చందవరం

ఇన్నాళ్ళకు వెళ్ళగలిగాను చందవరం. ఏడాదిపైగా అనుకుంటున్నది. తీరా దారిలో పాఠశాలల్ని చూసుకుంటూ వెళ్ళేటప్పటికి సంజ వాలిపోతూ ఉంది. కాని ఆ చిన్న గుట్ట ఎక్కి, ఆ శిథిలారామం చెంత నిలబడే క్షణానికి ఆకాశం సాయంసంధ్యా వర్ణాల్ని ధరించింది. ఎదురుగా గుండ్లకమ్మ.
 
ఒకరోజు ఏదో ఆఫీసు పనిమీద మంత్రిగారికి ఏదో వివరించవలసి ఉండి మార్కాపురం వెళ్ళాను. బాగా పొద్దుపోయింది. ఆయన ‘చాలా ఆలస్యమైపోయింది. ఉండిపోండి, గుండ్లకమ్మ నీళ్ళతో వండిన అన్నం పెడతాను, తిని వెళ్దురుగాని ‘ అన్నారు. ఆ మాట వినగానే ఏదో మధురమైన భక్ష్యం ఆయన నా చేతుల్లో పెట్టినట్టనిపించింది. నేనన్నాను కదా ‘సార్, ఈ మధ్య ఈ మధ్యనే గుండ్ల కమ్మ నాకు పరిచయమవుతూ ఉంది. అసలు తెలుగు వాళ్ళ చరిత్ర వెతకాలంటే కృష్ణా ఒడ్డునా, గోదావరి ఒడ్డునా కాదు, గుండ్ల కమ్మ పరీవాహకప్రాంతమంతా తెలుగు వాళ్ళ చరిత్ర కప్పడిపోయింది. ఆ జాడలు వెతుక్కుంటూ ఉన్నాను ‘ అని.
 
నిజమే. నన్నయ కు పూర్వం తెలుగు శాసనాల్ని సంకలనం చేసి జయంతి రామయ్యగారు వెలువరించిన శాసన పద్యమంజరిలో అత్యధికం గుండ్లకమ్మ ఒడ్డున దొరికిన శాసనాలే.
మల్లవరం రిజర్వాయర్ నుంచి మోటుపల్లి రేవుదాకా చూసానుగాని, అక్కడ చందవరంలో మొన్న సాయంకాలం కనిపించినంత అందంగా గుండ్లకమ్మని నేనిప్పటిదాకా చూడనే లేదు. ఆ ప్రాచీన బౌద్ధ చైత్యానికీ, గుండ్లకమ్మకీ మధ్య ఒక రహదారి. ఒకప్పుడు ఉత్తరాదినుంచి బౌద్ధ భిక్షువులు ఆ దారమ్మట కాంచీపురం దాకా ప్రయాణిస్తో ఉండేవారట. వారికి ఒక మజిలీలాగా చందవరం ఆరామాలు ఉండేవట. అశోకుడికన్నా ముందటి చరిత్ర చందవరానిది.
 
దూరంగా నారింజరంగు పరుచుకుంటున్న సాంధ్యగగనం. దిగంతం నుంచీ వినిపిస్తున్న నిశ్శబ్ద సంగీతం. కానీ నా చుట్టూ నన్ను చూడటానికీ, నాతో మాట్లాడటానికీ వచ్చిన స్థానికులు, మిత్రులు, ఉపాధ్యాయులు. గలగల మాట్లాకుంటున్న వాళ్ళ మాటల మధ్య అందకుండా జారిపోతున్న సాంధ్యమౌనాన్ని అందుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను.
 
ప్రతి బౌద్ధ క్షేత్రం దగ్గరా నాకు కలిగే మొదటి భావన ఆ ప్రాచీన బౌద్ధ శ్రమణుల సౌందర్యారాధాన ఎంత గొప్పది అనే. ఒకప్పుడు అజంతా గుహల ఎదట నిల్చొని కింద లోయలో ప్రవహిస్తున్న వాఘిరా నదిని చూస్తూ అదే అనుకున్నాను. మొన్నా మధ్య బొజ్జన్నకొండ వెళ్ళినప్పుడు ఆ కొండమీద సంఘారామ శిథిలాల దగ్గర నిలబడి దూరనీలి దిగంతాన్ని చూస్తూ ఇదే అనుకున్నాను. ఇప్పుడు చందవరం గుట్ట మీద గుండ్లకమ్మనీ, ఎరుపు, పసుపు, ఊదా, నీలం, నిశ్శబ్దాలు అల్లుకుపోతున్న సాంధ్యగగనాన్నీ చూస్తూ మళ్ళా అదే అనుకున్నాను. ఉపనిషత్కారుడు చెప్పినమాట: ‘నాల్పే సుఖం అస్తి. యో వై భూమా తత్ సుఖమ్’ (అల్పమైనదానిలో సుఖం లేదు. ఈ భూమి అంతా ఆవరించిన మహావిషయమేముందో అదే నిజమైన సుఖం).
 
అక్కడ కూచుని బొమ్మలు గీసుకోవాలనుకున్నాను. కాని సమయమూ లేదు, ఏకాంతమూ చిక్కలేదు. ఇంటికొచ్చాక రెండు బొమ్మలైతే గీసానుగాని, నా దగ్గరున్న రంగులపెట్టెలో నిశ్శబ్దమనే రంగు దొరకలేదు.
 
25-11-2021

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading