ప్రతిమా విసర్జనం

Protima visarjan by Gaganendra Nath Tagore

కొన్ని చిత్రలేఖనాలు మనం చూస్తూ వెళ్ళిపోగలం. కానీ కొన్నింటిని దాటుకు వెళ్ళిపోలేం. అక్కడ ఆగిపోతాం. వెనక్కి వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని తపిస్తూనే ఉంటాం. ఒకసారి వెళ్ళామా అక్కడే తచ్చాడుతూ ఉండిపోతాం.
 
గగనేంద్ర నాథ్ టాగోర్ చిత్రించిన ప్రకృతి దృశ్యాలన్నీ అట్లాంటి చిత్రలేఖనాలే గానీ, ‘ప్రతిమా విసర్జన్ ‘అనే చిత్రలేఖనం మాత్రం మామూలు బొమ్మ కాదు. చూడండి, ఆ బొమ్మని చూస్తూ ఉంటే, మీరు మీకు తెలీకుండానే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ వెలుగు, ఆ ఊరేగింపు, ఆ తాళాలు, ఆ తప్పట్లు, ఆ జనసందోహం- అది మీరు మర్చిపోయిన మీ ప్రాచీనలోకంలోకి తీసుకుపోయే బొమ్మ.
 
ఆ దీపాలు, ఆ కాగడాలు, ఆ ప్రభలు, ఆ పూనకం- అది మీరు వదిలిపెట్టి వచ్చేసిన ఏ పురాతన గ్రామానికో, మీరు మర్చిపోయిన ఏ ఆత్మీయ బాంధవ్యాలకో చెందిన దృశ్యం.
 
ఉహు. నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. అది ఒకప్పటి మనం దాటి వచ్చిన లోకం కాదు. ఇప్పటికీ మన అంతరంగంలో మనం ఎత్తిపట్టుకుంటున్న, దాచిపెట్టుకుంటున్న కోలాహలమే. ఆ జెండాలు, ఆ గవాక్షాలు, నీడల్ని పారదోలేసే ఆ కాంతి పుంజాలు- వాటిని చూడగానే మనం తక్షణమే మేల్కొంటాం. ఆ ఊరేగింపు మన వీథిలోకి వస్తే మనమింకా ఎట్లా మన ఇంట్లో లోపలిగదుల్లోనే ఉండిపోలేకుండా ఒక్క ఉదుటున బయటికి వచ్చేస్తామో అట్లానే ఆ దృశ్యాన్ని చూడగానే మన మనస్సు మనలో ఇంకెంత మాత్రం అణగి ఉండలేనని బయటికి వచ్చేస్తుంది.
 
అందులో గగన్ బాబు చిత్రించింది కాళీమాతనేనా? ప్రతిమా విసర్జనం అంటే నిమజ్జనం. నా జీవితకాలం పొడుగునా నేను చేస్తూ వచ్చిన ప్రతిమా నిమజ్జనాలెన్నో నాకు తలపుకి వస్తున్నాయి. ముందొక సౌందర్యానికి రూపాన్నివ్వడం. ఆపైన అలంకరించడం, ఆరాధించడం, స్తుతించడం, నతించడం. చివరికి ఒకరోజు అట్టహాసంగా వదిలిపెట్టేయడం. ఎన్ని ప్రతిమల్ని నేనట్లా త్యజిస్తూ వచ్చానని! ప్రతిమారాధనలో ఎంత కోలాహలం ఉందో ప్రతిమా త్యాగంలోనూ కూడా అంతే ఉంది.
 
కాని చెప్పలేని దిగులు కూడా ఉంది. ఆ దిగులు, గుండెని పట్టేసే ఆ అవ్యక్తదుఃఖాన్నేదో ఈ చిత్రలేఖనం తట్టిలేపుతున్నది. అందుకనే మనసు ఈ దృశ్యం దగ్గరే పదే పదే తచ్చాడుతున్నది, వదిలిపెట్టి వెనక్కి రావడానికి కాళ్ళు రాకున్నవి.
 
18-10-2021

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading