కాలం వెంబడి దాని ఉనికినీ, దోహదాన్నీ మరింత పొడిగిస్తాయి కూడా.

చెప్పొచ్చేదేమిటంటే, సమస్త వాఙ్మయాన్నీ అన్ని రకాల విధినిషేధాలకు, సరిహద్దులకు అతీతంగా, కొత్తగా అందివచ్చిన అనేకానేక వనరుల వెలుగులో స్వేచ్ఛగా అవలోకించి సమకాలానికి తెచ్చి దాని ప్రాసంగికతను స్థాపించడానికి బహుముఖాలుగా ప్రయత్నించే నేటి సాహితీవేత్తలూ, జిజ్ఞాసువులలో వీరభద్రుడుగారు ఒకరు మాత్రమే కాదు; ప్రథమగణ్యులలో ఒకరు. ఈ పుస్తకంలోని ‘చరిత్ర, పురాణాలు, సామాజికగమనం’ అనే విభాగంలోని నాలుగు వ్యాసాలూ అందులోకి వస్తాయి; అది రచయిత తాలూకు ఒక ముఖ్యమైన దృష్టికోణం అయినప్పుడు పుస్తకమంతటా దాని ప్రతిఫలనాన్ని ఏదో ఒక రూపంలో దర్శిస్తాం.

ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఉదహరించుకోవలసిన వ్యాసం ‘స్పష్టంగా చెప్పగలిగేనా?’ అనేది. ఇది వ్యక్తిగతంగా నేను అనుసంధానం కాగలిగినది కూడా. ‘మీ విశ్లేషణలు బాగుంటాయి. కానీ, వాటి తక్షణ, దీర్ఘకాలికప్రయోజనాలు ఏమిటో అర్థం కావడంలేదు. మీ దృక్పథమేమిటో తెలిస్తే మరింత ప్రయోజనకరం’ అన్న ఒక మిత్రుని మెసేజ్ కు సమాధానంగా రాసిన వ్యాసం ఇది. గురజాడ లాంటి కొంతమంది లోపల్లోపల మథనపడి, సమాధానం వెతికిపట్టుకుని దానిని మాత్రమే తేటగా, స్పష్టంగా ప్రపంచంతో పంచుకుంటారనీ, తనలాంటివాళ్ళు వేరనీ వీరభద్రుడు అంటూ, ‘నా నలుగులాటను నేను నలుగురినుంచీ దాచుకోవాలనుకోలేను, చలం లాగా, బైరాగిలాగా నేను రాసుకునేదంతా ఒక interior monologue. కాబట్టి, అందులో చాలా సంకీర్ణతా, సంక్లిష్టతా తప్పనిసరి’ అంటారు.

నన్నిక్కడ వ్యక్తిగతంగా ఆశ్చర్యపరచింది ఏమిటంటే, ఆ ‘వేర’ని చెప్పినవాళ్ళలో నేను కూడా ఒకడినేమో అనిపించడం! ఈమధ్య, నా సారస్వత, రచనాజీవితాన్ని చిత్రించవలసివస్తే, దానికి ఏ పేరుపెట్టవచ్చునన్న ప్రశ్న ఎదురైనప్పుడు ‘ప్రయాణం’, ‘అన్వేషణ’ అనే రెండు పేర్లు అప్పటికప్పుడు స్ఫురించాయి. ప్రయాణం, అన్వేషణ అన్నప్పుడు అవి ఇంకా ముగింపుకు చేరలేదనీ, ఒక జీవితకాలంలో చేరే అవకాశంలేదనీ అర్థం.

మరోరకంగా కూడా ఇది నన్ను నేను అనుసంధానించుకునే వ్యాసం. ఉపనిషత్తుల కాలం తర్వాత మొదటిసారిగా ఇప్పుడే భారతదేశంలో పెద్ద ఎత్తున భావజాలఘర్షణ జరుగుతోందనీ; మంచిదా, చెడ్డదా అనేది అలా ఉంచి, దేశం ఈరోజున ఒక కీలకమైన మలుపు తిరిగే దశలో ఉందనీ; అది ఈ దేశపు గతంవైపు కొత్తగా తిరుగుతున్న మలుపే తప్ప అంత కొత్తదీ కాదనీ నేను గత పదేళ్లుగా భావిస్తూ, చెబుతూవచ్చాను. వర్తమాన సందర్భం అలాంటిది కనుక, పునరుక్తమనిపించినా సరే, ఇదే మాటను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇతరేతరమైన తేడాలు ఉండవచ్చు కానీ మౌలికంగా వీరభద్రుడుగారు గారు తనవైపు నుంచి చేస్తున్నది కూడా అక్షరాలా అదే! ఈ చివరి పోస్టులో నేను ప్రస్తావించదలచుకున్న రెండవ విషయం కూడా అదే!

ఈ వ్యాసంలో ఆయన ఏమంటారో చూడండి:

‘ఏదైనా విషయం గురించి ఆలోచించడంలో, నలుగురితో చర్చించడంలో మూడు దశలుంటాయనిపిస్తుంది…చర్చ మూడవ దశకు చేరుకున్నప్పుడు అది ఆర్థిక-రాజకీయ-సామాజికపార్శ్వాలను దాటి ఒక తాత్త్వికకోణాన్ని సంతరించుకుంటుంది. ఉదాహరణకు, ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త జాతీయతాధోరణిని సంతరించుకుంటున్న రాజకీయవాతావరణం ఏర్పడుతున్నది. అది కొత్తపరిణామంగా కనిపించవచ్చుగాని, ఆదినుంచీ భారతదేశచరిత్రను నిశితంగా పరిశీలించినవాళ్ళకి ఈ పరిణామంలో చరిత్ర పునరావృత్తి కనిపిస్తుంది’.

ఈ దేశచరిత్రలో ఒకసారి కేంద్రం నుంచి అంచుల దాకా(centrifugal), మరొకసారి అంచులనుంచి కేంద్రం దాకా(centripetal) మార్చి మార్చి రాజకీయ-సాంస్కృతిక నిర్మాణాలు సంభవిస్తూ కనిపిస్తాయనీ, మొదటిది జాతిభావనగా, మతపరమైన ఏకేశ్వరోపాసనగా, రాజకీయంగా totalitarian గా వ్యక్తమై బలమైన కేంద్రంవైపు, unity వైపు నడిపిస్తే; రెండవది బలమైన ప్రాంతాలూ, అంచులూ, వివిధ సంస్కృతులూ, భాషలూ, వివిధ ఆరాధనాసమూహాల గురించిన జాగృతివైపు, diversity వైపు నడిపిస్తుందని వీరభద్రుడు ఒక ఆసక్తికరమైన సూత్రీకరణ చేస్తారు. ఈ alternation ను ప్రపంచవిపణితో దేశ సంబంధాలు బలంగా ఉండడం, లేదా బలహీనపడడం అనే పరిణామాలతో ముడిపెట్టి; బలంగా ఉన్నప్పుడు కేంద్రం బలపడడం, బలహీనపడినప్పుడు అంచులు బలపడడం జరుగుతూ ఉంటుందని ఊహిస్తారు. ‘ఈ క్రమంలో భారతదేశంలో నా కళ్ళముందు సంభవిస్తున్న పరిణామాల్ని చరిత్ర, తత్త్వశాస్త్రం, సాహిత్యం ఆసరాగా మరింత లోతుగా అధ్యయనం చేయాలనేది నా కోరిక’ అంటారు.

నేడు భారతదేశం హిందుత్వవాదం, హిందుత్వవాదాన్ని వ్యతిరేకించేవాదం అనే రెండు శిబిరాలుగా చీలిపోయిందని ఆయన అంటూ, ఈ రెండు దృక్పథాల్లోనూ కూడా లోతు లేదనీ, తమకు సంబంధించని విశాలభారతదేశమొకటి ఉందనీ, దాని గురించి వాళ్ళకు తెలిసింది స్వల్పమనీ తన అభిప్రాయంగా చెప్పి, ఆ భారతదేశం గురించిన ఎరుకను తను కబీరును చదవడం ద్వారా పొందానంటారు.

నేను కానీ, ఇతరులు కానీ ఆయన అవగాహనతో, లేదా సూత్రీకరణలతో ఏకీభవించేవీ, విభేదించేవీ ఏముంటాయనేది అలా ఉంచితే; నావరకు నాకిక్కడ కావలసినది ఆయన కూడా దేశీయంగా ఈ రోజున పెద్ద ఎత్తున భావజాలఘర్షణ జరుగుతున్న సంగతిని గుర్తిస్తూ, దాని గురించి ఆలోచిస్తూ, ఆ దిశగా సాహిత్యంతో సహా తన అధ్యయనాంశాలను అన్నిటినీ మళ్ళించడం! ఆ దిశగా ఆలోచించే ఎంతోమందికి బలమైన తోడు కావడం!

***

రచయిత ఇతరత్రా వ్యాసాలలో వ్యక్తపరచిన దృష్టికోణాలను కూడా దీనికి కలుపుకుని చూసి మొత్తంమీద ఈ పుస్తకానికి ఒక వస్త్వైక్యత సమకూడుతోందనుకుంటే- ఈ పుస్తకంలోని చివరి వ్యాసం మన ప్రాచీన కావ్యనాటకాలలో కనిపించే భరతవాక్యం లేదా మంగళాశాసనం లేదా ఫలశ్రుతి లాంటిది. ‘మన పిల్లలకు మంచిది కాదు’ అనే శీర్షికతో ఉన్న ఈ వ్యాసం గౌరీ లంకేశ్ హత్య గురించి మాట్లాడుతూ, ‘ఆమె హత్యను ఎవరు ఖండించారన్నది కాదు, ఎవరు ఖండించలేదన్నది నన్నెక్కువ బాధపెడుతోంది. ఇది జాతికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు’ అంటుంది.

నావరకు ఇక్కడ ఇంకొక విచిత్రమైన యాదృచ్ఛికత ఏమిటంటే, గౌరీ లంకేశ్ హత్య గురించి రాసినప్పుడు నేను ప్రముఖంగా ప్రస్తావించినది కూడా, ఆ హత్యను ఖండించని వాళ్ళ గురించే!

సాయుధయుద్ధాలలోనే కాదు, భావజాలయుద్ధాల్లో కూడా మధ్యమవాణిని వినిపించే వివేకవంతులు ఉంటూనే ఉంటారు. భీకరయుద్ధారావాల మధ్య ఆ గొంతు అణగారినట్టు అనిపించినా, యుద్ధం విధ్వంసపు అంచులవైపు పూర్తి స్థాయిలో సాగుతున్నప్పుడు, హాహాకారాలు మిన్నంటుతూ పునర్నిర్మాణం గురించిన ఆకాంక్షలు వెల్లువెత్తుతున్నప్పుడు ఆశ్వాసన కోసం, దిశానిర్దేశం కోసం ఒక వివేకవాణికి అందరూ తప్పనిసరిగా చెవియొగ్గవలసివస్తుంది.

అదిగో, అప్పుడు, ఆ అక్కర తీర్చడం కోసం…ఈ పుస్తకం, ఇంకా ఇలాంటి మరెన్నో పుస్తకాలు జాతి చేతికి అలంకారమవుతాయి!

26-11-2025, 27-11-2025, 30-11-2025, 7-12-2025,10-12-2025


2 Replies to “నిజంగా ఉదారచరితులు!”

  1. “విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్ “
    అన్న వాక్యం స్ఫురించింది. దేశకాలపాత్రాతీతంగా విశ్వమానవతావాద దృక్పథం కలిగి , అనేక గ్రంథాలు శోధించి మధించి రాసిన పుస్తకానికి అదేదృక్పథము, అంతగా కృషి సల్పిన సత్యాన్వేషి రాసిన ఈ వ్యాసం పుస్తకానికి సమీక్షగా కాదు పీఠికగా నిలుస్తుంది. ఇరువురు మేధావులకు మనఃపూర్వక అభినందనలు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%