
మొన్న బుక్ ఫెయిర్ కి వెళ్ళినప్పుడు ఒక పుస్తకాల షాపు దగ్గర నిలబడి పుస్తకాలు చూస్తూ ఉంటే ఒక చిన్నపిల్ల పలకరించింది. ‘సార్, మీరు మా స్కూలు పండక్కి వచ్చారు కదా’ అనడిగింది. నిజమే. నేను వాళ్ళ స్కూలు యానివెర్సిరీకి వెళ్ళాను. అక్కడ ఆ పిల్లలు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో ఆ అమ్మాయిని పలకరించాను. బహుశా ఒక నిమిషం పాటు మాట్లాడి ఉంటాను. లేగదూడ తల్లిని గుర్తుపట్టినట్టు ఇప్పుడు ఆ బిడ్డ అంత జనసమ్మర్దంలో నన్నెట్లా గుర్తుపట్టిందా అని ఆశ్చర్యపోయాను.
ప్రతి మాఘమాసంలోనూ
నన్ను మంకెనలు పలకరిస్తాయి
సూర్యుడికి ధూపం చల్లినట్టు
విరబూసిన మామిడిపూత మధ్య
సూర్యస్తోత్రాలు పఠించడం
మొదలుపెడతాను.
ప్రతి దినాంతసంధ్యవేళా
మరీ ముఖ్యంగా
ఒక మాఘమాసపుగాలి
నా ప్రాణాలు తోడేస్తుంది.
కాని ఈ మాఘమాసం
నన్ను తల్లకిందులు చేస్తున్నది
పువ్వులు కాదు
పిల్లలు.
ఏ పిల్లవాడి గురించి విన్నా
ఏ పిల్ల పలకరించినా
కన్నీళ్ళు పొంగుకొస్తున్నవి.
బతకవలసింది వాళ్ళు.
జీవనఫలాన్ని ఇంకా మునిపంట కూడా
కొరికిచూడని
ఆ పిల్లలు
క్లేశరహితంగా
ఉండాలన్న కోరిక ఒక్కటే
నన్ను బతికిస్తున్నది.
21-2-2024


అకారణంగా మీరు గుర్తొస్తారు
ఇన్నాళ్లు నాకు సంధ్యవేళలు
పువ్వులు, వెన్నెల, కొండలు, పొలాలు
ఇలానే ఉండేవి మనసులో, వాటితో పాటు మీరు కూడా ఇప్పుడు, వాటన్నింటికన్నా ఎక్కవ మీరు నాకు.
ధన్యవాదాలు
వావ్..ఎంత బాగుందో..
ధన్యవాదాలు
ఎందరి మనసుల్లోనో బలంగా, కానీ అమూర్తంగా ఉన్న భావాన్ని, మనసుకి హత్తుకునేట్టుగా చెప్పారు. గొప్ప కవుల ప్రతిభా లక్షణం ఇదేనేమో!
అందుకే గొప్ప కవిత్వం అనేటటువంటిది చదివినప్పుడు మనం అందులో అంతగా మమేకం అవుతావేమో!
మాఘ మాసమూ, మంకెన పూలూ, మామిడి పూతా ఇప్పుడు కొత్త ఆకాంక్షలకు ప్రతీకలు.
ధన్యవాదాలు సార్
సందర్భోచిత సమాహ్లాద కవిత.సారే జహాఁ సె అచ్ఛా హిందుస్థాన్ హమారా గీతం పిల్లలు పాడుతుంటే వింటున్నట్లుగా చెవిలో నిశ్శబ్ద స్వర సంచారం అనుభూతింపచేసారు. ఇపుడర్థమౌతున్నది కవిత్వం పలుకరింపు ఎలా ఇంపుగా ఉండాలో. నమస్సులు.నీటిరంగుల చిత్రాలు నిర్మల నీహారాలు.
ధన్యవాదాలు సార్
మాఘ శుక్లపక్ష ప్రభాత మందవీచి
మేనుకు స్పర్శ నిడినట్లు మెల్లమెల్ల
గా……….చాలా బావుంది
ధన్యవాదాలు సార్
చాలా బాగుంది సార్ కవిత
ధన్యవాదాలు సార్
మంకెనలు.. కవితా చిత్రాలు
ధన్యవాదాలు సార్
baavundi kavita.. bhavaalu
ధన్యవాదాలు
సహజ ప్రకృతి భావుకచక్రవర్తి. కవిత్వంలో నైనా చిత్రంలో నైనా మనసుమల్లెలుపరిచినపందిరివలెకనిపిస్తుంది.హృదయపూరవకనమస్కారములు.
అవును సార్