వానకి తడుస్తున్న చెట్లు

నీటిరంగుల చిత్రకారుడు
రంగుల్ని పళ్ళెంలో కాకుండా
కాగితం మీద కలిపాడు.

తన మనసులో కనిపిస్తున్న ఆకృతుల్ని
కాగితం మీదకి తీసుకురమ్మని
రంగుల్నీ, నీళ్ళనీ
ప్రాధేయపడ్డాడు.

ఎన్నాళ్ళుగానో, ఎన్నేళ్ళుగానో
గడ్డకట్టిన తాపమంతా
కరగడం మొదలుపెట్టింది.

కాగితం మీద నీళ్ళు
పరుచుకోడం మొదలుపెట్టగానే
పైన విస్తరించిన వెలుగుని
ఆకాశం అనుకున్నాడు.
దానికింద పరుచుకున్న నీడలు
కొండలూ, కాలువలూ అనుకున్నాడు.

ఆ మధ్యలో అక్కడక్కడ
రంగు ముద్దగా పడి
నిలిచిపోయిన తావుల్ని కొంతసేపు
తదేకంగా చూసాడు.

చీకటీ, వెలుగూ
అల్లుకున్న ఆ తావుల్లో
వానకి తడుస్తున్న చెట్లని
గుర్తుపట్టాడు.

బొమ్మ పూర్తయ్యింది.

27-7-2023

26 Replies to “వానకి తడుస్తున్న చెట్లు”

  1. నేనూ చెట్టునయ్యాను చదువుతూ చూస్తూ

  2. చూస్తున్న కళ్లు కూడా తడిసి పోతున్నాయి…
    మనసులో మెచ్చుకోలు వర్షం!

  3. వానకి తడుస్తున్న చెట్ల మొదలు లో మనసు జారవిడుచుకున్నాను..
    చాలా బాగుందండి

  4. అంతరంగ చిత్రలేఖన వర్ణన బావుంది సర్!

  5. రంగుల హొరంగు
    కవిత పసందు
    భావాలు వర్ణాలౌతూ

  6. మనస్సుకు హత్తుకున్న కవిత.. జీవం ఉట్టిపడే రంగుల చిత్రాలు.

  7. మీ నిశిత పరిశీలనా శక్తి కి ,చిత్ర కళా నైపుణ్యానికి
    సోదాహరణంగా ఉన్నాయి మీ కవితలు,గీసిన చిత్రాలు. ఆ పెంకుటిల్లు ,బయట నున్న నిట్టాడు గుంజ .ఎంతో సహజంగా ఉన్నాయి.

  8. చిత్రం ,కవిత, వాన, మీ భావుకత మిళితమైపోయింది. చిత్రం కవిత్వం అయ్యిందా లేదా కవిత్వం చిత్రమయ్యిందా మీరే చెప్పాలి

  9. పదాలు బొమ్మను చిత్రించినట్లు
    బొమ్మే కవిత్వం చెప్పినట్లు
    కవి చిత్రకారునిగా
    లిఖించిన చిత్రకావ్యంలో
    చిత్రకారుడు కవిగా
    రచించిన కావ్యచిత్రంలో
    వానలో తడుస్తున్న ఆ చెట్లని గుర్తుపట్టిన
    ఆ క్షణం సంపూర్ణం!! 🙇🏻‍♀️
    It’s complete!!
    🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading