
కవిత్వం రాసుకోవడం
ఒక ప్రథమ చికిత్స.
జీవితం గాయపరిచినప్పుడల్లా
ఏదో ఒకటి చేసి
ముందు రక్తం కారకుండా చూసుకోడం.
నొప్పినయితే ఎలానో భరిస్తాంగాని
ఏదో ఒకటి చెయ్యకుండా ఉండిపోయామన్న
చింత లేకుండా చేసుకోడం.
కవిత్వం చదువుకుంటూ ఉండటం
ఒక కాయకల్ప చికిత్స.
లోపల రక్తం శుద్ధిపరుచుకోవడం
రోగనిరోధక శక్తి పెంచుకోవడం
వచ్చే వృద్ధాప్యం ఎలానూ ఆగదుగాని
జీవితోత్సాహం చెక్కుచెదరకపోవడం.
కవిత్వం సంభావించుకుంటూ ఉండటం
ఒక సంజీవకరణి.
కూలిపోయామనుకున్న
ప్రతి ఒక్క క్షణం
మళ్ళా కొత్తగా లేపి
నిలబెడుతూనే ఉంటుంది.
8-10-2025


Loved it, sir. Beautiful!
ధన్యవాదాలు మానసా!
చివరి వాక్యాలు అద్భుతం సర్
కవిత్వం సంభావించుకుంటూ ఉండటం ఒక సంజీవకరణి
ఏనాడైనా ఎక్కడైనా ఒక చిన్న తోటలో కూర్చుని లోకంలోని కవిత్వానంతటినీ చదువుతూ చదువుతూ అక్కడే ఉండిపోగలనా…
ధన్యవాదాలు సోమ భూపాల్!
జీవితం గాయపరిచినప్పుడు కవిత్వం కాపాడుతుందని మీరన్నారు గనుక అది విలువగలది సర్. నమస్సులు
కూలిపోయామనుకున్న ప్రతి ఒక్క క్షణం… కవిత్వం నిజంగా నిలబెడుతుందా సార్.?ఎలాగో ఒకలా లేచి నిలబడుతున్నా. ఇంకా నా ప్రాణానికి ఒక ప్రయోజనం ఉందేమో అనుకుని.కవిత్వం లో ఉందంటే( మీరు చెప్పింది అది ఏదయినా నాకు నమ్మకం సర్) చదువుతాను సర్. తమకు నా నమస్సులు
తప్పకుండా
జీవితం గాయపరిచిందో, జీవితమే గాయపడిందో..
ఏమైనా సరే జీవితపు మలిమెట్లదారిలో కవిత్వం వో నమ్మకమైన ఆసరా
మీ వాక్యాలు చదివాక ఇంకాస్త భరోసా పెరిగింది
అవును సార్
నమస్తే సర్, కవిత్వం గురించిన అద్భుతమైన విషయం. కవిత్వం శుద్ధ అంతరంగీకరణం, మీలాంటి వారిని కలిపే అమృత ఋతం…
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
నమస్తే సర్, కవిత్వం గురించిన అద్భుతమైన విషయం. కవిత్వం శుద్ధ అంతరంగీకరణం, మీలాంటి వారిని కలిపిన అమృత ఋతం…
ఈ స్వంత వైద్యం.లేపనం పూత చాలా బాగుంది సోదరా!.
మీరు చెప్పిన తర్వాత కవిత్వం రాసుకోవడం, చదువుకుంటూ ఉండటం, సంభావించుకుంటూ ఉండటం అనేది మనిషికి ఎంత నమ్మకాన్ని, భరోసాని జీవితం మీద కల్పిస్తుందో అర్ధమయ్యింది. ఈ మంచి మాటని కవిత్వంగా మలిచినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు