
వానలు పడుతున్నంతసేపూ
పడవలు వచ్చి ఆగుతుంటాయి.
వెయ్యి తలుపులు ఒక్కసారి
తెరుచుకున్నట్టు వేలాది పడవలు.
వానపడుతున్నంతసేపూ
కిటికీలోంచి బయటకి చూస్తుంటాను
ఎక్కడెక్కడి పడవలూ నా ఇంటివాకిట్లో
ఉత్తరాలు కుమ్మరించిపోతాయి.
ఇప్పుడా మహారణ్యాల్లేవు, ఆ కొండలు దూరం,
వానలు మాత్రం నా ఇంటిదాకా వస్తాయి
ఆ నది ఒడ్డున రెల్లువిరబూసిందని
చెప్పడానికి నన్ను వెతుక్కుంటూ వస్తాయి.
లోకం ఏ వార్తలు కోరుకుంటుందోగాని
నేనీ వార్తలకోసమే పరితపిస్తాను.
కిటికీ లోంచి వాన గాలి తగలగానే
రెల్లు పొదల మాటలు వినబడతాయి.
కాకినాడలో ఉప్పుటేరుదగ్గర పడవలు
వరసగా నిలిచి ఉండే దృశ్యం గుర్తొస్తోంది.
కటు క్షారమయ జగత్తు, జీవితం మధ్యనే
రెల్లు పూసే కాలం నావలాగా తేలి వస్తుంది.
21-9-2025


ఆ నది ఒడ్డున పూసిన రెల్లు పూల వార్తలు మోసుకొచ్చే వాన పడవలు !!
Nostalgically beautiful, sir!
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
ఈ కవితలో వాన ఒక జ్ఞాపకాల వాహకుడిలా వస్తుంది. కిటికీ బయట పడవల వరుస కనిపించినట్లు, వాన కూడా కవికి ఎన్నో ఉత్తరాలను, వార్తలను తీసుకువస్తుంది. గతంలో దగ్గరగా ఉన్న మహారణ్యాలు, కొండలు దూరమైనా, రెల్లుపువ్వుల వాసన, వాటి మాటలు మాత్రం వానతో కలసి చేరతాయి. లోకం కోరుకునే పెద్ద వార్తలు కవికి ముఖ్యం కావు; ఆయన కోసం వాన, గాలి, రెల్లుపూవులే నిజమైన వార్తలు. చివరగా కాకినాడ ఉప్పుటేరుదగ్గర పడవల దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ, కఠినమైన జీవన మధ్యలో కూడా రెల్లుపూసే కాలం పడవలా మనసుకు తేలికనిస్తుందని కవి చెబుతున్నారు. చక్కని అనుభూతి ఇచ్చే కవిత
హృదయపూర్వక ధన్యవాదాలు శైలజ గారూ!