రెండు నిస్సహాయత్వాల గురించిన వర్ణన

క్లారిస్ లిస్పెక్టర్ పేరు మొదటిసారి పదేళ్ళ కిందట విన్నాను. కార్లోస్ ఫ్యుయెంటిస్ సంకలనం చేసిన The Vintage Book of Latin American Stories (1998) లో ఆమె కథ love చదివాను. చదవగానే ఎంత ముగ్ధుణ్ణైపోయానంటే, ఆ కథ నాకోసం నేను, పూర్తిగా తెలుగులోకి తిరిగి రాసుకున్నాను. ఆ ఒక్క కథతోటే ఆమె నాకు మొత్తం అర్థమయిపోయినట్టు అనిపించింది. ముఖ్యం ఆ కథనం. అంత శాంతంగా, స్తిమితంగా తన అంతరంగాన్ని తాను చీల్చి చెండాడుకోగల రచయితలు చాలా అరుదు.

ఆమె అంతరంగాన్ని నేను గ్రహించగలిగాను అనడం కొంత సాహసమే. ఎందుకంటే, ఆమె రాసిన ఒక కథ The Smallest Woman in the World సుప్రసిద్ధం. ఆ కథకి కనీసం ఇప్పటిదాకా మూడు ఇంగ్లిషు అనువాదాలు వచ్చాయి. నేను చదివింది, మరొక సుప్రసిద్ధ కవయిత్రి, ఎలిజెబెత్ బిషప్ అనువాదం. ఆ కథలో ఒక ఫ్రెంచి పరిశోధకుడు కాంగో అడవుల్లో ఒక చెట్టుమీద అతి చిన్న మహిళను చూస్తాడు. ఆమె ఎత్తు పదిహేడు పద్ధెనిమిది అంగుళాలు మించి ఉండదు. ఆ కథలో ఆ మహిళ ఆ పరిశోధకుడికి కైవసం కావడానికి ఇష్టపడదు. ఆ కథని ఒక మెటఫర్ గా సంభావిస్తూ, ఆమె జీవితచరిత్రకారుడు బెంజమిన్ మోసర్ ఏమంటాడంటే ఆ పిగ్మీ మహిళలానే లిస్పె క్టర్ కూడా తన పరిశోధకులకు కైవసం కావడాన్ని ఇచ్చగించదు అని.

క్లారిస్ లిస్పెక్టర్ (1920-1977) పోర్చుగీసులో రాసిన బ్రెజీలియన్ రచయిత్రి. యుక్రెయిన్ లో పుట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆమె తల్లిదండ్రులు మొదట్లో రొమేనియాకి, అక్కణ్ణుంచి ఎలాగో బ్రెజిల్ కి వలస వచ్చారు. వాళ్ళు బ్రెజిల్ లో అడుగుపెట్టినప్పుడు ఈశాన్యప్రాంతంలో దిగి నెమ్మదిగా కాలక్రమంలో రియో-డి-జెనిరో చేరుకున్నారు. ఆ తొలిరోజుల కాందిశీక జీవితం, బ్రెజిల్ లోతట్టు ప్రాంతాల్లో గడిపిన జ్ఞాపకాలు ఆమె అంతరంగంలో నిగూఢంగా గూడుకట్టుకున్నాయి. తర్వాత రోజుల్లో ఆమె ఒక రాయబారిని పెళ్ళి చేసుకుని దాదాపు ఇరవయ్యేళ్ళ పాటు బ్రెజిల్ కి బయటే గడిపింది. తన ఇరవై మూడవ ఏట Near to the Wild Heart అనే నవల రాసింది. ఆ నవలకి అవశ్యం జాతీయ ప్రకాస్తి లభించింది. ఆ తర్వాత ఇక ఆమె వెనుతిరిగి చూడలేదు.

లిస్పెక్టర్ ని మనం ఇంగ్లిషులోనే చదవగలం కాబట్టి ఆమె పోర్చుగీసు వచనంలోని విలక్షణత్వం, ఆమె పాఠకులూ, విమర్శకులూ కూడా ఒక్కలానే, సమస్యగా భావించిన ఆ వచనం ఎలా ఉంటుందో మనకి తెలిసే అవకాశం లేదు. ఆమె వాక్యనిర్మాణంలోని విలక్షణత, పంచువేషన్ లోని వైచిత్రి కూడా మనం పోల్చుకోలేం. బహుశా బెంజమిన్ మోసర్ అన్నట్టు ఆమెని పోర్చుగీసులో చదవడం కష్టం, అనువాదాల్లో చదవడం సులభం అయి ఉండవచ్చు. ఇక, ఇరవయ్యవ శతాబ్ది మధ్యలో మొదలై లాటిన్ అమెరికన్ సాహిత్యమంతా విస్తరించి తదనంతరం ప్రపంచమంతా వ్యాపించిన మాజికల్ రియలిస్టు సాహిత్యంలో ఆమె రచనల్ని కూడా ఒక భాగంగా ఎంచుతారు కాని, నా వరకూ నాకు, ఆమెని పూర్తి మాజికల్ రియలిస్టు రచయిత్రిగా కూడా పరిగణించలేను.

ఇన్నాళ్లుగా ఆమె సాహిత్యం మొత్తం చదవాలని అనుకుంటూనే ఉన్నాను. అందుకోసం ఎప్పుడో కొనుక్కున్న Hour of Star (1977, 2014) ఇన్నాళ్ళకు చదవగలిగాను. ఇది ఆమె చివరి నవల. ఆమె సాహిత్యంలో అత్యున్నత రచనగా కూడా పరిగణన పొందింది. పట్టుమని వంద పేజీలు కూడా లేని ఈ నవలను, బహుశా నవలిక అని కూడా కాదు, పెద్ద కథ అనవచ్చు. కాని ఇందులో ఒక సంఘటన కాదు, ఒక జీవితం, ఒక్క జీవితం కూడా కాదు, ఒక జీవితం నెపం మీద ఒక సమాజం మొత్తం కనిపిస్తుంది కాబట్టి, ఇతిహాసం అని కూడా అనవచ్చు. ఇది ప్రధానంగా నిస్సహాయత్వం గురించిన రచన. ఒక నిస్సహాయత్వం కాదు, రెండు నిస్సహాయత్వాల గురించిన వర్ణన. ఒకటి, కథలో సూత్రపాత్ర మకాబియో అనే నిరుపేద టైపిస్టు జీవితం, మరణాల చిత్రణ. మరొకటి ఆమె జీవిత కథని చెప్పడానికి తనకు మాటలు రావడం లేదనీ, చాతకావడంలేదనీ, ఎంత ప్రయత్నించినా తాను చెప్పవలసినట్టుగా ఆ కథ చెప్పలేకపోతున్నాననీ, ఆ నవలలో కథకుడు పదే పదే ప్రకటించే నిస్సహాయత్వం.

ఈ నవలకు మలిమాట రాసిన ఆమె జీవితచరిత్రకారుడు బెంజమిన్ మోసర్ ఇలా రాస్తున్నాడు:

‘.. .తదనంతర కాలంలో క్లారిస్ లిస్పెక్టర్ సముపార్జించుకున్న ఖ్యాతి, విదేశీ పాఠకుల్లో ఆమె సంపాదించుకున్న శాశ్వత జనాదరణ ప్రధానంగా ఈ చిన్న పుస్తకం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇందులో ఆమె తన రచనల్లోని ఎన్నో పాయల్ని, పోగుల్ని ఒక్కచోటకు తెచ్చి అల్లింది. తన విస్పష్ట యూదు వారసత్వం, స్పష్టంగా కనిపించే బ్రెజీలియన్ స్వభావం, ఈశాన్యప్రాంతంలో గడిచిన తన బాల్యం, రియో డి జనిరో లో గడిపిన నడివయస్సు; ‘ సాంఘికం ‘, నైరూప్యం; విషాదం, హాస్యం మొదలైనవాటిని తన మతావేశంతోనూ, భాషాప్రయోగాలతోనూ మేళవించి తన కథన స్రవంతిలో ముంచి తేల్చి మనకి అందించింది. రచయిత్రి ‘దుస్సహమైన ప్రతిభాపాటవాల ‘ కు The Hour of Star పూర్తి దృష్టాంతంగా నిలబడే మహానిర్మాణం.’

ఇందులో ఇతివృత్తం ముందే చెప్పినట్టుగా, రియో డి జనిరో మహానగరంలో అతి తక్కువ వేతనానికి పనిచెయ్యవలసి వచ్చిన ఒక బీద యువతి జీవితం. ఇటువంటి ఒక ఇతివృత్తం మీద పందొమ్మిదో శతాబ్దంలో ఓ హెన్రీ కూడా అద్భుతమైన ఒక కథ రాయకపోలేదు. కాని లిస్పెక్టర్ ఈ కథలో చెప్పడానికి ప్రయత్నించింది కేవలం ఆర్థిక విషాదం మాత్రమే కాదు. ఈ కథలో ఇతివృత్తాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే loss of innocence అనవచ్చు. ఇందులో రచయిత్రి జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయని తర్వాతి రోజుల్లో విమర్శకులు గుర్తుపట్టారు. అంతమాత్రాన దీన్ని ఆత్మకథనాత్మకం అనుకోవద్దని కూడా హెచ్చరించారు. జీవిత చిత్రణలో ఇది ఆత్మకథనాత్మకం కాకపోవచ్చుగాని, జీవితసారాంశ చిత్రణలో మాత్రం, అవును, నిస్సందేహంగా. ఎందుకంటే, రచయిత్రి, ఒక నిరుపేద టైపిస్టు జీవితం అనే నెపం మీద, తన విహ్వలత్వాన్నే మన ముందు విప్పిపరిచిందని చెప్పవచ్చు.

ఈ నవల్లో రెండు బ్రెజిళ్ళు ఉన్నాయని ఈ పుస్తకానికి ముందుమాట రాసిన Colm Toibin అనే రచయిత అన్నాడు. ఈ నవల ‘పేదరికం మీద రాసిన నవలే గాని పేదనవల కాదు’ అని మరొక విమర్శకుడు కూడా అన్నాడట. ఈ నవల్లో మనల్ని ఆకట్టుకునేది, రచయిత్రి తాను చెప్పాలనుకున్నది చెప్పడానికి వెతుక్కున్న మాటలు, ఇంకా చెప్పాలంటే ఆ శిల్పం. అందుకనే ఎలిజబెత్ బిషప్ ఒక ఉత్తరంలో లిస్పె క్టర్ ని ఆదిమచిత్రకారుడితో పోల్చకుండా ఉండలేకపోయింది.

ఈ నవల చదువుతున్నప్పుడు, ఇటీవల బుకర్ బహుమానం పొందిన గీతాంజలి శ్రీ రాసిన The Tomb of Sand గుర్తొస్తూ ఉంది. గీతాంజలి కథాశిల్పానికి ఈ నవలనే స్ఫూర్తి అయి ఉండవచ్చునేమో అనిపించింది ( కాని గీతాంజలి తన నవల్లో ఎందరి పేర్లో ప్రస్తావించింది కాని ఈమె పేరు ఎక్కడా రాయలేదు.) ఈ రెండు నవలలూ చదివినతర్వాత తెలుగులో రావిశాస్త్రి కథనశిల్పం ఇటువంటిదే కదా అని కూడా అనిపించింది. ఇంగ్లిషులోకి అనువాదమయిఉంటే బహుశా ‘రత్తాలు-రాంబాబు’ నవల గురించి కూడా ఇలానే మాట్లాడుకుని ఉండేవారు కదా అనిపించింది. అలాగని రావిశాస్త్రి, క్లారిస్ లిస్పెక్టర్ ఒక్కలాంటి రచయితలని కాదు. తన రచనా ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా తనని తాను అదుపు చేసుకోగలగడం లిస్పెక్టర్ కి తెలుసు. రావిశాస్త్రి, గీతాంజలి శ్రీలలో ఆ స్వీయనియంత్రణ కనరాదు.

ఈ పుస్తకం మీరు చదవకుండా, ఇలా నేను ఎంత చెప్పినా, ఆమె గురించి మీకై మీరు ఒక అభిప్రాయానికి రావడం కష్టం. అయితే పుస్తకం మొత్తం అనువదించలేను కాబట్టి, ఆమె వాక్యనిర్మాణం, ఆమె భావనాప్రపంచపు లోతు ఎలా ఉన్నాయో తెలపడానికి, ఆమె రాసిన అంకితవాక్యాలు తెలుగు చేస్తున్నాను.

రచయిత్రి రాసిన అంకిత వాక్యాలు

కాబట్టి ఈ రచనని నేను మా షూమాన్ కి, ఆయన ప్రియమైన లారాకీ అంకితం చేస్తున్నాను. కాని అయ్యో, వాళ్ళిద్దరూ ఇప్పుడు అస్థిగత అవశేషాలు మాత్రమే. నా పురుషుడి నెత్తురు అతడు వయసులో ఉన్నప్పుడు జపాపుష్ప సన్నిభంగా ఉంది కాబట్టి, ఆ నా రక్తంలో రక్తానికి అంకితం చేస్తున్నాను. అందరికన్నా ముఖ్యంగా ఈ పుస్తకాన్ని నా జీవితమంతా ఆక్రమించిన పిశాచాలకీ, గంధర్వులకీ, అప్సరసలకీ, యక్షులకీ అంకితమిస్తున్నాను. నా పూర్వాశ్రమ జీవితంలోని పేదరికానికి, దాని గాంభీర్యానికి, ఒక చిన్న ప్లేటు నాకిష్టమైన మాంసం కూర తినడానికి కూడా నోచుకోకుండా చేసిన ఆ లేమికలిమికి అంకితమిస్తున్నాను. దీన్ని బీథోవెన్ సృష్టించిన తుపానుకి అంకితమిస్తున్నాను. నన్ను మూర్ఛిల్లచేసే చోపే కి అంకితమిస్తున్నాను. నన్ను భయోద్రేకానికి గురిచేసి తనతో పాటు మంటల్లో విహరింపచేసిన స్ట్రావిన్ స్కీ కి అంకితమిస్తున్నాను. రిచర్డ్ స్ట్రాస్ కి, తన కృతి ‘మృత్యువూ, రూపాంతరం’ లో నా విధిపర్యవసానాన్ని నాకు తెలియచేసినందుకా? మొత్తం మీద దీన్ని నేటి నా నిన్నలకి, నేటికి, డిబస్సీ ఆవిష్కరించిన పారదర్శకపు పొరకీ, మార్లోస్ నోబర్ కీ, కారల్ ఆర్ఫ్ కీ, షోహెన్ బర్గ్ కీ, పన్నెండు శ్రుతుల సంగీతస్రష్టలకీ, ఎలక్ట్రానిక్ తరాల కఠోర, కర్కశ ధ్వనులకీ- నాతో పాటు నా లోపల్లోపల ఊహించలేనంత అగాధాలకి పయనించినవారందరికీ, నా కాలపు ప్రవక్తలు, ఈ క్షణాన నేను నేనుగా విస్ఫోటనం చెందకముందే నా గురించి నన్ను ముందే హెచ్చరించినవారికి, మీకందరికీ కూడా, ఎందుకంటే మీరు లేకుండా నేను నేనుగా ఉండలేనుకాబట్టి, నన్ను నేను కనుగొనడానికి ఇతరులు కావాలి కాబట్టి, అయ్యో, నేనెంత మూర్ఖురాల్ని, దారితప్పుతున్నాను, కాని మీరు మాత్రం ఏం చెయ్యగలరు, మీ ధ్యానంలో మీరు ప్రయాణించగలిగినంత దూరం ప్రయాణించి చివరికి ఆ పూర్ణశూన్యంలో పడిపోవడం తప్పించి. ధ్యానమంటే ఏదో చివరికి దక్కే ఫలితమని కాదు, ధ్యానం దానికదే ఒక సంపూర్ణ గమ్యం కావచ్చు. నేను పదరహితంగా, శూన్యాన్ని ధ్యానిస్తూంటాను. నా జీవితాన్ని కూల్చేసేది నా సాహిత్యమే.

మరోమాట, అణువు ఎలా ఉంటుందో మనం చూడలేం, కాని మనకు తెలుసు. నేను చూడని ఎన్నో విషయాల గురించి నాకు తెలుసు. అలాగే మీక్కూడా. అత్యంత సత్యాస్తిత్వం గురించి మీరు ఋజువులు చూపలేరు, మీరు చెయ్యగలిగిందల్లా దాన్ని విశ్వసించడమే. నమ్మడం, ఆపైన, ఏడవడం.

ఈ కథ ఒక అత్యవసర పరిస్థితిలో, ఒక పౌర ఉపద్రవం మధ్య సంభవించే కథ. దీనికింకా జవాబు దొరకలేదు కాబట్టి ఇది అసంపూర్తి రచననే. ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు దీనికి జవాబు చెప్తారేమోనని ఎదురు చూస్తున్నాను. అది మీరేనా? ఇది టెక్నికలర్ లో చిత్రించిన కథ. ఎందుకంటే ఈ పాటి హంగూ, ఆర్భాటం, దేవుడి దయవల్ల, నాక్కూడా కావాలిగా. మనందరికీ శుభమగుగాక.

26-6-2022

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%