జాగరాలమ్మ

దాదాపు మూడేళ్ళ తరువాత మళ్ళా మా ఊరు వెళ్ళాను. మా గ్రామదేవత జాగరాలమ్మను దర్శించుకోడానికి. నాతో పాటు మా అక్క కూడా వచ్చింది. మేము ఆ ఊరు వెళ్తామని తెలిసి సోమశేఖర్ తాను కూడా వస్తానన్నాడు. రావడమే కాదు, తనే తన కారుమీద మమ్మల్ని ఆ ఊరు తీసుకువెళ్ళి తీసుకొచ్చాడు. ఆ రోజు అతడు కూడా ఆ గిరిజనదేవతను దర్శించుకున్నాడు. కాని అతడి హృదయంలో ఇన్ని రసతరంగాలు ఎగిసిపడుతున్నాయని నేను ఊహించలేకపోయాను.  మరో సంతోషం, ఆ మధ్యాహ్నం, ఆయన కోసం  అడ్డతీగల అడవుల్లో ఒక మహావర్షం కురిసింది. అడ్డతీగల అడవుల్లో వానల గురించి నేనో కవిత రాసానని నేను మర్చిపోయినా సోమశేఖర్ మర్చిపోలేదు, అడవి మర్చిపోలేదు!ఆయన ఫేస్ బుక్కులో తన వాల్ మీద రాసిన ఈ పోస్టు మీతో పంచుకోకుండా ఎలా ఉండగలను!


జాగరాలమ్మ

సోమశేఖరరావు మార్కొండ


మీరు మా గురువు గారైన వాడ్రేవు చినవీరభద్రుడు గారి కవిత్వం లోనూ, రచనల్లోనూ, ప్రసంగాలలోనూ వారు జన్మించిన శరభవరం గురించి మీరు నాకులాగానే చదివేఉంటారు, లేకపోతే వినేఉంటారు.

ఆ శరభవరం అనే గిరిజనగ్రామం ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలోనూ ప్రస్తుతం శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది.

ఆగష్టు 31వ తేదీన నాకు చినవీరభద్రుడు గారితోనూ, వీరలక్ష్మీదేవి గారితోనూ కలిసి కొండ కిందపల్లె అయిన ఆ శరభవరం, ఆ ఊరులో ఉన్న జెండా కొండ, ఆ ఊరి గ్రామదేవత జాకరాలమ్మను దర్శించుకునే అమూల్యమైన అనుభవం, అదృష్టం దక్కింది.

వాడ్రేవు చినవీరభద్రుడు గారు 2014లో ప్రచురించిన తన కవిత్వ పుస్తకం ‘నీటిరంగుల చిత్రం’అంకితమిస్తూ ఇలా వ్రాసుకున్నారు.

“మా అమ్మకెంతో ఇష్టమైన మా గ్రామదేవత జాగరాలమ్మ తల్లికి”.

అలాంటి జాకరాలమ్మ దర్శనం, ఆశీస్సులు దక్కాయి.

మేము ఆ ఊరికి వెళ్లే దారి, ఆ ప్రయాణం గురించి ‘నీటిరంగుల చిత్రం‘లో ఒక కవిత…

మళ్లా ఆ దారిన అడుగుపెట్టాం,
మా ఎదట సీతాకోకచిలుకల అడవి.
ఆకుపచ్చని సముద్రం,
లెక్కలేని నావలు.

అడవి మొత్తం దూదిపింజగా
విడిపోయిన పోగులుపోగులు
ఎగురుతున్న కాంతితునకల
మీద ఎండ అద్దిన తళతళ.

ఒక చెట్టుకు పూసిన పూలు
మరొకచెట్టు మీద వాలుతున్నాయి.
గాల్లో తేలుతున్న పూలకి
మళ్లా పూలు పూస్తున్నాయి.

ఆ కొండ కింద పల్లెను, జెండా కొండను‌, జాగరాలమ్మను చూడాలని ఎన్నాళ్లనుండో నా కోరిక. ఎందుకో తెలుసా, నీటిరంగుల చిత్రం లోని ఈ కవిత చూడండి.

మా వూళ్లో మా చిన్నప్పటి ఇంటిచుట్టూ.

మా ఊళ్లో మా చిన్నప్పటి ఇంటి చుట్టూ
వెదురుకంచె, దానికి రెండు తలుపులు,
వీధిగుమ్మం దాటితే ఊరు, పెరటి తలుపు
తెరిస్తే పాలపూలఅడవి, జెండా కొండ.

ఒకరోజు వీధి తలుపు తెరిచి మా నాన్న
నన్ను మొదటిసారి బడికి తీసుకెళ్లాడు,
మరొకరాత్రి నేనాదారినే మా నాన్న
కన్నుగప్పి నవయవ్వనంలో అడుగు పెట్టాను.

తక్కినరోజుల్లో ఎవరు ఏ దారిన నడిచినా
వసంతకాలం వచ్చినప్పుడు ఆ పెరటిదారిన
దేవతలెవరో ఊరేగింపుకి తరలినట్టు
ఊరంతా బాజాలు మోగుతుండేవి.

చిగురించిన చింతతోపులమధ్య, గాటు
వాసన కొట్టే కొండసంపెంగల లోయలో
అడవిరాజులు వేటకి బయలుదేరారిప్పుడు
అనేవాడు మా అన్నయ్య గుసగుసగా.

ఇప్పుడా ఇల్లు లేదు, ఆ తలుపుల్లేవు,
అడవిదేవతల కోసం పాడుకున్న ఆ పాటల్లేవు
అయినా ప్రతి వసంతవేళా నేనెక్కడుంటే
అక్కడే పెరటితలుపు తెరుస్తోంది కోకిల.

****

ఇంకొక కవిత లో ఇలా అంటారు.

మా ఊరుదాటి కాకరపాడువెళ్లేదారి, జాగరాలమ్మగుడిదాటి
మద్దిచెట్ల, బాడిసచెట్ల, జీడిచెట్ల అడవిలో మధ్యాహ్నవేళల్లో
గాంధారిపాప తిరుగుతుందనేవారు, ఎన్నేళ్ళ ముసలిదో,
కొండరెడ్లమంత్రగత్తె, ఆమె నడుముకింద తోకవుందనేవారు.

ఆ ఊరి గ్రామదేవత జాగరాలమ్మను దర్శనం చేసుకున్నాము. వీరలక్ష్మీదేవి గారు, చినవీరభద్రుడు గారు అమ్మవారికి చీర, కుంకుమ, గాజులు, పూలు, నైవేద్యం సమర్పించారు.

నీటిరంగుల చిత్రంలో గ్రామదేవత గురించి ఇంకొక కవిత ఉంది.

మా గ్రామదేవతను నీళ్ళతో అభిషేకించాను

నిప్పులు కురుస్తున్న వేసవివేళ మాగ్రామదేవతను
నీళ్ళతో అభిషేకించాను, కొత్తచీర చుట్టాను, నుదుట
కుంకుమదిద్దాను, అడవిని, చెట్లని, కొండల్ని
కళ్ళారా చూసుకున్నాను, చూసింది కళ్ళకద్దుకున్నాను.

ఒంటినిండా పసుపురాసుకున్న కోదుపడుచుల్లాంటి
రేలచెట్ల మధ్య, పండు గురివింద తీగల పాటలాధరాలతో
అనాదిగా వన దేవతలు ఆ లోయలో పాడుతున్నపాటలు
చిన్నప్పుడు వెన్నెల్లో విన్నటే మళ్లా ఆ ఎండవేళ విన్నాను.

ఇంతదాకా తెలుసుకున్నవన్నీ అక్కడ మర్చిపోయాను,
ఇన్నాళ్లుగా మర్చిపోయినవన్నీ గుర్తుతెచ్చుకున్నాను, ఈ
ముషిడిచెట్లనీడనే ఆమెనొక ఆదివాసి తొలిసారి చూసాడు.
ఆ పూర్వమానవుడిలో నా ముఖాన్ని నేనిపుడు గుర్తుపట్టాను.

వీరలక్ష్మీదేవి గారు, చినవీరభద్రుడు గారు శరభవరం లో తమ బాల్యకాలపు జ్ఞాపకాలన్నిటినీ పంచుకున్నారు. అవి తమ కథలుగా, కవితలుగా, నవలలకి ఎలా భూమికగా మారాయో చెప్పారు. చినవీరభద్రుడు గారి ‘ఆ వెన్నెల రాత్రులు’ నవలలో మనకు కనపడేది ఆ ఊరే. అక్కడే పుట్టి, దాదాపు 33 సంవత్సరాల అనుబంధం ఉన్న ఊరది.

తర్వాత రాజవొమ్మంగి లో కూడా ఉన్నారు.

రాజవొమ్మంగిలో మధ్యాహ్న భోజనం చేసి, బయలుదేరాము. అడవిదారిలో మాకు చాలా పెద్దవాన ఎదురొచ్చింది.

నీటిరంగుల చిత్రంలో కూడా అడ్డతీగల అడవుల్లో వాన గురించి ఒక కవిత ఉంది.

ఆ మధ్యాహ్నం అడ్డతీగల అడవుల్లో

ఆ మధ్యాహ్నం అడ్డతీగల అడవుల్లో నేను వెతుక్కున్నది
ఈ కాలానికి చెందింది కాదు, కురుస్తున్నవాన ఒకింత
వెలసినప్పటి ఆ అపర్ణాహమూ ఇప్పటిది కాదు, ఇప్పుడే
పక్వమవుతున్న ఆ నేరేడువనాలూ ఇప్పటివి కావు.

కొండమీద అతిధి (2018)

వైశాఖం ప్రవేశించినప్పుడు
ఉండవలసింది నువ్వా కొండల్లో.
…..
…..
ఆ తోలుబొమ్మలాటలు,
ఆ ఏటి ఒడ్డున
జాగరాలమ్మ గుడిముంగిట
జక్కుల భాగోతం
నువ్విప్పటికీ ఆ ఊరు వదిలిపెట్టిరానే లేదు.
….
….
ఎన్ని గ్రంథాలతో తుడిచెయ్యాలని చూసినా
ఎన్నటికీ చెరగని
నీ బాల్యపు మరక.

ఫిబ్రవరి రాగానే అనే కవితలో…

నిండుగా పూసిన మంకెనలచుట్టూ
నీలిపొరలు‌, ఊదారంగుధూళి-
నా బాల్యంలో పూర్తిగా వినలేకపోయిన
పాటలన్నీ మళ్ళా అక్కడ ప్రత్యక్షమవుతాయి

నేను తిరిగిన కొండలదారుల్లో
రాలిన ఇప్పపూలు, నల్లజీడి చెట్లు తపసిమాకులు
సంత నుంచి ఆవును పల్లెకు తీసుకుపోతున్న రైతులా
మాఘమాసం నన్ను నగరంనుంచి అడివికి తీసుకుపోతుంది.

కొండకింద పల్లె (2021) కవిత్వసంపుటిలో…

చిలక్కొట్టిన జామపండు

ఆ మధ్యాహ్నం జాగరాలమ్మ గుడి ముంగట
కూచున్నామే గాని
పరిమళాల కొలనులో తేలుతున్నట్టే ఉంది
తెప్పలాగా గుడి, మాతో దేవత.

దూరంగా కొండకిందపల్లెమీద
మాఘమాసపు మంచుపొగ.

మామిడి, జీడిమామిడి పూలగాలిమధ్య
ఒక అడవిసంపెంగ పిల్లంగోవి ఊదుతూనే ఉంది.
ఏటి వడ్డున నీటిచెలమ
ఆకాశాన్ని విరగబూసింది.

అదేమిటో, ఈ గుడి ముంగిట కూచోగానే
నేను తొమ్మదేళ్ల పసివాణ్ణవుతాను
పక్కన మా అన్నయ్య, పైన మినుకు చుక్కలు
ఇంకా అక్కడ ఆ ఊళ్ళో, ఆ ఇంట్లో
ఏదో చీనా జానపద కథలోలాగా
లాంతరు చేతపట్టుకుని
మా కోసం ఎదురుచూస్తూ మా అమ్మ.

అమ్మతో మాట్లాడాలనిపించినప్పుడు‘ కవితలో

గుర్తుందా ఆ ఊళ్లో
సరిగ్గా ఇట్లాంటి రాత్రుల్లోనే
జక్కులాళ్ళు భాగవతం ఆడేవారు.
కొండమీద తపసిమాకులచుట్టూ
హేమంతం ధూపం చల్లేది.
అడవి నుంచి మైదానానికి రాగానే
నీ ఋతువులు కూడా మారిపోయేయి.

పునర్యానం (2004)లో

అమ్మ వళ్లో నేను కళ్ళు తెరిచేటప్పటికి అడవి నిండా పాలపూల సుగంధం
పూసిన కొండమామిడి కొమ్మలమీద అడవి కోయిలలు పాటలు పాడేవి,
భూమికోసం ఆకాశం నుంచి నిత్యం శుభవార్తలు వర్షించేవి,
ఆదివాసి యువతుల ఆటల్తో ఊరు గలగల్లాడేది

అమ్మ నాకొక్కటే అన్నం ముద్ద పెట్టినప్పుడల్లా ఆకలి రుచి తెలిసేది, పొదుగుల్లో పొంగుతున్న క్షీరధారలు తాము తాగి లేగలు నాకు కొంత మిగిల్చేవి
నేను ఆడుకోవడం కోసం సూర్యుడు దారి పొడుగునా వెలుతురు పరిచేవాడు,
వెన్నెలపందిరి మీద సన్నజాజులు పూచినట్టు తారకలుదయించేవి

నాకోసం ప్రతి అరుగు మీద ఆ ఊరు ఆహ్వాన పత్రిక రాసిఉంచేది,
నాకోసం శుభాకాంక్షల్తో ప్రతి ఇంటి కిటికీ తెరిచి ఉండేది
వాకిట్లో రాధా మనోహరాలు నాకోసం మరికొన్ని మకరందాల్ని మనసున నింపుకునేవి

ఎడ్లమెడల్లో గంటల సవ్వడి నేను వినాలని రాత్రులు బళ్ళు నడక తగ్గించేవి,
అడవి ఎప్పటికప్పుడు నాకోసం కొత్త వస్త్రాల్ని ధరించేది.
నా కళ్ళముందు రంగులు పోస్తూ పూలు పూసేవి
ఊరంతా నాకోసం పిల్లల బొమ్మల కొలువు, ఏ దేశాల్నుంచో
ప్రతి పండక్కి గంగిరెద్దులొచ్చేవి
జక్కుల వాళ్ళు నాట్యం చేసేవారు, ఊరివెలుపల జాగరాలమ్మ
సంధ్యా దీపం వెలిగించుకుని నను రమ్మనేది.

అడవి, ఏరు, పొలం, పాట, వెన్నెల మూటల సాక్షిగా
మేం పీటని పల్లకి చేసి బొమ్మలకి పెళ్లి చేసాం.
ఉత్తుత్తి వంటలతో బాల్యకాల సఖి ఎవరో నాకు అన్నం వండి చెలిమిని వడ్డించేది

నన్నెవరు ప్రేమించినా ఆ ఊరికి తీసుకుపోదామనిపిస్తుంది
నా చెలిమినెవరు కోరినా ఆ లోకానికెగరాలనిపిస్తుంది.

చినవీరభద్రుడు గారు ఏ ఊరిలో తన బాల్యం అంతా గడిపారో ఆ గిరిజన గ్రామం చూసిన తర్వాత మళ్లీ ఆ కవితా సంపుటాలన్నీ మళ్లీ చదివి, నా ఆనందం మీతో పంచుకుంటున్నాను.

3-9-2025

8 Replies to “జాగరాలమ్మ”

  1. సోమశేఖరరావు గారికి ధన్యవాదాలు 🙏🏽

    మీ కవితల్లో మీ పల్లె, జెండా కొండ, పెరటి తలుపు కావల పాలపూలఅడవి, జాగిరాలమ్మ గుడి !!
    నీ జ్ఞాపకాల్లో మీ బాల్యం!!
    Just too beautiful!! 🙏🏽

    1. మంచి కవితల్ని గుర్తుచేసారు, మంచి జ్ఞాపకాల్ని మూటగట్టుకున్నారు 🙏❤️🌹

  2. శుభోదయం సార్. మీతో పాటు చదువరులందరినీ తీసుకువెళ్లి మీ గ్రామ దర్శనంతోపాటు ఆ గ్రామదేవత , ఆ రమణీయమైన వాతావరణాన్ని ,దర్శింపచేశారు. చదివినంతసేపూ దృశ్యకావ్యమై మా మనసులను ఎంతో రంజింపచేసింది. అందులోని ప్రతివాక్యమూ రసాత్మకమైన అనుభూతిని కలిగించింది.
    కృతజ్ఞతలు సార్. 🙏🌹

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading