అమ్మకి ఉత్తరం

లేదు, కవిత రాయడం
వాయిదా వెయ్యలేవు
అమ్మకి రాయాల్సిన ఉత్తరంలాగా
కవిత రాసేదాకా
నీ మనసు కుదుటపడదు.

అమ్మకే కదా ఉత్తరం
ఎప్పుడన్నా రాద్దాములే అనుకుంటావుగాని
అంతకన్నా ముఖ్యమైన పని
మరేముంటుందిగనుక?

నువ్వు క్షేమంగా ఉన్నావని
అత్యవసరంగా చెప్పవలసింది
అమ్మకే కద.

అమ్మ నీకు నేర్పిన భాషలోనే
అమ్మకు ఉత్తరం రాసేటప్పుడు
అమ్మ తప్ప నీ మనసులో
మరేమీ ఉండదు.

ప్రపంచం గురించి అమ్మకెందుకు?
నువ్వు కులాసాగా ఉన్నావన్న
రెండు ముక్కలు చాలామెకి.
ఎలా ఉన్నావమ్మా
అని నువ్వడిగే రెండు మాటలు
చాలామెకి.

నీకు తెలుసు కదా
నీ ఉత్తరం అందినప్పటినుంచీ
ఆమె మళ్ళా మరో ఉత్తరం కోసం
ఎదురుచూస్తూనే ఉంటుంది.

18-2-2025

21 Replies to “అమ్మకి ఉత్తరం”

  1. “ ప్రపంచం గురించి అమ్మకెందుకు?
    నువ్వు కులాసాగా ఉన్నావన్న
    రెండు ముక్కలు చాలామెకి”
    ❤️

  2. పరమసత్యం.అమ్మ మనసును గురువాక్యమంత సీదాసాదాగా చెప్పారండీ….

  3. అమ్మ, ఉత్తరం. 🙏
    బహుశా ఎదురు చూస్తూనే ఉంటుంది.🙏

  4. హృద్యమైన కవిత . మనసుకు హత్తుకునేలా ఉంది . మీకు నమస్సులు .

  5. సార్
    మీ ఉత్తరం కోసం ఎదురు చూసే అమ్మలెందరోఈ వసుధైక కుటుంబం లో .

  6. అమ్మ నేర్పిన భాషలోనే రాసిన ఉత్తరం కవితగా మారినప్పుడే, మనం నిజంగా మాట్లాడుతున్నాం అనిపిస్తుంది. అప్పటికి మనలో ఆమె తప్ప మరొకరు ఉండరు. మన శబ్దంలో ఆమె నీడ ఉంటుంది. ఆమె కోసమే వ్రాసిన ఈ చిన్న కవిత, ఈ చిన్న ఉత్తరం, అసలు కవిత్వానికే అసలైన అర్ధాన్ని కలిగిస్తుంది. ప్రపంచం గురించి చెప్పాల్సిన అవసరం ఆమెకు లేదు. ఆమెకి మనం బాగున్నామన్న రెండు మాటలు చాలును. అలాగే, మనం ఆమెని ఎలా ఉన్నావమ్మా? అని అడిగే రెండు మాటలు కూడా ఆమె గుండెను తాకుతాయి. మన కవిత ఆమెకే ఉత్తరమైతే, ఆమె కూడా మళ్ళీ మరో కవిత కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఉత్తరం వచ్చిన క్షణం నుంచీ మరోసారి ఉత్తరం రాదా? అని ఆశపడుతూ కూర్చుంటుంది – ఆ నిశ్శబ్దపు వేచి చూడడమే ఈ కవిత్వపు మూలగమనంగా మారుతుంది. కవిత రాయడం వాయిదా వేయలేని పని కాదు. అది ఓ నిశ్శబ్దపు పిలుపు. తల్లి కోసం, మన కోసం, ముద్దైన అనుబంధం కోసం లిఖించాల్సిన ఉత్తరం.కవిత్వం అద్భుతం

    1. శైలజ గారూ! నిజంగా ఒక కవితకు ఇటువంటి పాఠకులు, ఇటువంటి అనుభూతి, ఇటువంటి స్పందన లభిస్తే ఆ కవితకు అంతకన్నా కావల్సింది మరేముంది!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading