
నిన్న సాయంకాలం బాచుపల్లి కౌసల్యాకాలనీలో సన్నిధానం నరసింహశర్మగారి ఎనభయ్యవ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. బంధుమిత్రుల మధ్య, సాహిత్య మిత్రుల మధ్య, పూర్వపు రాజమండ్రి మిత్రుల మధ్య శర్మగారి అభినందన సంచిక, ఆయన రాసిన ‘బ్రౌను ఉదాహరణ కావ్యం’, ఆయనకు ‘ఆరుద్ర రాసిన లేఖలు’ ఆవిష్కరించారు. ఆయన అభినందన సంచికని నామాడి శ్రీధర్, వొమ్మి రమేష్ బాబుల సంపాదకులుగా వెలువరించారు. ఆ పుస్తకం ఎంతో అభిరుచితో, సాహిత్యవిలువల్తో, నాలుగుకాలాలు దాచుకోదగ్గదిగా తీసుకురావడంలో వారి కృషి ఎన్నదగ్గది. అందులో ‘సాహిత్య సంకీర్తకుడు’ అని నేను రాసిన వ్యాసం కూడా ఉంది. ఆ పుస్తకానికి కూడా ఆ పేరే పెట్టారు. ఈ శుభసందర్భంలో ఆ వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.
మేఘసందేశంలో యక్షుడు మేఘం ప్రయాణించవలసిన దారి వివరిస్తూ ఆ దారిలో లేకపోయినా మేఘాన్ని ఉజ్జయిని వెళ్ళమని చెప్తాడు. అక్కడ ఉదయనకథాకోవిదులైన గ్రామవృద్ధులుంటారనీ, వాళ్ళని కలుసుకొమ్మనీ చెప్తాడు. మా మాష్టారు కాళిదాసు గురించి ఏ ప్రస్తావన వచ్చినా ఈ ఉదయనకథాకోవిదుల గురించి చెప్పకుండా ఉండేవారు కాదు. ఎందుకంటే, ఇక్కడ ఆ కథాకోవిదులు చెప్తున్నది వట్టి ఉదయినుడి కథ కాదు. వాళ్ళు ఆ వంకన పూర్వతరాల రసానుభవం గురించి తర్వాత తరాలవారికి చేరవేస్తుంటారని ఆయన చెప్తుండేవారు. సన్నిధానం నరసింహశర్మగారి గురించి చెప్పాలంటే ముందు నాకు ఈ మాటనే గుర్తొస్తుంది. ఆయన నా తరంలో నేను చూసిన ఉదయనకథాకోవిదుడు. అయితే ఆయన కీర్తిస్తూ ఉండిన ఆ ఉదయినుడు ఒక రాజు కాడు. ఆయన రాజసంకీర్తకుడు కాడు. ఆయన ఒక నగరసంకీర్తకుడు. ఒక నదీసంకీర్తకుడు. ఒక సాహిత్యసంకీర్తకుడు, సంస్కృతీసంకీర్తకుడు.
నేను 1982 లో రాజమండ్రి వెళ్ళిన మొదటిరోజుల్లోనే గౌతమీ గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు శర్మగారిని చూసాను. ఆ తర్వాత నేనక్కడ ఉన్న అయిదేళ్ళల్లోనూ శర్మగారు నా అధ్యయనంలో ఒక భాగంగా ఉన్నారు. ఆ అధ్యయనానికి ఫలానా పద్ధతి అంటూ ఉండేది కాదు. మేము ఎక్కడ కలిస్తే అక్కడ, ఎప్పుడు కలిస్తే అప్పుడు ఆయన ఏం చెప్తే అదే నా చదువు. ఆ చదువులో నేను నేర్చుకున్నది దేని గురించి?
రాజమండ్రి గురించి, గోదావరి గురించి, తెలుగు, సంస్కృత సాహిత్యాల గురించి అని చెప్పవచ్చు. కాని అదంతాsyllabi మాత్రమే. వాటిగురించి ఆయన అలవోకగా చెప్తుండే విషయాలు వింటూ నేను నేర్చుకున్న విద్య ఏమిటి?
అభిరుచి. ఉత్తమ సాహిత్యాభిరుచి.
అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి స్థితప్రజ్ఞుడెలా ఉంటాడు, అతడేం మాట్లాడతాడు? అతడి తలపులు ఎలా ఉంటాయి? అతడు దేనిమీద దృష్టిపెట్టి ఉంటాడు లాంటి ప్రశ్నలు అడిగాడు. నేను శర్మగారిని కలిసినప్పుడెల్లా రాజమండ్రిలో మా కన్నా పూర్వం జీవించి కవిత్వం చదువుకున్నవాళ్ళూ, కవిత్వం చెప్పినవాళ్ళూ ఎలా ఉండేవారు, ఎలా సంచరించేవారు, ఎలా సంతోషపడేవారు-ఒలాంటి ప్రశ్నలే అడిగేవాణ్ణి. నిజానికి శర్మగారు ఒక్కరినే కాదు, మా మాష్టారు శరభయ్యగారిని కలిసినా ఇటువంటి ప్రశ్నలే అడిగేవాణ్ణి లేదా ఇటువంటి ప్రస్తావనలకోసమే ఎదురుచూసేవాణ్ణి. శర్మగారు కూడా శరభయ్యగారి శిష్యులే కాబట్టి, ఆయన్ని నా సహాధ్యాయి అని కూడా అనుకోవచ్చు. సీనియర్ క్లాస్‌మేట్ అన్నమాట!
తెలుగునేల మీద రాజమండ్రిది ఒక ప్రత్యేక స్థానం. రాజమండ్రి మీద రాసిన ఒక కవితలో నేను ఆ నగరాన్ని వారణాసితో, ఏథెన్సుతో, డబ్లిన్ తో, వియన్నాతో పోల్చాను. ఆ నగరం ఒక సాంస్కృతిక కేంద్రం. పూర్తి అర్థంలో ఒక లెర్నింగ్ సెంటర్. అక్కడ వెయ్యేళ్ళుగా తెలుగు సాహిత్యసృజన సాగుతూనే ఉంది. అక్కడే నన్నయ శారదరాత్రుల్ని వర్ణించాడు. అక్కడే కుమారగిరిరెడ్డి కాళిదాసునాటకాల్ని చదువుకుని పరవశించాడు. శ్రీనాథుడు అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. కానీ ఆ కొన్నాళ్ళ నివాసమూ ఆరుద్ర చెప్పినట్టుగా అదొక ‘పెద్ద ముచ్చట.’ ఆధునికయుగం మొదలయ్యేక, బ్రిటిష్‌పాలన విస్తరించాక, ఆ నగరం ఆధునికవిద్యనీ, ఆధునికజీవితాన్నీ, దాని గుణావగుణాలన్నిటితోనూ స్వీకరించింది. ఆ స్వీకారంలోంచే ఆ నగరం ఒక వీరేశలింగాన్ని రూపొందించింది. ఒక గిడుగు, ఒక చలం, ఒక కృష్ణశాస్త్రి, ఒక గరిమెళ్ళ, ఒక గాడిచర్ల, ఒక చిలకమర్తి, ఒక దీక్షితులు, ఒక కవికొండల, ఒక దామెర్ల, ఒక నేదునూరి – రాజమండ్రి లేని ప్రాచీన సాహిత్యాన్ని ఎలా ఊహించలేమో, రాజమండ్రిలేని ఆధునిక తెలుగుసాహిత్యాన్నీ, సంస్కృతినీ కూడా అలానే ఊహించలేం.
ఒక ప్రాచీననగరం ఒక ఆధునికనగరంగా అకస్మాత్తుగా రూపొందదు. పూర్తిగా కూడా రూపొందదు. అదొక నిత్యపరిణామం. ఆ పరిణామంలో ఒక భాగంగా ఉంటూ, దాన్ని దగ్గరగా చూసేవాళ్ళుంటే వాళ్ళనుంచి మనం నేర్చుకోదగ్గది చాలానే ఉంటుంది. రాజమండ్రి పరిణామానికి నరసింహశర్మగారు అటువంటి participant-observant.
అన్నిటికన్నా ముందు ఆయన పులకించిపోతాడు. రాజమండ్రికి చెందిన ఏ సాహిత్యకారుడి పేరు ఎత్తినా ముందు ఆయన నిలువెల్లా పరవశించిపోతాడు. ఆ మనిషి చుట్టూ అల్లుకున్న ఎన్నో జ్ఞాపకాలు, ముచ్చట్లు, పాఠాలు,గుణపాఠాలు వెంటనే మనతో పంచుకోడానికి ఉత్సాహపడిపోతాడు. అది మనకు బాగా తెలిసిన ప్రసిద్ధ సాహిత్యకారులే కానక్కరలేదు. ఒకప్పుడు రాజమండ్రి జీవితాన్ని నిరుపమానంగా ప్రభావితం చేసి, ఇప్పుడెవరికీ అంతగా గుర్తురాని మహనీయులైతే వారి గురించి మాట్లాడటానికి ఆయనకి మరింత ఉత్సుకత! ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావు గారి గురించి అడగండి ఆయన్ని, లేదా మధురకవి నాళం కృష్ణారావుగారి గురించి అడగండి, ఆయనకి స్వయంగా దగ్గర బంధువైన బి.వి.ఎస్.శాస్త్రి గురించి, ఆర్.బి.పెండ్యాల గురించి అడగండి. శర్మగారితో మాట్లాడటం నిజంగానే ఒక ఎడుకేషన్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక aesthetic education, ఒక cultural education.
నేను రాజమండ్రిలో గడిపిన రోజుల్లో నేను ప్రధానంగా సాహితీవేదిక బృందంతో కలిసి తిరిగేవాణ్ణి. మహేష్, సమాచారం సుబ్రహ్మణ్యం, కవులూరి గోపీచంద్ వంటి మిత్రుల్తో ఎక్కువ కాలం గడిపేవాణ్ణి. శర్మగారూ, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణా వంటి మిత్రులు మరొక బృందంగా కలిసి తిరుగుతుండేవారు. కాని ఈ రెండు బృందాలూ, ఇలాంటివే మరికొన్ని బృందాలూ ఒక రోజులోనే కనీసం రెండుమూడు సార్లు ఒకరికొకరు తారసపడేవారు. అది గౌతమీ గ్రంథాలయం దగ్గర కావచ్చు, లేదా సమాచారం ఆఫీసు దగ్గర కావచ్చు లేదా గోదావరి గట్టుమీద కావచ్చు. కాని ఎందరు కలుసుకున్నా, ఎప్పుడు కలుసుకున్నా, ఆ గోష్ఠిలో నరసింహశర్మగారుంటే మాత్రం తక్కినవారంతా ఆయన మాటలు వినడానికే ఇష్టపడుతుండేవారు. ఆయన చుట్టూ ఎప్పుడూ గీతలుండేవి కావు. గోదావరి గాలీ, నీళ్ళూ ఎలా నలుగురిమీదా సమానంగా ప్రసరించేవో, శర్మగారి పాండిత్యం, పరిజ్ఞానం, రసోద్రేకం కూడా నలుగురిమీదా సమానంగా వర్షించేవి.
నేను యూనివెర్సిటి విద్యకు నోచుకున్నవాణ్ణిగాను. కాని ఆ లోటు రాజమండ్రి తీర్చిందనీ, గోర్కీ విశ్వవిద్యాలయాల్లాగా రాజమండ్రి నా విశ్వవిద్యాలయమనీ నేను చాలా సార్లు చెప్పుకున్నాను. ఆ విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద తరగతిగది గౌతమీ గ్రంథాలయమైతే, నరసింహశర్మగారు అక్కడ ప్రొఫెసరు అని చెప్పగలను. నేను తత్త్వశాస్త్రంలో ప్రైవేటుగా ఎమ్మేకి చదువుకుందామనుకున్నప్పుడు, ఆ సిలబస్ తప్ప, పాఠ్యపుస్తకాలూ, ప్రొఫెసర్లూ, పాఠాలూ, ప్రశ్నపత్రాలూ లేకపోవడంతో ఫిలాసఫీ పుస్తకాలేమైనా మన లైబ్రరీలో ఉన్నాయా అనడిగాను ఒకరోజు శర్మగారిని.
నాకు ఆ సాయంకాలం బాగా గుర్తు. ఆయన నా రెక్కపట్టుకుని లైబ్రరీ వెనక ఉన్న పెద్ద హాల్లోకి తీసుకుపోయారు. సందర్శకులెవరూ పెద్దగా అడుగుపెట్టే చోటుకాకపోవడంతో అక్కడంతా చీకటిగానూ, పైన కొంత బూజుతోనూ నిండిఉంది. ఆయన నన్ను నేరుగా నాలుగైదు బీరువాలముందుకు తీసుకుపోయి నిలబెట్టి ఒక బీరువా తలుపు తెరిచి ‘చూడండి, ఇవన్నీ ఫిలాసఫీ పుస్తకాలే’ అన్నారు. అది అయ్యగారి రామ్మూర్తి అనే ఒక తత్త్వశాస్త్ర ఆచార్యుడి సొంతలైబ్రరీ. గౌతమీగ్రంథాలయానికి కానుకగా ఇచ్చేసినది. ఆయన తెరిచి చూపించిన బీరువాలో పుస్తకాల్ని పోల్చుకోడానికి ప్రయత్నించాను.
మై గాడ్! అవన్నీ మూలగ్రంథాలు. ఒక జీవితకాలం సరిపోదు వాటిని చదువుకోడానికి!
నేను తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసిన ఎన్నో ఏళ్ళకి, పాశ్చాత్య తత్త్వశాస్త్రాన్ని పరిచయం చేస్తూ తెలుగులో ‘సత్యాన్వేషణ’ అనే పుస్తకం తీసుకొచ్చినప్పుడు, ఆ గ్రంథాన్ని గౌతమీ గ్రంథాలయానికే అంకితం చేసాను. విజయవాడలో ఆ పుస్తకం ఆవిష్కరించినప్పుడు గౌతమీ గ్రంథాలయం తరఫున నరసింహశర్మగారు వచ్చి ఆ పుస్తకం అందుకున్నారు. గౌతమీ గ్రంథాలయం తరలి వస్తే అది శర్మగారి రూపంలోనే కదా రాగలిగేది!
నేను రాజమండ్రిలో ఉన్నప్పుడే సాహితీవేదిక కాక, మరొక అధ్యయన వేదిక కూడా అవసరమనిపించింది. అంటే కేవలం సాహిత్యమొక్కటే కాదు, తత్త్వశాస్త్రం, సోషియాలజి, కళలు, మానవశాస్త్రం, ఆర్కిటెక్చర్, సైకాలజీ-ఇలా వీలైనన్ని సాంఘికశాస్త్రాలతో పరిచయం పెంపొందవలసిన అవసరం ఉందనిపించింది మాకు. అందుకని కవులూరి గోపీచంద్, వంక బాలసుబ్రహ్మణ్యంలతో కలిసి ‘ద రీడర్స్ క్లబ్’ ప్రారంభించాం. ఆ క్లబ్ తరఫున నాలుగైదు సమావేశాలు నిర్వహించాం. ఒక వేసవిలో అధ్యయనతరగతులు కూడా నడిపాం. సన్నిధానం, గౌతమీ గ్రంథాలయం లేకపోతే అవేవీ జరిగి ఉండేవి కావనీ వేరే చెప్పాలా!
మామూలుగా దూరవిద్య చదువుకునే విద్యార్థులకి యూనివెర్సిటీలు కాంటాక్ట్ క్లాసులు నిర్వహిస్తాయి. అక్కడ వాళ్ళు ఎవరేనా ఒక ఉపాధ్యాయుడి ముఖతా కూడా ఒకటి రెండు పాఠాలు వినే అవకాశం దొరుకుతుంది. రాజమండ్రి నా యూనివెర్సిటీ అన్నాను కదా. అక్కడ శరభయ్యగారు, సుదర్శనంగారు, మధునాపంతులవారు వంటి గురువుల సన్నిధిలో నిత్యం మాకు ఏవేవో పాఠాలు వినే అవకాశం దొరుకుతూనే ఉండేది కాని నరసింహ శర్మగారి పుణ్యాన మాకు దూరప్రాంతాలనుంచి వచ్చేవాళ్ళ కాంటాక్ట్ క్లాసులు వినే అవకాశం కూడా దొరికేది. ఎవరేనా చెన్నై నుంచి విశాఖపట్నమో లేదా అటునుంచి ఇటో లేదా ఆ చుట్టుపక్కల ఏదేనా ఊళ్ళకి వెళ్తున్నప్పుడో, వస్తున్నప్పుడో, వాళ్ళు శర్మగారికి ఆ సంగతి చెప్పేవారు. వెంటనే ఆయన ఒక సాయంకాలం గౌతమీ గ్రంథాలయంలో వారితో ఒక ప్రసంగమో, లేదా ఒక గోష్ఠినో ఏర్పాటుచేసేవారు. మొబైలు ఫోన్లూ, వాట్సపులూ లేని ఆ రోజుల్లో ఆ వార్త సత్వరమే రాజమండ్రి మొత్తం ఎలా వ్యాపించేదో నాకిప్పటికీ ఆశ్చర్యమే! అటువంటి ప్రతి ఒక్క ప్రసంగానికీ, గోష్ఠికీ నేను శర్మగారికి జీవితకాలం ఋణపడి ఉంటాను.
అలాగని శర్మగారు రాజమండ్రి సంస్కృతికి వారసుడని మాత్రమే చెప్పడం ఆయన ప్రతిభను తక్కువ చెయ్యడమే. ఆయన కవి, విమర్శకుడు, పరిశోధకుడు. ఎందరో మహాకవుల పద్యాలకు పల్లకిగా జీవిస్తున్న మనిషి కవిత్వం పలక్కుండా ఎలా ఉండగలడు? ఆయన పలికేది కవిత్వం కాకుండా ఎలా ఉండగలదు? కాని శర్మగారిని చూడగానే మనకి ముందు ఆయన కవిత్వం గుర్తురాకుండా పూర్వమహాకవులు గుర్తు రావడం ఆయనకు వరమో, శాపమో నేనిప్పటికీ తేల్చుకోలేను.
మరొక మాట కూడా చెప్పవచ్చు. విక్రమార్కసింహాసనానికి ప్రతి మెట్టు దగ్గరా ఒక సాలభంజిక ఉండేదనీ, ఆ సింహాసనం ఎక్కదలుచుకున్నవాళ్ళకి మెట్టుమెట్టునా విక్రమార్కుడి సద్గుణాల గురించి చెప్పి, నీకు అటువంటి అర్హత ఉంటేనే ఈ సింహాసనాన్ని అధిష్టించడం గురించి ఆలోచించమని చెప్పేదనీ చదివాం గుర్తుంది కదా! నరసింహశర్మ గార్ని ఒక సాహిత్యసింహాసన సాలభంజికగా కూడా చెప్పుకోవచ్చు. ఎవరేనా కవి కావాలను కుంటే, రచయితగా నలుగురూ తన రచనలు చదవాలని కోరుకుంటే ఆయన శర్మగారిని కలవాలి. కలిసి మాట్లాడాలి. ఆయన చెప్పే పూర్వమహాకవుల గురించీ, ప్రసిద్ధ సాహితీవేత్తల గురించీ వినాలి. ఆ మాటలు వింటుంటే, ఆ సృజన, ఆ రసజ్ఞత మనకి కూడా ఉన్నాయా అన్న అలోచనలో పడిపోతాం. అలాగని ఆయన మాటలు మనల్ని నిరుత్సాహ పరచవు. మనకి తెలీకుండానే మనముందు కొన్ని కొండగుర్తుల్ని పెడతాయి. ఎలాగేనా మనం కూడా అక్కడికి చేరుకోవాలన్న తపన మనలో రగిలిస్తాయి.
మొన్న సన్నిధానం నరసింహశర్మగారు మా ఇంటికొచ్చారు. ఎనభయ్యేళ్ళ యువకుడు. నలభయ్యేళ్ళ కిందట ఆయన్ని మొదటిసారి చూసినప్పుడెలాఇప్పుడూ అలానే ఉన్నారు. అగస్త్యుడు సముద్రాన్ని ఆపోశనం పట్టాడంటారు. శర్మగారు అప్పుడూ, ఇప్పుడూ కూడా ఒక నిండుగోదావరిని తనలో నింపిపెట్టుకుని ఉన్నారు. ఆయన మా ఇంట్లో కూచుని మాటాడుతున్నంతసేపూ ఆ గోదావరి తొణుకుతూనే ఉంది. చప్పుడు చేస్తూనే ఉంది. ఆయన కూచున్నంతసేపూ నాకు గోదావరి ఒడ్డున కూచున్నట్టే ఉంది. మళ్ళా శరభయ్యగారి సన్నిధిలో కవిత్వం గురించి మాటాడుకున్నట్టే ఉంది.
ఆయనకి ఆరుద్ర రాసిన లేఖల్లో శరభయ్యగారూ, మధునాపంతులవారితో పాటు తనని కూడా ఒక గురువుగా చెప్పుకుంటారనీ ఆరుద్ర రాసాడు. నేను ఆ మాట నమ్మలేను. శరభయ్యగారు సరే, మధునాపంతులవారు సరే. కాని ఆరుద్ర నుంచి శర్మగారు నేర్చుకున్నదానికన్నా ఆరుద్రనే శర్మగారి నుంచి ఎంతో నేర్చుకుని ఉంటాడని నా నమ్మకం. ఒక్క ఆరుద్రనే కాదు, శర్మగారి సాంగత్యం లభించిన ప్రతి ఒక్క సాహిత్యవేత్తా ఆయనకి విద్యార్థిగా మారిపోకతప్పదు.
శర్మగారు తన ‘ప్రాణహిత’ (2017) కవితాసంపుటిలో మొదటిపేజీలో డిలాన్ థామస్‌ది ఒక వాక్యం ఉల్లేఖించారు.The World is never the same once a good poem has been added to it అని. రాజమండ్రిని రాజమండ్రిగా రూపొందించిన వాళ్ళల్లో శర్మగారుకూడా ఒకరని నాలాంటివాడికి ఎప్పటికీ గుర్తుంటుంది. నాలాంటివాళ్ళు నాలాంటివాళ్ళుగా మారేక్రమంలో శర్మగారి పరిచయం, సాంగత్యం, సాన్నిహిత్యం అందించిన సహాయం కూడా మాలాంటివాళ్ళమెప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటాం.
ఇంకా చాలా రాయాలని ఉంది. కానీ మా మాష్టారు ఒకసారి సన్నిధానానికి రాసిన ఉత్తరంలోని (30-8-1991) ఈ వాక్యాలకు మించి నేను అదనంగా చెప్పగలిగే దేముంటుంది అనిపిస్తున్నది:
ఇప్పటి నా నలభైయేళ్ళ నా జీవితంలోని మొదటి ఆప్తులు మహీధరా, మధునాపంతులా మొదలైనవారంతా సన్నిధానంలో సన్నిధిచేసి ఉన్నట్లే నాకనిపిస్తుంది. పరాయి ప్రాంతం నుంచి యీ ఊరు వచ్చినప్పుడల్లా గౌతమీ లైబ్రరీకి వెళ్ళి ఇతణ్ణి చూచేటంతవరకు నాకు రాజమహేంద్రవరం వచ్చినట్లే అనిపించదు. గోదావరి తగిలినప్పుడు నీటిగాలి స్పర్శ వలె ఇతని సన్నిధానం ఎప్పటికీ నాకు ఆప్యాయంగా ఉండేది. ఆ అనుభవం మాటల్లోకి ఎలా వస్తుందీ?
8-12-2024


“The world is never the same when a good poem is added to it” …
So are the readers who read Veerabhadrudu’s literary offspring!
Kudos to you, Sir.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
కదిలే గ్రంధాలయం , కదలని గోదావరి,,
కనులే అలలు, కథలే కథలే తలపులు.. సాహిత్య సంకీర్తకునికి నమస్సులు…🙏🙏
ధన్యవాదాలు
ఎంత గొప్ప వ్యాసమిది.
ఎన్నో విషయాలు. ఒక్క శాస్త్రి గారి గురించో గౌతమి గ్రంథాలయమో, రాజమండ్రి గురించో కాదు సాహిత్యం గురించి. గొప్ప గురువుల గురించి, మీరు చేసిన సాహిత్యప్రయాణం గురించి… ఓహో ఒకటేమిటి… అంతా అద్భుతం. వారి ఆ పుస్తకం నా తరువాతి పుస్తకాల కలెక్షన్ లో చేర్చుకున్నాను. వచ్చినప్పుడు భారతావనికి తప్పక సేకరిస్తాను.
వందనములు.
ధన్యవాదాలు సోదరీ!
ఆయన తో మాట్లాడటం aesthetic education అన్నారు.. ఆయన ఇంటర్వ్యూ లు రెండూ చూస్తున్నంత సేపూ అలానే అనిపించింది. చాలా బాగా రాశారు. ఆ మహనీయునికి వందనాలు🙏
ధన్యవాదాలు మేడం
🙏🙏🙏
మొదట మీరు రాసిన వ్యాసాం చదివేకే ఆయన ఇంటర్వ్యూలు మొత్తం చూడగలిగాను!
ధన్యవాదాలు!
ధన్యవాదాలు సార్
ఎంత మంచి వ్యాసం భద్రుడు గారు. ఆ పుస్తకానికి టైటిల్ గా మీ వ్యాసం శీర్షిక ‘సాహిత్య సంకీర్తకుడు’ అని తీసుకోవడం సబబే అనిపిస్తుంది.. మీ వ్యాసాలు ఎప్పుడు చదివినా అందులో మీరు సూచించే, స్పురింప చేసే విషయాలు నాలాంటి పాఠకులకి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిస్తుంది. అలాగే మీరు మీ వ్యాసాలలో అలవోకగా ప్రస్తావించే చిన్న సంగతులు చదువుతున్నప్పుడు, మీరు ఇంత రాయడానికి ఎంత చదివి వుంటారో, ఎన్ని విని వుంటారో అని ఆశ్చర్యమేస్తుంది.. ఉదాహరణకి ఈ వ్యాసం లో వాక్యాలు “శ్రీనాథుడు అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. కానీ ఆ కొన్నాళ్ళ నివాసమూ ఆరుద్ర చెప్పినట్టుగా అదొక ‘పెద్ద ముచ్చట.’’ నా బోటి సినిమా పాటల అభిమానులకు వెంటనే ఆంధ్రకేసరి సినిమాలో వేదం లా ఘోషించే గోదావరి పాటని కూడా భలే ప్రస్తావించారే అని మహదానందం కలిగిస్తుంది. రాజమండ్రిలో గడపిన నా బాల్యం కారణంగా నాకు ఆ ఊరంటే చాలా ఇష్టం.. అక్కడ నివసించిన అనేక మంది ప్రముఖులు , సాహితీ వేత్తలు , రచయితలు, కవులు కూడా. ఆదికవి నన్నయ్య నుంచి మొదలుపెట్టి . వాళ్ళ గురించి ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. మీకు అనేక ధన్యవాదాలు సన్నిధానం వారి గురించి ఇంత అద్భుతమైన వ్యాసాన్ని మాకందించినందుకు. అంతే కాదు మీ వ్యాసం ద్వారా శర్మగారి అభినందన సంచిక, అలాగే వారు రచించిన ‘బ్రౌను ఉదాహరణ కావ్యం’, శర్మ గారు అందుకున్న ‘ఆరుద్ర రాసిన లేఖలు’ పుస్తకాలు కూడా చదవాలనే జిజ్ఞాస కలిగించారు.
మీ విపులమైన ప్రతిస్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీనాధుడు రాజమండ్రిలో గడిపినప్పుడు అక్కడ పండితులు ఆయనను సానుకూలంగా స్వాగతించలేకపోయారు. వారికీ ఆయనకీ మధ్య మానసికంగా ఒక అగాధం ఏర్పడింది. కానీ కుమారిగిరిరెడ్డి లాంటి రాజు, శ్రీనాధుడు రాజమండ్రిలో కూర్చుని గాథాసప్తశతి గురించీ, కాళిదాసు నాటకాల గురించీ ఏం మాట్లాడుకుని ఉంటారా అన్న ఆలోచన నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు.
ఆహా ఎంత అందమైన ఊహ అండి.. ఆ ఆలోచన మీదే దేవులపల్లి వారి ‘అప్పుడు పుట్టి వుంటే ‘ తరహా కథొకటి గాథా సప్తశతి , కాళిదాసు నాటకాల విషయాలు, విశేషాలు ప్రస్తావిస్తూ మీరు కూడా పుట్టించవచ్చు. భలే బావుంటుంది. మాలాంటి పాఠకులకి గొప్ప మేలు చేసినవారవుతారు.
నిజమే కదా! రాయాలి.
అదృష్టవంతులు
సన్నిధానం వారూ
మీరూ…
ఇది చదివిన వారంతానూ…
ధన్యవాదాలు
జయధీర్ తిరుమల్ రావుగారి పుణ్యమా అని సన్నిధానం వారి పరిచయభాగ్యం కలిగింది. వారి బ్రౌన్ ఉదాహరణం పుస్తకావిష్కరణ సభలో వారి కావ్యగానం చేసే అవకాశం నాకు లభించడం నా పూర్వ జన్మ సుకృతం . కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు నేనెల పఠిస్తానో పరికించి ఫర్వాలేదని చెప్పడంతో మొత్తం పద్యాలు గానపఠనం చేసాను.
ఆసభలో ఉన్న పొత్తూరి వారి ఆశిస్సులు పొందడం కూడా సన్నిధానం వారి ఆదరం వల్లనే. ఇటీవల రవీంద్రభారతిలో ఒక సభకు వచ్చినపుడు పలుకరించుకున్నాం . వారి గురించి మీరు చాలా బాగా రాశారు. వారికి మీకు శుభాభినందనలు.
ధన్యవాదాలు సార్
” సాహిత్య సంకీర్తనుడు “అంటే బాగుండేదేమో అని అనిపిస్తోంది సార్?!
ధన్యవాదాలు