ఇది కదా భారతదేశం

జీడిగుంట విజయసారథి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘జిజ్ఞాసి’ అనవచ్చు. ఏదో ఒకటి తెలుసుకోకుండా, ఏదో ఒకటి చదవకుండా, ఏ రచయిత తిరుగాడిన ప్రాంతాల్నో తాను మళ్ళా స్వయంగా సంచరించకుండా ఆయన ఒక్క క్షణం కూడా గడపరని చెప్పవచ్చు. ‘మీతో వస్తున్నానని కూడా పుస్తకం తెచ్చుకోలేదుగానీ లేకపోతే ఈ ఆటోలో పదినిముషాల్లో నాలుగు పేజీలు చదివేసి ఉండేవాణ్ణి’ అన్నారాయన నాతో.

మొన్న తెలంగాణా హెరిటేజి మూజియం చూసాక, మధ్యాహ్నం ఇంకా రెండుమూడు గంటల సమయం మా దగ్గర ఉండటంతో, ఆయన కుతూహలం తెలుసు కాబట్టి, ఏదేనా చిత్రకళా ప్రదర్శనకు కూడా వెళ్దామా అనుకున్నాను. మా అదృష్టం కొద్దీ మొన్న స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ లో ఒకటి కాదు, రెండు ప్రదర్శనలు, వర్కు షాపులు నడుస్తున్నాయి.

మొదటిది, గ్రౌండు ఫ్లోరులో, చిత్రకారిణుల వర్కుషాపు. బతుకమ్మ పండగ మొదలైన సందర్భం పురస్కరించుకుని స్టేట్ గాలరీ ఏర్పాటు చేసిన వర్క్ షాపు అది.

హాల్లో అడుగుపెట్టగానే బి.ఏ.రెడ్డి గారి కుమార్తె ప్రముఖ చిత్రకారిణి పద్మా రెడ్డి గారు చిరునవ్వుతో స్వాగతించారు. జె.ఎన్.యు కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సులో ప్రొఫెసరుగా పనిచేస్తున్న ప్రీతి సంయుక్తగారు క్యురేటరుగా ఉన్న ఆ చిత్రకళాశిబిరంలో భారతదేశం నలుమూలనుంచీ దాదాపు ముప్ఫై మంది చిత్రకారులు పాల్గొంటున్నారు.

మేం వెళ్ళేటప్పటికి ఆ హాలంతా పెళ్ళివారిల్లులా కనిపించింది. పండగ సందడి.

ఆ చిత్రకారిణులు ఫైన్ ఆర్ట్సులో గ్రాడ్యుయేషను, పోస్టుగ్రాడ్యుయేషను చేసినవారు. వాళ్ళు చదువుకున్నదికూడా మామూలు కళాశాలలు కాదు. శాంతినికేతను, ముంబై జె.జె.స్కూలు ఆఫ్ ఆర్టు లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు. ఒక విధంగా చెప్పాలంటే, నేడు చిత్రకళలో వారు ముందువరసలో నిలబడ్డ కళాకారులు.

మనందరం చూస్తున్న దృశ్యప్రపంచాన్నే వారు తమ నేత్రాల్తో చూసి మనకి సరికొత్తగా పరిచయం చేస్తున్నారు. కొందరు మనం చూడలేని అంతర్లోకాల్ని కూడా తమ మనోనేత్రాల్తో చూసి మనకు పరిచయం చేస్తున్నారు.

ఆ హాల్లో తిరుగుతూ వారిని పలకరిస్తూ వారు బొమ్మలు వేస్తూ ఉండగా ఫొటోలు తీసుకుంటూ, వారి నేపథ్యాలూ, వారి ఆసక్తులూ, వారి మాధ్యమాలూ, వారి నైపుణ్యాలూ తెలుసుకుంటూ ఉంటే, మాటల్లో పెట్టలేని ఉత్సాహమేదో మాలోపలనుంచి పైకి ఉబుకుతున్నట్టు మాకు తెలుస్తూనే ఉంది. విజయసారథిని ఆ ప్రదర్శన ఎంతగా సమ్మోహితుణ్ణి చేసిందంటే, అక్కడ రేలపూలమీద, హమ్మింగ్ బర్డ్సుని చిత్రించిన ఒక కాన్వాసుని ఆయన అక్కడికక్కడే కొనుక్కోడానికి సిద్ధపడిపోయారు. కాని ఆ చిత్రలేఖనాల్ని తాను అమ్మలేననీ, అవి స్టేట్ గాలరీకి చెందుతాయనీ ఆ చిత్రకారిణి చెప్పారు. ‘అలా అయితే, ఇటువంటి చిత్రలేఖనమే, నాకొకటి గీసిపెట్టండి’ అని అడిగి ఆమెతో వాగ్దానం చేయించుకునేదాకా ఆయన అక్కణ్ణుంచి కదల్లేదు.

గాలరీ రెండో అంతస్తులో Editions 2/ పేరిట ప్రింటుమేకింగ్ ప్రదర్శన ఉంది. The Unknown Art Group అనే సంస్థతో కలిసి స్టేట్ గాలరీ ఏర్పాటు చేసిన ప్రదర్శన అది. Ek Chitra సంస్థకు చెందిన మడిపడగ అన్నపూర్ణ, అత్రి చేతన్ అనే ప్రింట్ మేకరుతో కలిపి ఆ ప్రదర్శనను క్యురేట్ చేసారు. పధ్నాలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనని వారు A display of 15th century technique అని చెప్పుకున్నా, దాన్ని అత్యంత సమకాలీన భారతీయ చిత్రరచనా ప్రదర్శనగా చెప్పవచ్చు.

ప్రింట్ మేకింగ్ మొదట వుడ్ కట్ తో మొదలైన ప్రక్రియ. ప్రాచీన చీనాలో దీని మూలాలున్నాయి. కాని రినైజాన్సు రోజుల్లో యూరోపు ఈ మాధ్యమాన్ని తన స్వంతం చేసేసుకుంది. దానికి కొద్దిగా వెనగ్గా జపాను కూడా ఈ కళారూపాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో సాధన చేసింది. ఆ తర్వాత relif (అంటే ప్రింట్ తీసుకునే భాగం తప్ప చెక్కలో ఉన్న తక్కిన భాగమంతా తొలగించే పద్ధతి), intaglio (చెక్కలో ఏ భాగాన్ని ప్రింట్ తీయాలనుకుంటున్నామో ఆ గీతల మేరకు లోతుగా లోపలికీ కట్ చేస్తారు, తక్కిన భాగమంతా యథాతథంగా ఉంటుంది)- రెండు పద్ధతుల్లోనూ, వుడ్ కట్ తో పాటు, ఆక్వాటింటు, మెజోటింటు, డ్రై పాయింట్ లాంటి ఎచింగ్ ప్రక్రియలు కూడా యూరోపులో చిత్రకారుడి సృజనాత్మకతకు కొత్త తలుపులు తెరిచాయి. వీటికి తోడు ఇరవయ్యవ శతాబ్దంలో పికాసో వంటి చిత్రకారుల పూనిక వల్ల లినో కట్ కూడా విశిష్ట మాధ్యమంగా వికసించింది.

ఒక పెన్సిలుతోనో, లేదా ఇంకుపెన్నుతోనో లేదా పేస్టల్సుతోనో కాగితం మీద బొమ్మ గియ్యడంతో పోలిస్తే ప్రింట్ మేకింగ్ చాలా సమయాన్నీ, శక్తినీ, ఏకాగ్రతనీ కోరుకునే మాధ్యమం. కాని ఆ సవాలుని స్వీకరించడంలో ఉండే సృజనానందం ప్రింట్ మేకర్లకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టే, సెకన్ల వ్యవధిలో మనమిచ్చిన prompt ని బట్టి ఏదో ఒక తరహా ప్రింట్ మేకింగ్ మాధ్యమంలో ఇమేజిని సృష్టించగల ఆర్టిఫిషియలు ఇంటలిజెన్సు యుగంలో కూడా, ఇందరు యువతీయువకులు ఈ మాధ్యమాన్ని ఇంతగా ప్రేమిస్తున్నారు.

ఇటువంటి ప్రదర్శనలు చూడటానికి నేనెందుకు ఇష్టపడతానంటే, ఇటువంటి గాలరీలో ఒక గంట గడిపినా కూడా, ఒక కొత్త కవితాసంకలనమో, లేదా కథాసంకలనమో చదివినట్టు ఉంటుంది. సాహిత్య సంకలనాల ద్వారా వివిధ ప్రాంతాల, వివిధ సామాజిక నేపథ్యాల రచయితలు తమ అనుభవాల్నీ, అంతరంగాల్నీ మనకు పరిచయం చేసినట్టే, ఈ ప్రదర్శనల్లో కళాకారులు తమ హృదయాన్ని మనముందు విప్పి పరుస్తారు. ఇప్పటి కళాకారులు ఏమి చూస్తున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు, తమ ముందున్న దృశ్యప్రపంచాన్ని image making లోకి ఎలా అనువదిస్తున్నారు- ఆ కొత్తధోరణులు, ఆ నవ్య భావనలు మనకి స్థూలంగానైనా పరిచయమవుతాయి.

ఉదాహరణకి, మహారాష్ట్రకి చెందిన చరణ దాస్ జాదవ్ చిత్రాల్లో సెక్స్ వర్కర్ల, ట్రాన్స్ జెండర్ల ప్రపంచం పరిచయమవుతుంది. ఆ బొమ్మలు చూస్తుంటే మనలో కలిగే సంవేదనలు ఒక నళినీ జమేలానో (ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ), ఒక రేవతిని (ఒక హిజ్రా ఆత్మకథ) చదువుతున్నప్పుడో మనకి కలిగే సంవేదనల్లాంటివే. వారి జీవితాల్లోని అనిశ్చితి, వారు తప్పించుకోలేకపోతున్న న్యూనత-వీటిని ఈ చిత్రకారుడి ప్రింట్లు మాటలకన్నా మిన్నగా మనకు పరిచయం చేస్తున్నాయి.

Charan Das Jadav, Naka, Serigraphy, 15×19 inches, 2025

అలానే తెలంగాణాకి చెందిన బాబు పేరుపల్లి తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రూపొందించిన వుడ్ కట్లు ఒక సజీవ స్రవంతి ని మన కళ్ళముందు ఆవిష్కరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఈ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్క చిత్రకారుడూ తనదైన ఒక అద్వితీయతను, తన దృష్టికోణంలోని ప్రత్యేకతను మనతో పంచుకుంటున్నాడు.

కేవలం వస్తువులోనే కాదు, వారు ఎంచుకున్న మాధ్యమాల్లో కూడా ఎంతో వైవిధ్యముంది. అసాం కి చెందిన ఆగ్వమా బసుమతారీ డ్రై పాయింటు చిత్రలేఖనాలు, మధ్యప్రదేశ్ కి చెందిన ఆదర్శ పలాండి సాఫ్ట్ వుడ్ మీద చిత్రించిన ఎంగ్రేవింగులు, పశ్చిమ బెంగాలుకి చెందిన అతను బక్షి మల్టి రబ్బరు మాట్ మీద చిత్రించిన ఇంటాగ్లియో ప్రింట్లు, నరేంద్ర కుమార్ సయిన్, నికితా వర్మ, సంజయ్ కుమార్ యాదవ్, రాజశ్రీ నాయక్ ల అక్వాటింట్లు, ఇంకా మోనో టింట్లు, సేరిగ్రఫీలు, పేపరు పల్పుమీద టెట్రాపాక్ ప్రింట్లు, స్క్రీన్ ప్రింట్లు- ఎన్ని రకాలుగా ప్రింట్ మేకింగ్ ని తమ అభివ్యక్తిగా వాహికగా వాడుకోవచ్చునో అన్నిరకాలుగానూ ఈ చిత్రకారులు వాడుకున్నారు.

కాని నాబోటి వాణ్ణి ఆకర్షించే ఇతివృత్తాలు వేరే ఉంటాయి కదా! నాకు పల్లెపట్టులూ, అడవులూ, కొండలూ, అమాయికమైన పసివదనాలూ చూడాలని ఉంటుంది. అటువంటి ఇద్దరు చిత్రకారుల వల్ల ఈ ప్రదర్శన నన్ను నిరాశపర్చకపోగా, చెప్పలేని ఒక సుకోమలానుభూతిని కూడా ప్రసాదించింది. వారిలో ఒకరు అరుణాచల ప్రదేశ్ కి చెందిన స్వీటీ చక్మా. ఆమె తన గిరిజన ప్రాంతాల రంగుల్నీ, రేఖల్నీ నయన, హృదయ సమ్మోహకంగా తీసుకొచ్చారు.

Sweety Chakma, Dear Mother, Woodcut, 13x 17 inches, 2025

మరొకరు మరొకరు అసాం కు చెందిన రాజాబరో. ఆయన వుడ్ కట్లు మహిమాన్వితమైన జపనీయ వుడ్ కట్లను తలపుకు తెచ్చేవిగా ఉన్నాయి. కొండలు, పొలాలు, నీరవనిశ్శబ్దం, గంభీర సంధ్యలు- ముఖ్యంగా ఆ పసుపు, ఆ ఆకుపచ్చ, చూపరులకొక ప్రశాంతమనస్థితిని కానుక చేస్తాయని చెప్పవచ్చు. ఈ ఇద్దరు చిత్రకారులూ కూడా శాంతినికేతన్ విద్యార్థులు కావడంలో ఆశ్చర్యం లేదు.

Raja Boro, Above the Clouds-5, Woodcut, 8.25 x 6.25 inches, 2025

అలానే రాజస్తాన్ కి చెందిన దివ్య డ్రై పాయింటులోనూ, ఎండిన పూల రేకల్తోనూ చిత్రించిన పూలబొమ్మలు కూడా చాలా lyrical గా ఉన్నాయి. వాటి శ్రావ్యత నా చెవులకు వినబడుతూ ఉంది.

Divya Kakani, Jalalo Bilalo, Drypoint and Dried Flowers, 24×24 inches, 2025

ఈ సందర్భంగా స్టేట్ గాలరీ ఆఫ్ ఫైన్ ఆర్టు వారు, The Unknowns Art Group వారూ కలిసి ఒక ఆకర్షణీయమైన కాటలాగు కూడా వెలువరించారు. అందులో మొత్తం చిత్రకారులందరి వివరాలూ, వారివి ఒక్కొక్కరివీ ఒక్కొక్క చిత్రలేఖనం కూడా పొందుపరిచారు. చిత్రప్రదర్శనకు క్యురేటరుగా ఉన్న అన్నపూర్ణగారు మాకిద్దరికీ రెండు ప్రతులు బహూకరించారు.

ఈ శిబిరంలో ప్రత్యేకత ఏమిటంటే, తాము అంతకు ముందే చిత్రించిన బొమ్మలు మాత్రమే కాక, అప్పటికప్పుడు బొమ్మలు చిత్రిస్తూ ప్రింటు తీసుకునే ఒక వర్క్ షాపు కూడా నడపడం. అందుకు అవసరమైన సామగ్రీ, ప్రింటు యంత్రాలూ కూడా అక్కడ ఏర్పాటు చేసారు.

అలా భారతదేశపు నలుమూలలకూ చెందిన చిత్రకారులు మరో ధ్యాసలేకుండా తాము చూస్తున్న దేశాన్నీ, సమాజాన్నీ, సౌందర్యాన్నీ చిత్రించడంలోనే తలమునకలుగా ఉన్న ఆ దృశ్యాన్ని చూస్తుంటే, మాకు ‘ఇది కదా భారతదేశం’ అని అనిపించింది. ఈ జాతీయ చిత్రకళా శిబిరం నాకు మరొక discovery of India గా తోచింది.


Printmaking images courtesy: Editions 2 catalogue, Artists and Unknown Arts Group

25-9-2025

6 Replies to “ఇది కదా భారతదేశం”

  1. Rajabharo painting అత్యద్భుతంగా ఉందండీ.. great colors combinations. ఆ చెట్ల కాండాల మీద వెలుతురు పొడ, ఆ బంగారు కాంతి… Loved it.

  2. మీ అనుభవాలు మాకు పంచిన మీకు కృతజ్ఞతలు. చిత్రకళకు సంబంధించిన అనేక వివరాలు తెలపడం విజ్ఞాన దాయకం.

  3. నిన్నటి హెరిటేజ్‌ మ్యూజియం, ఈ నాటి చిత్రశాల – స్వయంగా వెళ్ళి చూసినట్లు ఉంది.. అంత చక్కగా వివరించారు. ధన్యవాదాలండీ🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading