ఈశ్వర స్తుతిగీతాలు-3

కీర్తనలు ఆవిర్భవించిన కాలాన్నిబట్టి వాటిని స్థూలంగా రెండు భాగాలుగా విభజిస్తారని చెప్పాను కదా. యూదులు బేబిలోన్ కి ప్రవాసానికి వెళ్ళకముందటి ప్రార్థనలూ, ప్రవాసం నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత కూర్చుకున్న ప్రార్థనలూ. మొత్తం కీర్తనల్లో దాదాపుగా మూడింట రెండు వంతులు ప్రవాసానికి వెళ్ళకముందు స్తోత్రాలు. వాటిలో మళ్ళా రెండు భాగాలున్నాయి. 41 నుంచి 89 దాకా ఉన్న కీర్తనలు యూదు సమాజం, యెరుషలేం కేంద్రంగా ఒక ఇజ్రాయేలుగా సంఘటితం కాకుముందు, చిన్న చిన్న సమూహాలుగా, చిన్న చిన్న ప్రార్థనా కూటములుగా ఉన్నప్పటి కీర్తనలు. యేరుషలేంలో సొలోమోను దేవాలయం నిర్మించకపూర్వం ఒక గుడారంలో దేవుణ్ణి ప్రతిష్టించుకుని ఆయన ఆలంబనగా తాము చేసుకునే హేమంత ఉత్సవాల్లో పాడుకున్న గీతాలవి. అంటే మార్గశిర మాసంలో వేదకాలమానవుడు నవాగ్రాయణ క్రతువుల్లో తొలి హవిస్సులు సమర్పిస్తూ పాడుకున్న అగ్నిసూక్తాల్లాంటివి అని చెప్పవచ్చు.

అయితే కీర్తనల్లో వినిపించే భావోద్వేగం, హృదయావేవదనల్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు వాటిని మళ్ళా స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటి తరహా కీర్తనలు విలపాలు, రెండో తరహా కీర్తనలు ధన్యవాద సమర్పణలు. ఈ రెండూ కాక, ఆత్మస్థైర్యాన్ని ప్రకటించే గీతాలుగానూ, దైవజ్ఞాన ప్రకటన గీతాలుగానూ, యాత్రా గీతాలుగానూ, ప్రవేశవేళల్లో చేసే ప్రార్థనలుగానూ కూడా కొన్ని గీతాల్ని లెక్కవేస్తున్నారుగానీ, అవన్నీ కూడా దాదాపుగా కృతజ్ఞతా ప్రకటనలే. మొత్తం గీతాలన్నిటిలోనూ దాదాపు మూడింట రెండు వంతులు విలాపగీతాలే. అందులో ఆశ్చర్యం లేదంటాడు J.Day. ‘దుఃఖ్ మేఁ సుమిరన్ సబ్ కరై, సుఖ్ మేఁ కరే న కోయ్’ అని కబీరు అనలేదా! కష్టంలో భగవంతుణ్ణి తలచుకోవడంలో మానవుడికి ఏ మతభేదమూ లేదు. ఇప్పుడు మన కవిత్వం కూడా అంతే కదా! జీవితవాస్తవాల్నీ, చుట్టూ ఉన్న నిష్ఠుర పరిస్థితుల్నీ చూసి ఎలుగెత్తి ఆక్రందించడంలో ఉన్న ఆసక్తి, కవులకి, జీవితం తమకి ప్రసాదిస్తున్న సంతోషాల్ని బిగ్గరంగా గానం చెయ్యడంలో లేదు కదా. ఒకవేళ ఎవరేనా అలా తమ జీవనసంతోషాన్ని మాత్రమే గానం చేస్తే ఆ కవిని తోటి కవులు ఒకపట్టాన నమ్మలేరు కూడా.

కీర్తనల్లో మరొక ముఖ్యలక్షణం కనిపిస్తూ ఉంది. వాటిల్లో మొదటి భాగం విలాపాలుంటే రాను రాను విజయసంతోష గీతాలు కనిపిస్తాయి. అలాగే కీర్తనల్లోని మొట్టమొదటి కీర్తన కూడా మంగళ ప్రదమైన కీర్తననే. బైబిలు పండితులు చెప్పేదాని ప్రకారం మొదటి కీర్తన మొట్టమొదటగా పుట్టిన కీర్తన కాదు. ఆ గీతంతో కీర్తనల అధ్యాయాన్ని మొదలుపెట్టడం సంకలనకారులు చూపించిన వివేకం. పూర్వకాలపు సంకలనాల్లో ఇటువంటి ఒక దృక్పథం ఉండేది. అంటే మొదటి కీర్తన లేదా మొదటి శ్లోకం లేదా మొదటి పదం అది కేవలం ప్రారంభ పదప్రయోగమో, శ్లోకమో, పద్యమో మాత్రమే అయి ఊరుకోకుండా ఆ మొత్తం అధ్యాయానికి ప్రాతినిథ్యం వహించేదిగా కూడా ఉండటం. ఉదాహరణకి ఋగ్వేదం మొదటిమండలంలోని మొదటి సూక్తం ‘అగ్ని మీళే పురోహితం’ ఋగ్వేదం లోని అతిచిన్న సూక్తం కావడం వల్ల మాత్రమే మొదటి సూక్తం కాలేదు. ఋగ్వేదమానవుడి మొత్తం జీవనదృక్పథానికి, అగ్నిసాక్షిగా, అగ్నిని అల్లుకుని, అతడు తన జీవనక్రతువును తీర్చిదిద్దుకోడాన్ని ఆ సూక్తం ప్రతిబింబిస్తుంది. ఋగ్వేదంలో వాక్కుని ఇళ, సరస్వతి, భారతి అనే మూడు రూపాల్లో, మూడు దశల్లో ఆవాహన చేసారు. ఋగ్వేద మానవుడి ప్రపంచంలో మూడు లోకాలున్నాయి. అవి పృథ్వి, అంతరిక్షం, ద్యులోకం. అగ్ని పృథ్వీదేవత. అంతరిక్షంలో ఇంద్రుడు, ద్యులోకంలో ఆదిత్యుడు. ఇళ పార్థివసంబంధమైన వాక్కు. సరస్వతి మధ్యలోకాలకి చెందిన వాక్కు. భారతి ఆదిత్యలోకపు వెలుగు. భా అంటేనే వెలుగు. రతి అంటే ఆ వెలుగుపట్ల నిష్ఠ. ఈ ప్రస్థానక్రమమంతా ఒక్క మొదటి సూక్తంలోనే మనం పోల్చుకోవచ్చు. అలానే కీర్తనల్లో కూడా మొదటి కీర్తన ఒక్కటి క్షుణ్ణంగా అధ్యయనం చేసినా మొత్తం కీర్తనల సారాంశాన్ని మనం అవగాహనచేసుకోవచ్చు.

అదీకాక ఏ కావ్యమైనా మంగళప్రదంగా మొదలై, మధ్యలో కూడా మంగళ భావనల్ని గుర్తుచేస్తూ చివరికి మంగళ ప్రదంగా ముగియాలనేది ప్రాచీనుల కావ్యదృక్పథం. కీర్తనలు కూడా అందుకు మినహాయింపు కాదని, ఈ నూటయాభై కీర్తనల్లోని 1, 75, 150 గీతాలు చదివినా కూడా మనం గ్రహించగలుగుతాం.

అంతేకాక, మనం ఇంతకు ముందు చెప్పుకున్న 22 వ కీర్తననే చూసినా కూడా ఆ గీతంలో రెండుభాగాలున్నాయనీ, మొదటి భాగం విలాపమైతే, ఈశ్వరానుగ్రహం తనకి ఒక్కడికే కాక, తన దేశానికీ, తన జాతికీ మాత్రమే కాక, భూమండలం మొత్తానికి దక్కబోతున్నదనే ఆశాభావం రెండోభాగమనీ కూడా అనుకున్నాం. ఇదే స్ఫూర్తి కీర్తనల మొత్తం అధ్యాయానికి వర్తిస్తుంది. ఆ విధంగా అవి ఒక దివ్యమంగళ ప్రకటనగా కూడా మనం భావించవచ్చు. తర్వాత రోజుల్లో దాంటే తాను నరకం నుంచి స్వర్గం వైపుగా ప్రయాణించడాన్ని డివైన్ కామెడీ గా రాసాడని మనకు తెలుసు. ఈ కీర్తనలు మొదటి డివైన్ కామెడీ.

కీర్తనల్లో అధికభాగం విలాపాలు అని చెప్తున్నప్పుడు 22 వ కీర్తనలోలానే చాలా కీర్తనల్లో మొత్తం గీతమంతా విలాపం కాకుండా సగం నుంచీ అదొక విశ్వాస ప్రకటనగా, ఒక సాక్షాత్కారం లభించిన సంతోషంగా కూడా వినిపిస్తుంది. చాలా గీతాల్లో మధ్యలోనే ఏదో జరగడం, ఆ తర్వాత, ఆ కన్నీళ్ళు ఆనందబాష్పాలుగా మారిపోడం మనం గమనిస్తాం. 126 వ కీర్తనలో చెప్పుకున్నట్టుగా అంతదాకా తాము అనుభవించిన కష్టాలన్నీ ఒక కలలాగా తోచి ‘కన్నీళ్ళు నారుగా నాట్లునాటే వాళ్ళు సంతోషం గంపలకి ఎత్తుకుని తిరిగిరావడం’ గీతకర్తలు చూసారు, చూసింది ఎలుగెత్తి పాడేరు.

కేవలం విలాపాలుగా ఉన్న కీర్తనల్ని, అంటే, 3-7, 9-10, 13,17, 22, 25-28, 31, 35, 38-39, 40, 42-43, 51-52, 54-57, 59, 61, 64, 69-71, 77, 86, 88, 94, 102, 109, 120, 130, 139-143 లను పరిశీలించినప్పుడు మనం మరికొన్ని అంశాలు గమనించవచ్చు.

విలాపాలు సాధారణంగా అభ్యర్థనలుగా, వినతిలేఖలుగా కనిపిస్తాయి. వాటిలో గీతకర్త తన అమాయికత్వాన్ని, నిర్దోషిత్వాన్ని విన్నవించుకోడం కనిపిస్తుంది. తులసీదాస్ ‘వినయపత్రిక’లో లాగా వీటిల్లో కూడా తన శత్రువులు- బయటివాళ్ళూ, లోపలివాళ్ళూ- కూడా తనని చుట్టుముట్టి ఉన్న ఒక విహ్వలత్వం కనిపిస్తుంది. అయితే, దేవుడు తన మొరాలకిస్తున్నాడనే నిశ్చయ జ్ఞానం, ఒక అచంచల విశ్వాసం ఈ గీతాలకి ప్రాణం. అందుకనే కొన్ని చోట్ల అవి ఫిర్యాదులుగా, రక్షణకోసం ఆక్రందనలుగా వినబడుతున్నప్పుడు కూడా, ఆ విశ్వాసం చెక్కుచెదరకపోవడం మనం చూడవచ్చు.

గీతాల్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితులు విలాపాల్లో మళ్ళా రెండు రకాలున్నాయని గుర్తుపట్టేరు. మొదటి తరహా విలాపాలు గీతకర్త తన స్వీయ దుఃఖాన్ని ప్రకటించేవి. రెండో తరహా విలాపాలు తన జాతి దుఃఖాన్ని వినిపించేవి. అక్కడ గీతకారుడికి తన దుఃఖం కొన్నిచోట్ల జాతి దుఃఖం, కొన్ని చోట్ల జాతి దుఃఖమే తన దుఃఖం కూడా. గీతకర్త తన విషాదాన్ని ప్రకటిస్తున్నప్పుడు అది దాదాపుగా మృత్యువు తన మీద విరుచుకుపడ్డ అనుభవం. జాతి దుఃఖాన్ని ప్రకటిస్తున్నప్పుడు తన జాతిమీద ప్రాకృతిక విపత్తులో, బయటి శత్రువులో విరుచుకుపడే సందర్భాలు లేదా తమ విశ్వాసాలమీద పరాయి విశ్వాసాలు, పరాయి దేవతలు దండెత్తడాలు. లేదా ఒక క్షీణత, ఒక corruption తన నైతికవిలువల్లో లేదా తన సమాజం తాలూకు నైతిక ప్రవర్తనలో ఒక సంక్షోభం తన దుఃఖప్రకటంగా మారడం కనిపిస్తుంది.

కొన్ని సార్లు ఆ విలాపాలు ఒక వ్యక్తి తన వ్యక్తిగత దుఃఖాన్ని ప్రకటించేవిగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి ఒక రాజుగా తన ఆక్రోశాన్ని వినిపిస్తుంటాడు. ఈ గీతాల్లో చాలావాటికి దావీదు కర్తృత్వం ఉందన్నప్పుడు ఆ దావీదు ఒక వ్యక్తి మాత్రమే కాక, ఒక జాతినాయకుడిగా కూడా తన దుఃఖాన్ని ప్రకటిస్తున్నాడు. నిజానికి అక్కడ వ్యక్తికీ, రాజుకీ మధ్య సరిహద్దు రేఖ గీయలేం కూడా. తనమీద దండెత్తుతున్న శత్రువులు బయటి శత్రువులే కానక్కరలేదు, తన ప్రలోభాలు, తాను దైవశాసనానికి కట్టుబడి ఉండలేకపోతున్న నిస్సహాయత్వం కూడా ఆ గీతాల సారాంశం కావచ్చు. అలాగే సామూహిక విలాప గీతాల్లో కూడా మేము అని కాక, చాలాసార్లు నేను అని కూడా వినిపింస్తుంది. అక్కడ ఆ నేను ఆ జాతి తాలూకు ఆత్మ అని మనం అర్థం చేసుకోవాలి.

కొన్ని సార్లు విలాపాల్లో తాను ప్రకటిస్తున్న దుఃఖం ఒక రోగం వల్ల, వ్యాధివల్ల లేదా దీర్ఘకాల రుగ్మత వల్ల కలుగుతున్న కష్టం కూడా. అయితే తనకి ఒక రుగ్మత కలగడంలోని కష్టం కన్నా, తాను ఎక్కడో దైవానుశాసనాన్ని ఉల్లంఘించాడనీ, అందుకే తనని ఆ రుగ్మత పట్టుకుందనీ భావించడం ఆ గీతాల్లో కనిపిస్తుంది. మానవుడిగా తనని వెంటాడే ఆదిపాపం నుంచి విముక్తిపొందితే తప్ప తాను ఆ రుగ్మతనుంచి బయటపడలేననే ఒక మెలకువ కూడా ఆ గీతాల్లో వినిపిస్తుంది.

చాలా సార్లు ఆ విలాపాల్లో కనవచ్చే ఆక్రోశం, తాను అన్యాయానికి గురవుతున్నాడనే ఒక భావన. లేదా తన మీద అన్యాయంగా నిందలుమోపుతున్నారనే ఒక నిస్సహాయత్వం, తనని అన్యాయంగా దోషిగా చూపిస్తున్నారనే ఒక మొత్తుకోలు- ఇది భావుకులైన యూదుల్నీ, క్రైస్తవుల్నీ కూడా- యుగయుగాలుగా వెన్నాడుతూనే ఉన్న ఒక మానసిక చేతన. ఉదాహరణకి ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో కాఫ్కా రాసిన  The Trail (1925) లో ఉన్నది ఈ కీర్తనల్లోని మనఃస్థితి లాంటిదే. అయితే, తన మీద చేస్తున్న ఆ ఆరోపణకి తన అంతరంగంలో  ఎక్కడో ఏ మూలనో తాను బాధ్యుణ్ణేమో అన్న అపరాధ భావన కాఫ్కా నవలకి కీలకం.

గీతాల్లోని చాలా పదప్రయోగాలు, అభివ్యక్తి, ఆక్రోశాన్ని ప్రకటించే తీరు విలక్షణంగా, అద్వితీయంగా ఉంటాయి. అన్నిటిలోకీ అతి పెద్ద విషాదకరమైన ప్రకటన how long అనేది. ఇదుగో, ఈ ఆరవ కీర్తనలో వినబడే మాట. ‘ఎన్నాళ్ళింకా?’. మనమొక దుఃఖానికి లోనయినప్పుడు, వ్యక్తులుగా గానీ, కుటుంబాలుగా గానీ, జాతులుగా గానీ, ఆ కష్టం ఎప్పటికి తీరిపోతుందో తెలిస్తే, అప్పటిదాకా, ఆ కష్టాన్నెట్లానో పంటిబిగువున భరించగలమనుకుంటాం. కాని కష్టంలోని అతిపెద్ద కష్టం అది ఎన్నాళ్ళు భరించవలసి ఉంటుందో తెలియకపోవడమే. విపత్తులో చిక్కుకున్నప్పుడు మనిషికి లభించగల మొట్టమొదటి సహాయం ఆ విపత్తు మరెన్నాళ్ళో ఉండేది కాదని తెలియడం. కనీసం ఎవరేనా ఆ మాట తనకి నిశ్చయంగా చెప్పడం. కాని అలాంటి మాట చెప్పేవాళ్ళే కనిపించరు. విషాదాల్లో కెల్లా అదే అతి పెద్ద విషాదం.

తన దుఃఖం పూర్తిగా దైవికంకాదనీ, తాను పూర్తిగా నిరపరాధికాడనీ ఎక్కడో తన పట్ల తనకే ఉండే ఒక సంశయం గీతకారుణ్ణి మరింత శోకగ్రస్తుణ్ణి చేస్తుంది. (స్వీయ హృదయం న్యాయ సదనం నేరమారోపించడానికి, నరనరాలా గూఢచారులు దృష్టి నాపై నిలపటానికి-బైరాగి.)అందుకని తానెటువంటి వాడుగానీ తనని తిరస్కరించవద్దని దేవుడికి మొరపెట్టుకుంటాడు.


నన్ను తిరస్కరించకు ప్రభూ

నన్ను తిరస్కరించకు ప్రభూ, నీ ఆగ్రహంలో. నా పట్ల నీకు భరించలేనంత అయిష్టం కలుగుతున్నా కూడా నన్ను ఖండించకు.

నా మీద దయ చూపించు ప్రభూ, నేను దుర్బలుణ్ణి. నా ఎముకలు రుజాగ్రస్తమయ్యాయి,ప్రభూ, నన్ను స్వస్థ పరచు.

నా ఆత్మ చెప్పలేనంత గొప్ప కష్టంతో నలిగిపోతోంది, కాని నువ్వు, నా ప్రభూ- ఎన్నాళ్ళింకా?

తరలి రా ఓ ప్రభూ, నన్ను బయటపడెయ్యి! కనీసం నీ దయ చూపించడానికేనా నన్ను బయటపడెయ్యి!

నేను మరణించేక ఇంక నీ గురించి తలుచుకోడానికెవరుంటారు? సమాధుల్లోంచి నీకు కృతజ్ఞతలెవరు ప్రకటిస్తారు?

మూలిగీ మూలిగీ నేను అలిసిపోయేను. రాత్రంతా నా శయ్యలో నేను అశ్రువుల్లో ఈదులాడుతోనే ఉన్నాను. ఆగని కన్నీళ్ళతో నా పక్కబట్టలు తడిసిపోయేయి.

అంతులేని దుఃఖంతో నా చూపు మందగించింది, నా శత్రువుల్ని చూసి అది రోజురోజుకీ బలహీనపడుతున్నది.

ఓ క్రూరాత్ములారా, నా దగ్గర్నుంచి దూరంగా పొండి. నేను ఏడుస్తున్న చప్పుడు ప్రభువు చెవిన పడింది.

నా ప్రభువు నా విన్నపం అవధరించాడు, నా ప్రభువు నా ప్రార్థన స్వీకరిస్తాడు.

నా శత్రువులంతా కుంచించుకుపోదురుగాక, ఇక్కట్ల పాలవుదురు గాక! వాళ్ళు ఒక్కసారిగా వెన్ను చూపి భరించలేనంత అవమానంలో కుంగిపోదురుగాక!

9-10-2024

2 Replies to “ఈశ్వర స్తుతిగీతాలు-3”

  1. ఈ ప్రార్థనా గీతాలు
    ఆ విశాలమైనా పువ్వులు పరచిన మైదానాలలో గీతాలు ఆలపిస్తున్న చిత్రం
    ఆక్రందనను ఆనందాన్ని ఒకేక్షణంలో కలగజేస్తున్నాయి గురువుగారు 🙇🏻‍♂️💐

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading