
సముద్ర శాస్త్రవేత్తలు చాలా ఏళ్ళుగా పరిశీలిస్తూ, పరిశోధిస్తూ చివరికి ఏమైతేనేం తిమింగలాల భాష కనుక్కున్నారు. భాష అంటే మొత్తం పదజాలం, వ్యాకరణం, సాహిత్యం అనీ అనుకునేరు సుమా! కాదు, మోర్సుకోడులాగా ఒక్క క్లిక్కు. చాలాకాలంగా మూసిపెట్టిన తలుపు నెమ్మదిగా తెరిచినప్పటిలాగా కిర్రుమనే చప్పుడు. ఒక ఈజిప్టాలజిస్టుకి అయిదువేల ఏళ్ళ కిందటి హీరోగ్లిఫ్ కి సూచన దొరికినట్టు, ఒక యాంత్రొపాలజిస్టుకి హాటెన్ టాట్ తెగవారి ఆదిమ గీతంలో ఒక శబ్దానికి అర్థం చిక్కినట్టు సముద్రశాస్త్రవేత్తల సంతోషానికి అవధి లేదు. వాళ్ళు ఆ తిమింగిలాన్ని లాబరేటరీకి తీసుకొచ్చారు. దానిచుట్టూ దాదాపు ఒక సముద్రం సృష్టించారు. ఇండాలజిస్టులు వేదం నేర్చుకున్నట్టుగా వారు తిమింగలం భాష మొత్తం నేర్చుకున్నారు. ఇంక నేర్చుకోడానికి ఒక్క ధ్వని కూడా మిగల్లేదు. ఈలోపు నగరంలో ఎంతసేపూ తన ధ్వనులకి ప్రతిధ్వనులు మటుకే వింటూ ఉండటంతో తిమింగలానికి విసుగెత్తిపోయింది. సముద్ర ప్రవాహాల్లో, భూమధ్యరేఖదగ్గరనుంచి ధ్రువప్రాంతాలకు ఉష్ణప్రవాహాలు ప్రసరించినప్పుడల్లా తోటితిమింగిలాల గొంతులో వినిపించే గిలిగింతలు వినాలనిపించింది దానికి. తన గొంతుతో తిరిగి వాటిని లాలించాలనిపించింది. తోటి తిమింగిలాల కోసం బెంగపెట్టుకుంది. అప్పుడు సాగరశాస్త్రవేత్తలు మళ్ళా మహాసముద్రాలమీదకి పోయి చూస్తే- ఏవీ తిమింగిలాలు? వాటినెప్పుడో వేటాడేసారు.
Images courtesy: Wikimedia commons
30-12-2024


ప్రస్తుతానికి ” ఉద్యమ నాయకా…” పద్యం చదివినట్లుంది! తరవాత కథలు
‘ ఆ కథలు’ చదివితే తెలుస్తుందేమో!
అకథలు వేటికవే కథలు.
ఒక చిన్న కథలో గొప్ప సందేశం! చాలా బావుంది.
ధన్యవాదాలు సార్!
😔😢