అంటున్నాడు తుకా-1

పాతికేళ్ళయిందనుకుంటాను, దిలీప్ చిత్రే Says Tuka మొదటిసారి చదివి. అప్పణ్ణుంచీ తుకా కూడా ఒక దీపంలాగా వెలుగుతూనే ఉన్నాడు, నా మనోమందిరంలో. ఆరని దీపం. ఇన్నాళ్ళకు ఆయన్ని తెలుగు చేద్దామని కూచున్నాను. ఇక కొన్ని వారాల పాటు తుకారాముడి నివేదనలే నా ప్రార్థనలు కూడా.

ఇక్కడ ఇస్తున్న అభంగాల సంఖ్య ఇందు ప్రకాశ్ ప్రచురణ, 1869 నుంచి. ఈ అనువాదానికి ఊతమిచ్చింది The Poems of Tukararama, J. Nelson Fraser, K.B., 1909

1

దారిలో ఎవర్ని కలిసినా
అడుగుతూనే ఉన్నాను
దేవుడు నాపట్ల దయచూపిస్తాడా అని
నన్ను అవమానం నుంచి రక్షిస్తాడా అని.
తక్కిన విషయాలన్నీ పక్కకిపొయ్యేయి
ఇదొక్కటే పనిలాగా తయారయ్యింది.

తుకా అంటున్నాడు:
చింతముంచెత్తింది నన్ను
ఎవరు కనబడతారు?
ఎవరు చెప్తారు?

2
సుఖంగా ఉన్నరోజుల్లో
ఒక తాడు తీసుకుని మెడచుట్టూ
బిగించుకున్నాను
ఇప్పుడేం చేసేది?
ఉచ్చు బిగుసుకుంది
ముందుకు పోలేను
వెనక్కి పోలేను
అన్ని దారులు మూసుకుపోయిపోయాయి
అప్పులపాలయ్యాను
పొలం బీడుపడింది
ఆలుబిడ్డలు పస్తులుంటున్నారు
ఎవరెవరి ఇళ్ళల్లోనే పడి దోచుకున్నాను
ఏం చేసినా
నన్ను నేను కాపాడుకోలేకపోయాను.

తుకా అంటున్నాడు
ఇంక ఏ ఆశా మిగల్లేదు
మొత్తమంతా విదిలించేసాను. (1207)

31-1-2025

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading