
ఈ మధ్య ఒక మిత్రురాలు నాకిట్లా మెసేజి పెట్టారు: ‘ సాహిత్యం అంతిమ లక్ష్యం ఏమిటి? మనుషుల్లో దాగున్న సున్నితత్త్వాన్ని మేల్కొలిపి సాటి మనుషుల పట్ల లేదా సమాజం పట్ల దయగా, బాధ్యతగా ఉండేటట్లు చేయడమేగా..మీరెందుకు అన్నీ తెలిసి గిరి గీసుకుని బతుకుతున్నారు?’
ఆమె ఇంకా ఇలా రాసారు: ‘మా కుటుంబస్నేహితులు ఒకరికి రిటైర్డ్ అయ్యాక కూడా సర్వీసు పొడిగించారు. సరే.. అలా మీకు ఇష్టం లేదనుకుందాం. కనీసం సమాజం పట్ల, చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న వాటిపై స్పందించకపోతే మీ అపారమైన జ్ఞానికి అర్థం ఏమిటి? ‘
ఆమె మాటలు నన్ను ఆలోచనకి గురిచేసాయి. నేనేమి చేయాలి? ఏమి చేస్తున్నాను? ఏమి చేయలేకపోతున్నాను? నాకు అర్థం కాలేదు.
‘నేనేమి చేయాలో మీ సలహా చెప్పండి’అనడిగాను. ‘నిజాయితీగానే మీ సలహా అడుగుతున్నాను’ అని కూడా అన్నాను. దానికి ఆమె ఇలా జవాబిచ్చారు:
‘మీలాంటి వాళ్ళు ఎందరినో ప్రభావితం చేయగలరు. అందుకే మీ పోస్టులు కేవలం సాహిత్యం పై మాత్రమే కాకుండా, సమాజంలో జరుగుతున్న అన్ని అంశాలపై నిర్మొహమాటంగా రాయండి. పాలకులు, ప్రజలు..ఎవరైనా సరే మారాల్సిన, మార్చుకోవాలసిన అంశాలను ఎత్తి చూపండి. ఉ. పాలస్తీనాపై దాడి చేసి పసిపిల్లలను టార్గెట్ చేసి చంపడం, మన దేశ, రాష్ట్ర సామాజిక, రాజకీయ పరిస్థితులు..’
అర్థమయింది. నిజమైన స్నేహితురాలు తన మిత్రుడి గురించి బహుశా ఇలానే ఆలోచిస్తుంది. తన మిత్రుడి శక్తిసామర్థ్యాలు జనహితం కోసం మరింత క్రియాశీలకంగా, మరింత కార్యసాధకంగా పనిచెయ్యాలనీ, అతడు ఒక మూల కూచుని బొమ్మలు గీసుకుంటూ, కవితలు చదువుకుంటూ గడపడానికి మాత్రమే పరిమితం కాకూడదని అనుకుంటుంది. ఆమె హృదయానుభూతి నేరుగా నన్ను తాకింది. ఆ సున్నితమనస్కురాలిపట్ల నాలో చెప్పలేనంత ఆత్మీయత ఉప్పొంగింది.
కానీ, ఆమె రాసినట్టు, లేదా ఆమె నన్ను పనిచెయ్యమని కోరుకుంటున్నట్టు నేను చేయగలనా?
చేయలేననే అనుకుంటున్నాను. ఎందుకంటే, నా ఉద్యోగ విరమణ తర్వాత నేను యాక్టివ్ పబ్లిక్ లైఫ్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నాను. అలాగని ప్రజలకు దూరంగా జరగాలని మాత్రం అనుకోలేదు. వీలైనంత దగ్గరగా, వారికి మరింత సన్నిహితంగా, వారి కష్టసుఖాల్ని మరింత లోతుగా చూడాలనీ, వారితో మమేకమవ్వాలనే కోరుకున్నాను. కోరుకుంటూనే ఉన్నాను. నేను అనుకున్నట్టుగా ప్రజలమధ్యకు వెళ్ళగలిగే అవకాశాలకు, రకరకాల కారణాల వల్ల, ఇంకా దూరంగానే ఉన్నాను.
కాని నిజంగానే ప్రజల మధ్యకు వెళ్ళినా కూడా నా మిత్రురాలు రాసినట్టు వాళ్ళని చైతన్యపరిచి, ఉత్తేజపరిచి, వాళ్ళని ముందుకో, వెనక్కో నడపాలని మాత్రం నాకెట్టి కోశానా లేదు. అసలు ప్రజలమధ్యకు వెళ్ళేదే వాళ్ళ గురించిన మరింత దగ్గరగా తెలుసుకోవాలనే తప్ప, సామాజిక పరివర్తన దిశగా పనిచెయ్యాలని కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రజలమధ్యకు వెళ్ళినా కూడా, ఒక గురజాడలాగా, మరింత సత్యసమ్మతమైన సాహిత్యసృజన చెయ్యాలన్న కోరికతోనే తప్ప, వీరేశలింగం లాగా ఒక ఉప్పెనలాగా ఉవ్వెత్తున ఎగిసిపడాలని కాదు.
అసలు నా చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న దోషాల్ని ఎత్తిచూపడం మీదా, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని సంస్కరించడం మీదా నాకు ఆసక్తి దాదాపుగా సన్నగిల్లిపోయింది. ఉద్యోగంలో ఉన్నంతకాలం, నా ఉద్యోగ జీవితపు పరిథిలో నేను చూసిన అన్యాయాల్ని ప్రతిఘటించడం మీదా, నా బాధ్యతల పరిమితుల మధ్యనే వాటిని చక్కదిద్దడం మీదా నేను శక్తివంచనలేకుండా పోరాడేను. నాకు అన్యాయం అని అనిపించినదాని పట్ల ఒక్కరోజు కూడా కళ్ళుమూసుకున్నది లేదు. ఆ పోరాటంలో నాకు ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకపోయినా నేను ఆగిందీ లేదు. కాని అదంతా నా ఉద్యోగ జీవితంలో భాగంగా చేసాను. ఒకవేళ నేను ఆ ఉద్యోగాలు చెయ్యకపోయి ఉంటే, ఆ పరిస్థితుల్ని స్వయంగా ఎదుర్కోకపోయి ఉంటే, బహుశా ఆ అన్యాయాల గురించి నాకు తెలిసినా కూడా నేను పట్టించుకుని ఉండేవాణ్ణి కాను. ఎందుకంటే మొదటినుంచీ నా దృష్టి నన్ను సంస్కరించుకోడం పట్లనే ఉంది తప్ప లోకాన్ని సంస్కరించడం పట్ల లేదు.
నా మిత్రురాలు చెప్పినట్టుగా గాజా మీద నేను ఎందుకు కవిత రాయలేకపోతున్నాను? అలాగని కవితలు రాస్తున్నవాళ్ళ దుఃఖం అసత్యం అనలేను. వాళ్ళ నిజాయితీని, చిత్తశుద్ధిని, ఆవేదననీ శంకించలేను. అలా రాయవలసిన అవసరం తప్పకుండా ఉంది. అలా ప్రపంచమంతా రాస్తేనన్నా, సామ్రాజ్యవాదదేశాలు ఎంతో కొంత వెనక్కి తగ్గుతాయి. ఈ సంగతి నాకు తెలియకపోలేదు. అయినా కూడా నేను గాజామీద ఒక కవిత రాయలేను. ఎందుకంటే అసలు అలా ఒక కవిత రాసే నైతికమైన హక్కు నాకున్నదా అన్న ప్రశ్న నన్ను వేధించడం మొదలుపెడుతుంది. నా చుట్టుపక్కల ఉన్న జీవితవిషాదంలో రవ్వంత కూడా పాలుపంచుకోకుండా అంతర్జాతీయ విషాదం గురించి రాయడంలో నాకొక చెప్పలేని సౌకర్యం ఉందేమోనన్న అనుమానం నన్ను పైకి కనబడని రంపంతో కోసేయడం మొదలుపెడుతుంది.
ఈ అర్థంలో నా శక్తులు పూర్తిగా నిరుపయోగాలు. ఉద్యోగజీవితంలో నేను కొంత పోరాటం చెయ్యకపోలేదుగాని, అది నేను తీసుకుంటున్న జీతానికి న్యాయం చెయ్యడం కోసం చేసిందే తప్ప, ఒక సామాజిక సంస్కరణలో భాగంగా చేసింది కాదు. ముందు నేను ఇరుగుపొరుగు కష్టసుఖాల్లో భాగం పంచుకోకుండా, వసుధైక కుటుంబం గురించి మాట్లాడటం కన్నా ఆత్మవంచన మరొకటి ఉండబోదు.
ఒకప్పుడు ఏథెన్సులో సోక్రటీసు ఈ సమస్యనే ఎదుర్కొన్నాడు. ఆయన శారీరికంగా చాలా బలిష్టుడు. కొన్నాళ్ళు సైన్యంలో కూడా పనిచేసాడు. మొదట్లో ఆయనకి సమాజం పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఆదర్శవంతమైన జీవితం జీవించాలనే కోరిక ఉండేది ఆయనకి. ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే తపన తీవ్రంగా ఉండేది. అలాంటి రోజుల్లో ఒక సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది.
ఆ రోజుల్లో డెల్ఫి అనే చోట ఒక దివ్యవాణి వినిపించేది. ప్రజలు తమ జీవితాల గురించి ఏవైనా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడి పూజారిణిని ప్రశ్నలు అడిగేవారు. ఆ పూజారిణి వాళ్లకి ఏదో ఒక జవాబు చెప్పేది. ఆ జవాబుని వాళ్ళు గ్రీకు దేవత అపోలో వాణిగానే భావించేవారు. అలా ప్రశ్నలు అడగడానికి రెండు పద్ధతులు ఉండేవి. ఒక పద్ధతిలో రాతపూర్వకంగా జవాబు కావాలంటే ఒక గొర్రెనో, మేకనో బలివ్వాల్సి ఉండేది. అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నకి వివరంగా జవాబు దొరికేది. అలా కాకుండా తమ ప్రశ్నకి ‘అవును’ అనో లేదా ‘కాదు’ అనో మాత్రమే జవాబు సరిపోతుందనుకుంటే, అందుకు ఏ బలులూ, నైవేద్యాలూ సమర్పించాల్సిన పని ఉండేది కాదు. మామూలుగా బీదవాళ్ళు దివ్యవాణిని సంప్రదించడానికి రెండో పద్ధతినే ఎంచుకునేవారు. ఒకసారి ఛాయిరేఫోన్ అనే ఒక యువకుడు ఆ పూజారిణి దగ్గరకు వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు.
‘సోక్రటీస్ కన్నా వివేకవంతుడెవరైనా ఉన్నారా?’
‘లేరు’ అంది దివ్యవాణి.
ఆ సంగతి తెలియగానే సోక్రటీస్ దిగ్భ్రాంతి చెందాడు. దేవుడు చెప్పిన మాటకి అర్థమేమిటి? అసలు వివేకమంటే ఏమిటి? తాను వివేకవంతుడా? తనని మించిన వివేకవంతుడు మరొకరు లేరని దివ్యవాణి ఎందుకు చెప్పింది? మరెవరికీ తెలియని, తనకు మాత్రమే తెలిసిన ఆ వివేకం ఏమిటి? ఆ ప్రశ్న సోక్రటీస్ ని పూర్తిగా అంతర్ముఖుడిగా మార్చేసింది. అతడు ఒక్కసారిగా పౌరజీవితం నుంచి పక్కకు తప్పుకున్నాడు. నిజానికి పెరిక్లీజ్ భావజాలంతో ప్రభావితమైన ఆనాటి ఏథెన్సులో, ఒక యువకుడు, పౌరజీవితం నుంచి పక్కకి తప్పుకోవడమంటే, ఆ పౌరుడు ‘అప్రయోజకుడి’ గా మారిపోవడమే.
ఉత్తమ జీవితం కోసం, ఆదర్శవంతమైన జీవితం కోసం వెతుక్కోడం మొదలుపెట్టిన యువకుడు చివరికి ఒక ‘అప్రయోజక జీవితం’లోకి ప్రయాణించడమే.
సోక్రటీస్ కి దాదాపు రెండువేళ ఏళ్ళ తరువాత, జపాన్ లో బషో కూడా ఈ మాటలే రాసుకున్నాడు: ‘నా కవిత్వం వేసవికాలంలో చలిమంటలాంటిది, శీతాకాలంలో విసనకర్రలాంటిది’ అని. అంటే లౌకిక ప్రయోజనం దృష్టిలోంచి చూస్తే ఆ కవిత్వం ఎందుకూ పనికిరాకపోగా, పైగా విరుద్ధ ఫలితాల్ని కూడా ఇస్తుందన్నమాట.
నా మిత్రురాలు నన్నట్లా సూటిగా ప్రశ్నించాక ఒక క్షణం ఆలోచించాను. ఆమె చెప్తున్నది సహేతుకమే గాని నేనెందుకలా ఉండలేకపోతున్నాను అని ఆలోచించాను. నా సృజనశక్తుల్ని, ఆమె ఆశిస్తున్నట్టుగా, సమాజాన్ని ప్రభావితం చెయ్యడానికి ఎందుకు వినియోగించలేకపోతున్నాను అని నా అంతరాత్మని నేను ప్రశ్నించుకున్నాను.
నాకు దొరికిన జవాబు ఒక్కటే. నేను కూడా ఒక ఆదర్శరాజ్యాన్ని కలగన్నాను, ఆదర్శసమాజంకోసం పరితపించాను. కాని ముందు నన్ను నేను సంస్కరించుకోకుండా, నా మనస్సుని ఒక ఆదర్శ రాజ్యంగా మార్చుకోకుండా, బయట చెయ్యగలిగింది ఏమీ లేదన్నదే నా మెలకువ. అందుకని, నేను చెయ్యగలిగిందల్లా, ఎప్పటికప్పుడు ఒక డస్టరు తీసుకుని నల్లబల్ల తుడుచుకున్నట్టుగా, కవిత్వం చదువుకోవడం ద్వారా నా మనసుని నిర్మలం చేసుకోవడం లేదా ఒక నీటిరంగుల బొమ్మ గీసుకోవడం ద్వారా నన్ను నేను పరిశుభ్రం చేసుకోవడం. పౌరసమాజం దృష్ట్యా చూసినప్పుడు నాది పూర్తిగా నిరుపయోగ జీవితం. నా సృజన శక్తులు పూర్తిగా అప్రయోజకాలు.
ఒకప్పుడు టాగోర్ ని కూడా ఇటువంటి ప్రశ్నలే వేధించినట్టున్నాయి. ఆయన ఒకచోట రాసుకున్నాడు. ఈ ప్రపంచంలో బొగడచెట్టు సాధించగల పరమార్థం ఏముంటుంది? దాని పండ్లు తినడానికి పనికిరావు. ఆ కలప ఇళ్ళు కట్టుకోడానికో, ఫర్నిచరు తయారుచేసుకోడానికో పనికిరాదు. ఆ పూలు కూడా గొప్ప మాలలుగా గుచ్చడానికి పనికొచ్చేంత పెద్ద పూలేమీ కావు. కానీ ఈ ప్రపంచంలో బొగడచెట్టు తాను నిర్వహించే పాత్రని నిరుపమానంగా నిర్వహిస్తూనే ఉంటుంది అని.
నేలన రాలిన ఒక చిన్న బొగడపువ్వుని చేతుల్లోకి తీసుకుని, వాడిపోని దాని సుగంధాన్ని ఒక్కసారి ఆఘ్రాణించినా, బొగడచెట్టే లేకపోతే ఈ సృష్టి ఎంత అసంపూర్ణంగా ఉండి ఉండేదో మనకి చప్పున తెలుస్తుంది.లౌకిక ప్రయోజనాల్ని బట్టి చూసినప్పుడు ఎందుకూ పనిచెయ్యని ఒక బొగడపువ్వులాంటి వాణ్ణి నేను. కాని బొగడపువ్వు దానికదే ఒక ఆదర్శరాజ్యమనే సంగతి కూడా నాకు తెలియకపోలేదు.
Featured image: Temple of Apollo at Delphi, Greece
21-5-2024


” ముందు నన్ను నేను సంస్కరించుకోకుండా, నా మనస్సుని ఒక ఆదర్శ రాజ్యంగా మార్చుకోకుండా, బయట చెయ్యగలిగింది ఏమీ లేదన్నదే నా మెలకువ. అందుకని, నేను చెయ్యగలిగిందల్లా, ఎప్పటికప్పుడు ఒక డస్టరు తీసుకుని నల్లబల్ల తుడుచుకున్నట్టుగా, కవిత్వం చదువుకోవడం ద్వారా నా మనసుని నిర్మలం చేసుకోవడం లేదా ఒక నీటిరంగుల బొమ్మ గీసుకోవడం ద్వారా నన్ను నేను పరిశుభ్రం చేసుకోవడం. ”
– భద్రుడు గారు, అతి సాధారణంగా కనిపించే అసాధారణ వాక్యాలివి. నా ఉద్దేశం లో ఇలా అందరూ ఆలోచిస్తే చాలు ప్రపంచం దానంతట అదే ఆదర్శవంతంగా మారుతుంది.. గాజాల, ఉక్రెయిన్ల ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవు. మనల్ని మనం మార్చుకోగలిగితే చాలు , మన చుట్టూ వున్న సమాజం, ప్రపంచం కూడా మారి తీరతాయి.. చాలా ఆలోచింపచేసే ఈ వ్యాసాన్ని అందించినందుకు మీకు అనేక ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్
“ఈ ప్రపంచంలో బొగడచెట్టు సాధించగల పరమార్థం ఏముంటుంది? దాని పండ్లు తినడానికి పనికిరావు. ఆ కలప ఇళ్ళు కట్టుకోడానికో, ఫర్నిచరు తయారుచేసుకోడానికో పనికిరాదు. ఆ పూలు కూడా గొప్ప మాలలుగా గుచ్చడానికి పనికొచ్చేంత పెద్ద పూలేమీ కావు. కానీ ఈ ప్రపంచంలో బొగడచెట్టు తాను నిర్వహించే పాత్రని నిరుపమానంగా నిర్వహిస్తూనే ఉంటుంది అని.“
ఏమిటీ నా ఈ జీవితం వలన లాభం అన్న ఆలోచన ఎప్పటికప్పుడు తొలుస్తూ వుంటుంది. Thank you for making me understand my role in this universe! 😃
పొగడ చెట్టు ఉపమానం భలే నచ్చింది.
But you sir, are a super ⭐️ shining bright !! 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
A great self analysis. It reveals Ramana Maharshi ‘ who am I’ , Jiddu Krishna Murthi ‘ Eruka’, Viswanatha’Jeevuni Vedana’,SriSri’s Socialistic view, Tagore’s vison of almighty in Nature, Vivekananda’s power of knowledge, Arabindo’s divine life , and Many poets’ wish of Nature and Joy and so on so forth. But, a trial of self realisation and self rectification is it self a path of society Change. Seeing and showing Beaty of the world is the only way to mend society. Of course, LOVE is the only tool is the world . I pardon you , for my poor English.
Beautiful English and thanks a lot.
మీరెప్పుడూ మీ అంతర్మథనాన్ని వ్యక్తీకరించుకోవడానికి కథో, వ్యాసమో, కవితో..ఏదో ఒక మాధ్యమాన్ని ఎంచుకున్నారు. మీ సబ్ కాన్షస్ లో అనిపించని విషయాన్ని మీరు వ్యక్తీకరించలేదని అనిపిస్తుంది నాకు. సూఫీయిజం గురించిన మీ ప్రసంగాన్ని పూర్తిగా ఒకేసారి విన్నాను. మీ మనసు అత్యంత ఉన్నత స్థాయిని కోరుకుంది కాబట్టే సూఫీయిస్ట్ లా ఉంటారు. పెయింటింగ్ ఆ మార్గంలో ఉంచే మైలురాయి. ఆ స్థాయికి తగ్గకుండానే మీ వ్యాసాలు ఉంటున్నాయి.
ప్రజా జీవనం, ప్రపంచం మీకు అర్థమైనా, మీ మనసు అటు లేదు. వాటిని మీరు అవసరమైనంత వరకే తీసుకున్నారు.
ఇప్పుడు మీరున్న స్థితి ఎందుకు ఉత్తమోత్తమైనదంటే, మీరు చూస్తున్నదాన్ని, మీరు అనుభవిస్తున్నదాన్ని మాత్రమే మీరు పలవరిస్తున్నారు.
ఆ బాట పడితే ఎవరైనా మీలా ఆ Exalted state లో ఆనందడోలికల్లో ఉండవచ్చు. మీ రచనలు చదివేవారు వెళ్లేది ఆ అనంత ఆనంద ప్రవాహంలోకే.
వ్యక్తిగా ఎవరి సంస్కరణ, purgation వాళ్లు చేసుకోగలిగితే, సమాజం దానికదే ఉత్తమ స్థాయికి చేరుకుంటుంది. Of course, This too ans utopian statement!!
మీ సహృదయ స్పందనకు నమోవాకాలు.
This too an utopian statement!!
“కలాన్ని వదిలి హలాన్ని పట్టొచ్చుగా?” అని, అడగడం లేదు.
మీ జవాబు మరెందరి తరఫునో కూడా!
ఆదర్శ రాజ్యాలైనా, సిద్ధాంతాలైనా ఎందుకు విఫలమౌతున్నాయి? వాటిని అంతిమంగా ఆచరించే మనుషుల్లో సంస్కరణ లేకపోవడమే.
ధన్యవాదాలు సార్
🙏
మీరు వ్రాసిన ఈ పోస్ట్ లోని ప్రతీ వాక్యం సారాంశమూ, మీరు వ్రాయకున్నా నాకు తెలుసు. ప్రపంచంలో ఎవరికీ ఎవరూ ఏదీ చెప్పరు, అడ్వొకేట్ చెయ్యలేరు. చెయ్యలేరు. ఏదో ఇంపల్స్ తో, తోటి ప్రయాణికుడి జాగ్రత్త కోసం ఓ మాటగా ఎప్పుడో ఏదో చెబుతారు. అలానే ఈ పోస్ట్ వచ్చింది. నాబోటి వాడు రాసే ఈ ముక్కలూ సరిగ్గా అందుకే.
మీరు – మీకు సలహా ఇచ్చిన మిత్రురాలిని అన్ ఫ్రెండ్ చెయ్యండి. ఈ పోస్ట్ కన్నా అది ఎక్కువ ప్రయోజనకరం.
ఒక (పాలస్తీనా) పసిపిల్లవాడి నిర్జీవదేహం చూడ్డం చాలా ఘోరం. నిజమే. కానీ రాత్రి పడుకున్న (ఇజ్రాయెల్) పౌరులపై వందలాది క్షిపణులు వదిలి చంపడం ఘోరం కాదా?
ఇక్కడ ఎవరు సరి, ఎవరు కాదు అనేది ప్రశ్న కాదు. యుద్ధం తప్పు. దానిని ఎదుర్కోవాలంటే “నేను” యుద్ధానికి ఏ నయాపైసా కూడా ఉపయోగపడకూడదు. ఇది మీకు తెలుసు.
కానీ మీ మిత్రులలో చాలామందికి ఇవి అర్థం చేసుకునే మెచ్యూరిటీ, సెన్సిబిలిటీ లేవు. వారు ఒపీనియన్స్, “మంచి తనం”, “మోరల్స్”, “న్యాయాన్యాయాలు”, “ఫలానా సిద్ధాంతపు ఫ్రేంవర్క్” – ఈ చెత్త లో, మలంలో ఉన్నారు.
వారితో ఉన్నంతకాలం ఓటికుండలో బియ్యం తోడినట్టు – మీకు మీరు ఉపయోగపడరు. వారు మిమ్మల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాడుకుంటూనే ఉంటారు. మంచితనం నెపంతో, ముసుగుతో, బలహీనతతో ఇవన్నీ ప్రపంచానికి, మీ మనసుకూ సత్యాలుగా కనిపిస్తుంటాయి. మీరు మంచితనం అని భావించేది మీ బలహీనత.
ఒక బుద్ధుడు అమ్మ ఒడిని అంటుకుని పడుకున్న పసిబిడ్డ మొహన్ని చూడకుండా పక్కకు పోవటం క్రౌర్యం కాదు, అది ఒక ప్రోద్బలం. బలం. మీరు మీ మిత్రుల్ని వదలటం, మిమ్మల్ని మీరు శుభ్రపర్చుకోవటం. అది వారిపట్ల అపకారం కాదు. వారిపట్ల, మీ పట్ల ఉపకారం.
మీ అంతర్మథనం విలువ మీకు తెలుసా? నిజంగా అది తెలిస్తే, మీరు చెత్త పుస్తకాలకు, చెత్త రాతలకు , చెత్త మిత్రులకు ఏ కోశానా ఉపయోగపడరు. బొగడచెట్టు అది అవుతుంది.
చినవీరభద్రుడు అనే మనిషి – చినవీరభద్రుడు అనే కవిని బ్రతికించుకోవాలి.
(నాతో సహా) మీరు మీ మిత్రులను వదిలించుకోండి సార్, ప్లీజ్! 🙏
ధన్యవాదాలు రవి గారూ! మీరు ఈ వ్యాసం చదివినందుకూ, మీ సహృదయ స్పందనకూ.
ఆపకుండా చప్పట్లు. అరచేతిలో బొగడపూవు. అదర్శ సుగంధం. ఒక పాట ఉంది సర్. చుక్కల్లారా… దిక్కుల్లారా.. ఎక్కడమ్మా జాబిలి? అని. చెప్పడం అసాధ్యం. కానీ కన్ను చూడగలిగేది. నమో నమః
ధన్యవాదాలు మేడం
SIR—can u e mail me u r books list —hanamkonda@aol.com
===========
Reddy
ఈ బ్లాగులోనే రచనలు అన్న విభాగం కింద చూడండి.
సర్! నమస్తే. మీరు, మీ సాహిత్యం సమాజాన్ని, ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయలేదనడమే తప్పు. సమస్యలు ఎత్తిచూపడం కంటే సమస్యలు లేని సమాజాన్ని కలగనడం చూడగలను మీ సాహిత్యం లో. “సాహిత్య ప్రయోజనం ఏమిటి” అని మీరొక వ్యాసం లో మీ మిత్రురాలి ఆరోపణకు సమాధానం చేప్పేసారు అనుకుంటున్నాను. సుజాత కథలో మీరు చెప్పిందేమిటి? ప్రశ్నభూమి లో ఎత్తి చూపింది ప్రజా సమస్య కాదా? ఒక రచయిత అంతర్మదనం సామాజికం కాదా?
నా మాటలు నా అజ్ఙానానికి నిదర్శనం. మన్నించండి.
ధన్యవాదాలు జగదీశ్!
మన చుట్టూ ఉన్న సమాజం ప్రభావం మనపై ఖచ్చితంగా ఉంటుంది. బుద్ధుడు ” సంఘం శరణం గచ్చామి” అనలేదా? ఈ సంఘం మనకు ఎన్నో ఇస్తున్నప్పుడు, మనం కూడా చివరివరకూ చేస్తూ ఉండడమే! మీ ఉద్యోగ జీవితం ద్వారా ఎంతో మందికి మేలు చేసారు. దాన్ని మీవంటి ప్రతిభావంతులు కొనసాగించాలన్నదే మా అందరి కోరిక. మనల్ని మనం సంస్కరించుకుంటూనే, సమాజ సంస్కరణకు పూనుకోవడం సాధ్యమే! మీ వంటి సున్నిత హృదయులు, మేధావులు ఈ సమాజానికి ఎంతో అవసరం. ధన్యవాదములు💐🙏
ధన్యవాదాలు మేడం
సామాజిక పరిస్థితులపై విపులమైన విశ్లేషణతో, లోతైన అంతర్మథనంతో మీరు చెప్పే ఎన్నో విషయాలు పాఠకుల్లో చాలా మెల్లగా వచ్చే, చిరకాలం నిలిచే మార్పుకి కారణమౌతాయి.
ప్రవహించే నీరు ఎంతో మృదువుగా గరుకు రాళ్లని నునుపు చేస్తుంది. సమాజంలో అవసరమైన మార్పు కోసం నక్సలైట్లు ఎన్నుకునే దారి వేరు. సుమతీ శతక కారుడు, ప్రేమ్ చంద్, బుద్ధుడు , గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ ఇలా ఎందరో- వేర్వేరు దారులెన్నుకున్నారు, వారి వారి సామర్థ్యానుసారం, ప్రతిభని బట్టి , విశ్లేషణని బట్టి.
మీరేం చేస్తున్నారో అది చాలా గొప్పగా చేస్తున్నారని నేననుకుంటున్నాను.
ధన్యవాదాలు మేడం!
ఇప్పటికే చుట్టు పక్క ల వున్న ఆదర్శ వాదులతో, సంస్కరణ ప్రియులతో విసిగి వేసారి పోయిన మాకు మీ వ్యాసాలు ఒక ఓదార్పు, నా మట్టుకు నేను మీ వ్యాసాలకి, మీ ప్రయాణ డైరీ లకి అభిమానిని, నిత్య జీవితం లో దొరకని ఏదో ఒక వొదార్పు , ఒక ధైర్యం, ఒక స్వాంతన, మీరు రాయబట్టి చెప్పబట్టి నేను ఒక శ్రీరంగనాధుని దర్శనానికి, ఒక కీలపట్ల వెంకట నాధుని చెంతకు వెళ్ళా, ఒక భగవాన్ వెంకయ్య స్వామిని చదివా, మీరు దర్శించిన ఆ వైభవాన్ని, చైతన్యాన్ని, నేను మానసికం గా అనుభూతి చెందా, లోకం కోసం పనిచేసేవాళ్ళు కోకొల్లలు, నమ్మకంగా చెబుతున్నా మీదారి అది కానేకాదు ,నిజంగా నన్ను నమ్మండి , మీదారి సాహిత్యమే, అదికూడా చుట్టు పక్కల ఆర్తనాదాలు వినక ఎక్కడో గాజా లో , సీరియా కాదు
ధన్యవాదాలు సార్!
అద్భుతమైన స్పష్టత ఆఖరి రెండు పేరాల్లో నాకు కనపడింది
ధన్యవాదాలు సార్