మేఘాన్ని చూడగానే భారతీయ కవికి ఏకకాలంలో ప్రేమా, దుఃఖమూ రెండూ కలుగుతాయి. వసంతాన్ని చూసినప్పుడు కలిగే భావనలు ప్రణయోద్దీపభావనలే తప్ప వాటిలో విషాదఛాయలుండవు. కానీ ఆషాఢమేఘం ఏకకాలంలో కవికి ఈ ప్రపంచం పట్ల అలవిమాలిన ప్రేమా, దీన్నుంచి తొలగిపోతున్నాననో, తొలగిపోవాలనో ఏదో ఒక గాఢనిర్వేదమూ, ఒక్కసారే ఆవహిస్తాయి.
