
కవిత్వం అనువదిస్తే అన్నిటికన్నా ముందు నష్టపోయేది సంగీతమనే నా అభిప్రాయం. ఏ భాషలోనైనా ఆ భాషకుండే సహజసంగీతాన్ని ఎంత ప్రయత్నించీ మరొక భాషలోకి తేలేము. అందుకనే టాగోర్ బెంగాలీలో గీతాలుగా రాసుకున్న తన కవితల్ని ఇంగ్లిషులోకి అనువదించినప్పుడు వచన కవితలుగా మార్చుకున్నాడు. తన కవితలే కాదు, క్షితింద్రమోహన్ సేన్ సంకలనం చేసిన కబీరు గీతాల్ని ఇంగ్లిషు చేసినప్పుడు కూడా ఆయన వాటిని వచనకవితలుగానే అనువదించాడు.
కబీర్ ని నేను తెలుగు చెయ్యాలనుకున్నప్పుడు కూడా టాగోర్ మార్గాన్నే అనుసరించాను. ఎందుకంటే మహిమోపేతమైన ఆ గీతాల్లోని మాధుర్యాన్ని తెలుగులోకి తేవడం కష్టమనే అనుకున్నాను. ఆ హలంత భాష, ఆ అంత్యప్రాసలు- స్వభావరీత్యా తెలుగు అజంతభాష కాబట్టీ, అంత్యప్రాస కన్నా, ద్వితీయాక్షర ప్రాసనే తెలుగులో శోభిస్తుంది కాబట్టీ, ఆ గీతాల్ని తెలుగు చెయ్యగానే వాటిలోని rough rhetoric ని నష్టపోతామని అనిపించింది.
ప్రయత్నిస్తే ఆ దోహాల్ని తెలుగు దేశిఛందస్సుల్లోకి తేవచ్చు. ఉదాహరణకి-
జాతి న పూఛో సాధు కీ, పూఛ్ లీజియే గ్యాన్
మోల్ కరో తలవార్ కీ, పఢా రహన్ దో మ్యాన్
అనే దోహాని ఇలా ద్విపదగా మార్చవచ్చు.
అడగకుమెన్నడు జ్ఞానిని జాతి
అడుగుట నేర్వుము జ్ఞానము, నీతి
బేరమాడిన ఫలమేటికి పిడిని
కొనుటకు తగినది ఖడ్గమె గాని
కాని రెండు పంక్తుల దోహా, రెండు ద్విపదలుగా మారడమే కాక, మూలంలోలేని గమకాలు కొన్ని అనువాదంలోకి వచ్చి కూచున్నాయి. అందుకని నేను దీన్ని ఇలా తెలుగు చేసాను:
సాధువు కనిపిస్తే జాతి అడక్కు, జ్ఞానం అడుగు.
బేరమాడవలసింది పిడిని కాదు, కత్తిని.
ఇందులో సంగీతాన్ని నష్టపోయినప్పటికీ, immediacy ని సాధించాను కదా అని తృప్తి పడ్డాను. పెద్దలు రాధాకృష్ణమూర్తిగారు ఈ పుస్తకం మీద రాసినప్పుడు, ఈ వాక్యాన్ని మరీ ప్రత్యేకంగా ఎత్తి చూపారు.
సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నేళ్ళ నా అభిప్రాయాన్ని పరాస్తం చేసేసారు సుష్మ. కబీర్ దోహాలకి నా వచన అనువాదాల్ని ఆమె ట్యూన్ చేసి నాకు పంపించినప్పుడు నన్ను సంభ్రమం ముంచెత్తింది. ఎలా అయితే, అనువాదాన్ని దాటి కూడా కవిత్వం ప్రవహించగలదో, అనువాదాన్ని దాటి సంగీతం కూడా ప్రవహించగలదని ఇప్పుడు నాకు అర్థమయింది. సాధారణమైన పొడి పొడి మాటల్లో, నేను కూడా వినలేని, ఒక సంగీతాన్ని ఆమె వినగలగడం నన్ను చకితుణ్ణి చేసింది. కబీరు చెప్తున్న అనాహతనాదమేదో, భాషల పరిమితుల్నీ, ఛందస్సుల కట్టుబాట్లనీ దాటి హృదయం నుంచి హృదయానికి నేరుగా ప్రవహిస్తున్నదనిపించింది.
వినండి.
ఈ గానం వినగానే నాకు చాలా ఏళ్ళ కిందట తిరువాచకాన్ని ఎవరో గానం చెయ్యగా నేను విన్నది గుర్తొచ్చింది. సాధుక్కడి అంటే సాధువులు ఎక్కడున్నా వారి మాటలు ఒకరికొకరికి అర్థం కావటమే కాదు, వాళ్ళ సంగీతం కూడా ఒక్కలాంటిదే అని ఇప్పుడు అర్థమయింది.
సుష్మ నిట్టల వరల్డ్ స్పేస్ తెలుగు కార్యక్రమాల నిర్వహణలో మృణాళిని గారితో కలిసి పనిచేసేటప్పుడు పరిచయం నాకు. పదిహేనేళ్ళ కిందటి మాట. కాని నేనడక్కుండానే కబీరును ఇలా స్వరపరిచి నాకు పంపినందుకు ఆమెకు ఎంతయినా ఋణగ్రస్తుణ్ణి.
సుష్మ, సౌమ్య సోదరీమణులిద్దరూ సాపాసా వెబ్ సిరీస్ నడుపుతున్నారు. వినాలనుకున్నవారు యూట్యూబ్ లో చూడవచ్చు.
2-10-2023


కట్టలు తెగిన అభిమానం. హృదయ పూర్వక అభినందనలు ఇరువురికి.
ధన్యవాదాలు సార్
మీ
మీ కబీరు వచన కవితలకు అమృత గానం తోడయ్యింది.
ధన్యవాదాలు సోమశేఖర్!
నన్ను ఏడిపించైనా సరే, ఒక మనిషిగా మారుస్తున్నది కేవలమంటే కేవలం మీ మాటలే, మీ కవిత్వమే,
ఇది అసందర్భం అయినా పర్వాలేదు
మీ చరణాలను ముద్దాడుతూ మీకు నా ప్రేమలు 💐
నీకు నా ఆశీస్సులు సోమ భూపాల్!