గిరోయి

ప్రతి ఏటా గుంటూరులో శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ వారు జరిపే లలితా కళా ఉత్సవాలు ఈ రోజు కూడా ఘనంగా జరిగేయి. ఇది 27 వ ఉత్సవం. ప్రతి ఏటా ఇచ్చే పురస్కారాల్లో భాగంగా బాలసాహిత్య పురస్కారం డా.ఎం.హరికిషన్ కు, మాలతీ ప్రమదా పురస్కారం ప్రముఖ రచయిత్రి, పాత్రికేయురాలు సి.సుజాత గారికి అందించారు. యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి నెలకొల్పిన ప్రతిభా పల్లవ పురస్కారం చిరంజీవి ఎ.లక్ష్మీ అహల కు అందచేసారు.

ఈ ఉత్సవాల్లో ఈ సారి విశేషం డా. నన్నపనేని మంగాదేవి గారి ఆత్మకథ ‘అంకురం నుంచి అనంతందాకా’ వెలువడటం. ఈ పుస్తకం ఇప్పటికే వచ్చి ఉండవలసింది. ఈ రోజు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు కలిగింది. అపురూపమైన ఆ పుస్తకానికి నేను రాసిన చిన్న పరిచయం ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.


గిరోయి

గిరోయి అంటే రష్యన్‌భాషలో హీరో అని అర్థమట. డా.మంగాదేవిగారు సోవియెట్‌ రష్యాలో ఉన్నప్పుడు ఒకసారి తూర్పుదేశాల యాత్ర ముగించుకుని రాగానే ఆమె క్లాసు టీచర్లు, కాస్మేట్స్‌ అంతా ఆమెని గిరోయి అంటూ ఆకాశానికెత్తేసారట. ఈ పుస్తకానికి ఏమి శీర్షిక పెట్టాలి అనడిగితే గిరోయి అనే పెట్టమంటాను. ఎందుకంటే ఇది నిజంగానే ఒక వీరవనిత కథ, ఒక ధీరవనిత కథ. ఒక సాహసమహిళ కథ, సంపూర్ణమానవి కథ.

పట్టుమని రెండువందల పేజీలు కూడా లేని ఈ పుస్తకంలో దాదాపు రెండువందల ఏళ్ళ ప్రయాణం ఉంది. మంగాదేవిగారి పసితనం ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభంలోనే మొదలైనప్పటికీ, ఆమె చిన్నప్పటి సామాజిక పరిస్థితుల్ని చూస్తే ఆ కాలం పందొమ్మిదో శతాబ్దిని గుర్తుకు తెచ్చేదిలా ఉంది. పుస్తకం చివరి పేజీలకు వచ్చేటప్పటికి 21 వ శతాబ్దపు విద్య గురించిన ఆలోచనలు, ప్రయత్నాలు, ప్రయోగాలు, ఆమె వెలిగించిన దీపాలు, వెలిగిస్తూ వస్తున్న జీవితాలు కనిపిస్తాయి. ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక సార్థక ప్రయాణం, ఒక సుసంపన్నమైన జీవనయానాన్ని చూసిన తృప్తి కలుగుతుంది మనకి.

ఆధునికమహిళ చరిత్రను తిరిగి రాస్తుందని గురజాడ రాసుకున్న మాట మనకి తెలుసు. ఆధునికమహిళ చరిత్రని తిరిగి ఎలా రాస్తుందో ఈ పుస్తకం ఒక డెమాన్స్ట్రేషన్‌ లెసన్‌. ఎందుకంటే సమాజాన్ని మార్చేవాళ్ళు, చరిత్రని తిరిగి రాసేవాళ్ళు ముందు తమ చరిత్రని తామే రాసుకుంటారు. అవసరమైతే తిరిగి రాసుకుంటారు. అందుకు ఇదుగో మంగాదేవి గారి జీవితమే ఒక నిరూపణ.

ఎవరి జీవితానికేనా మొదటి పాతిక ముప్ఫై సంవత్సరాలు ఎంతో కీలకం. ఎవరికైనా కెరీర్‌కి ఒక దారి దొరికి, అంచెలంచెలుగా జీవితంలో ముందుకు సాగడానికి ఆ కాలమే నిర్ణయిస్తుంది. కాని మంగాదేవి గారి జీవితం చూడండి. యూనివెర్సిటీ చదువునా, అర్థాంతరంగా ముగిసిపోయింది. ప్రభుత్వోద్యోగమా, బదిలీలమీద బదిలీలు. ఒక ట్రయినర్‌ గా చక్కటి ప్రాంగణంలో ఉద్యోగం దొరికిందనుకుంటే ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. మామూలు మనుషులెవరేనా అక్కడితో అన్ని ప్రయత్నాలూ ఆపేసి ఉండేవారు. పెళ్ళిచేసుకుని ఒక సాధారణగృహిణిగా జీవితంలో సర్దుకుపోయి ఉండేవారు. కాని అక్కడినుంచే మంగాదేవిగారు తన చరిత్ర తాను రాసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమె చేసిన ప్రయత్నాలు, తెరిచిన బడులు, తీర్చిదిద్దిన జీవితాలు, పెంచిన మొక్కలు, తోటలు, నడిపిన సంస్థలు- ఒక్క మనిషి ఒక జీవితకాలంలో చెయ్యగలిగినవేనా ఇవన్నీ అని ఆశ్చర్యపోతాం.

మా మొదటి పరిచయంలోనే ఆమె మా అమ్మగా మారిపోయింది. దాదాపు ఇరవయ్యేళ్ళుగా ఆ అనుబంధం నానాటికీ బలపడుతూనే ఉంది. ఇన్నేళ్ళల్లోనూ ఎన్నోసార్లు చేతన ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడి పిల్లల్తో కలిసి గడిపేను. గుంటూరులో శ్రీవెంకటేశ్వర బాలకుటీర్‌ కి కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఒకటి రెండు సమావేశాల్లో పాల్గొన్నాను. మనసులో ఎప్పుడేనా కారుమబ్బులు కమ్ముకున్నప్పుడు ఆ పాఠశాలల ప్రాంగణాల్లో అడుగుపెడితే చాలు మనసు తేలికైపోతుంది. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందనిపిస్తుంది.

నేను కూడా ప్రాథమిక విద్యారంగంలోనూ, పూర్వప్రాథమిక విద్యలోనూ కొన్ని ప్రయత్నాలు చేపట్టినవాడిని కాబట్టి, ఆ రంగాల్లో మంగాదేవి గారి కృషి ఎంత అపూర్వమైనదో నేను సాధికారికంగా చెప్పగలను. ఒక మాంటిస్సోరికి, ఒక గాంధీజీకి, ఒక గిజుభాయికి ఆమె నిజమైన వారసురాలు. ఎటువంటి స్నేహశీల, ప్రేమమయ వాతావరణంలో పిల్లలు అభ్యసనం మొదలుపెట్టాలో, ఎటువంటి ఆరోగ్యపూరిత ప్రాంగణంలో పిల్లలు తమ జ్ఞానప్రపంచాన్ని నిర్మించుకుంటారో మంగాదేవిగారికి తెలుసు. కాబట్టే ఆమె నిర్మించిన ప్రాంగణాల్లో పిల్లలూ, పువ్వులూ కూడా ఒక్కలానే వికసిస్తారు.

ఎంతో విలువైన జీవితం ఆమెది. తన జీవనప్రయాణాన్ని ఇన్నాళ్ళకైనా ఆమె మనతో ఇలా వివరంగా పంచుకోవడం మన భాగ్యం. ఆమె చిన్నప్పటి కన్నా ఇప్పుడు ప్రపంచం మరింత పెద్దదయింది. వనరులు మరింత విస్తారంగా అందుబాటులోకి వచ్చాయి. అభ్యసనం తీరుతెన్నులు మారిపోతూ ఉన్నాయి. కాని మంగాదేవి మాత్రం ఒక్కరే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ పుస్తకం వల్ల మరెందరో దేవమ్మలకు స్ఫూర్తి లభిస్తుందన్న ఆశ ఒకటి నాలో వెలగడం మొదలయ్యింది.

10-12-2024

9 Replies to “గిరోయి”

  1. చాలా బాగా చెప్పారు. నాకు ఆ బాల కుటీరం ను చూడాలనిపిస్తోంది. నమస్కారాలు.

  2. చాలా మంది ఎరుగని ఒక గొప్ప శక్తి యొక్క స్ఫూర్తిదాయకమైన జీవనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  3. 2022 లో పంచ వింశతి లలితకళా ఉత్సవానికి హాజరైనప్పుడు శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ ని చూడటం సంభవించింది. ఆ వేడుకల హడావిడిలో కూడా పిల్లల క్రమశిక్షణ, సత్ప్రవర్తన చూసాను. ముచ్చటేసింది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading